Updated : 03 Oct 2021 05:51 IST

వీళ్లు సామాన్యులు కారు!

సువిశాల భారతంలో ఎన్నో సమస్యలు దర్శనమిస్తుంటాయి. వాటిని చూస్తూ నిట్టూర్చేవారు చాలామంది ఉంటారు కానీ, పరిష్కారాన్ని ఆలోచించేవారు కొందరే! దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన సమస్యలకు తమదైన పరిష్కారాన్ని చూపారు ఈ అసామాన్యులు!

యాభైవేల హెల్మెట్లు పంచాడు!

బిహార్‌కు చెందిన 32ఏళ్ల రాఘవేంద్ర కుమార్‌ గ్రేటర్‌ నోయిడాలో లాయర్‌గా ప్రాక్టీసు చేసేవాడు. ఏడేళ్ల కిందట జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తన స్నేహితుడిని కోల్పోయాడు. హెల్మెట్‌గానీ వేసుకుని ఉంటే ప్రాణాపాయం తప్పేదని డాక్టర్లు  చెప్పారు. అది తెలుసుకున్నాక అతడి మనసులో ఏదో అలజడి. హెల్మెట్‌ పెట్టుకోవడమనే ముందు చూపు, జాగ్రత్త లేకపోవడంవల్ల ఎంత నష్టం జరిగిందీ అనుకున్నాడు రాఘవేంద్ర. మరింత పరిశోధన చేస్తే ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 95 శాతం మంది హెల్మెట్‌ లేకపోవడంవల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్నాడు. ఆరోజు నుంచి  హెల్మెట్‌ వినియోగంపైన అవగాహన కల్పించడం, అవసరమైన వారికి ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. నోయిడా నుంచి బిహార్‌ వెళ్లేటపుడు తన కారులో కొన్ని హెల్మెట్లు పెట్టుకుని వెళ్తూ దారిలో ఎవరైనా హెల్మెట్‌ లేకుండా కనిపిస్తే ఆగి వాళ్లకి హెల్మెట్‌ ఇస్తాడు. ఇప్పటివరకూ 22 రాష్ట్రాల్లో దాదాపు యాభైవేల హెల్మెట్లను పంచాడు. అలాగని రాఘవేంద్ర శ్రీమంతుడేం కాదు. హెల్మెట్‌ల కోసం అప్పులు చేయడంతో బిహార్‌లోని రూ.40 లక్షల విలువైన పొలం అమ్మాల్సి వచ్చింది. నోయిడాలో ఉన్న ఇంటినీ అమ్మేశాడు. తన భార్య, తల్లిదండ్రుల సహకారంతో ఇవన్నీ చేస్తున్నానంటాడు. ఈ క్రమంలో కొంతమందికి చదువు కోవడానికి పుస్తకాలు ఉండటం లేదని తెలుసుకున్నాడు. అదీ ముఖ్యమైన అంశమే, కానీ దాన్ని పరిష్కరించ డానికి తన దగ్గర అంత డబ్బులేదు. అందుకని హెల్మెట్‌ తీసుకునేవాళ్ల నుంచి పాత పుస్తకాలు తీసుకోడం మొదలుపెట్టాడు. వాటితో వేర్వేరు నగరాల్లో బుక్‌ బ్యాంకుల్నీ ఏర్పాటు చేశాడు. ఇప్పటివరకూ 50 వేల హెల్మెట్‌లను అందించిన    రాఘవేంద్రను ‘హెల్మెట్‌మ్యాన్‌’గా పిలుస్తున్నారంతా.


సంప్రదాయ ఆటల వేదిక..

