Updated : 10 Aug 2021 17:27 IST

‘వెబ్‌’లోకీ వచ్చేశారబ్బా!

సినిమాలూ, ధారావాహికలతోపాటు ఈ మధ్య కాలంలో వెబ్‌సిరీస్‌ కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. రానున్న కాలంలోనూ వాటిదే హవా. అందుకే మన సినీ తారలు సైతం డిజిటల్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టి పలు వెబ్‌ సిరీస్‌లలో మెరుస్తున్నారు. వారెవరంటే...

క్వీన్‌- రమ్యకృష్ణ

జయలలిత బయోగ్రఫీ ఆధారంగా తీసిన వెబ్‌సిరీస్‌ ‘క్వీన్‌’. దీనిలో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించింది. ఆమె వెబ్‌సిరీస్‌లో నటించడం ఇదే తొలిసారి. ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌లో జయలలిత స్కూలుకు వెళ్లే వయసు నుంచి ఎంజీఆర్‌ మరణం తరవాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే వరకూ చూపించారు. జయకు వీరాభిమాని అయిన రమ్యకృష్ణను వెబ్‌సిరీస్‌ కోసం గౌతమ్‌ మేనన్‌ అడగ్గానే ఆమె ఒప్పేసుకుందట. అందుకేనేమో క్వీన్‌లో రమ్యని చూసిన కళ్లతో ఇంకెవర్నీ జయ పాత్రలో ఊహించుకోలేమంటే నమ్మండి. అంత చక్కగా ఆకట్టుకుంది రమ్య.


ది ఫ్యామిలీ మ్యాన్‌- సమంత

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో అందుబాటులో ఉంది ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌. మనోజ్‌బాజ్‌పాయ్‌, ప్రియమణి నటించిన ఈ వెబ్‌సిరీస్‌ గతేడాది సెప్టెంబరులో విడుదలైంది. మొదటి సిరీస్‌లో ఇందులో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తే... రెండో సిరీస్‌లో సమంత చేస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. నటించేందుకు స్కోప్‌ ఎక్కువగా ఉండటంతో వెబ్‌సిరీస్‌కు ఒప్పుకున్నానంటున్న సమంత ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఎప్పుడెప్పుడు వెబ్‌లో విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు నెటిజన్లు.


హై ప్రీస్టెస్‌- అమల అక్కినేని

జీ5 ఒరిజినల్స్‌ నిర్మాణంలో వచ్చిన హై ప్రీస్టెస్‌లో ప్రధాన పాత్రలో నటించింది అమల అక్కినేని. ఇందులో స్వాతి రెడ్డి పాత్రలో ఆత్మలతో మాట్లాడుతూ కనిపించే అమలకి ఓ ప్రేమ కథ కూడా ఉంటుంది. ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న ఈ హారర్‌ వెబ్‌సిరీస్‌లో నటించిన అమల డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోకి రావడం ఇదే తొలిసారి. ఆమె ప్రధాన భూమిక పోషించిన హైప్రీస్టెస్‌ను జీ5 ఆప్‌లో చూడొచ్చు. ఇందులో అమలతోపాటు నటుడు బ్రహ్మాజీ కూడా కీలకపాత్రలో నటించాడు.


భయపెట్టే- హన్సిక

రెండేళ్ల విరామం తరవాత ‘రామకృష్ణ బీఏ బీఎల్‌’తో మనముందుకొచ్చింది హన్సిక. ఆ తరవాత ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించడానికి సంతకం చేసేసింది. అది కూడా హారర్‌ నేపథ్యంలో వస్తోన్న వెబ్‌ సిరీసే అని చెబుతోంది హన్సిక. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్న ఈ వెబ్‌సిరీస్‌కు ‘చిత్రాంగద’, ‘పిల్ల జమీందార్‌’, ‘భాగమతి’ వంటి సినిమాలు తీసిన అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.


మ్యాడ్‌ హౌస్‌- నిహారిక కొణిదెల

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్‌ నిహారిక. ఆమె నటిస్తూనే పింక్‌ ఎలిఫెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ బ్యానర్‌లో నిర్మించి, నటించిన మొదటి వెబ్‌సిరీస్‌ ‘ముద్దపప్పు ఆవకాయ’. ఆ తరవాత తండ్రి నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ తీసింది. తండ్రితో కలిసి నటించిన ఆ వెబ్‌సిరీస్‌ కూడా ఆమెకి యూత్‌లో మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. గతేడాది ‘మ్యాడ్‌ హౌస్‌’ అనే వంద ఎపిసోడ్ల వెబ్‌ సిరీస్‌ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని ఎపిసోడ్లు విడుదలయ్యాయి కూడా.


మన ముగ్గురి లవ్‌ స్టోరీ- నవదీప్‌

నటుడు నవదీప్‌ తొలిసారి నటించిన వెబ్‌సిరీస్‌ ‘మన ముగ్గురి లవ్‌స్టోరీ’. కడుపుబ్బా నవ్వించే ఈ వెబ్‌సిరీస్‌ యూట్యూబ్‌లో విడుదలైంది. ఇప్పుడు ఏక్తాకపూర్‌ తీస్తోన్న మరో వెబ్‌సిరీస్‌లోనూ నవదీప్‌ నటిస్తున్నాడు. ఇందులో నవదీప్‌కి జోడీగా సన్నిలియోని నటిస్తోంది. ఈ విషయాన్ని సన్నీ తన ట్విటర్‌లో నవదీప్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్‌ చేసి మరీ నెటిజన్లతో పంచుకుంది. అలానే రాధిక ఆప్టే, మంజరీ ఫడ్నిస్‌, స్వరభాస్కర్‌, కియారా అద్వాణీ వంటి మరికొందరు తారలు కూడా వెబ్‌సిరీస్‌లో నటించారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని