ఉపవాస వేళ..!

కొందరికి భక్తి, కొందరికి బరువుతగ్గడం, ఇంకొందరికి ఆరోగ్యం, మరికొందరికి నిరసన... ఉపవాసానికి ఇలా చాలా కారణాలున్నాయి. అయితే కారణం ఏదైనా ఉపవాసం ఒంటికి మంచిదేనట. కాకపోతే కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి. అవి గుర్తుంచుకుని చేస్తేనే ఉపవాసం ఆరోగ్యానికి మేలుచేస్తుంది, ఆయుష్షునీ పెంచుతుంది- అంటున్నారు శాస్త్రవేత్తలు.

Updated : 19 Nov 2023 08:23 IST

కొందరికి భక్తి, కొందరికి బరువుతగ్గడం, ఇంకొందరికి ఆరోగ్యం, మరికొందరికి నిరసన... ఉపవాసానికి ఇలా చాలా కారణాలున్నాయి. అయితే కారణం ఏదైనా ఉపవాసం ఒంటికి మంచిదేనట. కాకపోతే కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి. అవి గుర్తుంచుకుని చేస్తేనే ఉపవాసం ఆరోగ్యానికి మేలుచేస్తుంది, ఆయుష్షునీ పెంచుతుంది- అంటున్నారు శాస్త్రవేత్తలు.

దసరా, దీపావళీ... పండుగల సందడి అయిపోయింది. ఇప్పుడిక వన భోజనాలూ కార్తిక ఉపవాసాల వంతు. సోమవారాలూ, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి... ఇలా ఈ నెలలో చాలా రోజులు భక్తితో ఉపవాసాలు ఉంటారు కొందరు. మరి కొందరు పండుగ స్వీట్ల రూపంలో తిన్న అదనపు కెలొరీలన్నీ ఉపవాసాలతో కరిగించేయాలనుకోవడమూ కద్దు. వాతావరణం కాస్త చల్లగా ఉండడంతో డైటింగ్‌ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తారు.  

నిజానికి ఫలానా ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది... అంటూ ఎన్నిరకాల అభిప్రాయాలు కన్పిస్తాయో అలాగే ఉపవాసం గురించి కూడా సానుకూలంగానూ వ్యతిరేకంగానూ అన్నిరకాల అభిప్రాయాలూ కన్పిస్తాయి. ‘ఉపవాసం’ అన్న మాటకి అర్థం దగ్గర్నుంచీ పలు అపోహలూ నమ్మకాలూ దానిచుట్టూ అల్లుకుని ఉన్నాయనీ, అసలు ఉపవాసం వల్ల శరీరంలో కలిగే మార్పులేమిటో అర్థం చేసుకుంటే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుని పూర్తి ప్రయోజనం పొంద వచ్చనీ అంటున్నారు నిపుణులు. దాదాపుగా అన్ని మతాలలోనూ ఏడాదిలో ఏదో ఒక సందర్భంలో ‘ఉపవాసం’ పాటించే విధానం ఉంది. ఎవరి మతాచారాలను బట్టి వాళ్లు ఆ ఉపవాస విధివిధానాలను అనుసరిస్తారు. అయితే క్రైస్తవుల ‘లెంట్‌’, ముస్లింల ‘రోజా’ల్లాగా వరసగా రోజుల తరబడి సుదీర్ఘ ఉపవాసం హిందువుల్లో లేదు. సాధారణంగా వారు తమ ఇష్టదైవాన్ని బట్టి వారంలో ఒకరోజో రెండు రోజులో ఉపవాసం ఉంటారు. ఇక ఏకాదశులూ పున్నములూ సోమవారాలూ శనివారాలూ లాంటి సందర్భాలన్నిటిలోనూ ఉపవాసం ఉండడం కొందరికి అలవాటు. ప్రత్యేక దీక్షల సందర్భంలో మాత్రమే ఎక్కువ రోజులు ఒంటిపూట భోజనం చేస్తారు. అలాగే ఉపవాస విధానమూ ఇతర మతాలకన్నా భిన్నంగానే ఉంటుంది. కొందరు ఒకరోజంతా అసలేమీ తినకుండా ఉపవాసం ఉండి మరుసటి రోజు విరమిస్తే, కొందరేమో ఉదయం నుంచీ రాత్రి వరకూ ఏమీ తినకుండా రాత్రి భోజనంతో ఉపవాసాన్ని విరమిస్తారు. మరికొందరు పొద్దున్న ఒక్కపూట భోజనం చేసి ఇక మరుసటి రోజువరకూ ఏమీ తినరు. కొందరు పాలూ పండ్లూ తిని రోజంతా భోజనం చేయకుండా ఉండిపోతారు. సాధారణంగా ఆయా రోజుల్లో ఒక్కపొద్దు ఉండేవాళ్లే ఎక్కువ. వీరు ఒక పూట భోజనం చేసి మరోపూట అల్పాహారం తీసుకుంటారు.

దైవానికి దగ్గరగా...

నిజానికి ఆహారం తీసుకోకుండా ఉండడాన్ని ‘ఉపవాసం’ అంటాం కానీ దానికి అర్థం అది కాదంటారు ప్రవచనకారులు. ‘ఉప’ అంటే దగ్గరగా అనీ, ‘వాసం’ అంటే వసించడం అనీ అర్థమట. అంటే- దైవానికి దగ్గరగా ఉండి ప్రార్థనమీదే దృష్టి పెట్టడం కోసం భక్తులు ఆహారానికి దూరంగా ఉండడమే ఉపవాసమట. అలాగని పూర్తిగా అభోజనంగా ఉండడమూ మంచిది కాదనీ, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కటిక ఉపవాసం చేయమని ఏ గ్రంథాల్లోనూ లేదనీ, నీరసంగా ఉన్నప్పుడు దైవం మీద మనసు నిలపలేమనీ వారు చెబుతున్నారు. తేలికగా జీర్ణమయ్యే పాలూ పండ్లూ లాంటివి తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది, అప్పుడు మనసుని పూర్తిగా దైవం మీద కేంద్రీకరించవచ్చని వారు సూచిస్తున్నారు. కొన్నిరకాల ఆహారపదార్థాలు జీర్ణమవడానికి ఎక్కువ సమయం తీసుకుని మనిషిని చురుగ్గా ఉండనీయవనీ, మరికొన్ని మనసుని ఇతర కోరికలవైపు మళ్లిస్తాయనీ దాంతో ప్రశాంతంగా దైవారాధన చేసుకోవడం వీలుకాదు కాబట్టే ఈ ‘ఉపవాసం’ అన్న విధానాన్ని పెద్దలు తెచ్చి ఉంటారనీ వీరి అభిప్రాయం. ఇప్పుడంటే ఒక్క భక్తితోనే కాక రకరకాల కారణాలతో ఉపవాసం అన్న మాట వాడుకలోకి వచ్చింది కానీ చరిత్రలో ఉపవాసం ఒక తప్పనిసరి అంశంగా ఎప్పటినుంచో ఉంది. మానవ పరిణామ క్రమంలో కరవు కాటకాలు ఎన్నోసార్లు ఎదురయ్యాయి. దాంతో పస్తులు ఉండక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటూ రావడం వల్లే మనిషికి కొద్ది రోజులపాటు ఆహారం లేకుండా ఉండగల శక్తి వచ్చిందంటారు యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా పరిశోధకులు. అయితే, అప్పటిలా ఇప్పుడు కరవు కాటకాల్లాంటి సమస్యలేవీ లేవు. ధాన్యాన్నీ ఆహారపదార్థాల్నీ నిల్వ ఉంచుకునే సౌకర్యాలు వచ్చాయి. రెడీమేడ్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి సిద్ధంగా నోరూరించే ఆహారం లభిస్తుండడంతో ఇష్టమైన పదార్థాలను ఎంచుకుని తినే అవకాశం వచ్చింది. ఆయా పదార్థాల్లో ఉండే పోషకాల గురించీ రుచుల గురించీ సమాచారం వెల్లువెత్తుతోంది.

వేలం వెర్రి

సూపర్‌ ఫుడ్‌ అనీ మెడిటరేనియన్‌ డైట్‌ అనీ కీటో అనీ వెయిట్‌ వాచర్స్‌ డైట్‌ అనీ వీగన్‌ అనీ... ఇంటర్నెట్‌ తెరిస్తే చాలు, రకరకాల ఆహారాల గురించి వార్తలూ వ్యాసాలూ కన్పిస్తాయి. ఒకరు అచ్చంగా మాంసకృత్తులే తినమంటే మరొకరు తృణధాన్యాలంటారు. ఒకరు హెర్బల్‌ టీలంటే మరొకరు కాదు కషాయాలే పరమౌషధాలంటారు. ఇవన్నీ చాలవన్నట్లు మరోపక్క రకరకాల ఉపవాస విధానాలూ... ఎటుచూసినా ఫుడ్‌ ట్రెండ్లూ ఫాస్టింగ్‌ ట్రెండ్లే. ఆహారపుటలవాట్ల పట్ల కన్పించే ఈ వేలం వెర్రి ఇవాళ కొత్తగా వచ్చింది కాదనీ క్రీస్తు పూర్వం నుంచీ ఉన్నదేననీ అంటున్నారు చరిత్రకారులు. ఒకప్పుడు రోమ్‌ దేశం వైభవంగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు రోజూ ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలని పాలకులు నియమం విధించారట. ఈజిప్షియన్లు ప్రతి నెలలోనూ వరసగా మూడు రోజులు కటిక ఉపవాసం చేసి విరేచనాలకు మందులు వాడేవారట. సకల అనారోగ్యాలకీ కారణం ఆహారమేననీ, నెలకోసారి మొత్తం జీర్ణవ్యవస్థని శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చనీ నమ్మేవారట. ఇలాంటి నమ్మకాలూ అలవాట్లూ ప్రపంచ దేశాలన్నిట్లోనూ లెక్కలేనన్ని ఉన్నాయి.

ఆరోగ్యానికి... ఒక్కపూట

ఏకభుక్తం సదారోగ్యం ద్విభుక్తం బలవర్ధనమ్‌

త్రిభుక్తేవ్యాధిపీడా స్యాచ్చతుర్భుక్తే మృతిర్ధువమ్‌

రోజుకు ఒక్కసారే భోజనం చేసేవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. రెండుసార్లు భోజనం చేస్తే శారీరక బలం పెరుగుతుంది. అయితే రోజుకు మూడుసార్లు భోజనం చేయడంవల్ల వ్యాధులూ నొప్పులూ వస్తాయి. అదే నాలుగుసార్లు చేస్తే అకాలమరణం తప్పదంటుంది ఈ సంస్కృత శ్లోకం. దీన్నే వాడుక భాషలో ఒక్కపూట తినేవాళ్లు మహాయోగులనీ, రెండుపూట్ల తినేవాళ్లు మహాభోగులనీ, మూడుపూట్ల తింటే మహారోగులనీ చెప్పారు. పాతకాలం నాటి ఈ మాటలు ఇప్పటి జీవనశైలికి ఏమాత్రం నప్పవు. అలాగని పూర్తిగా కొట్టివేయడానికీ లేదు. ఆరోజుల్లో మనిషికి శారీరకశ్రమ ఎక్కువ ఉండేది. కష్టపడి సంపాదించుకున్న ఆహారం కాబట్టి దాన్ని అపురూపంగా, మితంగా తినేవారు. దినచర్య కూడా సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగిసేది. దాంతో సహజంగానే 12 నుంచి 16 గంటల సమయం ఆహారం తీసుకోకుండా ఉండేవారు. శరీరంలో జీవచర్యలకు కావలసినంత సమయం దొరికేది. కరెంటూ రకరకాల యంత్ర సామగ్రీ అందుబాటులోకి రావడంతో క్రమంగా జీవనశైలి మారింది. అంతెందుకూ... టీవీ కంప్యూటరూ మన జీవితాల్లోకి రానంత వరకూ రాత్రి పదింటికల్లా పడుకోవడమూ పొద్దున్నే లేవడమూ చాలా పనులు స్వయంగా చేసుకోవడమూ ఉండేది. ఇప్పుడలా కాదు, వినోదానికి సమయం పెరిగింది. పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా కదలకుండా కూర్చుని పనిచేయడం, ఎక్కువ సమయం మెలకువగా ఉండడం, ఉన్నంతసేపూ ఏదో ఒకటి తింటూ ఉండడం అలవాటైపోయింది. అప్పుడు శక్తి కోసమే తినేవారు. ఇప్పుడు రుచులకోసం తినడం పెరిగింది. ఆహారం ద్వారా కెలొరీలు ఎక్కువవడమూ వ్యాయామం లేకపోవడం వల్ల ఖర్చయ్యే కెలొరీలు తగ్గడమూ వెరసి... స్థూలకాయం సాధారణమైపోయింది. అదే మరెన్నో సమస్యలకీ దారితీస్తోంది.

ఉపవాసం ఉంటే...

ఆహారం తీసుకున్న తర్వాత మన కడుపులో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఉపవాసం ప్రాధాన్యం అర్థమవుతుంది. భోజనం చేసిన తర్వాత అందులోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజుగా మారి చిన్నపేగు ద్వారా రక్తంలో కలిసి శరీరంలోని అన్ని అవయవాలకూ శక్తినిస్తాయి. అదనంగా ఉన్న గ్లూకోజు- లివర్‌లోనూ అడిపోజ్‌ కణజాలం లోనూ గ్లైకోజెన్‌, కొవ్వుల రూపంలో భవిష్యత్‌ అవసరాల కోసం నిల్వ ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం అందదు కాబట్టి కాలేయం ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి శరీరానికి కావలసిన శక్తినిస్తుంది. శారీరకంగా చురుగ్గా క్రియాశీలంగా లేని వ్యక్తికి పది పన్నెండు గంటల తర్వాతే ఈ గ్లైకోజెన్‌ నిల్వల్ని వాడుకునే అవసరం వస్తుంది. అదే శరీర శ్రమ చేసేవారికి తక్కువ సమయం సరిపోతుంది. గ్లైకోజెన్‌ కూడా అయిపోయాక అడిపోజ్‌ కణజాలంలోని శక్తిని- అంటే కొవ్వును కరిగించి వాడుకుంటుందన్నమాట. ఎక్కువ గంటలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటేనే ఇలా శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇవ్వకుండా ఈలోపే మరోసారి భోజనం చేస్తే... కొవ్వు నిల్వలు పెరగడమే కానీ తగ్గే ప్రసక్తి ఉండదు.
గ్లూకోజ్‌గా మారిన ఆహారాన్ని కణాలకు చేరవేసేది ఇన్సులిన్‌ హార్మోన్‌. నోటికి విరామం ఇవ్వకుండా ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ ఇన్సులిన్‌ స్థాయి కూడా ఎప్పుడూ గరిష్ఠంగా ఉంటుంది. దాంతో కొన్నాళ్లకు కణాలు ఇన్సులిన్‌కి స్పందించడం మానేస్తాయి. ఫలితంగా షుగర్‌ వ్యాధి సమస్య తలెత్తుతుంది. ఉపవాసం ఈ ఇన్సులిన్‌ స్థాయుల్ని తక్కువగా ఉంచుతుంది. ఈ పరిశీలనే ఇప్పుడు ఉపవాసం ప్రాధాన్యాన్ని పెంచింది.

సమయం ముఖ్యం

ఏం తింటున్నామన్నది మాత్రమే కాదు, ఎప్పుడు తింటున్నామన్నదీ కీలకమేనంటున్నారు ఉపవాస వేళల మీద పరిశోధన చేసిన జాన్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. బరువు తగ్గడం కోసం చేసే డైటింగ్‌ విధానాల్లో గత కొంతకాలంగా ‘ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌’ ఎక్కువ ఆదరణ పొందుతోంది. అయితే ఇందులోనూ చాలా రకాలున్నప్పటికీ ఎక్కువ సమయం ఏమీ తినకుండా ఉండే పద్ధతి మంచిదని వారు చెబుతున్నారు. పైన చెప్పుకున్న సంప్రదాయ ఉపవాసానికి ఇది దగ్గరగా ఉంటోందనీ, ఉపవాసం చేయాలనుకున్నవాళ్లు ఈ పద్ధతిని అనుసరిస్తే మేలనీ సూచిస్తున్నారు.

ఇరవై నాలుగ్గంటల రోజుని మూడు భాగాలుగా చేసి ఒక భాగంలో మాత్రమే తిని మిగిలిన రెండు భాగాల సమయంలోనూ జీర్ణ వ్యవస్థని పస్తు ఉంచితే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గడంతోపాటు అన్నిరకాలుగానూ ఆరోగ్యం మెరుగుపడుతుందని రుజువైంది. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోపల రెండు మూడు దఫాలుగా ఆహారం తీసుకుని సాయంత్రం నుంచి మర్నాడు ఉదయం పదివరకూ అంటే- 16 గంటలు ఉపవాసం ఉండటం ఈ పద్ధతి. ఎవరికి అనువుగా ఉండే సమయాల్ని వారు అనుసరించవచ్చు కానీ ఉపవాసం ఉండే సమయంలో రాత్రి కలిసివస్తే మరింత మంచిది. అయితే అన్ని పోషకాలూ అందేలా సమతులాహారం తీసుకోవాలి. నీరు, జీరో కెలొరీ పానీయాలు తాగుతూ ఉండాలి. సామర్థ్యానికి మించి శారీరక శ్రమ చేయకూడదు. ఇతర ఉపవాసాల్లాగే ఇందులో కూడా ఒకేసారి కడుపునిండా భోజనం చేయకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ నిదానంగా ఉపవాసాన్ని విరమించాలి.

ఏం తిన్నా ఈ ఎనిమిది గంటలే కదా అని అదేపనిగా తినడమూ, ఫాస్ట్‌ ఫుడ్స్‌ లాంటివి తీసుకోవడమూ చేస్తే మాత్రం ఫలితం అసలు ఉండదట. రెండుసార్లు సమతులాహారం, రెండుసార్లు పండ్లూ తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గడానికి దీన్ని ఎంచుకునేవారు వెంటనే ఫలితాన్ని ఆశించకూడదు. దీనికి శరీరం అలవాటు పడడానికే కనీసం నాలుగు వారాలు పడుతుందట. కాబట్టి నిదానంగా పద్ధతిగా చేస్తే మాత్రం ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయంటున్నారు.

ఆయుష్షు పెరుగుతుంది!

పోషకాల లోపం లేకుండా మితాహారం తీసుకుంటూ ఎక్కువ సమయం(12-16 గంటలు) ఉపవాసం ఉండేవారు దీర్ఘాయుష్కులవుతారని పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఈ తరహా ఉపవాసం వల్ల ఇంకా చాలా లాభాలున్నాయి.

  • అనవసరమైన కొవ్వు తగ్గి శరీరం సన్నబడుతుంది.
  •  మెదడు చురుగ్గా ఆలోచిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  •  హార్మోన్లు, జన్యువులూ ప్రభావితమై జీవచర్యల్ని వేగవంతం చేస్తాయి.
  •  ఆహారనాళంలో ఉండే రకరకాల మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది.
  •  గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తనాళాల్లో పూడికలూ తగ్గుతాయి.
  •  కండరాలకు నష్టం లేకుండా బరువు తగ్గి, శారీరక సామర్థ్యం పెరుగుతుంది. స్థూలకాయం రాదు.
  •  ఇన్సులిన్‌ సెన్సిటివిటీ పెరుగుతుంది కాబట్టి మధుమేహాన్నీ నివారించవచ్చు.
  •  శస్త్రచికిత్స అవసరమైనప్పుడు కణజాలానికి నష్టం తగ్గడమే కాక, త్వరగా కోలుకోవడం సాధ్యమవుతోందట.
  •  ఇన్‌ఫ్లమేషన్‌ స్థాయులు తగ్గడం వల్ల గుండెజబ్బులూ క్యాన్సర్లూ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లాంటివి వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
  •  వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. జీవగడియారం గాడిలో పడుతుంది.
  •  వార్థక్యపు ఛాయల్ని దూరంగా ఉంచుతుంది. యాంగ్జయిటీ, కుంగుబాటు సమస్యలూ తగ్గుతాయి.

అతి అనర్థమే...

ఉపవాసం మంచిదన్నారని అదేపనిగా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. రోజుకు 16 గంటల కన్నా ఎక్కువ సమయం తరచూ ఉపవాసం ఉండేవారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు. చాలాకాలం అలాగే కొనసాగితే పిత్తాశయాన్ని తీసేయాల్సి రావచ్చట. ఉపవాసం వల్ల కొందరికి నీరసం, చికాకు, మూడ్‌ స్వింగ్స్‌ ఉంటాయి. కొందరికి నిద్రపట్టదు. భోజనం చేయకపోవడం ఒకోసారి మైగ్రెయిన్‌ తలనొప్పికి ట్రిగ్గర్‌ అవుతుంది. ఉపవాసం ఉన్నామన్న ఫీలింగ్‌తో తినడం మొదలెట్టాక అదే పనిగా తినడం, చిరుతిళ్లు తింటూనే ఉండడం కొందరికి అలవాటవుతుంది. దాంతో ఉపవాసం వల్ల లాభంకన్నా నష్టం ఎక్కువవుతుంది. అతిగా ఉపవాసం చేయడం అంటే కోరి అజీర్తిసమస్యలను తెచ్చుకోవడమేనంటారు యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ పరిశోధకులు. ఎప్పుడన్నా ఓసారి ఒక పూట భోజనం మానేయడం జీర్ణవ్యవస్థలోని కణజాలానికి విశ్రాంతినిస్తుంది కానీ రోజుల తరబడి, నెలల తరబడి ఉపవాసం ఉండడం చేజేతులా వాటికి హాని చేసుకోవడమేనంటారు వారు. అలా చేయడం వల్ల చిన్నపేగు లోపలి కణజాలం పనితీరు దెబ్బతింటుందట. ఉపవాసం వల్ల జీర్ణం చేసుకోవడానికి ఆహారపదార్థాలు రాకపోవడంతో ఆ కణజాలం పేగుల్లోని పైత్యరసం, మ్యూకస్‌ లాంటి వాటినే మళ్లీ మళ్లీ గ్రహిస్తుందట. అది శరీరానికి విషతుల్యంగా మారుతుందట. అలాంటివారి విసర్జితాల్లో టాక్సిక్‌ పదార్థాలు ఎక్కువగా ఉండడానికి కారణం అదేననీ, అంతేకానీ ఉపవాసం వల్ల టాక్సిన్లు బయటకు పోతాయనడానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవనీ అంటారు వీరు. తరచూ ఉపవాసం వల్ల శరీరానికి నిత్యం అవసరమైన విటమిన్లూ పోషకాలూ అందవు కాబట్టి అలాంటివాళ్లు సమతులాహారంపై ఎక్కువ శ్రద్ధపెట్టాలని చెబుతున్నారు. అలాగే- పిల్లలూ గర్భిణులూ బాలింతలూ ఉపవాసం జోలికి వెళ్లకూడదట. ఇంకా షుగర్‌ వ్యాధీ, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవాళ్లూ, ఉండవలసిన దానికన్నా తక్కువ బరువున్నవాళ్లూ... ఉపవాసానికి దూరంగానే ఉండాలట. ఉపవాసం అతిగా చేసినా, చేయాల్సిన పద్ధతిలో చేయకపోయినా సమస్యలు వస్తాయి కాబట్టి ఒకసారి వైద్యుల్ని సంప్రదించి చేయాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.


పదహారేళ్లు... అన్నం ముట్టలేదు!

రాజకీయ కారణాలపై అహింసాత్మక విధానంలో తమ నిరసన తెలపడానికి నిరాహార దీక్షలు చేయడం గతంలో ఎక్కువగా ఉండేది. గాంధీజీ తరచూ ఈ దీక్ష చేపట్టేవారు. చుట్టూ ఉన్నవారు పూనుకుని ఆయన చేత దీక్ష విరమింప జేసేవారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్ని వారాలపాటు అభోజనంగా ఉండి ప్రాణాలు వదిలిన వ్యక్తులూ చరిత్రలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంకోసం నిరశన దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 56 రోజులకు కన్నుమూస్తే, ఐర్లండ్‌లో బాబీ సాండ్స్‌ అనే వ్యక్తి 66 రోజులకు మరణించారు. ఆయనతోపాటు ఆ దీక్షలో మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మానవ హక్కుల పట్ల చైతన్యం పెరిగి, వైద్య సౌకర్యాలూ ఎంతో మెరుగైన నేపథ్యంలో- అలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇప్పుడు రానివ్వడం లేదు. దాంతో మణిపూర్‌కి చెందిన ఇరోం షర్మిలా చాను సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించమంటూ ఏకంగా పదహారేళ్ల పాటు నిరాహార దీక్ష చేసి కూడా ప్రాణాలతో బయట పడగలిగింది. ప్రభుత్వం ఆమెను బందీగా ఉంచి బలవంతంగా ముక్కు ద్వారా ఆహారాన్ని అందించే ఏర్పాటుచేయడంతో అన్నేళ్లూ జీవించి ఇప్పుడు సాధారణ జీవితం గడపగలుగుతోంది. ప్రపంచంలోనే దీర్ఘకాలం నిరాహార దీక్ష చేపట్టిన రికార్డూ ఆమెదే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..