కొవిడ్‌ ప్రభావంతో ఏడాదిన్నరగా విద్యార్థులు స్కూళ్లకు పోలేదు సరికదా బయటకూ వెళ్లలేదు. ఇళ్లలో ఉంటూ ఆన్‌లైన్‌ చదువులూ, ఆన్‌లైన్‌ గేమ్‌లకే పరిమితమైపోయారు. ఈ మధ్యనే బడులు మళ్లీ తెరుచుకోవడంతో పిల్లలు తిరిగి వస్తున్నారు. ఈ ఏడాదిన్నరలో వారి జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్నేహితులకూ, ఆటపాటలకూ దూరమయ్యారు. స్క్రీన్‌టైమ్‌ పెరగడంవల్ల వల్ల శారీరక, మానసిక సమస్యలూ ఎక్కువయ్యాయి. ప్రవర్తనాపరమైన మార్పులూ వచ్చాయి. ఈ విషయాల్ని గమనించి మదురైకి సమీపంలోని ఒత్తక్కడై ప్రభుత్వ బాలికల మోడల్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు శశిత్ర దీనికో వినూత్న పరిష్కారం చూపారు. విద్యార్థుల్లో చురుకుదనాన్నీ, స్నేహభావాన్నీ, ఆలోచనాశక్తినీ పెంచేలా సంప్రదాయ క్రీడల్నీ ఆడించాలనుకున్నారు. దీనికోసం తన సొంత డబ్బుతో పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా సంప్రదాయ ఆటల వేదికని ఏర్పాటుచేసి వైకుంఠపాళి, చదరంగం, అష్టాచమ్మా, వామన గుంటలు, అచ్చంగాయలు... లాంటి ఆటలు ఆడుకునేందుకు శాశ్వతమైన బోర్డుల్ని రూపొందించారు. 9-12 తరగతులు చదివే విద్యార్థులు లైబ్రరీ/సంగీతం క్లాసుల సమయంలో ఇక్కడ ఆడుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. స్కూల్‌ టైమ్‌కంటే ముందు వచ్చేవాళ్లూ ఆడుకోవచ్చు. ‘మన సంప్రదాయ ఆటలు... పిల్లల్ని ఆన్‌లైన్‌ గేమ్స్‌ నుంచి దారిమళ్లేలా చేసి విలువలు నేర్పుతాయి, ఏకాగ్రతను పెంచి నైపుణ్యాల్ని అభివృద్ధిచేసు కునేలా వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేలా సాయపడతాయ’ని చెబుతారు శశిత్ర.


సైకిల్‌మీదే ఆక్సిజన్‌..

కొవిడ్‌ సమయంలో వైద్యులతోపాటు ఎక్కడి కక్కడ మందులు పంచడం, ఆహారాన్ని అందించడం, అత్యవసర సమయంలో ఆక్సిజన్‌ను చేర్చడంలో వేలమంది సామాన్యులూ భాగస్వాములయ్యారు. అలాంటి అసామాన్యుడు సౌమిత్ర మండల్‌. వనరులు అస్సలే లేని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ బాధితులకు సేవలు అందిస్తూ వాళ్లలో ధైర్యాన్ని నింపుతున్నాడు పశ్చిమ బెంగాల్‌, సుందర్‌బన్స్‌ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల సౌమిత్ర. కొవిడ్‌ రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్‌ను తన సైకిల్‌ వెనక పెట్టుకుని సుందర్‌బన్స్‌ పరిధిలోని తొమ్మిది దీవుల్లో ఉన్న గ్రామాల్లో తిరుగుతూ ఆక్సిజన్‌ను అందించేవాడు. కొవిడ్‌ వచ్చినా వెంటనే ఆసుపత్రిలో చేరలేని వారికి ఈ సేవల్ని అందించేవాడు. వైద్యులతో మాట్లాడి మందుల్నీ అందజేస్తుండేవాడు. అలాగని ఎవ్వరి నుంచీ రూపాయి విరాళంగా తీసుకోడు. ‘డబ్బులు తీసుకోవడం మొదలుపెడితే లక్ష్యం పక్కదారి పడుతుంది’ అని చెప్పే సౌమిత్ర... అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌లో బెడ్‌ అవసరమైతే పరిచయస్థుల సాయంతో అందుకు సాయపడేవాడు. ఈ క్రమంలో మూడు నెలల కిందట ఆయనకూ కరోనా సోకింది. అయినా వెనకడుగువేయకుండా కోలుకున్నాక, మళ్లీ సైకిల్‌పైన కాన్‌సంట్రేటర్‌ని పెట్టుకుని వెళ్తున్నాడు ఈ ఆక్సిజన్‌మ్యాన్‌. డిగ్రీ చదువుకున్న సౌమిత్ర కొన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలలో వాలంటీరుగా పనిచేశాడు. ఇప్పుడు మాత్రం ప్రైవేటుగా పాఠాలు చెబుతున్నాడు. పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలూ, ప్రభుత్వం నుంచి ఉపకారవేతనాలు అందిస్తూ వారి చదువులు ఆగిపోకుండా చూస్తుంటాడు.

 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని