Updated : 05 Dec 2021 09:45 IST

తొలి యాడ్‌ రణ్‌బీర్‌తో..!

తొలి సంపాదన, మొదటిసారి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వస్తువు... వంటివన్నీ ఎవరికైనా మధుర జ్ఞాపకాలే. సినిమా రంగంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే సక్సెస్‌కు చిరునామాగా మారిన పూజాహెగ్డేకు కూడా అలాంటి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయట... ఇంతకీ అవేంటంటే...


తొలి సంపాదన

చిన్నప్పుడు నేను కొద్దిగా కాలియోగ్రఫీ నేర్చుకున్నా. మా తాతగారికి అది తెలియడంతో నా చేత ఓ క్రీడా సంస్థకోసం కొన్ని సర్టిఫికెట్లు రాయించుకుని మూడువందల రూపాయలు ఇచ్చారు. చిన్నదాన్ని కావడంతో ఆ మూడువందల రూపాయలు నాకు చాలా పెద్ద మొత్తంగా కనిపించాయి. ఆ రోజంతా ఎంత ఆనందించానో... కొన్నాళ్ల తరువాత టీనేజర్‌గా మోడలింగ్‌ చేసినందుకు అయిదువేల రూపాయల చెక్‌ను అందుకున్నా.


  ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తే...

థాయ్‌లాండ్‌... నేను వెళ్లిన మొదటి అంతర్జాతీయ ట్రిప్‌. అది కూడా కుటుంబమంతా కలిసి వెళ్లడంతో...  మేమంతా చాలా సరదాగా గడిపాం, బోలెడు ఫొటోలూ తీసుకున్నాం. అక్కడికి వెళ్లొచ్చిన కొన్ని నెలలకే మా తాతగారు చనిపోవడంతో... ఆయనతో ఆఖరిసారిగా కలిసి గడిపిన ఆ ట్రిప్‌ నాకు ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే.


ఆ ఫొటోషూట్‌లో కంగారుపడ్డా...

నేను మొదటిసారి పోర్ట్‌ఫోలియో ఫొటోలు తీసుకుంది... ‘మిస్‌ ఇండియా’ పోటీలకు వెళ్లేముందే. అప్పటివరకూ నాకు వాటి గురించి తెలియకపోవడంతో ఆ షూట్‌ సమయంలో కంగారుపడ్డా. ఆ తరువాత ఫొటోలు ఇలా కూడా తీస్తారా అనిపించింది.
 


తొలి ప్రకటన

తొలిసారి నేను చేసిన ప్రకటన ఇప్పటికీ గుర్తే. ఓ స్కూటీ యాడ్‌ కోసం రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటించా. బాలీవుడ్‌ నటుడితో కలిసి చేస్తున్నానని తెలిసినప్పుడు ఆనందంగానే కాదు, కంగారుగానూ అనిపించింది. నాకు పెద్దగా అనుభవం లేకపోవడంతో షూటింగ్‌లో నా డైలాగ్‌ మర్చిపోయినా, ఏ చిన్న పొరపాటు చేసినా... ‘సారీ... సారీ...’ అని పదేపదే చెప్పేదాన్ని. అది రెండురోజుల షూటింగే కానీ... ఆ ప్రకటన నాకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది.


హీల్స్‌ అప్పుడే వేసుకున్నా...

చిన్నతనం నుంచీ నేను టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. దాంతో స్నీకర్స్‌ తరహా బూట్లనే ఎక్కువగా వేసుకోవడంతో హీల్స్‌ గురించి అస్సలు తెలియదు. దాంతో మొదటిసారి మిస్‌ఇండియా పోటీల్లో పాల్గొనేటప్పుడే హీల్స్‌ వేసుకున్నా. వాటిని వేసుకుని క్యాట్‌వాక్‌ చేయడం అసలు నా వల్ల అవుతుందా అనుకున్నా. పడిపోతానేమోనని భయపడేదాన్ని. ఆ సమయంలో అలీసా రౌత్‌ అనే మోడల్‌ హీల్స్‌ వేసుకుని బ్యాలెన్స్‌ చేస్తూ ఎలా నడవాలో నేర్పించడంతో ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఆరున్నర అంగుళాల హీల్స్‌ వేసుకుని కూడా వేగంగా నడిచేయగలననుకోండీ...  


అమ్మచీర కట్టుకున్నా...

మా స్కూల్లో టీచర్స్‌ డే కార్యక్రమం రోజున నేను మొదటిసారి మా అమ్మ చీర కట్టుకుని వెళ్లడం నాకు ఇప్పటికీ గుర్తే. ఆ రోజున అమ్మ దగ్గరున్న పసుపు రంగు చీరకట్టుకుని నన్ను నేను టీచర్‌లా ఊహించుకుంటూ స్కూల్‌కు వెళ్లా. అయితే సాయంత్రమయ్యే సరికి ఆ చీరతో చాలా అవస్థ పడ్డా.


తొలి కారు...

నా తొలికారు నాకు ఎప్పటికీ అపురూపమే. ఎందుకంటే... చిన్నప్పుడు నేను, మా అన్నయ్య కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు.. బీఎండబ్ల్యూ కారు కనిపిస్తే చాలు కళ్లప్పగించి చూసేవాళ్లం. జీవితంలో కొంటే అలాంటి కారే కొనుక్కోవాలని ఇద్దరం అనుకునేవాళ్లం. అందుకే నేను కారు తీసుకోవాలని అనుకున్నప్పుడు బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ను తీసుకున్నా. ఆ కారు మా ఇంటికి వచ్చిన రోజు నా కల నిజమైందని అనిపించింది.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని