చిరుతిళ్ల సంబరాలు!

సంక్రాంతి వస్తోందంటే చాలు... గాలిపటాలు ఎగరేయడం, అందమైన ముగ్గులతో వాకిళ్లను నింపేయడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం... ఇలా పండుగ హడావుడికి అంతే ఉండదు. ఈ సంబరాల్లో పిండివంటలకూ ప్రాధాన్యం ఇవ్వడం మామూలే కాబట్టి... ఈసారి ఇలాంటివి వండుకుని చూస్తే సరి.

Updated : 09 Jan 2022 01:05 IST

చిరుతిళ్ల సంబరాలు!

సంక్రాంతి వస్తోందంటే చాలు... గాలిపటాలు ఎగరేయడం, అందమైన ముగ్గులతో వాకిళ్లను నింపేయడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం... ఇలా పండుగ హడావుడికి అంతే ఉండదు. ఈ సంబరాల్లో పిండివంటలకూ ప్రాధాన్యం ఇవ్వడం మామూలే కాబట్టి... ఈసారి ఇలాంటివి వండుకుని చూస్తే సరి.


లడ్డు

కావలసినవి: నువ్వులు: కప్పు,  పల్లీలు: పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, ఓట్స్‌: అరకప్పు, ఎండుకొబ్బరి పొడి: పావుకప్పు, బెల్లం తురుము: రెండు కప్పులు, యాలకులపొడి: అరచెంచా, నెయ్యి: పావుకప్పు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి ఓట్స్‌, జీడిపప్పు, పల్లీలు, నువ్వుల్ని విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. తరువాత వీటన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులోనే బెల్లం తరుగు, ఎండుకొబ్బరి పొడి, యాలకుల పొడి కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి.


పెసరపప్పు చిప్స్‌

కావలసినవి: ఉడికించిన పెసరపప్పు: కప్పు, గోధుమపిండి: రెండున్నర కప్పులు, నూనె: వేయించేందుకు సరిపడా, నువ్వులు: ఒకటిన్నర చెంచా, చాట్‌మసాలా: చెంచా, కారం: చెంచా, ఉప్పు: తగినంత, ఆమ్‌చూర్‌పొడి: అరచెంచా, పసుపు: పావుచెంచా.

తయారీ విధానం: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మూడు పెద్ద చెంచాల నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టాలి. పది నిమిషాలయ్యాక కొద్దిగా పిండిని తీసుకుని మందంగా చపాతీలా ఒత్తుకుని చాకుతో ముక్కల్లా కోసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


రవ్వ చెగోడీలు

కావలసినవి: బొంబాయిరవ్వ: నాలుగుకప్పులు, పెసరపప్పు: కప్పు, కారం: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, జీలకర్ర: చెంచా, నువ్వులు: నాలుగు చెంచాలు, సోంపు: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: పెసరపప్పును పావుగంట ముందు నానబెట్టుకోవాలి. ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి ఆరుకప్పుల నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు పెసరపప్పు, రవ్వ వేసుకుని స్టౌని సిమ్‌లో పెట్టాలి. రవ్వ ఉడికి.. దగ్గరకు అయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమం వేడి కొద్దిగా చల్లారాక చేతికి నూనె రాసుకుని కొద్దిగా తీసుకుని చెగోడీ ఆకృతిలో చేసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకుని నాలుగైదు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.  


చిరోటి

కావలసినవి: మైదా: కప్పు, బొంబాయిరవ్వ: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: టేబుల్‌స్పూను, ఉప్పు: అరచెంచా, యాలకులపొడి: అరచెంచా, చక్కెరపొడి: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా. స్టఫింగ్‌కోసం: బియ్యప్పిండి/మొక్కజొన్నపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: సరిపడా.

తయారీ విధానం: మైదా, రవ్వ, నెయ్యి, ఉప్పు ఓ గిన్నెలో వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోస్తూ చపాతీపిండిలా చేసుకుని మూత పెట్టి అరగంట నాననివ్వాలి.  స్టఫింగ్‌కోసం పెట్టుకున్న బియ్యప్పిండి/మొక్కజొన్నపిండిని ఓ గిన్నెలో తీసుకుని కరిగించిన నెయ్యి పోస్తూ పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని అయిదారు ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చపాతీలా ఒత్తుకుని దానిపైన బియ్యప్పిండి పేస్టును రాసి... పైన ఇంకో చపాతీని ఉంచాలి. ఇలా అన్నింటినీ చేసుకుని రోల్‌లా వచ్చేలా చుట్టుకుని ముక్కలు కోసుకోవాలి. ఒక ముక్కను తీసుకుని కొద్దిగా వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇదేవిధంగా అన్నింటినీ చేసుకుని... రెండు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిపైన యాలకులపొడి కలిపిన చక్కెర పొడి చల్లితే సరిపోతుంది. లేదంటే చక్కెర పాకంలోనూ ముంచి తీసుకోవచ్చు.


బ్రెడ్‌ మురుకులు

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: పన్నెండు, సెనగపిండి: ఒకటిన్నర కప్పు, బియ్యప్పిండి: కప్పు, కారం: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, నువ్వులు: నాలుగు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ముందుగా బ్రెడ్‌స్లైసుల అంచుల్ని తీసేసి నీటిలో నానబెట్టుకుని సరిగ్గా అర నిమిషం అయ్యాక ఈ నీటిని పూర్తిగా పిండేసి బ్రెడ్‌ముక్కల్ని ఓ గిన్నెలో వేసుకోవాలి. వీటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలను కూడా వేసుకుని బాగా కలిపి తరువాత అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుంటూ మురుకుల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని నూనె రాసిన మురుకుల గొట్టంలో వేసుకుని కాగుతున్న నూనెలో మురుకుల్లా ఒత్తుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..