పిల్లలు వీడియోగేమ్స్‌ ఆడుతున్నారా?

సెలవురోజుల్లో పిల్లలు కాసేపు వీడియోగేమ్స్‌ ఆన్‌ చేయగానే తల్లులు అసహనంగా ‘మొదలెట్టావా’ అంటూ నసగడం మొదలుపెడతారు. ఎందుకంటే పిల్లలు ఫొన్లకీ టీవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే చాలామంది అనుకుంటారు.

Updated : 12 Jun 2022 11:22 IST

పిల్లలు వీడియోగేమ్స్‌ ఆడుతున్నారా?

సెలవురోజుల్లో పిల్లలు కాసేపు వీడియోగేమ్స్‌ ఆన్‌ చేయగానే తల్లులు అసహనంగా ‘మొదలెట్టావా’ అంటూ నసగడం మొదలుపెడతారు. ఎందుకంటే పిల్లలు ఫొన్లకీ టీవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే చాలామంది అనుకుంటారు. అయితే వీడియోగేమ్స్‌ ఆడే పిల్లల్లోనే తెలివితేటలు ఎక్కువ అన్నది కరోలిస్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల అభిప్రాయం. ఈ విషయమై వాళ్లు తొమ్మిదీ పదేళ్ల వయసున్న ఐదు వేలమంది పిల్లల్ని ఎంపికచేసి, మూడు వర్గాలుగా విభజించారు. అదెలా అంటే- ఒక వర్గం పిల్లలు టీవీ, వీడియో ప్రొగ్రామ్స్‌ ఎక్కువగా చూస్తే, రెండో విభాగంలోని పిల్లలు సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఉండేవారు. ఇక, మూడో వర్గంలోని పిల్లలు మాత్రం వీలైనప్పుడల్లా వీడియోగేమ్స్‌ ఆడేవారట. ఈ మూడు విభాగాల పిల్లల తెలివితేటల్నీ పరిశీలించినప్పుడు- వీడియోగేమ్స్‌ ఆడేవాళ్లతో పోలిస్తే ఆన్‌లైన్‌లో ఉండేవాళ్లలోనూ, వీడియోలు చూసేవాళ్లలోనే ఐక్యూ లెవెల్స్‌ కాస్త తక్కువగా ఉన్నాయట. రెండేళ్ల తరవాత మళ్లీ పరీక్షించినప్పుడు గేమ్స్‌ ఆడినవాళ్లలో సాధారణ ఐక్యూ లెవెల్స్‌కన్నా రెండున్నర పాయింట్ల ఐక్యూ పెరిగినట్లు గుర్తించారు. సోషల్‌మీడియాలో ఉండేవాళ్లలో మార్పు కనిపించలేదట. కానీ టీవీ, వీడియోలు చూసేవాళ్లలో స్వల్పంగా ఐక్యూ పెరిగినట్లు గుర్తించారు. మొత్తమ్మీద స్క్రీన్‌ టైమ్‌ అనేది పిల్లల తెలివితేటలమీద పెద్దగా ప్రభావం చూపదనీ, ఇంకా చెప్పాలంటే గేమ్స్‌ ఆడేవాళ్లలో తెలివితేటలు పెరిగే అవకాశమే ఎక్కువనీ అంటున్నారు. అలాగని అదేపనిగా పిల్లల్ని గేమ్స్‌ ఆడుకోనివ్వమని కాదు, కాసేపు ఆడినా పెద్ద నష్టం జరిగిపోతుంది అన్న తల్లితండ్రుల ఆలోచన సరికాదని చెప్పుకొస్తుందా నిపుణుల బృందం!


బ్లూ బెర్రీతో మతిమరుపుకి చెక్‌!

