Updated : 12 Jun 2021 15:27 IST

ముందడుగు

- ముచ్చి ధనలక్ష్మి

‘‘మీ   తో కొంచెం మాట్లాడాలి నాన్నా... మీరిప్పుడు ఫ్రీ అయితేనే...’’
వింధ్య అడిగినప్పుడే అర్థమైపోయింది ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపే సన్నాహాల్లో ఉందని.
ఏంటన్నట్టు చూశారాయన నావైపు... నాకు తెలియదని తెలిసినా కూడా. అప్రయత్నంగా వినయ్‌వైపు తిరిగాయి నా కళ్లు. తెలియదన్నట్లు భుజాలెగరేశాడు వాడు.
‘‘దేని గురించి?’’ గంభీరంగా అడిగారు, కాస్త నవ్వితే నాలుగు కోట్ల నష్టం వచ్చినట్టు.
‘‘నా ప్రాజెక్ట్‌ గురించి’’ అంతే గంభీరంగా చెప్పింది తండ్రికి తగ్గ తనయ.
‘‘అది మరిచిపోమని అప్పుడే చెప్పాను గుర్తులేదా?’’
‘‘నేను మరిచిపోనని కూడా చెప్పాను మీకు గుర్తులేదా?’’
వింధ్య ధైర్యం నన్ను తీవ్రమైన షాక్‌కే గురిచేసింది. అసలు దీనికింత ధైర్యమెలా వచ్చిందో అర్థం కావట్లేదు. మొన్నమొన్నటి వరకూ మోహన్‌ ఎదుట మాట్లాడే సాహసమే చేయనిది ఈ మధ్య ఏకంగా వాదిస్తోంది.
‘‘వింధ్యా..!’’ తీవ్రమైంది మోహన్‌ స్వరం.
‘‘సారీ నాన్నా! ఆ ప్రాజెక్ట్‌ నా కల. నాలుగు సంవత్సరాల నుండీ దానికోసమెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. మీరు వదిలేయమని చెప్పినంత ఈజీగా నేను వదిలేయలేను’’ క్లుప్తంగా, స్పష్టంగా చెప్పింది తన నిర్ణయాన్ని.
‘‘అయితే ఇప్పుడేమంటావే?’’ హాల్లో ప్రత్యక్షమైపోయింది మా అత్తగారు. ఆమెకి ఇలాంటి వాదనలంటే మహా సరదా.
‘‘నేను కచ్చితంగా బెంగళూరు వెళ్తానంటాను’’ కచ్చితంగా అనే పదాన్ని ఒత్తి పలికింది.
‘‘అసలేంటి నాన్నా మీ సమస్య? ఇప్పుడు నేనేం చేయకూడని పని చేస్తున్నానని? స్టేట్‌ లెవెల్లో మా కాలేజ్‌ నుండి మా ప్రాజెక్టే సెలక్టయిందంటే అర్థం చేసుకోరేం? ఎందుకిలా అన్నింటికీ అడ్డు తగులుతారు?’’ కాస్త ఆవేదనా, బాధా ధ్వనించాయా గొంతులో.
ఒక్కసారిగా ఏదో కలకలం నాలో... ఏవో గుర్తొస్తున్నాయి... ఇవే మాటలు... ఎక్కడో విన్నాను... కాదు, కాదు అన్నాను... నేనే అన్నాను... అచ్చం ఇలానే, వింధ్యలానే... అవును నా కూతురిలో నేనే కనిపిస్తున్నాను. అదే గొంతు, ఆ గొంతులో అదే కోపం, అదే బాధ.
పాతికేళ్లక్రితం ఇలాగే నాన్నని అడుగుదా మనుకున్నా, ఇంతే ఆవేశంగా నిలదీద్దా మనుకున్నా. కానీ... కానీ... ఇంత తెగువా, ధైర్యం నాకెక్కడివి? భయం అన్నిటికీ భయమే.
వింధ్యలానే ఎన్నో కోరికలతో ఏవేవో లక్ష్యాలు పెట్టుకుని డిగ్రీ అవగానే ఉద్యోగవేటలో పడ్డా. అలుపూ సొలుపూ లేకుండా నా వంతు ప్రయత్నాలన్నీ చేశా. కానీ అదేంటో దురదృష్టం అన్నీ చేతికందినట్టే అంది చేజారిపోయాయి.
ఎం.బి.ఏ. చేస్తే భవిష్యత్‌ తారాజువ్వలా దూసుకుపోతుందని మా లెక్చరర్లు చెప్పేసరికి కొత్త ఆశలు మేల్కొన్నాయి నాలో. ఎలాగైనా ఎం.బి.ఏ. చేయాలనీ, తర్వాత మార్కెటింగ్‌ చేయాలనీ, ఆ ఎం.బి.ఏ. ఫార్మల్‌ డ్రెస్‌లో అంతా తిరగాలనీ, జాబ్‌ చేసి సొంత కాళ్లపై నిలబడాలనీ, ఫస్ట్‌శాలరీతో అమ్మకీ నాన్నకీ బట్టలు కొనాలనీ... ఏవేవో ఆశల రెక్కలతో ఊహా లోకమంతా చుట్టేస్తుంటే పెళ్లనే పదునైన కత్తితో ఒక్క వేటున కత్తిరించేశారు నా రెక్కలు.
మనసాగక మెల్లగా నాన్న దగ్గర ఒకసారి కదిపాను.
‘‘నువ్వేం ఉద్యోగాలు చేసి ఊళ్లేలక్కర్లేదులే’’ ఒక్కటే మాట, మరోసారి మళ్లీ అడగాలనిపించలేదు. ఆశచావక మోహన్ని అడిగాను అభ్యర్థనగా.
‘‘అక్కర్లేదులే నీ సంపాదనతో ఆస్తులు కూడబెట్టక్కర్లేదు’’ ఈ మాటతో పూర్తిగా మాయమై పోయాయి నా చిన్న చిన్న కోరికలు.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నా జీన్స్‌తో పుట్టిన నా కూతురు నేను సాధించ లేనిది, సాధించటానికి ప్రయత్నిస్తుంటే ఏదో ఆనందం నాలో. దాని వెన్ను తట్టి ప్రోత్సహించాలనున్నా నేను అశక్తురాలిని. మాదో సనాతన సంప్రదాయాల కుటుంబం.
మా నాన్న నన్నెంత కట్టుదిట్టమైన క్రమ శిక్షణతో పెంచారో అంతే కట్టుదిట్టమైన ఆచారాలున్న ఇంటికి కోడలిగా పంపించారు. ఏ విషయంలోనూ నాకు స్వాతంత్య్రం లేదు మా అమ్మలానే. అక్కడా ఇక్కడా కూడా ఎప్పుడూ ప్రేక్షక పాత్రే. పిల్లల పెంపకం విషయంలో కూడా.
అమ్మ నన్నెలా కుందేలులా పెంచిందో నేనూ వింధ్యనలానే పెంచాను. మరి నాలో రాని ధైర్యం దానికెలా వచ్చింది... పెళ్లైన ఇన్ని సంవత్సరాల తర్వాత నా గుండె ఆనందంగా, వేగంగా కొట్టుకున్నదిప్పుడే.
‘‘అయినా మా ఇంట్లో ఆడపిల్లలలా చదువులూ, ఉద్యోగాలంటూ గడపదాటి ఇంటి పరువు తియ్యరు’’ మా అత్తగారి అరుపులకు చెదిరాయి నా ఆలోచనలు.
‘‘గడపదాటినంత మాత్రాన పరువు తీసినట్టేనా? అయితే అన్నయ్య ఎన్నిసార్లు పరువు తీశాడు?’’

‘‘వాడూ, నువ్వూ ఒకటేనా?’’
‘‘ఏం వాడేమైనా రెండుసార్లు పుట్టాడా? రెండు కొమ్ములతో పుట్టాడా?’’
నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నా... వింధ్యేనా ఇలా, ఇంత ధైర్యంగా మాట్లాడేది? దీనికింత ధైర్యమిచ్చినదెవరు?
నా ఆలోచనలకందటం లేదు. సందేహం లేదు, ఏదో జరిగింది. ఎవరో దీన్ని వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరది? ఎవరినైనా ఇష్టపడుతోందా ఏంటి?
‘‘అయినా నిన్ననేం ప్రయోజనంలే? పెంపకాన్ని అనాలి’’ నిరసనగా నావైపు చూసింది మా అత్తగారు.
ఏదో అనాలన్నట్టు అంది కానీ వాళ్లిద్దర్నీ ఏనాడు నా దగ్గర పెరగనిచ్చారు కనుక. పిల్లలతో కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడనివ్వరు, మాట్లాడితే అదో పెద్ద నేరం.
‘‘అన్నయ్యతో నీకు వంతు అనవసరం. నా మాట విని ఉద్యోగాలనీ, ప్రాజెక్టులనీ బయట తిరగకుండా హాయిగా ఇంట్లో ఉండు, పైగా నీకు మంచి సంబంధాలొస్తున్నాయి. దీనిపై ఇక వాదనలనవసరం’’ తెగ్గొట్టేశారు.
దేవుడా! ఈ మనిషి నిజంగా మనిషేనా? అసలు ఇన్ని సంవత్సరాలు నేనెలా భరించాను? ఎందుకంత వివక్ష? పిల్ల మీద కనీసం ఆవగింజంత అభిమానమైనా చూపించరేం?
‘‘సారీ నాన్నా! నాకు తెలిసినంతవరకూ నేనెప్పుడూ మీమాట కాదనలేదు. ఈ ఒక్కసారికి కాదనాల్సి వస్తోంది.
ఆహా! నా కూతుర్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇలా ఉండాలి అమ్మాయంటే. ఎవరికైనా ఉండేది ఒకే జీవితం కదా? జీవితాంతం కాకపోయినా కొన్నాళ్లయినా నచ్చినట్టు జీవించనివ్వచ్చుగా? ఊరికే ఉద్ధరిస్తున్నట్టు మధ్యలో దూరి గీతలు గీసి బంధించడమెందుకు?
‘‘ఇదే నీ చివరి నిర్ణయమైతే నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను రూపాయి కూడా ఇవ్వకుండా నీ ప్రాజెక్టెలా కంప్లీటవుతుందో చూస్తాను.’’
కాళ్లకింద భూమి కంపించినట్టయింది.
కన్నతండ్రి కాదు కసాయివాడు. ఎంత అహంభావమో? అందరూ తన మాటే వినాలన్న పంతం.
ఇక నేను కల్పించుకోవాల్సిందే, అంతే మా తలరాతలు.
‘‘వదిలేసేయ్‌ వింధ్యా! నా తల్లివి కదూ! మనకంత అదృష్టం లేదమ్మా!’’ ఎంతలా ఆపినా నా కళ్లల్లో నీళ్లాగలేదు.
‘‘తప్పుకో, అదేనా పిల్లలకు చెప్పే పద్ధతి?’’ అని నన్ను తోసి ముందుకు వచ్చింది మా అత్తగారు.
‘‘చూడు పిల్లా! నీకంతగా ఉద్యోగం చేయాలని ఉంటే పెళ్లయ్యాక మీ ఆయనకి చెప్పి చేసుకో’’ ఓ ఉచిత సలహా పడేసింది.
నా కూతురి మీద ఈవిడ పెత్తనమేమిటో? ఇలాంటప్పుడే ఆవిడ గొంతు నొక్కేయాలనిపిస్తుంది.
‘‘సరే నాన్నా! నేనిక బయల్దేరతా!’’ కాలేజీకో, షాప్‌కో వెళ్తానన్నంత ఈజీగా చెప్పేసింది.
‘‘వింధ్యా...’’ అప్రయత్నంగా అరిచేశాను. ‘‘పిచ్చి పట్టిందా ఏంటే? ఎక్కడికెళ్తావ్‌? నువ్వు ఆడపిల్లవి.’’
‘‘అది నువ్వు కొత్తగా గుర్తు చేయనక్కర్లేదమ్మా! రోజుకో వందసార్లు నాన్నా, నానమ్మా గుర్తు చేస్తూనే ఉంటారుగా! నీ హెల్త్‌ జాగ్రత్త.’’
‘‘నోరు మూసుకో’’ నా కోపం పెరిగిపోతోంది. ‘‘కదిలావంటే కాళ్లు విరగ్గొడతాను, నడు లోపలికి.’’
‘‘ఇప్పుడు నన్నాపటానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత ఒట్టు, తర్వాత నీ ఇష్టం.’’
ఎంత స్పష్టంగా, సూటిగా చెప్పిందంటే మరో మాట బయటికి రాలేదు నా గొంతు నుండి.
మరో గంటసేపు మోహన్‌ బెదిరింపులూ, అత్తమ్మ సాధింపులూ తీవ్రస్థాయిలో జరిగినా వెనక్కి తగ్గలేదు వింధ్య.
దాని ధైర్యమేంటనేది అర్థంకాక పిచ్చెక్కిపోతోంది. దాన్ని ఆపలేను, వాళ్లకి సర్దిచెప్పలేను ఏం జరుగుతుందో ఏంటో? ఒంటరిగా అదెక్కడికని వెళ్తుంది? వింధ్యకేదైనా అయితే నేను బతకగలనా?
‘‘మోహన్‌... ప్లీజ్‌’’
‘‘నువ్వు మాట్లాడకు, నీకా అర్హత లేదు. కూతుర్ని హద్దుల్లో పెంచడం రాదు. అసలెందుకు నువ్వున్నది ఛీ...’’ కోపంతో వణికిపోతోంది తన గొంతు.
కాసేపు వింధ్యనొదిలి నా లోపాల్ని ఎత్తి చూపించారిద్దరూ.
తన పంతం నెగ్గించుకోవడానికి తండ్రితో పాటూ, తల్లిని కూడా వదిలేసి బయటికెళ్లిపోయింది నా కూతురు.
ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా దాన్నొదిలి ఉన్నానా? మా నాన్నకీ, భర్తకీ నేనున్నా లేనట్టే అనుకునే దాన్ని ఇప్పటివరకూ. ఇక వింధ్యకి కూడా అంతేనా? నేనెవరికీ అక్కర్లేదా? ఏంటో ఎంత బాధపడినా కన్నీళ్లు రావడం లేదు.
తుఫాను తర్వాత వచ్చేంత ప్రశాంతంగా అయింది ఇల్లు. ఏం జరగనట్టు యథావిధిగా న్యూస్‌ చూడటంలో మునిగిపోయాడు మోహన్‌. పనిమనిషి దగ్గర కూర్చుని ఊరందరి విషయాలు సేకరిస్తోంది అత్తమ్మ. ఏదో ఫోన్‌ వస్తే బయటికెళ్లాడు వినయ్‌.
ఇక ఆగడం నావల్ల కాలేదు. అదెక్కడి కెళ్తుందో... ఎలా వెళ్తుందో... గబగబా లేచి పరుపు కిందా, చీరల మడతల్లో, డబ్బాల్లో దాచిన డబ్బుల్ని తీసి చెప్పుల్లో కాలు దూర్చి పరుగుతీశాను బస్టాండ్‌ వైపు. ఎంతైనా తల్లిని కదా, దాన్ని నేనెలా వదిలేయగలను?
ఎక్కువ వెతకనవసరం లేకుండా ఎంట్రన్స్‌లోనే కనిపించింది. పిలవబోయి ఆగిపోయాను. దానికి సన్నిహితంగా నిలబడ్డాడా అబ్బాయి. నాకు ముందు నుండీ సందేహమే ఇలాంటిదేదో ఉందని... లేకపోతే అంత ధైర్యంగా ఎలా బయటికొస్తుంది?
మోహన్‌ అన్నట్టు నా పెంపకం సరిగ్గా లేదా? మెల్లగా అటువైపు నడిచాను.
‘‘నువ్వేం టెన్షన్‌ పడకు, దిగగానే స్వాతి నిన్ను రిసీవ్‌ చేసుకుంటుంది’’ ధైర్యం చెప్తున్న ఆ గొంతు నాకు సుపరిచితమైనదే.
‘‘వినయ్‌’’ అప్రయత్నంగా అనేశాను. టక్కున నా వైపు తిరిగిన ఇద్దరూ తలొంచుకున్నారు దొరికిన దొంగల్లా.
నిమిషంలో తేరుకున్న వినయ్‌ ఒక్క పరుగులో నా దగ్గరకొచ్చాడు. ‘‘అమ్మా! ప్లీజ్‌ నువ్వు కూడా నాన్నా నానమ్మా చెప్పిన డైలాగ్స్‌ అయితే చెప్పొద్దు. వింధ్య మంచి టాలెంటెడ్‌, కాన్ఫిడెంట్‌ కూడా. భవిష్యత్తులో ఏం చేయాలో దానికో అవగాహన ఉంది. మీరెందుకు ఎదగ నివ్వకుండా అడ్డుకుంటారు? అది కూడా నీలాగే జీవితాంతం వంటింట్లో మగ్గితే నీకిష్టమా?’’ ఆవేశంగా అడుగుతున్నాడు వినయ్‌.
ఆనందంతోనో, అయోమయంతోనో మాటలు రాలేదు నాకు. నా మౌనాన్ని కోపమనుకున్నాడేమో. ‘‘నేను వింధ్యకి సపోర్ట్‌ చేస్తున్నానని నాన్నకి తెలిస్తే బాధ పడతారు, అంతే కానీ నన్ను ఇంటి నుండి బయటికెళ్ల మనరు కదా! నాన్నని బాధపెట్టడం ఇష్టం లేకనే ఇంట్లో సైలెంట్‌గా ఉన్నా. అర్థం చేసుకో ప్లీజ్‌.’’
