అనారోగ్యాల్ని నయం చేసే నెట్టికంటి అంజన్న!

ఆ ఆలయంలోని స్వామి శుభదృష్టి తమమైన పడితే చాలనుకుంటారు ఎంతోమంది భక్తులు. అలా తనని దర్శించుకునే భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా పూజలు అందుకుంటున్నాడు గుంతకల్లు మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయుడు.

Updated : 12 Jan 2024 16:33 IST

ఆ ఆలయంలోని స్వామి శుభదృష్టి తమమైన పడితే చాలనుకుంటారు ఎంతోమంది భక్తులు. అలా తనని దర్శించుకునే భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా పూజలు అందుకుంటున్నాడు గుంతకల్లు మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయుడు. మధ్వ మఠాధిపతి అయిన వ్యాసరాయల మహర్షి స్థాపించిన ఈ విగ్రహానికే కాదు.. ఆలయ నిర్మాణానికీ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉండటం విశేషం.  
సువిశాలమైన ప్రాంగణంలో... నాలుగు గోపురాల మధ్య కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాడు నెట్టికంటి ఆంజనేయుడు. గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో కనిపించే ఈ ఆలయంలోని విగ్రహాన్ని మధ్వ మఠాధిపతి అయిన వ్యాసరాయల మహర్షి ప్రతిష్ఠించాడని అంటారు.  

స్థలపురాణం

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలకి ఓసారి కుహు అనే జాతక గండం వచ్చిందట. అప్పుడు రాజ్యపాలన మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పడంతో... కొన్ని ఘడియలపాటు ఆ బాధ్యతను శ్రీకృష్ణదేవరాయలు తన గురువైన వ్యాసరాయల మహర్షికి అప్పగించాడట. తరువాత ఆ మహర్షి తీర్థయాత్రలకు బయలుదేరి... హంపి క్షేత్రంలో తుంగభద్రా నదీ తీరాన తన నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడున్న శిలపైన గంధంతో ఆంజనేయస్వామి రూపాన్ని చిత్రీకరించాడు. మర్నాటికి ఆ చిత్రం కాస్తా శిల్పంగా మారిపోయింది. ఆంజనేయస్వామికి భక్తుడైన వ్యాసరాయలు స్వామి ఆదేశం ప్రకారం వివిధ ప్రాంతాల్లో 732 స్వామి విగ్రహాలను ప్రతిష్ఠిస్తే... వాటిల్లో చిట్టచివరిదే ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామిదని ప్రతీతి. ఒకప్పుడు పెద్ద రావిచెట్టు కింద ఈ స్వామి విగ్రహం ఉండేదనీ క్రమంగా ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించారనీ చెబుతారు.

ఈ క్షేత్రంలో స్వామి ఉత్తరముఖంగా దర్శనమివ్వడంతో పాటు స్వామి కన్ను స్పష్టంగా కనిపించడం వల్ల తమపైన శుభదృష్టి పడుతుందని నమ్ముతారు భక్తులు. ఇక్కడి ధ్వజస్తంభం దగ్గర స్వామివారి భారీ పాదరక్షలు ఉండటం వెనుకా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బట్నపాడు గ్రామానికి చెందిన హరిజన హనుమంతు అనే భక్తుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు.. స్వామి కలలో కనిపించి తనకు పాదరక్షలు తయారుచేయమన్నాడట. దాంతో అతడు మర్నాడే పాదరక్షల్ని తయారుచేసి స్వామికి సమర్పించాడట. తరవాత వాటిని పరిశీలిస్తే స్వామి వేసుకున్నట్లుగా వాటి అడుగున ముళ్లూ, పాదముద్రలూ కనిపించాయట. అప్పటినుంచీ ఏడాదికోసారి ఆ భక్తుడు కొత్త చెప్పుల్ని తయారుచేసి ఆలయానికి తీసుకురావడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తే... దాన్ని అతడి వారసులు కొనసాగిస్తున్నారిప్పుడు. ప్రతిరోజూ రాత్రి స్వామి ఆ పాదరక్షల్ని ధరించి భక్తులను కాపాడేందుకు ఊరంతా తిరుగుతాడనీ, దుష్టశిక్షణ చేస్తాడనీ అంటారు.

స్వామి కరుణిస్తే చాలు

ఈ ఆలయానికి వచ్చే భక్తులు... ముందుగా ఆ పాదరక్షల్ని దర్శించుకున్నాకే స్వామి సన్నిధానానికి చేరుకుంటారు. గ్రహపీడితులూ, అనారోగ్య సమస్యలతో బాధపడేవారూ, సంతానం లేనివారూ, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారూ ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుని ప్రాంగణంలో నిద్రిస్తారు. అలా నిద్రించినప్పుడు స్వామి కలలో కనిపిస్తే గనుక భక్తుల సమస్యలు తీరతాయని ఓ నమ్మకం. చైత్రమాసంలో హనుమాన్‌ దీక్షాపరులు ఇక్కడకు వచ్చి స్వామి సన్నిధిలో దీక్షను విరమిస్తారు. అదేవిధంగా వైశాఖమాసంలో వచ్చే హనుమాన్‌ జయంతికి వారం రోజులపాటు రోజుకో విధంగా స్వామిని తమలపాకులూ, గులాబీపూలూ తదితరాలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చే ఈ స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివస్తారు.  

ఎలా చేరుకోవచ్చు

గుంతకల్లుకి  మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కసాపురం గ్రామంలో కనిపిస్తుంది నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రం. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైళ్లూ, బస్సులూ అందుబాటులో ఉంటాయి. గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి కసాపురం వెళ్లేందుకు బస్సులూ, ఆటోలూ ఉంటాయి. లేదంటే హైదరాబాద్‌ - కర్ణాటక ఏడో నంబరు జాతీయ రహదారి మీదుగా కూడా ఆలయానికి వెళ్లొచ్చు.
నబీరసూల్‌, గుంతకల్లు, న్యూస్‌టుడే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..