స్తంభోద్భవం..నృసింహావతారం..!

లోకపాలకుడైన విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాల్లో నాలుగోది నృసింహావతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకోసం ఎత్తిన అవతారం. నరమృగరూపంలో స్తంభోద్భవుడైన ఆ ఉగ్రనారసింహుడిని శాంతింపజేసేందుకు ‘లక్ష్మీనృసింహం భజే...’ అంటూ భక్తులు వేనోళ్ల కొనియాడుతుంటారు.

Updated : 23 Mar 2022 16:47 IST

స్తంభోద్భవం..నృసింహావతారం..!

లోకపాలకుడైన విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాల్లో నాలుగోది నృసింహావతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకోసం ఎత్తిన అవతారం. నరమృగరూపంలో స్తంభోద్భవుడైన ఆ ఉగ్రనారసింహుడిని శాంతింపజేసేందుకు ‘లక్ష్మీనృసింహం భజే...’ అంటూ భక్తులు వేనోళ్ల కొనియాడుతుంటారు.

ప్తర్షుల్లో ఒకడైన కశ్యపుడికి విష్ణుమూర్తి అనుగ్రహంతో పుట్టినవాళ్లే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వాళ్లు పరమ క్రూరులు... విష్ణు ద్వేషులు. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించడంచూసి- విష్ణుమూర్తివల్ల ఎప్పటికైనా తనకూ ముప్పు ఉందని భావించిన హిరణ్యకశిపుడు ఘోరతపస్సు చేసి, ఇంటి లోపలా వెలుపలా, పగలూ రాత్రీ, నింగిలోనూ నేలపైనా, నిప్పులోనూ నీటిలోనూ, నరులవల్లా మృగాలవల్లా, ఏ ఆయుధం చేతనూ మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతాడు. ఆపై తానే దేవుడిగా విర్రవీగగా... దిక్కుతోచక ముక్కోటి దేవతలూ శ్రీహరిని ప్రార్థించగా- ‘కన్నకొడుక్కి ఆపద తలపెట్టినప్పుడు మరణిస్తాడ’ని సెలవిస్తాడు.

హిరణ్యకశిపుడి కుమారుడే ప్రహ్లాదుడు. బ్రహ్మజ్ఞాని. ఓనమాలు రాకముందే ‘ఓం నమో నారాయణాయః’ అంటూ అషాక్షరీ సాధన మొదలుపెట్టాడు. బడిలోనూ శ్రీహరినామస్మరణే. గురువు చండామార్కుడు పరమ క్రూరుడు. నానావిధాలుగా హింసించినా ప్రహ్లాదుడు హరినామస్మరణ మానలేదు. చివరకు తనవల్ల కావడం లేదని అతణ్ణి తండ్రికే అప్పగిస్తాడా రాక్షస గురువు. కుమారుడికి ఎంతో నచ్చజెప్పాలని చూశాడు హిరణ్యకశిపుడు. ఎంతకీ వినకపోవడంతో సోదరి హోళికకు అప్పగించి ప్రహ్లాదుడిని మంటల్లో వేయాలనుకున్నాడు. కానీ హోళికే అగ్నికి ఆహుతైపోయింది. ఆగ్రహం పట్టలేని హిరణ్యకశిపుడు ‘ఎక్కడ నీ హరి...’ అంటూ ప్రశ్నిస్తాడు. ‘ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు’ అని సెలవిస్తాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభములో ఉన్నాడా నీ శ్రీహరి అని ఆ రాక్షసరాజు అడగగా, అవునంటాడు ప్రహ్లాదుడు. అప్పుడతను ఆగ్రహంతో గదతో స్తంభంమీద మోదగా... ఆకాశం బద్ధలైనట్లు... భూగోళం పేలిపోయినట్లు... సంద్రాలు ఉప్పొంగినట్లు... స్తంభాన్ని చీల్చుకుంటూ బయటికొస్తాడు... మహోగ్రరూపుడైన నరసింహుడు... భీకరంగా గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద అదిమిపెట్టి గోళ్లతో వక్షస్థలాన్ని చీల్చి పేగుల్ని మెడలో వేసుకుని ఆ రాక్షసుణ్ణి అంతమొందిస్తాడు. మనిషీజంతువూకాని నరమృగరూపంలో, పగలూరాత్రీకాని సంధ్యాకాలంలో, ఆయుధమని చెప్పలేని గోళ్లతో, ఇంటాబయటాకాక గుమ్మంలో, భూమిపైనా ఆకాశంలోగాక తన తొడమీద హిరణ్యకశిపుని సంహరిస్తాడా శ్రీహరి. అదే నృసింహావతారం ప్రత్యేకత.


