Updated : 03 Oct 2021 05:14 IST

లక్ష్మి, సరస్వతి.. కామాక్షికి రెండుకళ్లు

వెయ్యి ఆలయాలు ఉన్న పట్టణంగా గుర్తింపు పొందిన కాంచీపురంలో కొలువై... తన చల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తూ ప్రశాంతమైన వదనంతో కనిపించే శక్తిస్వరూపిణి కామాక్షి అమ్మవారు. దేవి స్వయంభువుగా వెలసిన ఈ ఆలయం అష్టాదశ శక్తిపీˆఠాల్లో ఒకటనీ, సతీదేవి నాభిభాగం ఇక్కడ పడిందనీ అంటారు. సర్వశుభాలనూ కలిగించే ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించుకున్నాచాలని అంటారు.
కామాక్షి అంటే... నటరాజు నృత్యాన్ని ఆనందంగా చూసే చల్లని నయనాలున్న తల్లి అని అర్థం. అదే విధంగా కా అంటే సరస్వతి అనీ, మా అంటే లక్ష్మీ అనీ... ఆ  రెండు దేవతలనూ తన నయనాలుగా ధరించిన జగన్మాత కామాక్షీదేవి అనే అర్థం కూడా వస్తుంది. భుజాన చిలుకతో, చేతిలో చెరకుగడ, అయిదు పూలూ, పాశాంకుశాలూ ధరించి ధర్శనమిచ్చే ఈ అమ్మవారిని లలితాపరమేశ్వరి స్వరూపంగా, బాలాత్రిపురసుందరిగా కొలుస్తారు భక్తులు. గాయత్రి మండపంలో పద్మాసనంలో ధ్యానముద్రలో ఆశీనురాలై... భక్తులకు దర్శనమిచ్చే కామాక్షీదేవి కోరిన కోర్కెలు ఈడేరుస్తుందని అంటారు. ఒకప్పుడు ఇక్కడ నర, జంతు బలులు బాగా జరిగేవనీ.. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఇక్కడకు వచ్చి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి, ఈ ప్రాంగణంలోనే సౌందర్యలహరి రచించాడనీ... అప్పటినుంచీ బలులన్నీ ఆపేశారనీ ప్రతీతి. అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసిందడానికి పురాణాలు ఏం చెబుతున్నాయంటే... 

స్థలపురాణం

బ్రహ్మాండపురాణం ప్రకారం... ఒకప్పుడు భండాసుర అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో అంతా కలిసి శివుడి దగ్గరకు వెళ్లారట. శివుడు కన్య రూపంలో  దర్శనమిచ్చే బాలాత్రిపుర సుందరిని వేడుకోమని వాళ్లకి సూచించాడట. ఆదేవతలంతా ఒక్కటై చిలుక రూపంలో అమ్మవారి దగ్గరకు వచ్చి తమ కష్టాల్ని చెప్పుకోవడంతో అనుగ్రహించిన దేవి ఆ రాక్షసుడిని సంహరించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పాతిపెట్టి... దానిపైనే పీఠం ఏర్పాటు చేసుకుని ఆశీనురాలైందని అంటారు. మరో కథ ప్రకారం... సతీదేవి తన తండ్రి దక్షుడికి ఇష్టం లేకుండా శివుడిని పెళ్లాడాక... తండ్రి నిర్వహించే యాగానికి వెళ్తుంది. ఆ సమయంలో తండ్రి చేత అవమానాలు ఎదుర్కొన్న సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. దాన్ని చూసిన పరమేశ్వరుడు కోపంతో అమ్మవారి దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేయడం మొదలుపెడతాడు. ఆ సమయంలో అమ్మవారి శరీరభాగాలు వివిధ ప్రాంతాల్లో పడగా నాభి భాగం కంచిలో పడిందని చెబుతారు. అలా ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైంది.

ప్రత్యేక ఉత్సవాలు...

మొదట పల్లవ రాజులు ఏడో శతాబ్దంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే... ఆ తరవాత చోళులు పునర్నిర్మించారని అంటారు. సుమారు అయిదు ఎకరాల్లో, నాలుగు ప్రవేశ మార్గాల్లో ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో మొదట గణపతిని దర్శించుకున్నాకే కామాక్షీదేవి సన్నిధానానికి వెళ్లాలి. పరబ్రహ్మ స్వరూపిణిగా కొలిచే కామాక్షీ దేవికి ఇక్కడ ఏడాది మొత్తం విశేష పూజలు జరుగుతుంటాయి. ప్రతిరోజూ ఇక్కడ గో, గజ పూజలు నిర్వహించాకే అమ్మవారికి పూజాది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక, ఫిబ్రవరి మార్చి నెలల్లో జరిపే రథోత్సవం, తెప్పోత్సవం... వసంతోత్సవాలూ, నవరాత్రుల సమయంలో జరిపే పూజల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. అమ్మవారి చుట్టూ ఉన్న ఆదిశంకరాచార్య, అయ్యప్ప, అన్నపూర్ణ, సరస్వతి విగ్రహాలను కూడా దర్శించుకునే భక్తులు ఆ తరువాత ఈ ప్రాంగణంలో కొలువైన అరూప లక్ష్మీదేవికి కుంకుమార్చన నిర్వహించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. అయితే... లక్ష్మీదేవికి అర్చన చేసినా అది కామాక్షీదేవికే చెందుతుందని చెబుతారు. ఈ ఆలయానికి ఓ వైపు ఉన్న ప్రాంతాన్ని శివ కంచి లేదా పెద్ద కంచి అని పిలిస్తే, మరోవైపు ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి లేదా చిన్న కంచి అంటారు. అంటే ఈ రెండు ప్రాంతాల్లో శివ, వైష్ణవాలయాలూ ఉంటాయి. కామాక్షీదేవిని దర్శించుకునే భక్తులు ఆ తరువాత ఈ ఆలయాలకూ వెళ్తారని చెబుతారు.

ఎలా వెళ్లాలి

కాంచీపురం చెన్నైకి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై వరకూ విమానం, రైలు ద్వారా చేరుకుంటే... అక్కడి నుంచి రైలూ, బస్సులూ, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్లొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని