అవమానాలు సహిస్తూ ఎలా ఉండగలుగుతున్నావమ్మా?

అమ్మ ముఖంలో బాధ చూడడం నాకు కొత్తేమీ కాదు. అమ్మ ఏ బాధనయినా భరించగలదు గానీ అవమానం వల్ల కలిగే బాధను తట్టుకోవడం ఆమెకు కష్టమే. తరచూ అలాంటి బాధలను భరిస్తున్న అమ్మను ఎలా ఊరడించాలో తెలియని పసివయసు నాది.

Updated : 07 May 2023 16:44 IST

అవమానాలు సహిస్తూ ఎలా ఉండగలుగుతున్నావమ్మా?

- కొయిలాడ రామ్మోహన్‌ రావు

మ్మ ముఖంలో బాధ చూడడం నాకు కొత్తేమీ కాదు. అమ్మ ఏ బాధనయినా భరించగలదు గానీ అవమానం వల్ల కలిగే బాధను తట్టుకోవడం ఆమెకు కష్టమే. తరచూ అలాంటి బాధలను భరిస్తున్న అమ్మను ఎలా ఊరడించాలో తెలియని పసివయసు నాది. నాకిప్పుడు పన్నెండు నడుస్తుంది. నేనూ పెద్దదాన్ని అవుతున్నాను. అన్నీ ఆకళింపు చేసుకోగలుగుతున్నాను.

మా నాన్న చనిపోయి నాలుగేళ్ళు అవుతోంది. ఆయన మరణంతో వచ్చిన చిన్న ఉద్యోగంతో అమ్మ నన్నూ చెల్లినీ పోషించుకుంటూ గుట్టుగా కాపురాన్ని నడిపించుకొస్తోంది.

నాన్నకు ఒక తమ్ముడూ, ఇద్దరు చెల్లెళ్ళూ. మేము తప్ప అందరూ ఆర్థికంగా పెద్ద స్థాయిలోనే ఉన్నారు. నాన్న తక్కువ కులానికి చెందిన పేదింటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని ఆ కుటుంబంలో అందరికీ చులకనే. అప్పట్లో కులాల పట్టింపు ఎక్కువగా ఉండేది. అందుకే ఏ శుభకార్యానికైనా నాన్న ఒక్కరే వెళ్ళేవారు. అమ్మనిగానీ, మమ్మల్నిగానీ తీసుకెళ్ళేవారు కాదు.

*    *    * 

ప్రస్తుత సమస్య పెద్దత్తయ్య వాసంతి వల్ల వచ్చింది. ఆమె కూతురు ‘ఐశ్వర్య’ రజస్వల ఫంక్షన్‌కి మేమంతా వచ్చాం. గతంలో ఏ ఫంక్షన్‌కీ పిలవనివారంతా ఇప్పుడు పిలుస్తున్నారు. దానికి కారణం... ఒక రకంగా పెద్దత్తే.

నాన్న చనిపోయిన కొత్తలో పెద్దత్తకు ఒక కొత్తరకపు చికెన్‌ పాక్స్‌ వచ్చింది. అది మామూలు జబ్బే అయితే భయపడే పనేలేదు. కానీ అది డాక్టర్లకే అంతుచిక్కని జబ్బు అయింది. ఆ జబ్బు తగ్గడానికి కొంత టైమ్‌ పడుతుందని డాక్టర్లు ముందే చెప్పేశారు. ఆ పరిస్థితుల్లో అత్తయ్యను చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అది కొత్తరకపు అంటువ్యాధి అని తేలడంతో అందరూ భయపడిపోయారు. అమ్మ మాత్రం ఏమీ భయపడకుండా ముందుకు వచ్చింది. ఆమెకు ఎవరూ అడ్డు చెప్పలేదు. సుమారు పదిరోజులపాటు అత్తను కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ సేవ చేయడం వల్ల, అత్తయ్య ఆరోగ్యవంతురాలయింది. అప్పటినుంచీ అత్తయ్యే కాదు, అందరూ అమ్మను కలుపుకోవడం, ఆప్యాయంగా ఆదరించడం మొదలుపెట్టారు. ఒక్క తాతయ్య విషయంలో మాత్రం ఏ మార్పూ రాలేదు. అవే కరకు చూపులు... అదే గంభీరమయిన ముఖం.

నాన్న, అచ్చు తాతయ్య పోలికే అంటారు. ఆ మాట నిజమే కావచ్చు కానీ నాకు మాత్రం తేడాలే ఎక్కువ కనబడుతున్నాయి. నాన్న ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరిగేదే కాదు. ఆయన ఎప్పుడూ హుషారుగా ఉండేవారు. ఏనాడూ ఆయన జబ్బుతో బాధపడినట్లు నాకు గుర్తు లేదు. యాక్సిడెంట్‌ ఆయన్ని పొట్టన పెట్టుకుందిగానీ, వందేళ్ళు చిరునవ్వుతో సంతోషంగా జీవించవలసిన మనిషాయన. తాతయ్య అలా కాదు, ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. మమ్మల్ని చూస్తే, ఆయన ముఖం మరింత ముడుచుకుపోతుంది. ‘ఆయన నవ్వగా ఎవరైనా ఎప్పుడైనా చూసుంటారా?’ అన్న నా సందేహం- సందేహంగానే మిగిలిపోయింది ఇప్పటికీ.

పెద్దత్తకి సేవ చేయడంతో అందరికీ అమ్మ మంచితనమూ ఆమె తత్వమూ తెలిసిపోయాయి. అప్పటినుంచి అందరూ అమ్మను ఏదో రకంగా వాడేసుకోవడం మొదలుపెట్టారు. నేను వయసుకు మించి ఆలోచించడం వల్ల నాకు అన్నీ తెలుస్తున్నాయి. అమ్మ అమాయకంగా అందరి అభ్యర్ధనలకూ తలూపేస్తుందని నాకు మంటగా ఉంది. ఆ మాటే అమ్మతో అంటే, ‘‘పోన్లే అమ్మా, నేనేమీ పెద్దగా కష్టపడిపోవడం లేదు కదా... ఏవో చిన్న చిన్న సాయాలే కదా. ఈ రకంగానయినా మన వాళ్ళతో కలిసిపోతున్నందుకు ఆనందంగా ఉంది. మీ నాన్నే బతికి ఉండి ఉంటే, ఎంత సంతోషించేవారో’’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నేను కరిగిపోయి, మరో మాట అనేదాన్ని కాదు.

ఇప్పుడు అమ్మను బాధపెట్టిన పెద్దత్త మీద నాకు చాలా కోపంగా ఉంది. అయినా చిన్నపిల్లను నేనేమి చెయ్యగలను... బాధపడుతూ ఏడవడం తప్ప. చిన్నత్త సుభద్ర అమ్మతో అన్న మాటలే నాకిప్పుడు పదేపదే గుర్తొస్తున్నాయి.

‘‘వదినా... ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. వాసంతి చెప్పమన్న విషయమే నీకు చెపుతున్నాను. ఈ పరిస్థితి వచ్చినందుకు తను కూడా ఎంతో బాధపడుతోంది. ఐశూకి మంగళస్నానం చేయించాక, కుర్చీలో కుర్చోబెట్టిన తర్వాత, మనవాళ్ళంతా అక్షింతలు వేసి, దాని చేతిలో ఎంతోకొంత పెట్టడం ఆనవాయితీ కదా. మేమందరం ఐదువేలకు తక్కువ కాకుండా దాని చేతిలో పెడుతున్నాం. అక్క అత్తవారు కూడా అలాగే చేస్తున్నారట. ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయిలే ఐశూ చేతిలో పెడితే, అక్కకి నామోషీగా ఉంటుందనీ, వాళ్ళ అత్తగారి బంధువుల దగ్గర చులకన అయిపోతుందనీ బాధపడుతోంది. అందుకే ఎవరూ చూడకుండా ఐశూని పెరటి గుమ్మం దగ్గరకు తీసుకువస్తాననీ... అక్కడే దాన్ని దీవించి, ఆ వెయ్యి రూపాయిలు దాని చేతిలో పెట్టమనీ... మరోలా ఏమీ అనుకోవద్దనీ... మరీ మరీ చెప్పింది’’ అని ముగించింది. ఆ మాటలు వినగానే అమ్మ ఎంత బాధపడిందో నేను ఊహించగలను. బాణం గుచ్చుకున్న పక్షిలా అమ్మ గిలగిలలాడటం నేను సహించలేకపోయాను.

ఈ సంభాషణంతా దూరంగా కూర్చుని ఉన్న తాతయ్య వింటూనే ఉన్నారు. పెద్దత్తను పిలిచి చీవాట్లు పెడతాడేమోనని కాసింత ఆశపడ్డాను, అది జరగని పని అని తెలిసికూడా. ఆయన అమ్మనూ చిన్నత్తనూ మార్చి మార్చి చూస్తున్నారే తప్ప, ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆయన ముఖంలో ఏ భావాలూ తొంగి చూడటం లేదు.

*    *    * 

అమ్మకు అప్పుడప్పుడూ ఇలాంటి అవమానాలు తప్పడం లేదు. అయితే అవి మరీ పెద్దవి కాకపోవడంతో ఆమెకు అలవాటై పోయింది. అందరికీ నిత్యమూ అమ్మ అవసరం పడుతూనే ఉంది. వంటలూ పిండివంటలూ చేయడంలో అమ్మ సిద్ధహస్తురాలు. ఎవరింట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా అమ్మ చేతివంట ఉండాల్సిందే.  ఒకపక్క ఉద్యోగం చేస్తూ, అందరికీ సేవలు చేయడం అమ్మకే కుదిరింది. పర్మిషన్లు పెట్టో, సెలవలు పెట్టో, సాయంత్రం వేళల్లోనో, రాత్రి వేళల్లోనో, తెల్లవారుజామునో బంధువుల పనులు చేసిపెడుతూ అన్నిరకాల సేవలూ అందిస్తూ ఉండేది. ఎక్కువ రోజులు సెలవు పెట్టడం వల్ల, జీతంలో కోతపడినా, అందువల్ల ఆర్థికంగా ఇబ్బందిపడినా అమ్మ ముఖంలో చిరునవ్వు చెరిగేది కాదు.

‘‘ఇన్ని ఇబ్బందులూ కష్టాలూ పడుతూ, అప్పుడప్పుడూ అవమానాలు సహిస్తూ ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావమ్మా? నీకు కోపంగానీ విసుగుగానీ చిరాకుగానీ రావా?’’ అని అడిగితే, చిన్నగా నవ్వి, ‘‘ఇదంతా మీ నాన్న దగ్గరే నేర్చుకున్నానమ్మా. పెళ్ళి కాకముందు నా ప్రవర్తన వేరుగా ఉండేది. ఎవరికైనా సాయం చేయాలంటే మనసొప్పేది కాదు. ఎవరైనా ఏమయినా అంటే పడేదాన్ని కాదు. కానీ పెళ్ళయిన తర్వాత మీ నాన్నను చూసి చాలా నేర్చుకున్నాను. ఆయనంత గొప్ప మనిషిని నేనెక్కడా చూడలేదు. ‘మనం మనకోసమే బతికేస్తే, మన జన్మకు సార్ధకత ఏముంటుంది? వీలయినంత వరకూ తోటివారికి సాయం చేయాలి. అందువల్ల మనం కొన్ని నష్టపోవచ్చూ కొన్ని ఇబ్బందులూ పడవచ్చు. కాని తోటివారికి సాయం చేశామన్న తృప్తి ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి నాకు’ అనేవారు. ఏనాడూ ‘అలా చెయ్యి, ఇలా చెయ్యి’ అని నాకు చెప్పేవారు కాదు. అన్నీ ఆయన్ని చూసే నేర్చుకున్నాను. అవన్నీ పాటిస్తుంటే నా మనసు స్వచ్ఛంగా మారిపోయింది. నా దృక్పథమే మారిపోయింది. ఎన్ని కష్టాలూ అవమానాలూ ఎదురైనా నా పెదవుల మీద చిరునవ్వు చెరగకపోవడానికి కారణం అదే’’ అని అమ్మ నవ్వుతూ చెపుతుంటే ఆమె వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను.

*    *    * 

కొంతకాలం తర్వాత తాతయ్యకు చాలా సీరియస్‌గా ఉందని తెలిసింది. మామూలు రోజుల్లో ఆయనకు సుస్తీ చేస్తే చిన్నాన్న గానీ, పిన్ని గానీ చూసుకునేవారు. వాళ్ళకు ఏదయినా పనిపడినా, వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినా, అదే వీధిలో ఉంటున్న పెద్దత్త గానీ, చిన్నత్త గానీ చూసుకునేవారు. ఆరోగ్యం బాగున్న రోజుల్లో తాతయ్య ఒకేచోట ఉండకుండా ఆ మూడు ఇళ్ళలో ఏదో ఒకచోట ఉండేవారు. కానీ ఈసారి ఆయనకు పెద్ద జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గలేదు. ఊపిరితిత్తులకు సంబంధిం చిన ఇన్ఫెక్షన్‌ అనీ అయినా భయపడాల్సిన పనిలేదనీ కనీసం ఒక నెలపాటు ఎవరయినా నిరంతరం కనిపెట్టుకొంటూ ఉండాలనీ పగలూ రాత్రుళ్ళూ మందులు తప్పనిసరిగా టైముకు ఇవ్వాలనీ చెపుతూ, అనేక జాగ్రత్తలు చెప్పారు డాక్టర్లు.

ఆ వార్త వినగానే అమ్మకు పెద్ద పని పడిందనీ, ఆ బాధ్యత అమ్మకు తగిలించేస్తారనీ భయపడ్డాను. అనుకున్నట్లే జరిగింది. చిన్నాన్న, అత్తలిద్దరినీ తీసుకుని మా ఇంటికొచ్చాడు. తాతయ్యను కంటికి రెప్పలా చూసుకునే దక్షత అమ్మకే ఉందంటూ- పగలయితే వంతులు వారీగా తాతయ్యను చూసుకోగలమనీ, రాత్రుళ్ళు కనిపెట్టుకొని ఉండడానికి అందరికీ ఆరోగ్యపరమయిన సమస్యలున్నాయనీ, పెద్దమనసు చేసుకుని, ఎలాగయినా ఈ గండం గట్టెక్కించమనీ ముగ్గురూ బతిమాలారు. అమ్మ ఒప్పుకోక తప్పలేదు. నెలరోజులపాటూ అమ్మ నలిగిపోవడం నాకూ, చెల్లికీ సుతరామూ ఇష్టం లేదు. మేమిద్దరం తీవ్రంగా వ్యతిరేకించినా అమ్మ వినలేదు.

‘‘అంతా మన మంచికేనర్రా. బంధువులందరూ మనల్ని కలుపుకున్నారు. ఒక్క తాతయ్య మాత్రమే మనకు దూరంగా ఉండిపోయారు. ఆయన కూడా మనల్ని కలుపుకోవడానికి దేవుడే ఈ అవకాశం ఇచ్చాడేమో. మీరేమీ అడ్డుచెప్పకండి. ఏ లోకాన ఉన్నా మీ నాన్న సంతోషిస్తారు. ఆయన కోసమయినా అడ్డురాకండి’’ అంటూ మమ్మల్ని బలవంతంగా ఒప్పించింది.

*    *    * 

మర్నాడు రాత్రి మాకు అనేక జాగ్రత్తలు చెప్పి, తాతయ్య దగ్గరకు వెళ్ళింది. కానీ ఓ గంటలోనే తిరిగి వచ్చేసింది. ఎంతసేపు ఏడ్చిందో ఏమో! కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. అమ్మనలా చూస్తుంటే మా ఇద్దరికీ దుఖం ఆగలేదు. అమ్మను పట్టుకుని ఏడ్చేశాం. అమ్మ కూడా మాతోపాటు ఏడ్చింది. చాలాసేపటికి అమ్మ తేరుకుని చెప్పడం మొదలుపెట్టింది...

‘‘తాతయ్యకు మన మీదింకా కోపం పోలేదమ్మా. నేను ఆ ఇంటికి కోడలిగా రావడం ఆయనకు అస్సలు ఇష్టం లేదని తెలుసుగానీ, ఇన్నేళ్ళుగా ఆయన కక్ష పెంచుకుంటూనే ఉన్నారని ఊహించలేక పోయాను. నేను ఆయన గదిలోకి అడుగు పెడుతుండగానే ఆయన అరవడం మొదలుపెట్టారు, ఒకపక్క దగ్గుతూనే.

‘ఏం? నన్ను చంపేయాలని వచ్చావా? ముందు నా కొడుకుని పొట్టనబెట్టుకున్నావు. ఇప్పడు నేను దొరికానా? ఎవడ్రా దీన్ని నా గదిలోకి రానిచ్చింది? వెంటనే బయటకు పంపేయండి. లేదా...’ అంటూ తెరలు తెరలుగా వచ్చే దగ్గును ఆపుకుంటూ అరుస్తుంటే, నేను భయపడి బయటకు వచ్చేశాను. చిన్నాన్న గబగబా అక్కడికి వచ్చి, తాతయ్యకు నచ్చజెప్పబోయినా ఫలితం లేకపోయింది. చేసేదేమీలేక తిరిగి వచ్చేశాను’’ అంటూ అమ్మ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నేనూ చెల్లీ అమ్మను గట్టిగా అదుముకుని ఆమెను ఊరడించే ప్రయత్నం చేశాం. తాతయ్య మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని బయటపెడితే, అమ్మ తిడుతుందేమోనని భయపడి మనసులోనే తిట్టుకున్నాను.

‘పోన్లే, ఈ రకంగానయినా అమ్మకు కష్టం తప్పింది. అందుకే అంతా మన మంచికే అంటారు’ అనుకున్నాను.

*    *    * 

తాతయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి రెండు నెలల పైనే పట్టింది. ‘దేవుడు మాకు మేలే చేశాడు. అంతకాలం సేవ చేస్తే, అమ్మ ఆరోగ్యం పాడయిపోయి ఉండేది’ అనుకుంటూ తృప్తిగా నిట్టూర్చాను.

ఒక ఆదివారం నేను, చెల్లితోపాటు ఆడుకుని, ఇంట్లో అడుగుపెడుతూ, ‘‘అమ్మా, ఆకలేస్తుంది. తినడానికి ఏదయినా పెట్టు’’ అని కేకవేస్తూ, హాల్లో కూర్చుని ఉన్న తాతయ్యను చూసి గతుక్కుమన్నాను. చెల్లి పరిస్థితి కూడా అంతే. ఇద్దరం భయంతో వెనక్కి అడుగులు వేశాం, అప్రయత్నంగా. తాతయ్య ముఖంలో నవ్వు చూసి, ఇద్దరం తికమకపడ్డాం. ఇది కలో నిజమో నాకు అర్ధం కావడం లేదు. ‘‘భయపడకండి.

నా దగ్గరకు రండి’’ అంటూ తాతయ్య పిలుస్తున్నారు. ఆయన కళ్ళలో ఆప్యాయతా, మాటల్లో మృదుత్వమూ... ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఆయనంత ప్రేమగా పిలుస్తున్నా, ఇద్దరం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం. ఈలోగా అమ్మ కాఫీ పట్టుకుని హాల్లోకి వచ్చి, ‘‘తాతయ్య అంతలా పిలుస్తుంటే వెళ్ళరేమర్రా? ఏమీ భయం లేదు. వెళ్ళండి’’ అంటూ భరోసా ఇచ్చింది. తాతయ్య నవ్వుతూ దగ్గరకు రమ్మన్నట్లు చేతులు చాచారు. ఆ నవ్వు పండు వెన్నెలలా చల్లగా ఉంది. ఆ నవ్వు చూస్తుంటే, నాన్నే గుర్తొచ్చారు. నాన్న గుర్తుకు రాగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ కన్నీళ్లు చూడగానే తాతయ్య కలవరపడ్డారు.

‘‘అయ్యో! చిట్టితల్లీ... ఎందుకేడుస్తున్నా వమ్మా? మీ తాతయ్య ఎప్పుడో మారిపోయాడు’’ అంటూ నన్నూ చెల్లినీ అక్కున చేర్చుకుని గుండెలకు హత్తుకున్నారు. ఆ ఆలింగనం ఎంత హాయిగా ఉందో చెప్పలేను. నాన్నే స్వయంగా వచ్చి కౌగలించుకున్నట్లు అనుభూతి పొందాను. దాంతో నా కళ్ళు మళ్ళీ చెమర్చాయి. ఈసారి తాతయ్య చూడకుండా జాగ్రత్తపడ్డాను.

*    *    * 

‘‘అబ్బ, ఎంత బాగా రాశావు. పదేళ్ళక్రితం జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకుని, పూసగుచ్చినట్లు చెప్పావు. నీలో ఇంత గొప్ప రచయిత్రి ఉందని నాకిప్పటి వరకూ తెలియదే’’ అన్నాడు ప్రద్యుమ్న గదిలోకి అడుగుపెడుతున్న భార్య, వైశాలిని చూస్తూ.

‘‘ఏమిటి? అంతా చదివేశావా... నా అనుమతి లేకుండా?’’ అంటూ చిరుకోపంతో అడిగింది వైశాలి.

‘‘అనుమతి ఎందుకు? ఇదేమీ డైరీ కాదు కదా. అయినా, అందరూ చదవాలనే కదా నువ్వు రాసింది’’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు నవ్వుతూ.

‘‘ఆ ఉద్దేశ్యం ఇప్పట్లో లేదు. ఏ పత్రికకూ పంపే ఆలోచనా లేదు. అమ్మ జ్ఞాపకంగా రాయాలని అనిపించింది. అంతే.’’

‘‘ఏది ఏమయినా చాలా బాగా రాశావు. చదువుతుంటే అక్కడక్కడా కళ్ళు చెమర్చాయి. అంత మంచి అత్తగారూ మామగారూ మన మధ్య లేకపోవడం బాధ కలిగించింది. మరి అసంపూర్ణంగా ఆపేశావేం? మీ తాతయ్య ఎందుకు మారిపోయారో చెప్పలేదే?

నువ్వు అది రాసి పూర్తి చేసేదాకా ఆగలేను. ఏం జరిగిందో నీ నోటితోనే చెప్పేయ్‌’’ అంటూ బతిమాలాడు.

సమాధానంగా చిరునవ్వి నవ్వి, ‘‘ఓకే ఓకే. మిగిలినది కూడా కథ లాగే చెప్తాను విను’’ అంటూ మొదలుపెట్టింది.

‘‘తాతయ్య హఠాత్తుగా ఇంట్లోకి అడుగుపెట్టేసరికి, మాలాగే అమ్మ కూడా ఆశ్చర్యపోయినా, వెంటనే తేరుకుని, సాదరంగా ఆహ్వానించింది.

‘‘నిన్ను క్షమాపణ అడగాలనే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానమ్మా’’ అన్నారు తాతయ్య.

‘‘అదేం మాట మావయ్య గారూ. మనలో మనకి క్షమాపణలేమిటి? ముందు కూర్చోండి’’ అంటూ మర్యాద చేసింది.