సర్దిచెప్పడం మొదలుపెట్టాడు. వాడి ప్రయత్నాలకి నవ్వొచ్చేసింది. ‘‘హమ్మయ్య, నువ్వు నవ్వావంటే ఒప్పుకున్నట్టే. థాంక్‌ గాడ్‌ బతికించావు’’ ఊపిరి పీల్చుకున్నాడు రిలీఫ్‌గా.
‘‘ఆల్‌ ది బెస్ట్‌ వింధ్యా! జాగ్రత్త, రోజుకొకసారైనా ఫోన్‌ చేస్తావు కదూ! ఇంట్లో నీ అరుపులూ అల్లరీ హడావుడీ లేకుంటే ఆ నిశ్శబ్దానికి నేనేమైపోతానో’’ నిట్టూరుస్తూ డబ్బులు తన చేతికిచ్చాను. రెప్పల నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ.
‘‘అమ్మా!’’ గద్గద స్వరంతో ఏడ్చేస్తుందనుకున్నా.
‘‘థ్యాంక్యూ సో మచ్‌ అమ్మా! నీకు ఫోన్‌ చేయకుండా, నీ గొంతు వినకుండా నేను మాత్రం ఉండగలనా? కానీ తప్పదు, ఇప్పుడీ క్షణాలు నా చేతుల్లో ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి అడుగు ముందుకు వేయకుంటే జీవితాంతం వెనక్కి చూసుకుంటూనే బతకాలి. ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోయినా కనీసం ప్రయత్నించి ఓడిపోయానన్న తృప్తి ఉండనీ. ప్రయత్నమే మొదటి మెట్టు’’ స్థిరంగా చెప్తున్న వింధ్య నా కళ్లకు యుద్ధంలో పోరాడుతున్న సైనికుడిలా కనిపించింది.
‘‘దట్స్‌ ద స్పిరిట్‌ మై డియర్‌ మంకీ. అయినా నీకన్ని కష్టాలు పడే ఛాన్స్‌ రాదులే. వన్‌ వీక్‌ స్వాతి దగ్గరుండి డాక్యుమెంటేషనంతా చేసేయ్‌, తర్వాత నేనొచ్చేస్తాగా?’’
తన భుజాల చుట్టూ చేతులేస్తూ చెప్తున్న వినయ్‌ చేతిని గట్టిగా పట్టుకుంది వింధ్య. లావాలా ఉబికివస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటోంది.
‘‘బీ బ్రేవ్‌ రా! నువ్వేం మాకు దూరమవ్వట్లేదు. కాస్త దూరంగా వెళుతున్నావంతే’’ ధైర్యం చెప్తున్న వినయ్‌ని చూస్తుంటే ముచ్చటేస్తోంది... అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కూడా.
ఈ రాక్షసులిద్దరే కదా... ఇంట్లో బయటా నన్ను నిమిషం నిలబడనీయక కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఒకరి మీదొకరు కంప్లైంట్స్‌ చెప్తూ విసిగించి విసిగించి చంపేవారు! అయినా వీళ్లిద్దరి మధ్యా అంత దృఢమైన బంధమెప్పు డేర్పడింది... ఎంత బద్ధ శత్రువుల్లా ఉండేవారు!
ఇది నిజంగా షాక్‌, పెద్ద షాక్‌. శత్రుత్వంలో సాన్నిహిత్యాన్ని నేనెందుకు గుర్తించలేకపోయానో?
బస్‌ హారన్‌ మోగేసరికి చకచకా కదిలింది వింధ్య. బస్సు ఎక్కుతూ వెనక్కి తల తిప్పి చూసింది మావైపు. వినయ్‌తో పాటూ నేను కూడా రెండు చేతుల పిడికిళ్లు మూసి బొటనవేలు తెరిచి దీవించాను మనస్ఫూర్తిగా.
విలువైన కన్నీళ్లను జారనివ్వకుండా రెప్పలతో బిగించి లోపలికెళ్లిపోయింది. ఇలా వెన్నుతట్టి ప్రోత్సహించే అన్నయ్య ఆనాడు నాకు లేడన్న బాధకన్నా నా కూతురికైనా ఇలాంటి భరోసాను ఇవ్వగలిగానన్న గర్వమే ఎక్కువ.
అయినా అటువంటి ఇంట్లో పుట్టి,
పెరిగిన వినయ్‌ వాళ్లలా ఉండకపోవడం నిజంగా మా అదృష్టమే. ఇక నాకు వింధ్య గురించి బెంగ లేదు.
మరో గట్టి హారన్‌తో కదిలింది బస్సు. దూసుకెళ్తోంది వింధ్య గమ్యం వైపుగా.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని