Updated : 21 Aug 2022 13:52 IST

వంటిల్లే ఓ వైద్యశాల..!

కాస్త జలుబు చేసిందంటే చాలు... మిరియాల రసం పెట్టేస్తుంది బామ్మ. దానికి దగ్గూ జ్వరం కూడా తోడయిందంటే... ఏకంగా లవంగాలూ చెక్కా దనియాలూ అన్నీ కలిపి మరిగించిన కషాయాన్ని బలవంతంగా అయినా పట్టించేస్తుంది. పోతే, చనా మసాలానో కోడి కూరనో మటన్‌ బిర్యానీనో ఏది వండాలన్నా వాటిల్లోకి ఒక్కో రకం గరం మసాలా దంచి వేయడం షరా మామూలే. ఇలా వంటల్లోనూ గృహవైద్యంలోనూ భాగమైన ఆ మసాలా దినుసుల్లో దేని ఘాటు దానిదే. దేని రుచి దానిదే. అటు వంటకాలకు రుచినీ ఇటు ఒంటికి ఆరోగ్యాన్నీ అందించే సుగంధద్రవ్యాలను వానల్లోనూ చలికాలంలోనూ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు అంటోంది ఆయుర్వేదం. అందుకే వాటిల్లో కొన్నింటి గురించి...


నల్లబంగారం!

న మిరియాల కోసం క్రీస్తు పూర్వమే రోమ్‌, ఈజిప్ట్‌, మెసపొటేమియాల నుంచి వచ్చి కొనుక్కుని వెళ్లేవారట. ఆ రుచి వాళ్లకి బాగా నచ్చడంతో ఆనోటా ఈనోటా ఈ సంగతి తెలుసుకున్న పోర్చుగీసు, డచ్‌ యాత్రికులు పేద్ద పేద్ద ఓడలేసుకుని మనదేశాన్ని వెతికి పట్టుకుని మరీ వచ్చేశారు. మలబారు తీరంలో మాత్రమే పండే మిరియాల్ని బంగారం ఇచ్చి కొనుక్కెళ్లేవారు. అందుకే వీటిని నల్లబంగారం అనేవారు. అప్పటివరకూ మిర్చి ఎలా ఉంటుందో కూడా తెలియని మనవాళ్లు వంటల్లోనూ కారానికి బదులుగానూ మిరియాల్నే వాడుకునేవారట. ఆ పోర్చుగీసువాళ్లే దక్షిణ అమెరికా నుంచి మిర్చిని తెచ్చి మనకిచ్చి, మిరియాల్ని పట్టుకెళ్లేవారు. అలా మనం మిర్చిని సొంతం చేసుకుని, మిరియాలు వాడటాన్ని తగ్గించేశాం. కానీ ఐరోపాలోనూ అమెరికాలోనూ వాటి వినియోగం పెరిగింది. ఎంతంటే- పెప్పర్‌ డబ్బా లేని డైనింగ్‌టేబుల్‌ ఇప్పటికీ అక్కడ ఉండదు. అయితే, మిరియాల్లో నల్లనివే కాదు, పచ్చ, తెలుపు, ఎరుపు రంగు మిరియాలూ ఉంటాయి. కానీ అన్నింటిలోకీ నల్లమిరియాల్లోనే ఘాటూ రుచీ ఔషధగుణాలూ ఎక్కువ. పచ్చరంగులో ఉన్నప్పుడే కోసి వేడినీళ్లలో వేసి తీసి, ఎండబెట్టినవే నల్ల మిరియాలు. ఆ దశలోనే కోసి ఆ రంగు పోకుండా ఫ్రీజ్‌ డ్రైయింగ్‌ చేసినవే పచ్చ మిరియాలు. బాగా పండాక వాటిని నానబెట్టి, ఎండబెట్టి తొక్కభాగాన్ని తీసినవే తెల్ల మిరియాలు. చైనీస్‌, థాయ్‌ వంటకాల్లో వీటి వాడకం ఎక్కువ. పైపొట్టు పోవడంతో వీటి ఫ్లేవర్‌ భిన్నంగా ఉంటుంది. ఎర్రని మిరియాలకోసమైతే పండాక కోసి ఎండనిస్తారు. నిద్రలేమి, పంటినొప్పి, దగ్గూ జలుబూ... వంటి ఎన్నో సమస్యలకి నల్ల మిరియాల్ని మందులా వాడతారు. జీర్ణశక్తినీ ఆకలినీ పెంచుతాయివి. ముఖ్యంగా వర్షాకాలంలో మిరియాల కషాయాన్ని మించిన మందులేదు అంటారు ఆయుర్వేద వైద్యులు. కీళ్ల సమస్యలూ అల్సర్లూ డిప్రెషన్‌... వంటి వాటికీ మిరియాలు మంచి మందు. మెలనిన్‌ శాతాన్ని పెంచడం ద్వారా బొల్లి, తెల్ల మచ్చల్నీ తగ్గిస్తాయి. మెదడుకు ఆక్సిజన్‌ అందించేందుకూ బరువును తగ్గించేందుకూ తోడ్పడతాయి. వీటిని పొడి చేసుకుని, టీల్లోనూ పాలల్లోనూ అన్ని రకాల వంటల్లోనూ వాడుకోవచ్చు. కూరల్లో కారానికి బదులుగా కాస్త మిరియాల పొడి వాడటమే మేలు అంటారు ఆయుర్వేద వైద్యులు.


ఔరా.. దాల్చినచెక్క..!

సినామోమమ్‌ వెరమ్‌ అనే ఒక రకం చెట్ల బెరడే మనం వాడే దాల్చినచెక్క. శ్రీలంక, ఇండియాల్లో ఎక్కువగా పెరిగే ఈ రకాన్నే సిలోన్‌ సినామోమమ్‌ అనీ అంటారు. మిల్క్‌షేక్స్‌, డెజర్ట్స్‌, కుకీస్‌లలో చెక్క వాడటం తెలిసిందే. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి మధుమేహాన్ని నియంత్రించే దాల్చినచెక్క ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని అడ్డుకుంటుంది. మిరియాలతో కలిపి టీరూపంలో తీసుకున్నా లేదా కాస్త పొడిని ఆహారపదార్థాలమీద చల్లుకుని తిన్నా మేలే. ఇది శరీరంలోని టాక్సిన్లని తగ్గించి పోషకాల శోషణను పెంచుతుంది. జీర్ణశక్తినీ ఆకలినీ పెంచే చెక్క, బరువునీ తగ్గిస్తుంది. దగ్గూ జలుబూ తలనొప్పీ ఆస్తమా టీబీ... ఇలా ఎన్నో రోగాలకు మంచి మందు. గొంతుమంటకి- చిన్నముక్కని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి చిటికెడు అల్లం రసం కలుపుకు తాగినా పనిచేస్తుంది. రక్తాన్ని గడ్డకట్టనివ్వని గుణాలు ఉండటంతో ఇది గుండెజబ్బులకీ మంచిదే. మొటిమల్నీ చర్మసమస్యల్నీ నివారిస్తుంది. రింగ్‌వార్మ్‌, అథ్లెట్స్‌ ఫుట్‌... వంటి మైక్రోబియల్‌ ఇన్ఫెక్షన్లనీ దాల్చినచెక్క కషాయం తాగడంద్వారా నివారించుకోవచ్చు. దీన్ని నేరుగా తినడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఇందులోని పీచు జీర్ణం కాక ఊపరితిత్తుల్లో పేరుకుని ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమవుతుంది. అందుకే దీన్ని మరిగించి టీ రూపంలో తీసుకోవడమే మేలు. పార్శ్వనొప్పి, గొంతువాపు, రుతుస్రావ సమస్యల్నీ తగ్గిస్తుంది. ముక్కుదిబ్బడకి దాల్చినచెక్క, మిరియాలు, యాలకులు, నల్లజీలకర్ర సమంగా తీసుకుని పొడిచేసి నస్యంగా పీల్చితే కఫం తగ్గి, శ్వాస తేలికవుతుంది. పావుటీస్పూను పొడికి టీస్పూను తేనె కలిపి మూడుపూటలా తాగితే కీళ్లనొప్పులనుంచీ ఉపశమనం ఉంటుంది.


నక్షత్ర పుష్పం... అనాస!

నాస పువ్వునే స్టార్‌ ఫ్లవర్‌ అంటారు. బిర్యానీలోనూ బగారా రైస్‌లకే పరిమితం చేస్తాంగానీ ఇది ఔషధాల గని. దగ్గూజలుబూ కడుపుబ్బరం, వికారం... వంటి సమస్యలకు ఇందులోని థైమోల్‌, టెర్పినాల్‌ అనే పదార్థాలు మెడిసిన్‌లా పనిచేస్తాయి. యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియా గుణాలున్న అనాస మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నివారిణి. ఫ్లూజ్వరాలకు మంచి మెడిసిన్‌. నెలసరిలో వచ్చే కడుపునొప్పినీ తగ్గిస్తుంది. అండాశయ సమస్యలని తగ్గించడంతోపాటు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ సమతుల్యాన్నీ కాపాడుతుంది. అనాసపువ్వులోని షికిమిక్‌ ఆమ్లానికి యాంటీవైరల్‌ సామర్థ్యం ఉంది. అందుకే ఫ్లూవైరస్‌ల నివారణకు వాడే టామిఫ్లూ అనే ట్యాబ్లెట్‌ తయారీలో వాడతారు. హెర్పిస్‌ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లకీ ఇది మందులా పనిచేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు ఫంగల్‌ ఇన్ఫెక్షన్లనీ తగ్గిస్తాయి. అజీర్తినీ, తేన్పుల్నీ బాగా తగ్గిస్తుంది. ఈ పువ్వులోని గింజల్ని పొడిచేసి మరిగించిన నీటిని తాగితే శృంగారేచ్ఛ పెరుగుతుందట. ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే ఈమధ్య మసాలా చాయ్‌లోనూ దీన్ని వాడుతున్నారు. సబ్బులు, పెర్‌ఫ్యూమ్స్‌, టూత్‌పేస్టులు, మౌత్‌వాష్‌లు, క్రీముల్లో అయితే అనాస వాసన ఉండి తీరాల్సిందే మరి!


సుగంధద్రవ్యాల రాణి

యాలకుల్ని సుగంధద్రవ్యాలకే రాణిగా పిలుస్తారు. నీలగిరి కొండలు వీటి జన్మస్థానం. కానీ ఇప్పుడు శ్రీలంక, బర్మా, చైనా, గ్వాటెమాలా, టాంజానియా... ఇలా చాలా దేశాల్లో పండిస్తున్నారు. సూర్యకాంతి నేరుగా మొక్కమీద పడని చల్లని ప్రదేశాల్లో యాలక మొక్కలు చక్కగా పెరుగుతాయి. పూర్వం గ్రీకులూ రోమన్లూ వీటిని అత్తరుగా వాడేవారట. గరం మసాలాతోపాటు టీ, పాయసాల్లోనూ తీపి వంటకాల్లోనూ వాడతారు. ఇవి శృంగారపరమైన సమస్యల్ని నివారిస్తాయట. శుశ్రుత, చరకసంహితలోనూ కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోనూ దీని ప్రస్తావన ఉంది. వీర్యకణాల వృద్ధికి తోడ్పడతుందనీ అంటారు. పడుకునేముందు ఓ యాలక తింటే హానికారక వ్యర్థాలూ బ్యాక్టీరియా నశిస్తాయి. యాలకుల్లో మానసికోల్లాసం కలిగించే తైలం ఉంటుంది. ఇవి కఫ దోషాన్నీ, వాంతుల్నీ, గొంతునొప్పినీ, నోటి దుర్వాసననీ పోగొడతాయి.ఎక్కిళ్లు, అతిదాహం, ఉబ్బసం, వర్టిగో... ఇలా అనేక సమస్యల్ని యాలక్కాయ తగ్గిస్తుంది. యాలకుల కషాయంతో దగ్గుకి ఉపశమనం ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. వీటిని నూరి గాయాలకీ పుండ్లకీ పూతమందులా వాడొచ్చు. కీమోథెరపీలో వచ్చే దుష్ఫలితాలను తగ్గించే శక్తి యాలకులకి ఉందట.


జాజికాయ-జాపత్రి!

రంమసాలాలో తప్పక కనిపించే మరో ఘాటైన సుగంధద్రవ్యమే జాజికాయ. ఈ గింజకు పైన పొట్టులా పట్టి ఉండేదే జాపత్రి. దీన్ని కూడా బిర్యానీల్లోనూ పలావుల్లోనూ వాడతారు. మిరిస్టికా ఫ్రాగ్రెన్స్‌ అనే చెట్లకు కాస్తాయివి. రెండు రకాల సుగంధద్రవ్యాలను అందించే ఒకే ఒక చెట్టు ఇది. వీటిని వేస్తే ఏ వంటకానికైనా మంచి వాసనా రుచీ వస్తుంది. మొఘలాయీ వంటకాల్లో జాజికాయ తప్పనిసరి. జాజికాయ నూనెని కీళ్లనొప్పులకీ, వాపులకీ వాడతారు. ఈ వాసనకి డిప్రెషన్‌, ఒత్తిడి, అలసట తగ్గుతాయన్న కారణంతో రోమన్లు ఈ నూనెని బ్రెయిన్‌ టానిక్‌గా పిలిచేవారట. చిటికెడు పొడిని టీలోగానీ సూపుల్లోగానీ వేసుకుంటే మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. ఈ పొడిని రోజూ వాడటంవల్ల కొలెస్ట్రాల్‌ తగ్గడంతో గుండెజబ్బులు రావట. కాలేయం, మూత్రపిండాల్లో పేరుకున్న వ్యర్థాల్ని తొలగించడంతోపాటు నోటి దుర్వాసననీ తగ్గిస్తుంది. జాజికాయ పొడి రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. వీర్యవృద్ధిని కలిగిస్తుంది. పూర్వం సంప్రదాయ వైద్యులు జాజికాయ నూనెను పేగు సమస్యల నివారణలో వాడేవారట. సబ్బులు, హెయిర్‌ ఆయిల్స్‌, టూత్‌పేస్టుల్లోనూ వాడుతుంటారు. జాజికాయ, శొంఠి అరగదీసి కణతల దగ్గర పట్టులా వేస్తే తలనొప్పి, మైగ్రెయిన్‌... వంటి వాటి నుంచి ఉపశమనం ఉంటుంది. టీస్పూను తేనెలో కాస్త పొడి వేసి తింటే నిద్ర పడుతుంది. లేదూ గ్లాసు పాలల్లో చిటికెడు జాజికాయ పొడి వేసుకున్నా మంచిదే. ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.


లవంగమొగ్గ..!

శాస్త్రీయంగా చెప్పాలంటే వీటికిదే సరైన పేరు. గులాబీరంగులోకి మారి పువ్వుగా విచ్చుకున్నవి సుగంధద్రవ్యంగా పనికిరావు. అందుకే గుత్తులుగా ఉన్న ఆకుపచ్చని పూమొగ్గల్ని చెట్టునుంచి కోసి దేనికది విడదీసి దాదాపు నలుపురంగులోకి మారేవరకూ ఎండబెట్టినవే మనం వాడుకునే లవంగాలు. లవంగ చెట్ల పుట్టిల్లు ఇండొనేషియా. కానీ మధ్యయుగంనాటికే అంతటా వ్యాప్తి చెందాయి. పంటినొప్పికీ నోటి దుర్వాసనకీ లవంగం చక్కని మందు. అందుకే వీటిని టూత్‌పేస్టుల తయారీలోనూ వాడతారు. బీపీకీ, అలసటకీ, ఒత్తిడికీ లవంగం వేసి మరిగించిన కషాయం టానిక్‌లా పనిచేస్తుంది. ఉబ్బినట్లుగా ఉన్న చర్మానికి కాస్త లవంగనూనెని ఇతర నూనెల్లో కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది. పెరట్లో లవంగ మొక్కను పెంచుకుంటే పక్కన ఉన్న మొక్కలకీ చీడపీడలు రాకుండా ఉంటాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని కలిగిస్తుంది లవంగ టీ. ఇది చర్మ సంబంధిత, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లనీ నివారిస్తుంది. ఇందులోని నైజెరిసిన్‌ అనే పదార్థం మధుమేహాన్ని తగ్గిస్తుంది. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం, అల్సర్‌ సమస్యలకు మందులా పనిచేస్తాయి. ఆస్టియోపొరోసిస్‌తో బాధపడేవాళ్లు రోజూ లవంగాల్ని తింటే మేలు. బ్రాంకైటిస్‌, ఆస్తమా ఉంటే- లవంగాలను వేడిచేసి వాటినుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల శ్వాసరంధ్రాల్లోని అవరోధాలు తొలగిపోతాయి. లవంగాల్లోని యూజెనాల్‌ రక్తశుద్ధికీ తోడ్పడుతుంది.


పసందైన మరాఠీ మొగ్గ..!

రాఠీ మొగ్గల్నే ఇంగ్లిష్‌లో కపోక్‌ బడ్స్‌ అంటారు. కపోక్‌(సెయిబా పెంటాండ్రా) అనే ఒక రకం బూరుగు దూది చెట్టు నుంచే వచ్చేవే మరాఠా మొగ్గలు. దీన్నే తెలుగులో మొగ్గ, తెల్ల బూరుగ అంటారు. ఆవాలు, నల్లమిరియాలు కలగలిపినట్లుంటుంది వీటి వాసన. పువ్వులన్నీ కాయగా మారి పెరిగే దశలోనే వీటిని కోసి ఎండబెడతారు. దీన్ని కూడా ఇతర మసాలా దినుసుల్లో కలిపి వాడటంతోపాటు నేరుగా పొడి చేసీ వంటల్లోనూ ఔషధంగానూ వాడుకోవచ్చు. ఇది డయేరియాకీ పుండ్లూ గాయాల నివారణకీ భలే మందు. ముక్కులోని ఇన్‌ఫ్లమేషన్‌నీ తగ్గిస్తుంది. ఈ చెట్లు మనదగ్గర కర్ణాటకలో ఎక్కువగా పెరుగుతున్నాయి. బిసిబేళాబాత్‌లో వీటిని తప్పక వేస్తారు. జ్వరనివారణకీ పనిచేస్తాయీ మొగ్గలు. దీన్ని ముందుగా నూనెలో వేయించి తీస్తే మంచి వాసన వస్తుంది. చెట్టినాడ్‌ వంటకాల్లో ఇది తప్పనిసరి. ఈ చెట్లను సిల్కులా మెరిసే బూరుగు దూదికోసమే పెంచినప్పటికీ, ఆకులూ బెరడూ మొగ్గలూ... ఇలా అన్నింటినీ వ్యాధుల నివారణలోనూ వాడతారు సంప్రదాయ వైద్యులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు