కుక్కలకీ విగ్గులొస్తున్నాయ్‌!

ఇంటికి వెళ్లగానే ఎదురొచ్చే బుజ్జి కుక్కపిల్లని చూడగానే అప్పటివరకూ పడిన శ్రమ అంతా మర్చిపోతాం అంటారు శునకాల్ని పెంచుకునేవాళ్లు. అందుకే వాటికి అచ్చం మనుషుల్లానే డ్రెస్సులు వేసి

Published : 27 Mar 2022 00:35 IST

కుక్కలకీ విగ్గులొస్తున్నాయ్‌!

ఇంటికి వెళ్లగానే ఎదురొచ్చే బుజ్జి కుక్కపిల్లని చూడగానే అప్పటివరకూ పడిన శ్రమ అంతా మర్చిపోతాం అంటారు శునకాల్ని పెంచుకునేవాళ్లు. అందుకే వాటికి అచ్చం మనుషుల్లానే డ్రెస్సులు వేసి ఫొటోషూట్‌లు చేయిస్తున్నారు. ఎంత టెన్షన్‌లో ఉన్నప్పుడైనా ఆ ఫొటోలు చూస్తే ఆనందంగా అనిపిస్తుందట. అందుకే  అవి మరింత ముద్దొచ్చేలా వాటికి విగ్గుల్నీ తగిలించి మరీ ఫొటోలు తీస్తున్నారట..!

శునకాల్ని పెంచుకునేవాళ్లు వాటినీ కుటుంబ సభ్యుల్లానే చూస్తుంటారు. తమ పిల్లలకు కొన్నట్లే వాటికీ బట్టలూ బొమ్మలూ కొంటున్నారు. పుట్టినరోజులూ చేస్తున్నారు, ఫొటోషూట్‌లూ చేయిస్తున్నారు. వాటికోసం ఏర్పాటుచేసిన బొటిక్కులకీ స్పాలకీ హోటళ్లకీ తీసుకెళుతున్నారు. అక్కడితో ఆగితే చెప్పేదేముందీ... వాటిని అచ్చం మనుషుల్లానే చూడాలనీ ముచ్చటపడుతుంటారు. అందమైన అమ్మాయిలు రకరకాల హెయిర్‌స్టైల్స్‌ వేసుకున్నట్లే వాటికీ వేయాలన్న ఉత్సాహంతో- మనుషులకు పెట్టే విగ్గుల్నే వాటికీ పెట్టి ఫొటోలు తీయడం మొదలుపెట్టారట. ఆ క్రేజ్‌ చూశాక... కంపెనీలకు ఆలోచన రాకుండా ఉంటుందా... అచ్చంగా కుక్కలకోసమే విగ్గుల్ని చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటిని రకరకాల సైజుల్లోనూ రంగుల్లోనూ తయారుచేస్తున్నాయి. అయితే అచ్చం మనుషుల్ని తలపించేలాంటి విగ్గులే చాలామందికి నచ్చుతున్నాయి. దాంతో సినిమాల్లో హీరో హీరోయిన్లకు సందర్భాన్ని బట్టి రింగుల జుట్టూ స్ట్రెయిట్‌ హెయిరూ ఉన్నట్లే కుక్కలకీ రకరకాల హెయిర్‌స్టైల్స్‌ని తలపించే విగ్గుల్ని చేస్తున్నారు. వీటిల్లో పొట్టి, పొడవు కేశాలతోపాటు పోనీటెయిల్‌, ముడి, క్రాఫ్‌... ఇలా చాలానే వస్తున్నాయి. ఈ విగ్గుల్ని కూడా ఆట్టే శ్రమ లేకుండా నేరుగా తలమీద పెట్టేసి కిందకి ముడేస్తే సరి. అప్పటివరకూ మామూలుగా ఉన్న కుక్కపిల్ల కాస్తా క్యూట్‌ లుక్స్‌తో భలే వింతగా అనిపిస్తుంది.

అదీగాక ఇన్‌స్టాగ్రామ్‌ లైక్స్‌ పెంచుకునేందుకూ చాలామంది తమ డాగీలకి డ్రెస్సులు వేసి అచ్చం మోడల్స్‌లా తయారుచేస్తున్నారు. అయితే పట్టుకుచ్చులాంటి బొచ్చు ఉన్న పూడుల్‌, కొమొండోర్‌, యోర్క్‌షైర్‌... వంటి కుక్కలకైతే వాటి జుట్టుతోనే ఎన్ని రకాల జడలయినా వేయొచ్చు. కానీ అన్నింటికీ అంత అందమైన జుట్టు ఉండదు కదా... అందుకే వాటికోసం వస్తోన్న విగ్గుల్ని తగిలిస్తున్నారు.

నిజానికి శునకప్రియులు ఇదంతా సరదా కోసమే చేసినప్పటికీ, ముద్దుగా అనిపించే జంతువుల బొమ్మల్ని చూడటం మానసిక ఆరోగ్యానికీ మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఆ ఫొటోల్ని చూడటంవల్ల ఏకాగ్రత పెరుగుతుందనీ ఉత్సాహంగా పనిచేస్తారనీ అధ్యయనాల్లోనూ స్పష్టమైందట. పసిపిల్లల ఫొటోల్ని చూసినప్పుడు ఎలాంటి ఫీల్‌ కలుగుతుందో వీటిని చూసినప్పుడూ అలానే అనిపిస్తుందట. అదీ, పెద్దవాటికన్నా పప్పీల్ని చూసినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటున్నారట. ఈ విషయమై యూనివర్సిటీ విద్యార్థుల్లో పరిశీలించగా- ముద్దుముద్దు డాగీ ఫొటోల్ని చూపించినప్పుడు వేగంగా తమ టాస్క్‌ల్ని పూర్తి చేశారట. సో, షోకిల్లా కుక్కపిల్లల్ని పెంచుకోలేకపోతున్నామే అని బాధపడకుండా ఆ ఫొటోల్ని చూసైనా ఆనందించేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..