వ్రణాలను తగ్గించే... రణపాల!

ఆయుర్వేదంలో సంప్రదాయ గృహవైద్యంలో వాడే మొక్కలెన్నో ఉన్నాయి. ఒక్కోదానికీ ఒక్కో రకమైన ఉపయోగం ఉంటుంది. అయితే కొన్ని మొక్కలు మాత్రం అదీ ఇదీ అని లేకుండా పలు రకాల వ్యాధులకు మందులా పనిచేస్తాయి.

Updated : 12 Feb 2023 03:50 IST

వ్రణాలను తగ్గించే... రణపాల!

ఆయుర్వేదంలో సంప్రదాయ గృహవైద్యంలో వాడే మొక్కలెన్నో ఉన్నాయి. ఒక్కోదానికీ ఒక్కో రకమైన ఉపయోగం ఉంటుంది. అయితే కొన్ని మొక్కలు మాత్రం అదీ ఇదీ అని లేకుండా పలు రకాల వ్యాధులకు మందులా పనిచేస్తాయి. అలాంటి అద్భుతమైన ఔషధ మొక్కే రణపాల... మన ఇంటి సంజీవని!

ణపాల... ఈ పేరు వినగానే ఆకు వేస్తే మొక్క వస్తుందనుకునే చిన్నతనం గుర్తుకురావచ్చు... కానీ ఇది ఎన్నో రోగాలకు మందు అని తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలామంది దీన్ని అందంకోసమే పెంచుతారు. కాబట్టి ఎవరింట్లో అయినా ఈ మొక్క కనిపిస్తే ఓ క్షణం ఆగండి. ఏమాత్రం ఆలోచించకుండా ఓ ఆకుని కోసి చక్కగా కడిగి నోట్లో పెట్టుకుని తమలపాకులా నమిలేయండి. చేదుగా ఉంటుందనో తింటే ఏమవుతుందోనని భయపడక్కర్లేదు. వగరూ పులుపూ కలిసిన రుచితో ఉండే ఈ ఆకు అనారోగ్య సమస్యలు ఉంటే మందుగా పనిచేస్తుంది. లేదంటే అందులోని ఔషధ గుణాలు రోగాల్ని అడ్డుకుంటాయి అంటున్నారు సంప్రదాయ వైద్య నిపుణులు.

రణపాల మొక్కనే అష్టిభక్ష, హేమసాగర్‌, పర్ణబీజ అనీ పిలుస్తారు. రాళ్లను కరిగిస్తుందన్న అర్థంలో సిద్ధవైద్యులు రణకళ్లి అనీ, ఆయుర్వేద వైద్యులు పాషాణభేడ అనీ అంటారు. పూల ఆకారాన్ని బట్టి కేథెడ్రల్‌ బెల్స్‌ అనీ; ఆకులోని ఔషధగుణాల కారణంగా లీఫ్‌ ఆఫ్‌ లైఫ్‌, మిరకల్‌ లీఫ్‌ అనీ; ఎప్పుడూ ఆకుపచ్చరంగులోనే ఉంటుందని ఎవర్‌గ్రీన్‌ ప్లాంట్‌ అనీ... దీనికి ఎన్నో పేర్లు.

ఆకులో ఏముంది?

యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెన్నో రణపాల ఆకుల్లో గుర్తించారు. మధుమేహులకీ బీపీ రోగులకీ మందుగా పనిచేస్తుందనీ, శ్వాసకోశ, మూత్రాశయ, జీర్ణ సంబంధ సమస్యల్నీ ఇన్ఫెక్షన్లనీ పుండ్లనీ ఇతరత్రా వ్యాధుల్నీ నివారిస్తుందనీ చెబుతున్నారు. ఇందులోని ఫ్లేవనాయిడ్లూ గ్లైకోసైడ్లూ స్టెరాయిడ్లూ కర్బన ఆమ్లాలకు క్యాన్సర్‌ను నిరోధించే శక్తి ఉందట. దీన్నుంచి తీసిన రసానికి హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ను నివారించే శక్తి ఉందని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ప్రచురించింది. ఈ వైరస్‌ కారణంగానే మహిళలు సెర్వైకల్‌ క్యాన్సర్‌ బారినపడుతున్నారు మరి. మూత్రపిండాల్లోనూ పిత్తాశయంలోని రాళ్లకీ రణపాల మంచి మందే.

ఎలా తీసుకోవాలి?

ఉదయం, సాయంత్రం రెండు ఆకుల చొప్పునగానీ లేదా ఆకుల్ని మరిగించిన కషాయాన్ని రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున (పరగడుపునే) రెండునెలలపాటు తాగితే మూత్రపిండాలూ పిత్తాశయంలోని రాళ్లు కరిగిపోతాయి అంటున్నారు కొందరు వైద్యులు. అనేక రాష్ట్రాల్లో గిరిజన వైద్యంలో ఆకు రసంలో చిటికెడు మిరియాలపొడి చేర్చి తీసుకుంటారట. దీనివల్ల మధుమేహం, బీపీ సైతం అదుపులో ఉంటాయట. నేరుగా తినలేని, తాగలేనివాళ్లు దీన్ని సలాడ్లలో భాగంగానూ కూరగాయలతోపాటు ఉడికించీ తినొచ్చు.

* ఈ ఆకుని పొడి చేసి టీ లేదా కషాయంగా తాగితే శ్వాసకోశ సంబంధ సమస్యలకీ ఉపశమనం కలుగుతుంది.

* ఈ కషాయం కామెర్లకీ మందులా పనిచేస్తుంది. అజీర్తినీ మలబద్ధకాన్నీ  తగ్గిస్తుంది. జలుబూ దగ్గూ మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాల్నీ నివారిస్తుందట.

* రణపాల ఆకులోని ఆస్ట్రింజెంట్‌, అనాల్జెసిక్‌ గుణాలు చర్మ కణాలు సంకోచించేలా చేసి గాయాల నుంచి రక్తం కారకుండా చేయడంతోపాటు నొప్పినీ తగ్గిస్తాయి.

* రణపాలలోని యాంటీహిస్టమైన్‌, యాంటీఫంగల్‌ గుణాల వల్ల దీన్ని నలిపి కీటకాలు కుట్టినచోట పెడితే నొప్పి తగ్గుతుంది.

* ఆకుల్లోని రసాయనాలు నాడులకు సాంత్వన కలిగిస్తాయట. అందుకే ఈ కషాయం ఆందోళన, ఒత్తిడి... వంటి వాటినుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

* దీర్ఘకాలిక పుండ్లూ గడ్డలూ వేడి కురుపులూ వస్తే ఈ ఆకుల్ని నూరి ముద్దలా పెడితే క్రమేణా తగ్గుతాయి. వాపుల్నీ తగ్గిస్తుంది. లేదూ ఈ ఆకుల్ని మరిగించిన నీళ్లతో పుండుని కడిగినా మంచిదే.

* ఈ ఆకుల్ని నలిపి కొబ్బరి నూనెలో కలిపి తలకు మర్దన చేసినా లేదా నుదుటిమీద పెట్టుకున్నా తలనొప్పి తగ్గుతుంది.

* ఈ కషాయంలో కాస్త జీలకర్ర, నెయ్యి చేర్చి తీసుకుంటే డయేరియా, రక్త విరేచనాలు కూడా తగ్గుతాయి.

* కీళ్లనొప్పులున్నవాళ్లు ఆకుని వేడిచేసి నొప్పి ఉన్నచోట పెడితే ఫలితం ఉంటుంది. రణపాల ఆకురసాన్ని కొబ్బరి నూనెలో కలిపి పెడితే చుండ్రు బాధ తగ్గుతుందట. గర్భిణులూ, ఏవైనా ఆరోగ్య సమస్యలున్నవాళ్లూ వైద్యుల సలహామీదనే వాడాలన్నది మాత్రం అస్సలు మర్చిపోకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..