ఓ ఆలయమండపం కథ!

అమెరికాలోని ఫిలడెల్ఫియా అనగానే... తెలుగువారందరికీ అక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయమే గుర్తొస్తుంటుంది! అక్కడికి వెళ్ళిన పర్యటకుల్లో కాస్త ఆసక్తి ఉన్నవాళ్ళు ‘ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌’నీ సందర్శిస్తుంటారు.

Updated : 16 Oct 2022 02:11 IST

ఓ ఆలయమండపం కథ!

అమెరికాలోని ఫిలడెల్ఫియా అనగానే... తెలుగువారందరికీ అక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయమే గుర్తొస్తుంటుంది! అక్కడికి వెళ్ళిన పర్యటకుల్లో కాస్త ఆసక్తి ఉన్నవాళ్ళు ‘ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌’నీ సందర్శిస్తుంటారు. ఆ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ - ‘హిందూ టెంపుల్‌ హాల్‌’. భారతదేశం బయట ఉన్న అతిపెద్ద ఆలయ మండపం ఇదేనని చెబుతుంటారు. ఇది 1920 నుంచీ ఈ మ్యూజియంలో ఉందికానీ... అక్కడికి ఎలా వచ్చిందన్న విషయం మాత్రం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇటీవలే ఆ మిస్టరీని ఛేదించింది డేరియల్‌ మేసన్‌ అనే పరిశోధకురాలు. ఆ ఛేదనలో ఆసక్తికరమైన కథ ఒకటి వెలుగులోకి వచ్చింది... అనగనగా ఆడిలైన్‌ అని ఓ అమెరికన్‌ అమ్మాయి. తనకి చిన్నప్పటి నుంచీ భారతీయ శిల్పకళంటే తగని ఇష్టం. అందుకని పెళ్ళయ్యాక హనీమూన్‌కి భారతదేశాన్నే ఎంచుకుని 1913లో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చింది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న మదనగోపాల స్వామి ఆలయానికి వెళితే అక్కడ ఆలయ శిల్పాలూ, స్తంభాలూ శిథిలాలుగా ఉండటం గమనించింది. వాటిని టోకున కొనేసింది. ఆ శిల్పాలతో తన ఇంటి ముంగిట ఓ ఆలయ మండపంలాంటిది నిర్మించుకోవాలనుకుంది ఆడిలైన్‌! ఎంతో ప్రయాసకోర్చి ఆ శిథిలాలని అమెరికాకి తీసుకెళ్ళగలిగింది. కానీ ఆడిలైన్‌ న్యుమోనియాతో చిన్న వయసులోనే కనుమూసింది. దాంతో ఆ శిథిలాలని ఏం చేయాలో అర్థంకాక ఆమె కుటుంబసభ్యులు వాటిని ఫిలడెల్ఫియా మ్యూజియానికి ఇచ్చేశారట. వాళ్లు వెంటనే లండన్‌లో ఉంటున్న ప్రఖ్యాత భారతీయ కళాపరిశోధకుడు ఆనందకుమార స్వామిని రప్పించారు. ఆ శిథిల శిల్పాలు మదురైని పాలించిన తెలుగు నాయకరాజుల ఆలయ నిర్మాణ శైలిలో ఉన్నాయని ఆయనే గుర్తించారు. కుమారస్వామి సాయంతోనే మ్యూజియంలో ఆ శిథిలాలని అద్భుతమైన మండపంగా ఏర్పాటుచేశారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు