పసుపు రంగు చూస్తే భయమేసేది!

పడవ నడిపే చిన్నదిగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నటించిన ఐశ్వర్య లక్ష్మి ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ‘అమ్ము’తో కంట తడి పెట్టించింది. ‘మట్టి కుస్తీ’లో మల్లయోధురాలిగా ఓ పట్టు పట్టింది.

Updated : 07 May 2023 16:56 IST

పసుపు రంగు చూస్తే భయమేసేది!

పడవ నడిపే చిన్నదిగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నటించిన ఐశ్వర్య లక్ష్మి ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ‘అమ్ము’తో కంట తడి పెట్టించింది. ‘మట్టి కుస్తీ’లో మల్లయోధురాలిగా ఓ పట్టు పట్టింది. మెడిసిన్‌ చదివి... నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ కేరళ కుట్టి...  వెండితెరపైకి ఎలా వచ్చిందంటే..

నంత పద్మనాభస్వామి కొలువుదీరిన తిరువనంతపురం మా సొంతూరు. అమ్మానాన్నలు ఇద్దరూ ప్రభుత్వోద్యోగులు. ఒక్కగానొక్క కూతుర్ని కావడంతో గారాబంగా పెంచారు. చదువు విషయంలో మాత్రం అమ్మ చాలా స్ట్రిక్టు. అందుకే మార్కులూ, ర్యాంకులూ అంటూ ఆరాటపడేదాన్ని. వారమంతా చదువుల ఒత్తిడితో గడిచినా... ఆదివారం సినిమాలతోనే ఆటవిడుపు. అమ్మకి సినిమాలంటే చాలా ఇష్టం. వీలుకుదిరితే సెలవు నాడు థియేటర్‌కి తీసుకెళ్లేది. ఎందుకో తెలియదుగానీ అంతలా సినిమాలు చూసినా నాకెప్పుడూ నటన మీద ఆసక్తి కలగలేదు. డాక్టర్‌ అవ్వాలని ఉండేది. వైద్యానికి డబ్బులేక ఇబ్బంది పడుతున్నవాళ్లకి సేవ చేయాలనుకునేదాన్ని. ఆ విషయం చెబితే అమ్మానాన్నలు ఎంత సంతోషించారో! బంధువులకీ, తమ స్నేహితులకీ చెప్పి తెగ మురిసిపోయారు. ఏడో తరగతిలో ఉన్నప్పుడే తిరువనంతపురంలోని ఓ మెడికల్‌ కాలేజీ దగ్గర ఇల్లు కూడా కొనేసింది అమ్మ. ‘అమ్మాయి డాక్టర్‌ అయితే డాక్టర్‌ సంబంధమే తీసుకురావాల’ని నాన్న కలలు కనేవాడు. ఇంటర్‌ అయ్యాక ఎంసెట్‌ రాస్తే ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీటు వచ్చింది. ఎర్నాకుళంలోని ఓ మెడికల్‌ కాలేజీలో చేరా. ఎందుకో మొదటి సంవత్సరం విసుగ్గా గడిచింది. చదువుకు సమయం సరిపోయేది కాదు. వేరే ప్రపంచమంటూ లేక చిరాగ్గా అనిపించేది. ఆ ఒత్తిడిని ఎలా పోగొట్టుకోవాలో తెలిసేది కాదు. అందుకే సెకండ్‌ ఇయర్‌కి వచ్చాక- ‘ఎత్తుగా, తెల్లగా ఉంటావు... నీ నవ్వు బాగుంటుంది. మోడలింగ్‌ చేయొచ్చుగా’ అంటూ స్నేహితుల నుంచి సలహా వచ్చింది. అమ్మానాన్నలకు చెప్పకుండానే- ఒత్తిడిని దూరం చేసుకోవడానికీ, పాకెట్‌ మనీ కోసమనీ మోడలింగులోకి అడుగుపెట్టా.

కాలేజీలోనూ అనుమతి తీసుకుని పలు ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంటూనే వ్యాపార ప్రకటనల్లో నటిస్తుండేదాన్ని. మెడికోగా, మోడల్‌గా రెండు చోట్లా సంతృప్తి లభించేది. అలా ఎంబీబీఎస్‌ చదివిన నేను పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో-  కొచ్చిలోని ఓ కెఫేకి స్నేహితులతో వెళ్లా. రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న ఓ సినిమా పత్రిక మీదకు అనుకోకుండా నా చూపు వెళ్లింది. ‘హీరోయిన్‌ కావాలి’ అన్నది ఆ పత్రికలోని ప్రకటన సారాంశం. అది చూశాక ‘నాకేం తక్కువ... నేనెందుకు ప్రయత్నించకూడదు’ అనిపించింది. వెంటనే అందులో ఇచ్చిన చిరునామాకు నా ఫొటోలు కొరియర్‌ చేశా. అంతేకాదు, ఆ సినిమా దర్శకుడు ఆల్తాఫ్‌ సలీమ్‌ నా స్నేహితుడికి స్నేహితుడని తరవాత తెలిసింది. నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేస్తే ‘రేపు కలుద్దాం..’ అన్నారు ఆల్తాఫ్‌. మరుసటి రోజు క్రిస్మస్‌... పొద్దుటే వెళ్లి కలిశా. నవీన్‌ పౌలీ హీరోగా ‘జందుకలుడే నత్తిల్‌ ఒరిడవేలా’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు ఆల్తాఫ్‌. ఆ కథ బాగా నచ్చింది. కాసేపటికి ఇంటికి బయల్దేరుతుంటే ‘మా సినిమాలో మీరు నటిస్తారు కదూ...’ అన్నారు. తొలి ప్రయత్నం ఫలించింది- ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పి వచ్చా. హాస్టల్‌కి వచ్చాకే ఆలోచన మొదలైంది. డాక్టర్ని అవుతానంటే అమ్మ పొంగిపోయింది. ఈ విషయం చెబితే కుంగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంబీబీఎస్‌ ఫలితాలు వచ్చే వరకూ ఎదురు చూశా. మంచి మార్కులు వచ్చాయని అమ్మ సంబరపడుతుంటే-  డాక్టర్ని అవ్వను యాక్టర్ని అవుతానని ఇంట్లో బాంబ్‌ పేల్చా. నేను అనుకున్నట్టే అమ్మకి కోపం వచ్చింది. తనకి సినిమాలంటే ఇష్టమున్నా... తన కూతురు నటిస్తానంటే మాత్రం జీర్ణించుకోలేకపోయింది. నాన్నకీ అంతే. నేను పట్టుపట్టడంతో అయిష్టంగానే ఒప్పుకున్నారు. అలా 2017లో మొదటి సినిమా విడుదలైంది. అందులో నటనకు మంచి పేరు రావడంతో ఆ తరవాత సినిమాలో స్టార్‌ హీరోల్లో ఒకరైన టోవిన్‌ థామస్‌ పక్కన ‘మాయనది’లో అవకాశం వచ్చింది. దానికీ మంచి మార్కులు పడటంతోపాటు మలయాళంలో సినిమా అవకాశాలు వరస కట్టాయి. తమిళంలోనూ విశాల్‌, ధనుష్‌ సరసన ఛాన్స్‌లు వచ్చాయి. ‘అర్చన 31 నాట్‌ అవుట్‌’ సినిమాలో నా నటన అమ్మానాన్నలకు బాగా నచ్చింది. అప్పటినుంచి ‘నీకు నచ్చిందే చెయ్‌...’ అంటూ మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తున్నారు.

నిర్మాతగానూ...

2021లో ‘గాడ్సే’తో తెలుగులో అడుగుపెట్టా. ‘గార్గి’తో నిర్మాతగా మారా. ‘జగమే తంత్రం’, ‘కెప్టెన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’, ‘అమ్ము’, ‘మట్టి కుస్తీ’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ తదితర చిత్రాలు నటిగా నన్ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. దుల్కర్‌ సల్మాన్‌తో నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోట’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గార్గి’ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నో చెప్పా. నా గతమే అందుకు కారణం. చిన్నప్పుడు అమ్మానాన్నలు గురువాయుర్‌ ఆలయానికి తీసుకెళ్లారు. దర్శనానికి క్యూలో నిలబడినప్పుడు నా వెనకున్న ఓ వ్యక్తి నా ప్రయివేట్‌ పార్ట్స్‌ను తాకుతూ మీద మీద పడ్డాడు. ఎంతో ఇబ్బందిగా అనిపించింది. ఏడుపొచ్చింది. అమ్మానాన్నలకు చెబితే ఇంకేం చేస్తాడోనని భయమేసి మౌనంగా ఉన్నా. ఆరోజు పసుపు రంగు గౌను వేసుకున్న నాకు చాలా కాలం ఆ రంగును చూస్తేనే భయమేసేది. గదిలో ఒంటరిగా ఏడ్చేదాన్ని. చాలా కాలం కొత్త వాళ్లను చూస్తే దాక్కునేదాన్ని. ఎదిగే క్రమంలో- పసుపు రంగును చూసి భయపడకుండా ఉండేందుకు ప్రయత్నించా. ఆ రంగు దుస్తుల్ని వేసుకుని నా మనసులోని ఆలోచనల్ని రూపు మాపే ప్రయత్నం చేశా. కొన్నాళ్లకి రంగంటే భయం పోయిందిగానీ... ఆ సంఘటన మనసుకు చేసిన గాయం మాత్రం మానలేదు. ఎంబీబీఎస్‌కి వచ్చాకే అమ్మానాన్నలకు ఆ విషయం చెప్పా. ‘గార్గి’ కూడా ఇంచుమించు అలాంటి కథే. అది విన్నాక డిస్టర్బ్‌ అయ్యా. అయితే కొంత కాలానికి ‘గార్గి’ కథకు సాయి పల్లవి ఎంపికైనా... ఆ సినిమా పట్టాలెక్కడానికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. స్నేహితుల ద్వారా ఆ విషయం తెలియడంతో బాధేసింది. సమాజంలో ఆడపిల్లలు నిత్యం ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు సినిమాలతోనే తల్లిదండ్రులకూ, ఆడపిల్లలకూ అవగాహన కల్పించొచ్చు అనిపించింది. ఆ సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. స్నేహితులతో కలసి
నిర్మిస్తూనే ఓ చిన్న పాత్ర కూడా పోషించా.

ఆ తరవాత వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ ఓ మధుర జ్ఞాపకమనే చెప్పాలి. మణి సర్‌ ఆడిషన్‌కి పిలిచి.. వానతి(శోభిత ధూళిపాళ చేసింది) పాత్రకు తీసుకున్నారు. ఆ సమయంలో ‘జగమే తంత్రం’ షూటింగ్‌ కోసం లండన్‌లో ఉన్నా. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగానే ఆ సినిమా తీస్తున్నారని చెప్పగానే పుస్తకం తెప్పించుకుని చదివేశా. నవల పూర్తయ్యేసరికి పూంగళళి పాత్ర బాగా నచ్చేసింది. నన్ను నేను పూంగళళిలా ఊహించుకునేదాన్ని. ఆ పాత్ర నాకు ఇవ్వమని అడిగితే మణి సర్‌ ఏమంటారోనని భయమేసింది. ఓ వారం రోజులకి మా మేనేజర్‌ ఫోన్‌ చేసి ‘పూంగళళి పాత్ర చేస్తారేమో మణి సర్‌ కనుక్కోమన్నారు’ అన్నాడు. అంతే ఎగిరి గంతేశా... కానీ ఆ పాత్ర కోసం చాలా దృఢంగా ఉండాలన్నారు. అందుకే ఐదారు కేజీల బరువు పెరిగా. ఈత, తెడ్డుతో పడవ నడపడం నేర్చుకున్నా. పెద్ద నటీనటులతో నటించడం ఓ గొప్ప అనుభూతి. షూటింగ్‌ సమయంలో నా పాత్రకోసం సిద్ధమవుతూనే వాళ్ల నటనను గమనించేదాన్ని. ఐశ్వర్యరాయ్‌ బోర్డు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అయినట్టు తన డైలాగ్స్‌ శ్రద్ధగా చదువుకునేవారు. మేకప్‌, హెయిర్‌ స్టైల్‌, నగలు ధరించడానికి సమయం పడుతుందని- త్రిష తెల్లవారుజామున మూడు గంటలకే సెట్‌కి వచ్చేవారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’లోనూ అలాంటి అనుభవాలు బోలెడు. నాకు మాత్రం మణి సర్‌ దర్శకత్వం, పూంగళళి కట్టూబొట్టూ ఎంతగానో నచ్చాయి. నా కెరీర్‌లో అదో మైలు రాయి.

ఎందరినో చూశా...

ఎంబీబీఎస్‌ చేసేటప్పుడు హాస్పిటల్‌లో పనిచేసేదాన్ని. పక్కటెముకలు విరిగిపోయి, తల పగిలి, కాళ్లూ చేతులపైన వాతలతో ఎంద]రో మహిళలు వచ్చేవాళ్లు. భర్త పెట్టే హింస వల్లే వాళ్లకా పరిస్థితి. కేసు పెట్టే ధైర్యం ఉండేది కాదు. హింసను తప్పించుకోవడానికి భర్తని వదిలి పెట్టమంటే ఒప్పుకునేవారు కాదు. వాళ్లని చూసి నాకు ఏడుపొచ్చేది. ఈ సంఘటనలే నేను ‘అమ్ము’ ఒప్పుకోవడానికి కారణం. చాలామంది థియేటర్‌లో విడుదల కాని సినిమాలో ఎందుకు నటిస్తున్నావ్‌ అన్నారు. ఆ సినిమా ఓటీటీలో విడుదలవ్వడం వల్ల ఎందరో మహిళలు చూడగలిగారు. ఇప్పటికీ చూస్తున్నారు. ఆ సినిమాలో- ఓ సందర్భంలో భర్త కొట్టాడని కూతురు తల్లికి చెబుతుంది. ‘మొగుడు అన్నాక కొడతాడు. ఇది నీకే జరగలేదు. నీ తరవాత ఆగిపోదు. నీకు ఇలా మళ్లీ మళ్లీ జరగొచ్చు. మగాడు అన్నాక కోపాలు వస్తాయి. వెయ్యి తలనొప్పులు పడతాడు...’ అని తల్లి చెబుతుంది. మన చుట్టూ ఇలా ఆలోచించేవాళ్లే కదా ఉన్నారని చాలా బాధేసింది. ఆరోజంతా మనసు కల్లోల కడలిగా మారింది. డైలాగులు చెప్పలేకపోయా. దాన్నుంచి బయట పడేందుకు చాక్లెట్లు తింటూ సంగీతం వింటూ రకరకాల ప్రయత్నాలు చేశా. ఆ సినిమా విడుదలయ్యాక బయటకు వెళితే ‘ఎన్ని కష్టాలు పడ్డావ్‌్ తల్లీ... అందరూ నీలాగే ధైర్యంగా ఉండాలి’ అంటూ ఆడవాళ్లు చుట్టుముట్టేవారు. అలాంటప్పుడు కలిగే సంతృప్తి అంతా ఇంతాకాదు. హీరో రవితేజ నిర్మించిన ‘మట్టి కుస్తీ’ కూడా అంతే సంతృప్తినిచ్చింది. కుస్తీ పోటీలకోసం స్టంట్స్‌ చేయాల్సి వచ్చింది. నాది చాలా సున్నిత శరీరం. స్టంట్స్‌ చేయడానికి సహకరించేది కాదు. అయినా పట్టు వీడకుండా ఫైట్‌ మాస్టర్‌ చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఆత్మవిశ్వాసంతో షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. రిహార్సల్‌ సమయంలో చాలా గాయాలు కూడా అయ్యాయి. పైగా ‘మట్టి కుస్తీ’లో కామెడీ కూడా చేయాల్సి వచ్చింది. అదొక కొత్త అనుభూతి. ఆ సినిమాకి వచ్చిన స్పందన చూశాక నేను పడిన కష్టానికి ఫలితం దక్కినట్టు అనిపించింది. సినిమా రంగంలోకి వచ్చినప్పుడే డబ్బు గురించి కాకుండా పాత్ర గురించే ఆలోచించాలనే నియమం పెట్టుకోవడం వల్లే ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటున్నా. ఇక మీదటా ఇదే ఫాలో అవుతా.


ఆ పాత్ర చేయను

నేను పుట్టినప్పుడు నాన్న శ్రీలక్ష్మి అని పేరుపెట్టారు. అమ్మ ఐశ్వర్య అని పెట్టుకుంది. చివరికి ఐశ్వర్య లక్ష్మిని అయ్యా. స్కూల్‌ రిజిస్టర్‌లో లక్ష్మి బదులు లెక్ష్మి అని పడటంతో అందరూ అదే పేరుతో సంబోధిస్తున్నారు గానీ, నా అసలు పేరు ఐశ్వర్య లక్ష్మి.

* నాకు డ్రీమ్‌రోల్స్‌ అంటూ లేవుగానీ... నెగెటివ్‌ రోల్స్‌ మాత్రం చేయకూడదనే నియమం పెట్టుకున్నా.

* కాంజీవరం పట్టు చీరలు, కేరళ సంప్రదాయ చీరలు చాలా ఇష్టం. ఖాళీగా ఉంటే ఆ చీరలు కట్టుకుని ఫొటోలు దిగుతుంటా.

* అల్లు అర్జున్‌ స్టైల్‌ ఇష్టం. సినిమా విషయానికొస్తే అభిషేక్‌ బచ్చన్‌, విజయ్‌ సినిమాలు ఎక్కువ చూస్తుంటా.

* చిన్నతనంలో నా మొదటి క్రష్‌ యువరాజ్‌ సింగ్‌. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ యువరాజ్‌ సింగ్‌ను ప్రేమిస్తున్నానని ఇంట్లో చెబితే నవ్వేవారు. నన్ను ఆటపట్టించేవారు. ఇప్పుడు క్రికెట్‌ చూసే తీరిక ఉండట్లేదు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..