నకి రకరకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అవన్నీ ఒకెత్తయితే, నీలం రంగులోని బెర్రీలు మరొకెత్తు అంటున్నారు సిన్‌సినాటీ యూనివర్సిటీ నిపుణులు. మధ్యవయసులో రోజూ గుప్పెడు బ్లూబెర్రీల్ని తింటే తరవాతి కాలంలో ఆలోచనాశక్తి తగ్గకుండా ఉండటంతోపాటు మతిమరుపూ రాదని వాళ్ల పరిశీలనల్లో  తేలింది. కేవలం పన్నెండు వారాలపాటు ఇచ్చిన బ్లూబెర్రీ సప్లిమెంట్లతోనే మెదడు పనితీరులో మార్పుని స్పష్టంగా గమనించగలిగారట. వీటిల్లోని పోషకాలు నాడుల్ని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం 50-65 ఏళ్ల వయసున్న 33 మందిని తీసుకుని, వాళ్లకి పన్నెండు వారాలపాటు అరకప్పు బ్లూ బెర్రీలతో సమానమైన పొడిని ఇచ్చారు. ఇవ్వకముందూ ఇచ్చిన తరవాతా వాళ్ల మెదడు పనితీరూ, శరీరంలోని మార్పుల్ని పరిశీలించినప్పుడు- ఇన్సులిన్‌ శాతంలోనూ ఆరోగ్యకరమైన కణవిభజనలోనూ తేడా స్పష్టంగా కనిపించింది. దీనిబట్టి బ్లూబెర్రీల్ని ఆహారంలో భాగంగా తింటే వృద్ధాప్యంలో వచ్చే డిమెన్షియా, ఆల్జీమర్స్‌ వంటి సమస్యల్నీ అడ్డుకోవచ్చట.


మధుమేహానికి కొత్త మందు

ధుమేహులు ఇన్సులిన్‌ కోసం ప్రతిరోజూ ట్యాబ్లెట్టో లేదా ఇంజెక్షనో తీసుకోవాల్సిందే. అయితే అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ ఈమధ్యే మరో కొత్త డయాబెటిస్‌ డ్రగ్‌కు అనుమతి ఇచ్చింది. దాని పేరే మంజారో... దీన్ని ఇంజెక్షన్‌ రూపంలో వారానికోసారి తీసుకుంటే- మధుమేహం నియంత్రణలో ఉండటంతోపాటు, హార్మోన్లమీద ప్రభావం చూపించడం ద్వారా ఆకలినీ నియంత్రిస్తుందట. దాంతో ఊబకాయం కూడా తగ్గుతుంది అంటే- ఒకే మందుతో రెండు రకాల సమస్యల్నీ తగ్గించవచ్చన్నమాట. పైగా ప్రస్తుతం ఉన్న డయాబెటిస్‌ మందులతో పోలిస్తే ఇది మరింత ప్రభావవంతంగా రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రిస్తుంది అంటున్నారు. అదెలా అంటే- రక్తంలోని గ్లూకోజ్‌ నిల్వల్నీ ఆకలినీ నియంత్రించేందుకు పొట్టలో సహజంగా విడుదలయ్యే గ్లూకాగాన్‌ అనే హార్మోన్‌లానే ఇదీ పనిచేస్తుంది. అందువల్లే ఈ మందు ఆ రెండు సమస్యల్నీ తగ్గించగలుగుతుందట. మధుమేహం లేని ఊబకాయులకి దీన్ని ఇచ్చినప్పుడు ఏడాదిలో ఇరవై శాతం బరువు తగ్గడాన్నీ గుర్తించారు. అయితే దీన్ని ఊబకాయ నియంత్రణకీ వాడేందుకు మరికొన్ని ట్రయల్స్‌ అవసరం అని భావిస్తున్నారు.


కొవిడ్‌తో థైరాయిడ్‌ సమస్య!

కొవిడ్‌ కేసులు తగ్గినా దాని ప్రభావం ఇంకా పోలేదనే చెప్పాలి. అది వచ్చి తగ్గినవాళ్లలో గుండెజబ్బులు, మధుమేహం, పార్కిన్‌సన్స్‌... వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్తగా ఇప్పుడు కరోనా బారిన పడినవాళ్లలో థైరాయిడ్‌ గ్రంథికి సంబంధించిన సమస్యలూ కనిపిస్తున్నాయని ఇటలీలోని మిలన్‌ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఆ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గిన ఏడాది తరవాత కొందరిలో ధైరాయిడిటిస్‌ అనే సమస్యని గుర్తించారట. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన వందమందిని పరిశీలించినప్పుడు- వాళ్లలో థైరాయిడ్‌ గ్రంథి స్రవించే హార్మోన్‌శాతం తగ్గిందట. అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్న తరవాత మళ్లీ యథాస్థితికి వచ్చిందట. కానీ ఓ ఏడాది తరవాత వాళ్లను మళ్లీ అల్ట్రాసౌండ్‌ ద్వారా పరీక్షించినప్పుడు- సగంమందిలో మళ్లీ థైరాయిడిటిస్‌ సమస్యని గుర్తించారు. దీన్నిబట్టి మరో ఐదారేళ్లకి ఈ థైరాయిడ్‌ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..