కంటికి విందు... గులాబి రంగు..!

కొన్ని పండ్లనీ కూరగాయల్నీ రుచికోసం తింటే, మరికొన్నింటిని ఆరోగ్యంకోసం తింటుంటాం. కానీ కొన్నింటిని మాత్రం వాటి ఆకర్షణీయమైన రంగుని చూసి ముచ్చటపడి నోట్లో పెట్టేసుకుంటాం.

Published : 12 Nov 2022 23:38 IST

కంటికి విందు... గులాబి రంగు..!

కొన్ని పండ్లనీ కూరగాయల్నీ రుచికోసం తింటే, మరికొన్నింటిని ఆరోగ్యంకోసం తింటుంటాం. కానీ కొన్నింటిని మాత్రం వాటి ఆకర్షణీయమైన రంగుని చూసి ముచ్చటపడి నోట్లో పెట్టేసుకుంటాం. అందుకే ఈమధ్య పండ్లకీ కూరగాయలకీ సంకరీకరణతో కొత్త రంగుల్నీ అద్దేస్తున్నారు. ఈ గులాబీ రంగు కూరగాయలూ పండ్లూ అలా పండిస్తున్నవే మరి

హారపదార్థాలేవయినా కంటికి నచ్చాలి. రుచి బాగుండాలి. ఆ తరవాతే పోషకాల గురించి ఆలోచిస్తాం. ఈ రెండూ లేకుండా అవెంత పోషకభరితమైనా చాలామంది వాటిని పక్కన పెట్టేస్తారు. దీనికితోడు భోజనం ప్లేటులో ఎన్ని రంగులుంటే అంత మంచిదని పోషక నిపుణులూ చెబుతూనే ఉన్నారు. నిజానికి మనం రోజువారీ తినే కూరగాయాలూ పండ్లూ అన్నీ రంగురంగుల్లో ఆకర్షణీయంగానే ఉంటాయి. అయితే అవన్నీ ఆకుపచ్చా ఎరుపూ నారింజా పసుపూ మహా అయితే ఊదా రంగుల్లోనే కనిపిస్తాయి. కానీ అమ్మాయిలకి ఇష్టమైన గులాబీరంగులో కనిపించడం కాస్త అరుదనే చెప్పాలి. ఆ లోటు తీర్చేందుకే కావచ్చు... జన్యునిపుణులు ఎరుపూ నారింజ రంగుల్లో పండే కూరగాయల్ని సంకరీకరించి గులాబీరంగులోనూ పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్‌ హార్టీకల్చరల్‌ కాలేజీలోని జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగానికి చెందిన నిపుణులు పసుపుతోపాటు గులాబీరంగు టొమాటోల్నీ సృష్టించారు. పైగా వీటిల్లో క్యాన్సర్‌ను నిరోధించే ఆంథోసైనిన్లు ఎక్కువట. అయితే గులాబీ టొమాటోల తొక్క పలుచగా ఉండటంతో వారం రోజులకి మించి నిల్వ ఉండవుకానీ త్వరగా ఉడుకుతాయనీ పులుపూ ఎక్కువే కాబట్టి పచ్చడికీ బాగుంటాయనీ అంటున్నారు. ముఖ్యంగా ఆకర్షణీయమైన ఆ రంగు ఆహార పదార్థాలకు కొత్తందాన్నీ తీసుకొస్తుంది. 55 రోజులకే పంట చేతికి వస్తుందనీ మొక్క కూడా ఎత్తుగా పెరిగి గుత్తులుగా కాచి అధిక దిగుబడినిస్తుందనీ చెబుతున్నారు. ఇక, సుందరి చీర లేదా పింక్‌ అమరాంథస్‌గా పిలిచే తోటకూర కేరళతోపాటు మనదగ్గరా పండుతోందిప్పుడు. గులాబీకాడలూ పచ్చని ఆకులతో ఉండే ఈ తోటకూర సైతం త్వరగా ఉడకడంతోపాటు రుచిగానూ ఉంటుంది. పైగా ఈ మధ్య గులాబీరంగు ఆకుకూరలకి విదేశాల్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడిందట. దాంతో కొత్తగా పండిస్తోన్న రోజీ లెట్యూస్‌ లేదా పింక్‌ రాడిచియో అనే ఆకుని సలాడ్లలోనూ పిజ్జా బర్గర్లలోనూ బాగా తింటున్నారట. మిరియాల రుచిని పోలిన పింక్‌ లేదా షెజువాన్‌ పెప్పర్‌ వంటకాలకి తీపితో కూడిన ఘాటైన రుచిని ఇస్తుంది. ఇది జలుబూ దగ్గూ జ్వరాలకు మంచి మందులానూ పనిచేస్తుంది. మసాలా కూరల్లో విధిగా వేసే దనియాలు సైతం గులాబీరంగులో పండుతున్నాయి. ఈ రంగుకి కారణమైన వర్ణద్రవ్యం కారణంగా ఇవి మామూలు వాటికన్నా మంచివి. అలాగే ఎర్రని భుట్‌ జొలొకియా, వంగరంగు పిమెంటా డా నెడె రకాల్ని సంకరీకరించిన పింక్‌ టైగర్‌ మిర్చి వేస్తే ఆ కూర రంగే కాదు, రుచీ అద్భుతమేనట.

ఇక, బీటాసైనిన్‌ అనే కెరోటినాయిడ్‌ శాతం వల్లే బీట్‌రూట్‌ రంగు గులాబీ నుంచి ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ఎన్నో వ్యాధులకు మంచి మందు. అందుకే... బంగాళాదుంప, ముల్లంగి, వంకాయ, క్యాప్సికమ్‌, సెలెరీ, పచ్చిమిర్చి, క్యారెట్‌, కాలీఫ్లవర్‌... ఇలా ఎన్నో కూరగాయలు గులాబీవర్ణంలో పండుతూ భోజనం ప్లేటుని ఆకర్షణీయంగా మార్చడంతోపాటు వాటిల్లోని కెరోటినాయిడ్లతో ఆరోగ్యానికీ మేలు చేస్తున్నాయి.

గులాబీ పండ్లు..!

సహజంగానో లేదా సంకరీకరణ ద్వారానో గులాబీరంగులో పండించే పండ్లలో విభిన్నమైన పోషకాలు ఉండటమే కాదు, వాటి రుచీ అంతే భిన్నంగా ఉంటుంది. అందుకే ఈమధ్య గులాబీ పూల మాదిరిగానే ఆ రంగు పండ్లకీ ఆదరణ పెరుగుతోంది. అవునుమరి, గులాబీరంగులో కొట్టొచ్చినట్లు కనిపించే డ్రాగన్‌ ఫ్రూట్‌ పరిచయమై కొద్దికాలమే అయినప్పటికీ చిన్నాపెద్దా అందరికీ ఫేవరెట్‌గా మారిపోయింది. మృదువుగా ఉండటంతోపాటు దాని రంగూ అందుకు కారణమే. అందులో పుష్కలంగా ఉండే ఆంథోసైనిన్లు ఎన్నో వ్యాధుల నివారణకీ తోడ్పడతాయి. ప్లేట్‌లెట్స్‌ పెరుగుదలకీ తోడ్పడతున్నాయన్న కారణంతోనూ దీని పెంపకంతోపాటు వాడకమూ మనదగ్గర పెరిగింది. అంతేనా... డ్రాగన్‌ ఫ్రూట్‌ పొడిని ఆ రంగు కోసమే అనేక ఆహారపదార్థాల్లోనూ కలుపుతున్నారు.

మానవాళికి చిరపరిచితమైన అత్తిపండు లేదా అంజీర్‌ తొక్క ఆకుపచ్చ నుంచి వంగపూరంగులోనే ఉంటుంది. కానీ గుజ్జు మాత్రం గులాబీ నుంచి ఎరుపు రంగులోనూ ఉంటుంది. ఆపిల్స్‌లోకెల్లా గులాబీ ఆపిల్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పింక్‌ లేడీ ఆపిల్‌గా పిలిచే ఈ రకం పండు పక్వానికి వచ్చేకొద్దీ చూడముచ్చటైన గులాబీరంగులోకి మారిపోతుంది. లోపల మాత్రం పసుపురంగు గుజ్జుతో ఎంతో రుచిగా ఉంటుంది. గులాబీరంగు గుజ్జు ఉన్న పింక్‌ పెరల్‌ ఆపిల్‌ అనే మరో రకం కూడా ఉంది. లేత పసుపు రంగు తొక్కతోనూ గులాబీ గుజ్జుతోనూ ఉండే ఈ రకాన్ని ఐరోపా, అమెరికా దేశాల్లో ఎప్పటినుంచోనే పండిస్తున్నారు. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఈ గులాబీ ఆపిల్‌ ఒత్తిడినీ తగ్గిస్తుంది.

తక్కువ క్యాలరీలూ ఎక్కువ పోషకాలూ ఉండే రాస్బెర్రీలూ స్ట్రాబెర్రీలూ దానిమ్మపండ్లలో కొన్ని రకాలూ, బ్రష్‌చెర్రీలూ గులాబీరంగులో పండుతున్నాయి. రాస్బెర్రీల్లోని ఎలాజిక్‌ ఆమ్లం అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌. అలాగే పైన ఆకుపచ్చగానూ పింక్‌ కలర్‌ గుజ్జుతోనూ ఉన్న జామతో జెల్లీలూ జామ్‌లూ జ్యూస్‌లూ తయారుచేస్తున్నారు. సిట్రస్‌ పండ్లలోకన్నా నాలుగురెట్లు సి-విటమిన్‌ ఎక్కువగా ఉండే జామలో లైకోపీన్‌ శాతమూ ఎక్కువే.  గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కావడంతో మధుమేహులకి జామ జ్యూస్‌ మంచిదని చెప్పడంతో-  గోవా పింక్‌ డ్రింక్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

గులాబీరంగు తొక్కతోనూ లేత పసుపురంగు గుజ్జుతోనూ ఉన్న అరటిపండ్ల రుచి సంగతెలా ఉన్నా రంగు మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. గులాబీ తొక్కతో ఉండే లిచీ పండ్లూ అంతే. తీపీ పులుపూ కలగలిసిన ఈ పండ్లలో విటమిన్‌-సి శాతం ఎక్కువ. ఇక, కాక్టస్‌ పియర్‌ పండ్లూ గులాబీరంగు గుజ్జుతో ఉండే గ్రేప్‌ ఫ్రూట్‌ల్లోనూ సి-విటమిన్‌ శాతం ఎక్కువే. ఇందులోని పోషకాలు చర్మసౌందర్యాన్నీ పెంపొందిస్తాయి. మృదువుగా లేత గులాబీరంగులో ఉండే పీచ్‌ పండ్లలోనూ ఎ, సి విటమిన్లు రెండూ అధికమే.

తెలుపూ లేదా పసుపు రంగు గుజ్జులో ఉండే పైనాపిల్‌ కాస్త పులుపుతో కూడిన వగరు రుచితో ఉంటుంది. కానీ హవాయ్‌కి చెందిన డెల్‌మాంటె ఫ్రెష్‌ అండ్‌ డొలె కంపెనీ రూపొందించిన పింక్‌ గ్లో పైనాపిల్స్‌ మాత్రం తియ్యగానూ మృదువైన గుజ్జుతోనూ మంచి వాసనతోనూ నోరూరిస్తాయి. సాధారణంగా లైకోపీన్‌ అనే కెరోటినాయిడ్‌ వల్ల పండ్లూ కూరగాయలు గులాబీ నుంచి ఎరుపురంగులో ఉంటాయి. అయితే ఆయా పండ్లలోని కొన్ని ఎంజైమ్‌లు ఆ లైకోపీన్‌ను బీటాకెరోటిన్‌గా మార్చడంతో అవి కాస్తా పసుపురంగులోకి మారతాయి. అందుకే జన్యుమార్పు ద్వారా ఆ ఎంజైమ్‌ పనిచేయకుండా చేసి పింక్‌ గ్లో పైనాపిల్‌ను పండిస్తున్నారట. వీటితో చేసిన జ్యూస్‌లూ స్మూతీలు సైతం ఎంతో రుచిగానూ ఆకర్షణీయంగానూ ఉండటంతో ఇవి యమా క్రేజీగా మారాయట. ఇవే కాదు,  నిమ్మ, ద్రాక్ష, వాటర్‌ఆపిల్‌, సీతాఫలం... ఇలా ఎన్నో పండ్లని గులాబీరంగులోనూ పండిస్తున్నారు.

ఇవన్నీ అలా ఉంచితే- థాయ్‌లాండ్‌కి చెందిన ఓ యువరైతు తన పొలంలో కనిపించిన గులాబీరంగు వరిమొక్కని చూసి ఆ వంగడంతో రకరకాల ప్రయోగాలు చేసి పింక్‌ లేడీ రైస్‌ అనే కొత్త రకాన్ని సృష్టించాడు. గింజ మాత్రం మిగిలిన బియ్యం మాదిరిగా తెల్లగానే ఉన్నప్పటికీ చేనూ కంకులూ మాత్రమే గులాబీరంగులో ఉన్నాయి. దాంతో పచ్చని వరిపొలాలకు భిన్నంగా ఉన్న ఈ గులాబీ పొలాన్ని చూడ్డానికి ఆ ఊరికి చాలామంది క్యూ కడుతున్నారట. సో, మున్ముందు ఆపిల్‌, టొమాటో... అనగానే ఎరుపు రంగూ; పచ్చిమిర్చి అంటే ఆకుపచ్చ వర్ణం; క్యారెట్‌ పేరు చెప్పగానే నారింజరంగూ స్ఫురించడానికి బదులుగా గులాబీరంగువీ కళ్లముందు కదలాడతాయి. అంటే- భోజనం ప్లేటు మరింత వర్ణభరితం కానుందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..