Published : 14 Nov 2021 01:41 IST

వెదురు పిలకల్నీ తింటున్నారోచ్‌!

వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న మాదిరిగానే వెదురు కూడా గడ్డిజాతి మొక్కే. వాటిని ధాన్యంకోసం పండిస్తే, వెదురుని  కలపకోసం మాత్రమే పెంచుతారు. అయితే వెదురు మొక్క మొదల్లో వచ్చే పిలకలు అద్భుతమైన పోషకాహారం కూడానట. అందుకే వాటినీ తింటున్నారిప్పుడు.

అరటి దూటనో పువ్వునో కూర వండుకోవడం తెలుసుగానీ ఈ వెదురు పిలకలేంటీ అనిపిస్తోంది కదూ. నిజమే, ఈమధ్య మార్కెట్లోనూ రోడ్డుపక్కనా లేతాకుపచ్చ రంగులో కోన్‌ ఆకారంలో ఉండే కాడల్లాంటివి కనిపిస్తున్నాయి. అవి పోషకాల నిధులని తెలియడంతో వాటికి ఎక్కడలేని డిమాండ్‌ ఏర్పడిందట. అలాగని ఇదేదో కొత్త తిండి అనుకునేరు, పూర్వం నుంచీ ఉంది. నిట్టనిలువుగా అంతెత్తున ఆకాశంలోకి పెరిగే వెదురులో అనేక జాతులు ఉన్నాయి. వాటిల్లో బ్యాంబూసా వల్గారిస్‌, ఫైలోస్టాకిస్‌ ఎడ్యులిస్‌... వంటి జాతుల్ని మాత్రం అచ్చంగా పిలక మొక్కల కోసమే పెంచుతారట. ఆగ్నేయాసియా దేశాల్లోనూ మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ పిలకలతో కూరలూ సూప్‌లూ చేస్తారు. అందుకే వీటిని తాజాగానే కాదు, ప్రాసెస్‌ చేసీ, ఎండబెట్టీ, కేన్‌డ్‌ ఫుడ్‌గానూ అమ్ముతుంటారు.

ఎందుకు తినాలి?
పిండిపదార్థాలూ ప్రొటీన్లూ పీచుతోపాటు కాపర్‌, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం... వంటి మూలకాలూ; రిబోఫ్లేవిన్‌, విటమిన్‌-ఎ, కె, ఇ, బి6...వంటి విటమిన్లూ ఈ వెదురు పిలకల్లో పుష్కలం. ఇంకా ఫైటోస్టెరాల్సూ, ఫైటోన్యూట్రియంట్లూ, పీచూ వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందట. ఆరోగ్యంగా ఉన్న మహిళలు వరసగా ఆరు రోజులపాటు వీటిని తిన్నప్పుడు వాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. కప్పు వెదురు పిలకల్లో అంటే సుమారు 155 గ్రాముల్లో రెండు గ్రా. పీచు లభిస్తుంది. ఇది రక్తంలో కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ను సైతం తగ్గిస్తుంది. ఇది ప్రిబయోటిక్‌గా పనిచేస్తుందట. అంటే- పొట్టలోని బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడుతుంది. తద్వారా మధుమేహం, డిప్రెషన్‌, ఊబకాయం తగ్గడానికీ దోహదపడుతుంది. ఈ పిలకల్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువునీ తగ్గిస్తాయి. పొట్ట కూడా తగ్గినట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ ముఖ్యంగా నాడీసంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయనీ చెబుతున్నారు. వీటిని నీళ్లలో మరిగించి తేనెతో కలిపి తీసుకుంటే శ్వాససంబంధ వ్యాధులూ ఉండవట. నొప్పులు తగ్గడానికీ పొట్ట సమస్యల్ని నివారించడానికీ తోడ్పడతాయని మరికొన్ని పరిశీలనల సారాంశం. వీటిలో ఎక్కువగా ఉండే పొటాషియం వల్ల బీపీ రోగులకీ ఇవి మంచిదే. గర్భిణీలకు తొమ్మిదోనెలలో వీటిని తినిపించడం వల్ల గర్భాశయం సంకోచం చెంది కాన్పు తేలికవుతుందని చైనా సంప్రదాయ వైద్యం పేర్కొంటోంది.

ఎలా తింటారు?
వెదురు పిలకల్లో కర్ర పెండలంలో మాదిరిగానే కొన్ని రకాల టాక్సిన్లు ఉంటాయి. ఉడికించినప్పుడు ఇవి తొలగిపోతాయి. అందుకే తాజా వెదురు పిలకల్ని శుభ్రం చేసి పావుగంటసేపు పసుపులో ఉడికించాకే కూరల్లో వేస్తుంటారు. పులియబెట్టి బంగాళాదుంపలు, బీన్స్‌తో కలిపి వండుతారట. దక్షిణాదిన కర్ణాటక, ఆంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో వీటితో ప్రత్యేక వంటకాలు చేస్తారు. తెలుగులో ఈ పిలకల్నే వెదురు కొమ్ములు అని పిలుస్తారు. కొందరైతే వీటిని రెండు మూడు రోజులపాటు నీళ్లలో నానబెట్టి ఆ తరవాత పచ్చడి పడతారు. కొన్నిచోట్ల అనేక నెలలపాటు పులియబెట్టీ వాడుకుంటారట. మణిపూర్‌లోని ఆండ్రో గ్రామంలో ఇలా పులియబెట్టిన వెదురు పిలక(సొయ్‌జిన్‌)ల్ని పదేళ్లపాటు నిల్వచేసుకుంటారట. సో, మార్కెట్లో కనిపిస్తే కర్రముక్కలేంటీ... అనుకోకుండా ఆ రుచిని ఎంజాయ్‌ చేయండి..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని