Updated : 11 Dec 2021 23:21 IST

కంటి సమస్యలకు పరారుణకాంతి!

వయసు పెరిగేకొద్దీ కంటిచూపు మందగించడం సహజం. దీనికితోడు ఇతరత్రా సమస్యలు అనేకం వస్తూనే ఉన్నాయి. వీటికి చక్కని పరిష్కారం ఎరుపురంగులోని పరారుణ కాంతి అంటున్నారు లండన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఉదయాన్నే ఎర్రని కాంతిని తదేకంగా మూడు నిమిషాలపాటు చూడటం వల్ల రెటీనాలోని మైటోకాండ్రియల్‌ కణాలు శక్తిని పుంజుకుని చురుగ్గా మారుతున్నట్లు వాళ్ల పరిశీలనలో స్పష్టమైందట. వయసు పెరిగేకొద్దీ కణాల్లోని శక్తిభాండాగారాలైన మైటోకాండ్రియా సైతం వృద్దాప్యాన్ని సంతరించుకుంటాయి. దాంతో అవి శక్తిని సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతుంటాయి. ఫలితంగా కణాల పనితీరు తగ్గుతుంది. అదీగాక రెటీనా కణాల్లో ఈ మైటోకాండ్రియాల శాతం మరీ ఎక్కువ. దాంతో అక్కడ సరిపడా శక్తి ఉత్పత్తి కాకపోవడంతో మిగిలిన భాగాలకన్నా కళ్లు త్వరగా వృద్ధాప్యాన్ని సంతరించుకుంటాయి. అందుకే ఎల్‌ఈడీతో పనిచేసే పరారుణ కాంతికి గురిచేసినప్పుడు- మైటోకాండ్రియా చురుగ్గా మారి శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభించాయనీ తద్వారా రెటీనా పనితీరూ మెరుగయిందనీ పేర్కొంటున్నారు. అయితే మధ్యాహ్నం, సాయంకాలాలతో పోలిస్తే ఉదయం వేళలోనే ఎరుపు రంగు కాంతి ప్రభావం ఆ కణాలమీద ఎక్కువగా ఉన్నట్లు వాళ్ల పరిశీలనలో తేలిందట. మన పెద్దలు వేకువనే సూర్య నమస్కారం చేయడం మంచిది అనేది ఇందుకేనేమో!


ప్రొబయోటిక్‌తో క్యాన్సర్‌ చికిత్స!

హాని చేసే బ్యాక్టీరియాలు ఎన్ని రకాలు ఉన్నాయో మన శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాలూ అన్నే ఉన్నాయి. ఈ రెండో రకం అనుక్షణం అప్రమత్తమై మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. వీటినే ప్రొబయోటిక్‌ బ్యాక్టీరియా అంటారనేది తెలిసిందే. ఈ విషయాన్ని ఆసరాగానే చేసుకునే యూనివర్సిటీ ఆఫ్‌ సిన్‌సినాటికి చెందిన పరిశోధకులు క్యాన్సర్‌ కణాల్లోకి చొచ్చుకువెళ్లి వాటిని నిర్మూలించే ప్రొబయోటిక్‌ బ్యాక్టీరియాని కృత్రిమంగా రూపొందించారు. ముఖ్యంగా రొమ్ము, ప్రొస్టేట్‌ తరహా క్యాన్సర్‌ కణాల గోడల్లోకి ఈ బ్యాక్టీరియా చొచ్చుకువెళ్లి చికిత్సకు స్పందించేలా వాటిని రూపొందించారట. గడ్డలుగా ఏర్పడే ఈ క్యాన్సర్‌ కణాల గోడలు మందంగా మారిపోవడంతో యాంటీబాడీలుగానీ రోగనిరోధకకణాలుగానీ వాటిని నిర్మూలించలేకపోతున్నాయి. అందుకే ఈ-కొలి నిసె అనే మేలు రకం బ్యాక్టీరియాని జన్యుమార్పిడికి గురిచేశారు. దాంతో క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే ఎంజైమ్‌ను ఈ బ్యాక్టీరియా ద్వారా ఆయా కణాల్లోకి చొచ్చుకు వెళ్లేలా చేస్తారు. అప్పుడు వ్యాధి తగ్గుముఖం పడుతుంది అంటున్నారు సదరు పరిశోధకులు.


కాఫీతో ఆల్జీమర్స్‌కి చెక్‌!

కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదనీ, మంచిది కాదనీ... ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అయితే దీర్ఘకాలికంగా చేసిన ఓ అధ్యయనంలో కాఫీ ఎక్కువగా తాగేవాళ్లలో ఆల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు ఎడిత్‌ కొవాన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. కాఫీ తాగడంవల్ల మెదడు ఆలోచనాశక్తి క్షీణత కూడా తగ్గుతుందని గతకాలపు పరిశోధనలో స్పష్టమైంది. అదేవిధంగా మెదడులో అమిలాయిడ్‌ ప్రొటీన్‌ పేరుకోవడం కూడా తగ్గినట్లు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ పేరుకోవడం వల్లే ఆల్జీమర్స్‌ వస్తుందట. ఈ విషయమై వీళ్లు కొందరిని ఎంపిక చేసి పరిశీలించారు. రోజూ పావులీటరు కాఫీ తాగేవాళ్లను ఎంపికచేసి 18 నెలల వ్యవధిలో వాళ్ల మెదడులో జరిగే మార్పుల్ని గమనించారు. అందులో వాళ్ల ఆలోచనాశక్తికి సంబంధించిన మెదడు కణాల్లో జరిగే సహజ క్షీణత ఎనిమిది శాతం తగ్గిందట. అదే సమయంలో అమిలాయిడ్‌ ప్రొటీన్‌ పేరుకునే శాతమూ బాగా తగ్గిందట. దీన్నిబట్టి కాఫీ వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదనీ కెఫీన్‌ మెదడుకి మంచిదేననీ అంటున్నారు.


ప్లాస్టిక్కు వాడకం తగ్గకపోతే!

ప్లాస్టిక్‌ వాడకం ఎంత తగ్గించాలని చెబుతున్నా రోజురోజుకీ పెరుగుతుందే తప్ప అది తగ్గడం లేదు. కాబట్టి ఎలాగైనా వాటి తయారీలో వాడుతోన్న థాలేట్స్‌ వాడకం బాగా తగ్గించాలని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన గ్రాస్‌మ్యాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటి కారణంగా ఏటా ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా ముందస్తు మరణాలు చోటు చేసుకుంటున్నాయట. దాదాపు యాభై సంవత్సరాలుగా కర్టెన్లూ షూ, పైపులూ, పెర్‌ఫ్యూమ్స్‌, సబ్బులూ, షాంపూలు... ఇలా అనేక వస్తువుల ఉత్పత్తిలో వీటి వాడకం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. దాంతో ఇవి హార్మోన్ల వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తున్నాయట. ఈ విషయమై వాళ్లు 50-60 ఏళ్ల వయసు వారి యూరిన్‌ శాంపుల్స్‌ని సేకరించి అందులో థాలేట్స్‌ శాతాన్ని గమనించారట. ఆ తరవాత మరో పదేళ్లపాటు వాళ్లమీద దృష్టి సారించగా- థాలేట్స్‌కు గురయిన వాళ్లలో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదీ గుండెజబ్బులకు లోనయి చనిపోతున్నట్లు తేలింది. అంతేకాదు, గర్భిణీలు థాలేట్స్‌కు గురయితే, ప్లాసెంటాలోని జన్యువుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయనీ దాంతో ఆ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయనీ అంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, గర్భస్రావం, శిశువు ఎదుగుదలలో లోపాలు  ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్కు వాడకం ఎంత తగ్గితే అంత మేలు అని మరోసారి హెచ్చరిస్తున్నారు సదరు నిపుణులు.


 


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని