సెనగలు... పోషకాల నిల్వలు!

శ్రావణ మాసంలో నోచుకునే మంగళగౌరీ నోములూ వరలక్ష్మీ వ్రతాల్లో ముత్తైదువలకు వాయనంలో పసుపు కుంకుమలతోపాటు నానబెట్టిన సెనగల్నీ తప్పక ఇస్తుంటారు. గుళ్లలోనూ ఉడికించిన సెనగల్నే

Updated : 07 Aug 2022 19:50 IST

సెనగలు... పోషకాల నిల్వలు!

శ్రావణ మాసంలో నోచుకునే మంగళగౌరీ నోములూ వరలక్ష్మీ వ్రతాల్లో ముత్తైదువలకు వాయనంలో పసుపు కుంకుమలతోపాటు నానబెట్టిన సెనగల్నీ తప్పక ఇస్తుంటారు. గుళ్లలోనూ ఉడికించిన సెనగల్నే ప్రసాదంగా పంచుతుంటారు. రోగాలు చుట్టుముట్టే ఈ కాలంలో సెనగల్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అన్నదే ఈ ఆహారం వెనక ఆంతర్యం. అయితే గ్యాస్‌ వస్తుంది అనో, తింటే పడదనో ఈమధ్య చాలామంది వీటి పేరు చెబితేనే భయపడుతున్నారు. కానీ పోషకాలు పుష్కలంగా ఉండే సెనగల్ని ‘దేశీ సూపర్‌ ఫుడ్‌’గా పేర్కొంటున్నారు ఆహార నిపుణులు.

శ్రావణం మొదలుకుని దేవీనవరాత్రులవరకూ దాదాపుగా అందరి ఇళ్లలోనూ తప్పక కనిపించే చిరుతిండి సెనగ గుగ్గిళ్లు లేదా తాలింపు సెనగలు.  సెనగల్ని వాయనంగా ఇచ్చినా ప్రసాదంగా పెట్టినా దాని వెనకున్న పరమార్థం ఒకటే... పూజలూ పునస్కారాల పేరుతో చేసే ఉపవాసాలతో నీరసించిపోకుండానూ త్వరగా ఆకలి వేయకుండానూ ఉండేందుకేనట. అందుకే ఈ కాలంలో సెనగల వాడకం ఎక్కువ. ఆ తరవాతా వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. సీజన్‌లో దొరికే పచ్చి సెనక్కాయల్ని ఒలుచుకుని తినడంతోపాటు వేయించిన సెనగల్ని మధ్యాహ్నమో సాయంత్రమో తింటుంటారు. నిజానికి ఒకప్పటి పిల్లలకి గుప్పెడు వేయించిన సెనగలూ లేదా ఆ సెనగపప్పూ బెల్లాలే చిరుతిండి. ఉత్తరాదిన పూరీ, రోటీల్లో చోళె, చనామసాలా... వంటి కూరలు తప్పనిసరి. ఇక, చాట్‌మసాలాలూ సలాడ్లలోనూ వీటి వాడకం ఎక్కువే. ఇప్పుడు సెనగల్ని కార్న్‌ఫ్లేక్స్‌లానూ చేస్తున్నారు. డోక్లాలు చేసినట్లే సెనగలతో ఇడ్లీలూ దోసెలూ కూడా వేస్తున్నారు.

ఇక, పిండి వంటల్లోనూ సెనగపిండిదే పైచేయి. బూందీ లడ్డూ చుట్టాలన్నా బేసన్‌ లడ్డూ చేయాలన్నా కారప్సూసో కారబ్బూందీనో వత్తాలన్నా మైసూర్‌పాక్‌ లేదా బర్ఫీ, హల్వా... వంటి వాటికైనా సెనగపిండి ఉండాల్సిందే. వానాకాలం సాయంకాలాల్లో వేడివేడిగా వండుకునే బజ్జీలూ పకోడీల్లో వాడేదీ ఈ పిండే మరి. అయితే సెనగపిండితో చేసే స్నాక్స్‌కి ఉప్పూ కారాలూ నూనె... కాస్త ఎక్కువే పడతాయి కాబట్టి పిండి వాడకాన్ని తగ్గించి, వారానికోసారయినా సెనగల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు.

తెల్ల సెనగలా... నల్ల సెనగలా?
సెనగల్ని మొదటగా తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే మధ్యధరా, మధ్యతూర్పు దేశాల్లో పండించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటిని అత్యధికంగా పండిస్తోంది మనదేశమే. పండించే ప్రాంతాన్ని బట్టి సెనగల రంగూ రుచిలో కాస్త తేడాలున్నప్పటికీ ఇవి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి దేశవాళీ లేదా నల్ల సెనగలూ రెండు కాబూలీ సెనగలుగా పిలిచే తెల్లనివీనూ. తెల్ల సెనగల్ని ఎక్కువగా కూరల్లో వాడితే; దేశవాళీ సెనగల్ని స్నాక్స్‌ రూపంలోనూ పప్పూ, పిండికోసమూ వాడుతుంటారు. అయితే మధుమేహం ఉన్నవాళ్లకీ బరువు తగ్గాలనుకునేవాళ్లకీ తెల్లవాటితో పోలిస్తే దేశవాళీవే మేలు.  పీచు ఎక్కువగా ఉండటంతోపాటు వీటి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువ. ఇవి వాత, కఫ, పిత్త దోషాల్ని తగ్గిస్తాయని ఆయుర్వేదమూ చెబుతోంది. భావప్రకాశిక గ్రంథం ప్రకారం- ఏ సెనగలైనా నానబెట్టి, ఉడికించుకునీ లేదా మొలకెత్తించీ తినడమే మంచిదట.

పోషకాలూ- లాభాలూ
పిండిపదార్థాలూ ప్రొటీన్లూ ఖనిజాలూ విటమిన్లూ అన్నీ పుష్కలంగా ఉండటంతో శాకాహారులకు సెనగలు బలవర్థకమైన ఆహారం. పెద్దవాళ్లకు ఒక రోజుకి అవసరమయ్యే ప్రొటీన్‌లో మూడో వంతు 28 గ్రా. సెనగల్లో ఉంటుంది. ఇది ఓ గుడ్డులోని ప్రొటీన్‌తో సమానం. దేశవాళీ సెనగల్లో ఎ, సి, బి6, ఫోలేట్‌, నియాసిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌... వంటి విటమిన్లూ; మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌... వంటి ఖనిజాలూ ఉంటాయి.

* సెనగల్లోని ప్రొటీనూ పీచూ కలిసి నెమ్మదిగా జీర్ణం కావడంతోపాటు ఆకలికి సంబంధించిన హార్మోన్‌ శాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా క్యాలరీల శాతం తగ్గడంతో సెనగల్ని తినేవాళ్లలో బరువుతోపాటు నడుం చుట్టుకొలత కూడా తగ్గిందట.

* సెనగల్లోని పీచువల్ల మలబద్ధకం ఉండదు. ఈ పీచు పొట్టలోని బ్యాక్టీరియాను ఆరోగ్యంగానూ ఉంచడంతోపాటు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. కాబట్టి సెనగలు గుండెజబ్బుల్నీ బీపీనీ అడ్డుకుంటాయి.

* వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం... వంటి ఖనిజాలన్నీ ఎముకలూ కండరాల వృద్ధికి తోడ్పడతాయి. అందుకే గుప్పెడు సెనగలు కప్పు పాలతో సమానం అంటారు.

* సెనగల్లోని ఫాస్ఫరస్‌ మూత్రపిండాల్లోని వ్యర్థాలు పోయేలానూ చేస్తుంది.

* సెనగల్ని తినేవాళ్లలో బ్యుటిరేట్‌ అనే ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా విడుదలై, మృత కణాలను తొలగించడానికి సాయపడతాయి. లైకోపీన్‌, శాపోనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లనీ నిరోధిస్తాయి.

* సెనగల్లోని కోలీన్‌ అనే పదార్థం మెదడు, నాడుల పనితీరునీ పెంచుతుంది. వీటిల్లోని అమైనో ఆమ్లాలు డిప్రెషన్‌, ఆందోళనలకీ మందులా పనిచేస్తాయి.

* ఐరన్‌ లోపం ఉన్నవాళ్లకి ఇవి మంచి పౌష్టికాహారం. నిద్రలేమినీ తగ్గిస్తాయి.

* నల్ల సెనగలతో చేసుకున్న రోటీని ఒకటీ రెండు నెలలు తింటే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లూ తగ్గుముఖం పడతాయి.

* జాండిస్‌తో బాధపడేవాళ్లు రాత్రిపూట నల్ల సెనగల్ని బెల్లంతో కలిపి నానబెట్టి తినడంతోపాటు ఆ నీళ్లను తాగితే దాహం తగ్గుతుంది. మొలకలు వచ్చిన నల్ల సెనగల్ని టీస్పూను త్రిఫల చూర్ణంతో కలిపి తినడం వల్ల చర్మంమీద వచ్చే తెల్ల మచ్చలూ తగ్గుతాయట.

గ్యాస్‌ ఎందుకు వస్తుందంటే...
సుదీర్ఘకాలంగా ఆహారంలో భాగమైన సెనగలకి గ్యాస్‌ కారణంగా ఈమధ్య కొందరు దూరంగా ఉంటున్నారనేది నిజం. అయితే దీన్ని పూర్తిగా కొట్టి పారేయలేం. ఎందుకంటే, చిక్కుళ్లు, బీన్స్‌లో మాదిరిగానే సెనగల్లో ఓలిగోశాకరైడ్లు అనే చక్కెరలూ పీచూ ఎక్కువగా ఉండటం వల్లే గ్యాస్‌ ఏర్పడుతుంది. అదెలా అంటే- సాధారణంగా మనం తీసుకున్న ఆహారంలోని తేలికపాటి కార్బొహైడ్రేట్లు చిన్నపేగులోకి వెళ్లగానే జీర్ణం అయిపోతాయి. కానీ ఓలిగోశాకరైడ్లు(రాఫినోజ్‌, స్టాకియోజ్‌) వంటి సంక్లిష్ట పిండిపదార్థాలు జీర్ణం కాకుండా పెద్దపేగులోకి వెళ్లి, అక్కడ అవి పులిసి బ్యాక్టీరియాకి ఆహారంగా మారడంతో గ్యాస్‌ విడుదలవుతుంది. ఇది పేరుకుని తేన్పులు లేదా అపానవాయువుగా బయటకు వస్తుంది. సెనగల్లోని సాల్యుబుల్‌ ఫైబర్‌ కూడా ఈ గ్యాస్‌కి కారణమే. కానీ అరకప్పు తెల్ల సెనగల్లో ఈ పీచు కేవలం 1.2గ్రా. మాత్రమే. ఇది బీన్స్‌, రాజ్మా, పప్పుధాన్యాలతో పోలిస్తే తక్కువే అంటున్నారు నిపుణులు. కాబట్టి మొలకెత్తించి వాడుకోవడం లేదా 18 గంటలపాటు బేకింగ్‌సోడా వేసి నానబెట్టడం ద్వారా గ్యాస్‌కు కారణమైన ఓలిగోశాకరైడ్ల శాతాన్ని 40 శాతం వరకూ తగ్గించుకోవచ్చట. తగుమోతాదులో తింటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. లేదూ సెనగల్లోని పీచునీ చక్కెరల్నీ జీర్ణం చేసే ఆల్ఫా-గాలాక్టోసిడేజ్‌ అనే ఎంజైమ్‌ సప్లిమెంట్లనూ తీసుకోవచ్చు అంటున్నారు. జీర్ణశక్తి అసలే లేనివాళ్లూ ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ ఉన్నవాళ్లు మాత్రం కాస్త దూరంగా ఉండటమే మంచిది.

అందానికీ సెనగలు!
పాతకాలంలో సెనగపిండితో నలుగు పెట్టుకుంటే, ఇప్పుడు ఫేస్‌ప్యాకుల రూపంలో వేసుకుంటున్నారు. సెనగపిండిలో గంధం కలిపి రాస్తే మొటిమల మచ్చలన్నీ తగ్గుతాయి అంటారు సౌందర్య నిపుణులు. అందుకే అచ్చంగా సెనగపిండి సబ్బుల్నీ తయారుచేస్తున్నాయి కొన్ని కంపెనీలు. నల్ల సెనగల్లోని బి6, జింక్‌ శిరోజాల పెరుగుదలకి తోడ్పడే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తినేవాళ్లకి జుట్టు రాలే సమస్యా తగ్గుతుంది. సెనగపిండిలో నీళ్లు కలిపి తలకి పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఇతర నట్స్‌తో పోలిస్తే సెనగల ధర తక్కువ కావడంతో పేదవాడి బాదం అనీ అంటారు. అందుకే ఇటీవల ప్రభుత్వాలు పిల్లలకోసం తయారుచేసే బాలామృతాల్లోనూ పుట్నాలపొడినే వాడుతున్నాయి. అయితే ఏదయినా మితిమీరితే కష్టమే. ఇది సెనగలకీ వర్తిస్తుంది. కాబట్టి తగుమోతాదులో తింటే... సెనగలు నిజంగానే సూపర్‌ ఫుడ్‌ మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..