రమణీయం రాజగోపురాల రాజసం!

ఆలయానికి అల్లంత దూరం నుంచే భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచి, మరికాసేపట్లో ఆ దేవదేవుడి దర్శనభాగ్యం దొరకబోతోందన్న ఆనందాన్ని కలిగిస్తాయి దేవాలయ గోపురాలు. కొత్త హంగులతో పునర్నిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలోనూ గుహలో వెలిసిన స్వామికి గోపురాలతో ఘన వైభవం తీసుకొచ్చారు. అద్భుతమైన శిల్పకళాసంపదతో తీర్చిదిద్దిన ఆ రాజగోపురాల విశేషాలు ఇవి...

మహిమాన్వితమైన యాదాద్రి క్షేత్రంలో భక్తజనాకర్షకమై ఠీవిగా దర్శనమిచ్చే ఆరు రాజగోపురాలు ఆలయంలోని రెండు ప్రాకారాల్లో కొలువుదీరి ఉన్నాయి. దేవాలయాల గోపురాల్లో మొత్తం 16 రకాలుంటే యాదాద్రిలో మూడు రకాల గోపురాల్ని నిర్మించారు. అవే... త్రితల, పంచతల, సప్తతల గోపురాలు. గర్భగుడి వెలుపల మొదటి ప్రాకారంలో- ఈశాన్యానా, పడమర వైపునా రెండు గోపురాలూ... రెండో ప్రాకారంలో- తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిశల్లో  నాలుగు రాజ గోపురాలు... కనువిందుచేస్తాయి. స్వామిని చేరడానికి వేసిన మొదటి అడుగు నుంచి దైవదర్శనం పూర్తయ్యే వరకూ ఆధ్యాత్మిక శోభతో భక్తుల్ని పరవశింపజేస్తాయి.

పంచతల గోపురాలు...

ఆరు రాజగోపురాల్లో నాలుగు పంచతల గోపురాలున్నాయి. వీటిల్లో మూడు రాజగోపురాలు రెండో ప్రాకారంలో ఉంటే, మరోటి మొదటి ప్రాకారంలో ఉంది. ఇవన్నీ 55 అడుగుల ఎత్తుతో ఐదు అంతస్తుల్లో ఉంటాయి.

* తొలి రాజగోపురం... ఆలయ రెండో ప్రాకారంలో తూర్పున ఉండే ‘ఇంద్ర గోపురం’. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ గోపురం నుంచే లోపలికి ప్రవేశిస్తారు. దీనికి ఇరువైపులా ఐదు అడుగుల ఎత్తున రెండు ఏనుగుల ప్రతిమలూ, ద్వారపాలకులుగా జయవిజయుల విగ్రహాలూ ఉన్నాయి.  
* రెండోది ఉత్తరదిక్కులో ఉంటుంది. ఈ రాజగోపురం ద్వారానికి ఇరువైపులా నాలుగు అడుగుల ఎత్తున రెండు సింహాల ప్రతిమలను ప్రతిష్ఠించారు. గతంలో ఉత్తర ద్వారం లేకపోవడంతో ముక్కోటి ఏకాదశీ పర్వదినాన తూర్పు ద్వారాన్నే ఉత్తర
ద్వార దర్శనానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం ముక్కోటి దర్శన భాగ్యాన్ని ఉత్తరం నుంచే చేసుకునే వీలు కలిగింది.

* దేవాలయ దక్షిణం దిక్కున రెండో ప్రాకారంలో ఉండే మూడో పంచతల గోపురం యమ రాజగోపురం.  
* ఆలయ మొదటి ప్రాకారంలో పశ్చిమ దిక్కున ఉంటుంది ‘వరుణ గోపురం’. ఈ గోపురానికి ఇరువైపులా జయవిజయులు ఉంటారు. 

సప్తతల మహా రాజగోపురం...

రెండో ప్రాకారంలో పశ్చిమాన ఉన్న సప్తతల రాజగోపురం అత్యంత విశేషమైంది. గర్భాలయ నరసింహుడు పశ్చిమం వైపు చూస్తున్నట్టు ఉంటాడు కాబట్టి పశ్చిమాన ఉన్న మాడవీధికీ, మహారాజ గోపురానికీ ఎనలేని ప్రాముఖ్యతను నిర్మాణంలోనే చూపారు. 77 అడుగుల ఎత్తులో 7 అంతస్తుల సప్తతల మహారాజ గోపురంగా తీర్చిదిద్దారు. అన్ని గుళ్లలో దైవ దర్శనానికి ఆలయంలోకి ప్రవేశించే తూర్పు రాజగోపురాన్ని అన్నింటి కంటే ఎత్తుగా నిర్మిస్తారు. కానీ ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహస్వామి పశ్చిమ ముఖంగా ఉండటంతో స్వామివారికి అభిముఖంగా ఉండే ఈ గోపురం ఉన్నతంగా ఉండాలనే సంప్రదాయాన్ని అనుసరించారు.

ఈ రెండోప్రాకారంలోని మిగిలిన తూర్పు, ఉత్తర, దక్షిణ రాజగోపురాలు 5 అంతస్తుల ఎత్తులో ఉంటాయి.

త్రితల రాజ గోపురం...

మొదటి ప్రాకారంలో ఈశాన్యాన ఈ త్రితల గోపురం ఉంటుంది. మూడు అంతస్తులతో 33 అడుగులు ఎత్తున్న ఈ గోపుర ద్వారం నుంచే భక్తులు ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. బహుశిల్పమయంగా ఉండే ఈ చిరురాజగోపురం అంతరాలయంలోకి తీసుకెళ్తుంది.
ఈ ఆరు రాజగోపురాల్లోని అంతస్తుల మధ్యన కిటికీల్లాంటి నిర్మాణాలుంటాయి. వీటి వల్ల గాలి ఎంత వేగంగా వీచినా గోపురాలకు ఎలాంటి నష్టం జరగదు.

ప్రత్యేక ఆకర్షణ...

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరు గోపురాలు కాకుండా స్వామి వారి గర్భాలయంపైన ఉండే విమానం 45 అడుగుల ఎత్తులో అష్టభుజ రూపంలో నరసింహుని కిరీటమానమై ఉంటుంది. స్వామివారి దర్శనం ఇచ్చే ఫలాన్ని ఈ విమాన దర్శనం ఇస్తుందని అంటారు.


హరి నిలయంలో శివాలయం!

హరిహరుల్నీ శైవవైష్ణవాలనీ కలిపి ఒక్కటే హైందవ సంప్రదాయంగా మార్చిన సమన్వయ పద్ధతికి ప్రతీక యాదాద్రి క్షేత్రం. నరహరిగా పూజలందుకునే విష్ణువు ఉన్నచోటే శివుడూ ఉండి తీరాలన్న భావనతో సుమారు వందేళ్లకిందట ఇక్కడ రామలింగేశ్వరాలయాన్ని నెలకొల్పారు. నాటి నుంచీ నిత్య పూజలూ, వార్షిక బ్రహ్మోత్సవాలతో కళకళాడుతున్న ఈ గుడిని... కోట్ల  రూపాయలతో విస్తరించి... కొత్త సొబగులెన్నో అద్దారు!

‘హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే/అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే’ - ‘దశావతారం’ సినిమాలో వచ్చే ‘రాయిని మాత్రం కంటే’ పాటలోని ఓ పంక్తి ఇది. 12వ శతాబ్దంలో శైవులూ, వైష్ణవుల మధ్య శత్రుత్వం ఎంతగా ఉండేదో సినిమాలోని ఈ ఘట్టం చూచాయగా చూపుతుంది. అదే శతాబ్దానికి చెందిన కవిబ్రహ్మ తిక్కన ఆ ఇరువర్గాల నడుమ ద్వేషాన్ని చల్లార్చడానికే ‘మహాభారత’ రచనకి నడుం బిగించాడని అంటారు. శివకేశవులు ఇద్దరూ ఒక్కటే అని నిరూపిస్తూ హరిహరాద్వైతం అనే కొత్త మతతత్వాన్నీ తిక్కన ప్రచారం చేశాడు. ఇంతచేసినా... ఎంతోకొంత శైవ, వైష్ణవ వైరం కొనసాగుతూనే వచ్చింది. అది 20వ శతాబ్దం ప్రథమార్ధంలోనూ ఉండేదని గురజాడ అప్పారావు కథ ‘మీ పేరేమి?’ చెబుతుంది. సరిగ్గా ఆ కాలంలోనే తెలుగు ప్రాంతాల్లోనూ శైవ, వైష్ణవ సమైక్యత కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే ప్రసిద్ధ వైష్ణవక్షేత్రమైన యాదాద్రిలో శివుణ్ణి కొలువుంచారు. 1913-15లో బెల్లంకొండకు చెందిన స్వామి ఆధ్వర్యంలో నారసింహుడి ఆలయానికి తూర్పున లింగ ప్రతిష్ఠగావించారు.

‘కంచి’ స్వామి రాక...

శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఐదేళ్ల తర్వాత ఇక్కడి పంచనారసింహుని దర్శనానికి నాటి కంచి కామకోఠి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలోనే నాటి లింగం చుట్టూ ఓ చిన్న దేవాలయాన్ని రూపుదిద్దారు. ఇందులోనే అమ్మవారిని పర్వతవర్థిని పేరుతో కొలువుదీర్చారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం అంటుండేవారు. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఒక పుష్కరిణిని కూడా ఏర్పాటు చేశారు.

పంచనారసింహునిలాగే పుష్కరిణిలో రామలింగేశ్వరుడికి అభిషేకాలు చేస్తుండేవారు. ఓ వైపు నుంచి ‘ఓం నమోనారాయణాయః’ అన్న అష్టాక్షరీ మంత్రం, మరోవైపు ‘ఓం... నమశ్శివాయః’ అనే పంచాక్షరీ జపం వినిపిస్తుండటంతో... యాదాద్రికి హరిహరుల క్షేత్రం అనే పేరూ వచ్చింది.

రూ.60 కోట్లతో పునర్నిర్మాణం...

యాదాద్రి విస్తరణలో భాగంగా నాటి శివునిగుడిని పెద్ద దేవాలయంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంలాగే మొత్తం కృష్ణశిలతో కొత్త రూపునిచ్చారు. తొగుట మాధవానంద స్వామిజీ సూచనల మేరకు ఈ ఆలయం శైవాగమ శాస్త్రయుక్తంగా రూపుదిద్దుకుంది.
గర్భగుడికి ఎదురుగా కొత్తగా పెద్ద నందిని ఏర్పాటు చేశారు. పక్కనే ధ్వజస్తంభాన్నీ ప్రతిష్ఠించారు. విమానంపైన రుద్రాక్షతో కూడిన నమూనాలను తీర్చిదిద్దారు. విఘ్నేశ్వరుడూ, సుబ్రహ్మణ్యస్వామి, పార్వతీ దేవీ ఉపాలయాలను నిర్మించారు. ఆవరణలో కొత్తగా నవగ్రహాలనూ యాగశాలల్నీ ఏర్పాటుచేశారు. పైనున్న సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలూ, అష్టాదశ శక్తిపీఠాలతోపాటూ శివుని విభిన్న రూపాలనీ అమర్చారు. ఈ ఆలయ పనుల కోసమే అరవై కోట్ల రూపాయలని ఖర్చుచేశారు. త్రితల రాజగోపురం ద్వారా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున ఈ శివాలయం ఉంటుంది. అక్కడ ముఖమండపంతోపాటూ శివలింగాన్నీ దర్శించుకోవచ్చు. కొండ కింది నుంచి వైకుంఠం మెట్ల ద్వారా వచ్చే భక్తులకు ప్రధానాలయం కంటే ముందే శివాలయాన్ని దర్శించుకునే వీలుంది.


అందాల రథశాల

శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవాల కోసం టేకుతో తయారు చేసిన రథాన్ని భద్రపరిచేందుకు 33 అడుగుల ఎత్తుతో ప్రత్యేక రథశాలనూ నిర్మించారు. దీనికి రెండు వైపులా రథ నమూనా చిత్రాలు.. వెనుక శంఖు, చక్ర నామాలతో తీర్చిదిద్దారు. షటర్‌పై జ్వాలా నరసింహుడి రూపాన్నీ చిత్రించారు.


ప్రయాణ ప్రాంగణం!

యాదాద్రిలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ‘బస్‌ బే’ను సైతం మందిరం ఆకారంలో నిర్మించారు. కళాదర్శకుడు ఆనందసాయి రూపొందించిన నమూనా ఆధారంగా.. దాదాపు ఎకరం విస్తీర్ణంలో 16 ప్లాట్‌ఫాంలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని ఆనుకొనే 30 నుంచి 40 కార్లు నిలిపేలా ఏర్పాట్లూ చేశారు. కొండ కిందనున్న గండి చెరువు సమీపంలోనూ ప్రయాణ ప్రాంగణ పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయ్యే వరకూ యాదాద్రిలో ఇప్పుడున్న బస్టాండ్‌ కేంద్రంగానే బస్సులను నడపనున్నారు. తిరుపతి తరహాలో గుట్ట కింద నుంచి పైనున్న బస్‌ బే వరకూ భక్తుల కోసం షటిల్‌ సర్వీసులు తిరగనున్నాయి.


ఆకట్టుకునే అద్దాల మంటపం

ప్రధానాలయం బయటి ప్రాకారంలో స్వామివారికోసం అద్దాల మంటపాన్ని నిర్మించారు. పశ్చిమ రాజగోపురం సమీపంలో నైరుతి దిశలో నిర్మితమైన ఈ మంటపాన్ని విద్యుద్దీపకాం తులతో అలంకరించి బంగరు రంగులో మెరిసేలా తీర్చిదిద్దారు. అద్దాల మంటప ద్వారానికి ఇత్తడి కవచాలతో 12 మంది ఆళ్వారుల ప్రతిమల్ని బిగించారు. ద్వారానికి ఇరువైపులా సుమారు మూడడుగుల ఎత్తు కలిగిన ఐరావత విగ్రహాల్ని అమర్చనున్నారు. వీటిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రూపొందించారు. ఈ మంటపానికి చుట్టూ అమర్చిన అద్దాల్లో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఊయలలో ఊగుతున్నట్లు కనిపించే దృశ్యం భక్తులకు కన్నుల పండుగే.


యాదగిరీశుని పుష్కరిణి ఇదే..!

నారసింహుడి దివ్యతేజోకాంతుల్లో ధగద్ధగాయమానమై వెలుగులీనుతున్న యాదాద్రి దివ్యక్షేత్రంలో- ప్రతి జలధారా పవిత్ర తీర్థమే. ముఖ్యంగా ఇక్కడి విష్ణు పుష్కరిణిని సాక్షాత్తూ దేవదేవుడి పాదాల నుంచి ఉద్భవించిన గంగ అనీ అందులో స్నానం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందనీ సకల పాపాలూ తొలగిపోతాయనీ భావిస్తారు భక్తులు. హిరణ్యకశిపుని వధ అనంతరం రుషులూ బ్రహ్మాది దేవతలూ శ్రీవారి పాదాలను కడిగినప్పుడు ఏర్పడినదే ఈ పుష్కరిణి అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో మహర్షులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి వేద మంత్రాలు జపిస్తూ లక్ష్మీనరసింహుడిని దర్శించుకుంటారనీ ఆ సమయంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయనీ చెబుతారు. బ్రహ్మోత్సవ సమయంలో రాత్రివేళలో తీర్థానికి మధ్యలో అఖండమైన దివ్యజ్యోతి ప్రకాశిస్తుందనీ, అది సావిత్రి-గాయత్రి-అరుణ దేవతల రూపమనీ భావించి ఆరాధిస్తారు. ఈ జ్యోతి ప్రకాశం నుంచీ సుదర్శన జ్యోతి వెలుగొంది సమస్త దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుందని విశ్వసిస్తారు. అయితే క్షేత్రాభివృద్ధిలో భాగంగా- కొండపైన పునరుద్ధరించిన విష్ణు పుష్కరిణిని దైవ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించనున్నారు. భక్తుల పుణ్యస్నానాలకోసం కొండ కింద లక్ష్మీ పుష్కరిణిని నిర్మిస్తున్నారు.

 


ఈ స్వామి స్వయంభువు

హైదరాబాద్‌ నగరం తూర్పున ఉన్న లక్ష్మీనారసింహుడీయన. కొసగుండ్ల ఆలయమనీ... ఫణిగిరి క్షేత్రమనీ అంటారు స్థానికంగా. యాదాద్రిక్షేత్రం దత్తత తీసుకున్న ఆలయాల్లో ఇదీ ఒకటి. యాదాద్రీశుడి కటాక్ష వీక్షణలతోనే ఇక్కడ నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగానే కాదు... చారిత్రకంగానూ ఎన్నో ప్రత్యేకతలకు  నెలవైన ఈ గుడి విశేషాలు...

భాగ్యనగరంలోని చైతన్యపురిలో ఉంటుందీ ఆలయం. వాణిజ్యసముదాయాలు అత్యధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి నిత్యం రణగొణధ్వనితో ఉంటుంది ఇక్కడికెళ్లే మార్గం. ఈ హైవే నుంచి ఉత్తరదిక్కున ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళితే కనిపిస్తుందీ ఆలయం. గుడి చేరువయ్యేకొద్దీ రణగొణలు దూరమై చల్లటి గాలి సేదదీరుస్తుంది. మెట్లమార్గంలో కొండనెక్కి కాస్త ఉత్తరం వైపు చూస్తే చాలు... పచ్చదనం కనువిందుచేస్తుంది. ఆ పచ్చదనం మధ్య మూసీ నదీ పిల్లకాలువలా ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా తూర్పువైపున ప్రవహించే మూసీనది ఇక్కడ మాత్రం కాస్త ఉత్తరాభిముఖంగా వెళుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన మొదటి విశేషం ఈ నదితోనే మొదలవుతుంది...

‘ముచికుంద’ అన్న పేరుకి మరో రూపమే ‘మూసీ’. ముచికుందుడు అన్న రుషి కారణంగా ఆ పేరు వచ్చిందంటారు. ఆ ముచికుంద మహర్షి తపస్సు చేసింది ఈ గుహాలయంలోనేనని చెబుతారు. ఉత్తరవాహినిగా ఉన్న నది దగ్గర ఓ ఆలయం ఏర్పడిందంటే అది తప్పకుండా పుణ్యక్షేత్రమే అవుతుందని ఆలయ నిర్మాణశాస్త్రాలు చెబుతాయి. అదొక్కటే కాదు... ఈ ఆలయం క్షేత్రపాలకుడు హనుమంతుడు. సాధారణంగా హనుమ దక్షిణాభిముఖంగానే ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఉత్తరం వైపు చూస్తుంటాడు. అలా చూడటం ధనాభివృద్ధికి సంకేతమన్నది ప్రాచీన వాస్తు వివరణ. ఇక గుహలో మూలవిరాట్టయిన లక్ష్మీ నరసింహుడు స్వయంభువు. రాతిపైన కనిపించే నిలువు నామం ఆకారాన్ని బట్టే ఇక్కడి స్వామివారిని గుర్తించారట. దేవుణ్ణి ఎవరో గుర్తించడమేమిటా అనుకుంటున్నారేమో... దాని వెనక ఓ పెద్ద కథే ఉంది.

బండరాతిని తొలగించి...

1980లలో కూడా ఈ ప్రాంతం రకరకాల చెట్లతో అడవిలాగే ఉండేది. ఆ చెట్ల మధ్య ఎత్తైన గుట్ట, దాన్ని ఆనుకుని, ఒకదాని వెనక ఒకటి పెద్ద కొండరాళ్లూ ఉండేవి. కొనదేలిన ఆ కొండరాళ్ల వల్లే ఈ ప్రాంతాన్ని ‘కొసగుండ్ల’ అంటుండేవారు. ఈ రాళ్ల మధ్య కాస్త ఎత్తులో గుహ ఉండేది. అది ఎందుకో... ఎప్పట్నుంచో తెలియదుకానీ... గుహలోపలికి ఎవరూ వెళ్లకుండా ఓ పెద్ద బండరాయిని కప్పి ఉంచారు. లోపలున్న దైవం ఎవరో తెలియకున్నా... ఆ బండరాయి ముందే కొబ్బరికాయ కొట్టి పూజచేస్తుండేవారు భక్తులు. ఆ నేపథ్యంలోనే ఇక్కడికొచ్చారు కొమాండూరి శేషాచార్య. ఓరియంటల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేసి రిటైర్‌ అయ్యారాయన. ఆయనకోసారి కలలో... ఈ గుహలోపలికి ఓ నాగుపాము వెళ్లినట్టూ, అక్కడ లక్ష్మీ నరసింహ రూపం ఉన్నట్టూ కనిపించిందట. ఉదయం లేవగానే గుట్టనెక్కిన శేషాచార్య భక్తుల సాయంతో గుహ ముందున్న బండరాయిని తొలగించి లోపలికెళ్లారట. చీకట్లో ఆయనకి మొదట నిలువునామం కనిపించింది. పక్కనే ఐదుతలల సర్ప విగ్రహమూ ఉండటంతో... ఈ స్వయంభువు నారసింహుడేనని నిర్ధారించారు. శేషాచార్యులే ఈ ఆలయానికి ఓ రూపమిచ్చారు. ఓ రోజు ఆయన ఈ గుహాలయానికి పైనున్న కొండని చూస్తూ ఉంటే ఏవో కొన్ని అక్షరాల వరస కనిపించిందట. అవే ఇక్కడో చారిత్రక అద్భుతాన్ని ఆవిష్కరించాయి...

అతిప్రాచీన శాసనం...

ఆయన పేరు పీవీ పరబ్రహ్మశాస్త్రి. పురావస్తు శాఖలో శాసనకర్తగా ఉండేవారు. శేషాచార్య పిలుపుతో ఎవరూ ఎక్కలేని ఈ కొండమీదకి వెళ్లి ఆ వాక్యాలని పరిశీలించారు. నకలు తీసుకుని పరిష్కరించి... ఇది బ్రాహ్మీలిపిలో ఉన్న ప్రాకృత శాసనమని తేల్చారు. క్రీ.శ. 4-5వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన గోవిందవర్మ అన్న విష్ణుకుండిన మహరాజు వేయించిన దాన శాసనమని గుర్తించారు. అంతేకాదు, హైదరాబాద్‌లో దొరికిన అతిప్రాచీన శాసనం ఇదేనని ప్రకటించారు పరబ్రహ్మశాస్త్రి. అంతేకాదు, ఈ శాసనంలో ఈ ప్రాంతాన్ని ‘పుడ(పడగ)గిరి’ అని ప్రస్తావించారట. అదే తర్వాతి కాలంలో ఫణిగిరిగా మారింది. బౌద్ధచైత్యాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రాంతాన్ని చైత్యపురిగా పిలుస్తూ వచ్చి క్రమంగా చైతన్యపురిగా మారిందని చెబుతున్నారు చరిత్రకారులు!

ఏటా 500 పెళ్ళిళ్లు...

ఈ చారిత్రక వైభవానికి తగ్గట్టే ఆలయం కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తూ వస్తోంది. 2008లో ఈ ఆలయాన్ని యాదాద్రి క్షేత్రం దత్తత తీసుకుంది. ఏటా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున యాదాద్రిలాగే నరసింహ జయంతినీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వచ్చే వైశాఖ పున్నమి రోజున 500 మంది నిరుపేద జంటలకి కనులపండువగా పెళ్ళిళ్ళు నిర్వహిస్తారు!

- మేకల గణేశ్‌, న్యూస్‌టుడే, నాగోలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..