ఎవరెవరి మధ్య ప్రేమ పుడుతుందంటే...

ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలన్నీ ఒకే రకమైన కథాంశంతోనే ముగిసేవి. డబ్బూ పొగరూ ఉన్న ఓ అబ్బాయి కాలేజీలోనో లేదా ఆఫీసులోనో అందంగా ఉన్న అమ్మాయితో ప్రేమలో పడటం, మొదట్లో ఆమె కాదనడం, చివరకు అతనిలోని నిజాయతీని గుర్తించి ఒప్పుకోవడం...

Updated : 06 Nov 2022 05:07 IST

ఎవరెవరి మధ్య ప్రేమ పుడుతుందంటే...

ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలన్నీ ఒకే రకమైన కథాంశంతోనే ముగిసేవి. డబ్బూ పొగరూ ఉన్న ఓ అబ్బాయి కాలేజీలోనో లేదా ఆఫీసులోనో అందంగా ఉన్న అమ్మాయితో ప్రేమలో పడటం, మొదట్లో ఆమె కాదనడం, చివరకు అతనిలోని నిజాయతీని గుర్తించి ఒప్పుకోవడం... ఇదీ క్లుప్తంగా కథ. టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌... అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అంతా ఇలాంటి సినిమా కథలే ఎక్కువ. అయితే అది కేవలం సినిమాలకే పరిమితం అనీ; సాధారణంగా ప్రేమ- అనేది ఒకే రకమైన అవసరాలూ నేపథ్యం ఉన్నవాళ్ల మధ్యగానీ బాగా తెలిసి ఉన్నవాళ్ల మధ్యగానీ ఏర్పడుతుందనీ అప్పుడే వాళ్ల మధ్య అనుబంధం పదిలంగా ఉంటుందనీ కొలంబియాలోని మిస్సోరి యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇటీవల మొదలైన ఆన్‌లైన్‌ పరిచయాల పెళ్లిళ్లను పక్కనపెడితే- ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా- తమ కమ్యూనిటీలో తెలిసిన వాళ్ల మధ్యే ప్రేమయినా పెళ్లయినా జరుగుతున్నట్లు లెక్కించారట. అలా జరిగినవే ఎక్కువ కాలం నిలబడుతున్నట్లు వాళ్ల అధ్యయనం చెబుతోంది.


ఐదు గంటలకన్నా నిద్ర తగ్గితే..!

రోజుకి ఆరేడు గంటలపాటు నిద్ర ఉండాలని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. అయితే ఐదు గంటలకన్నా తగ్గితే అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు లండన్‌ యూనివర్సిటీ కాలేజీకి చెందిన నిపుణులు. ఇందుకోసం వీళ్లు, యాభై, అరవై, డెబ్భైల్లో ఉన్న స్త్రీ, పురుషులు కొందరిని ఎంపికచేసి మరీ పరిశీలించారట. యాభైల్లో ఉండి ఐదు గంటలకన్నా తక్కువగా నిద్రపోతున్నవాళ్లలో 20 శాతం మంది ఆ వయసులోనే ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే, మరో 40 శాతం మంది ఆ తరవాతి కాలంలో హృద్రోగాలు, పక్షవాతం, బీపీ... వంటి అనేక వ్యాధులకు గురయినట్లు గుర్తించారు. అదే కనీసం ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయేవాళ్లలో ఈ సమస్యలు తక్కువగా ఉన్నాయట. అంతేకాదు, యాభైల్లో ఐదు గంటలకన్నా తక్కువగా నిద్రపోయేవాళ్లలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుందట. అదీగాక, వయసు పెరిగేకొద్దీ నిద్ర అవసరం ఎక్కువనీ కాబట్టి కనీసం ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయేలా చూసుకోవాలనీ చెబుతున్నారు. ముఖ్యంగా- పడుకునేముందు ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం, పడకగదిలో ఎలక్ట్రానిక్‌ పరికరాలూ కాంతీ లేకుండా చూసుకుంటే మంచి నిద్ర పడుతుందని చెప్పుకొస్తున్నారు.


పంటల్లోనూ రసాయనాలు!

పీఎఫ్‌ఏ (పర్‌- అండ్‌- పాలీఫ్లోరోఆల్కైల్‌)రసాయనాల వాడకం రోజురోజుకీ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా వీటి జాడ కనిపిస్తోంది. ముఖ్యంగా తడి పీల్చని దుస్తులు, నాన్‌స్టిక్‌ వంట సామగ్రి, కాస్మెటిక్స్‌తోపాటు, నూనె, నీరు, గ్రీజు అంటనివ్వని అనేక వస్తువుల తయారీలో సుమారు ఐదువేలకు పైగా ఈ ఫరెవర్‌ కెమికల్స్‌ను వాడుతున్నారు. ఇవి గాల్లో కలిసి వర్షపునీటి ద్వారా నేలలోకి చేరుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే కలుషిత జలాల్లో వీటి శాతం మరీ ఎక్కువ. అయితే ఆ నీరు వృథా కాకుండా ఉండేందుకు శుద్ధి చేసి మళ్లీ వాడుతున్నారు. అయినప్పటికీ వాటిల్లో ఈ రసాయనాలు మిగిలే ఉండటంతో వాటి దుష్ఫలితాలు పర్యావరణం, మానవాళి ఆరోగ్యం, పిల్లల ఎదుగుదలమీదా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, క్యాన్సర్లు, కొలెస్ట్రాల్‌, మహిళల్లో సంతాన హీనత, రోగనిరోధకశక్తి తగ్గడం... వంటి అనేక సమస్యలకూ ఇవే కారణమట. ముఖ్యంగా శుద్ధి చేసిన కలుషిత జలాల్ని పంటపొలాలకు వాడటంతో ఆ పంటల్లోనూ ఈ రసాయనాలు ఉంటున్నాయట. పైగా ఆయా పంటల్నీ గడ్డినీ తినడంవల్ల అటు జంతువులకీ తద్వారా మనిషి ఆరోగ్యానికీ ఇవి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా వీటి వాడకంమీద పూర్తి నిషేధం విధించాలి అంటోంది శాస్త్ర ప్రపంచం.


ఊబకాయులు ఆ పిల్స్‌ను వాడితే..!

గర్భం రాకుండా ఉండేందుకు కొందరు అమ్మాయిలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. అయితే ఈ రకమైన ట్యాబ్లెట్లు ఊబకాయులకి అస్సలు మంచిది కాదు అంటున్నారు యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీకి చెందిన నిపుణులు. వీటిల్లోని ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిన్‌... వంటి హార్మోన్ల కారణంగా రక్తనాళాల్లో గడ్డలు కట్టే ప్రమాదం మిగిలిన వాళ్లకన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారట. దీన్నే వీనస్‌ థ్రాంబోఎంబొలిజమ్‌(వీటీఈ) అని పిలుస్తారు. అందుకే ఊబకాయులు ఈస్ట్రోజెన్‌ లేకుండా కేవలం ప్రొజెస్టిన్‌ ఉన్న పిల్స్‌నీ, గర్భాశయంలో అమర్చే లూప్‌లు... వంటి వాటినీ వాడుకోవడమే ఉత్తమం అంటున్నారు.  గత నలభయ్యేళ్లలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. నలభయ్యేళ్లలోపు మహిళల్లో 15 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. రక్తనాళాల్లో ఇలా గడ్డలు ఏర్పడటం వల్ల ఊపిరితిత్తులకు రక్త సరఫరా అందకపోతే మరణానికీ దారితీయవచ్చు. కాబట్టి కాంట్రాసెప్టివ్స్‌తో జాగ్రత్త అంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..