‘‘నేను చాన్నాళ్ళ క్రితమే మారిపోయానమ్మా. నా తప్పు ఎప్పుడో తెలుసుకున్నాను. కానీ ‘అహం’ అనే జాడ్యం ఒకటుంటుంది కదా... దాని వల్లనే దిగిరాలేకపోయాను. అదొక్కటే కాదు. నేనెక్కడ మెత్తబడిపోయి, మీకు దగ్గరయిపోయి, మీ వాటా ఆస్తి మీకు రాసి ఇచ్చేస్తానో అని మావాళ్ళు పన్నిన పన్నాగాల గురించి తెలుసుకుని బయటపడడానికి మరి కొంతకాలం పట్టింది. అయితే చాలాకాలంగా నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఎంతమంది నీ వల్ల ఉపకారం పొందారో తెలుసుకున్నాను. మావాడిలాగే నీది కూడా వెన్నలాంటి మనసనీ, తోటివారి కోసం తపనపడే తత్వమనీ నాకు బోధ పడింది. మాలో కలవడానికి నువ్వు పడే తాపత్రయం చూస్తే ముచ్చటేసేది. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది. భర్త లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా, పిల్లలకు ఏ లోటూ రాకుండా, వాళ్ళను చక్కగా చదివిస్తూ పైకి తీసుకొస్తున్నావు చూడు... అది నాకు బాగా నచ్చింది.

నేనిక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందమ్మా. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వు సేవ చేయడానికి వచ్చినపుడు, నిన్ను నానా మాటలూ అని తరిమికొట్టడం వెనుకా ఒక బలమైన కారణం ఉందమ్మా. ఆ విషయం చెప్పడానికే నేనొచ్చాను. నీ మంచి కోసమే అలా చేయాల్సి వచ్చింది. నమ్మశక్యంగా లేదు కదూ, వివరంగా చెప్తా విను...

రాత్రుళ్ళు నాకు సేవ చేయడానికి, వాళ్ళకు ఆరోగ్య సమస్యలున్నాయని మావాళ్ళు నీతో అబద్ధం చెప్పారు. నిజానికి వాళ్ళకు నన్ను దగ్గరుండి చూసుకునే ఉద్దేశ్యమే లేదు. ఎవరైనా మనిషిని పెడదామని చూస్తే, నెలకు ఇరవై వేలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. డబ్బుకి కక్కుర్తి పడి, నా బాధ్యత నీకు అప్పజెప్పేద్దామని ప్లాన్‌ వేశారు. ఈ విషయాలన్నీ మా పనిమనిషి ద్వారా నాకు తెలిశాయి. అందుకే నీకు ఆ కష్టం కలగకూడదనే...’’ అంటుండగా అమ్మ అడ్డు తగిలింది.

‘‘కష్టం ఏముంది మావయ్య గారూ. మా నాన్నకే అలా జరిగితే, నేను చూసుకోనా? నాకు మీరొకటీ నాన్నొకటీ కాదు’’ అంది.

‘‘తెలుసు తల్లీ. నేను నిన్ను తప్పించడానికి మరో కారణం కూడా ఉంది. నీకు ‘ఆస్తమా’ ఉన్న సంగతి నాకు తెలుసు. నాకొచ్చిన ఇన్ఫెక్షన్‌ నీకు సోకితే, నీ గతేమిటి? నీ పిల్లలేమయిపోతారు? ఇవన్నీ ఆలోచించే నేను అలా చేశాను. నెమ్మదిగా చెపితే నువ్వు వినవని, అలా మొరటుగా ప్రవర్తించాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తాతయ్య.

‘‘మళ్ళీ ఎప్పుడూ క్షమాపణ ప్రసక్తి తేకండి. నన్ను ఆదరించారు. నాకంతే చాలు’’ అంటూ అమ్మ కూడా కన్నీళ్ళు పెట్టుకుంది.

అదీ జరిగిన విషయం. అప్పటినుంచీ తాతయ్య మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో మమ్మల్ని చదివించి వృద్ధిలోకి తీసుకు రావడానికి అమ్మకు అంతగా ఇబ్బంది కలగలేదు. మా కథ అలా సుఖాంతం అయింది. అమ్మ లేదన్న బాధ తప్ప ప్రస్తుతం నాకూ చెల్లికీ ఏ లోటూ లేదు’’ అంటూ ముగించింది వైశాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..