కుండీలో చెట్టుకు వందల్లో కాయలు

నారింజ అనగానే నోరూరించే తీపి కలిసిన పులుపు... చూసేకొద్దీ చూడాలనిపించే పళ్ల రంగు... పొడవాటి ముళ్లున్న అంత ఎత్తైన చెట్లు గుర్తొస్తాయి.

Updated : 18 Mar 2024 15:42 IST

నారింజ అనగానే నోరూరించే తీపి కలిసిన పులుపు... చూసేకొద్దీ చూడాలనిపించే పళ్ల రంగు... పొడవాటి ముళ్లున్న అంత ఎత్తైన చెట్లు గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మన దగ్గర వస్తున్న సరికొత్త కమలా ఉరఫ్‌ నారింజ అందుకు భిన్నం. మధురమైన రుచితో కుండీలోనే గుత్తులుగుత్తులుగా విరగ్గాస్తుంది. ఒక్క మొక్కను పెంచుకుంటే వేలపళ్లను అందిస్తున్న ఈ రకం విశేషాలు ఏంటంటే...

ఇంటి వెనక దొడ్లోనో, ప్రహరీ గోడపక్కనో వేసిన నారింజ చెట్టు... గుబురుగా పైకి పెరుగుతుంది. దాని కొమ్మల్లో అక్కడొకటీ ఇక్కడొకటీ చొప్పున కాసే కాయలు కోయడం ప్రహసనమే. ఒక్కోసారి కింద పడి పగిలిపోతాయి. లేదంటే చెట్టు ముళ్లు గుచ్చుకుంటాయి. చైనీస్‌ ఆపిల్‌ అని పిలిచే మాండరిన్‌ నారింజతో ఆ ఇబ్బందే లేదు. చేతికందే ఎత్తులోనే బోలెడన్ని కాయలు కాసేస్తుంది. బహుశా అదేమన్నా బొన్సాయ్‌ చెట్టేమో అనే సందేహం రావచ్చు. నాటిన మూడు నుంచి ఐదేళ్లకే పూతపూసి కాయలు కాస్తుంది మాండరిన్‌ రకం. పెద్ద సైజు నిమ్మకాయ కంటే ఇంకాస్త లావు ఉండి.. ఏ మాత్రం పులుపు ఛాయలు లేకుండా తియ్యగా ఉంటాయి ఈ పళ్లు. ఆకులెన్నో... పండ్లూ అన్ని అన్నట్టు కనిపించే ఈ మాండరిన్‌ నారింజ ఆరొందల నుంచి రెండు వేల దాకా కాయలు కాస్తుంది.

ఈ పళ్లు తినడానికి ఎంత అద్భుతంగా ఉంటాయో... చూడ్డానికి చెట్టు కూడా అంతకంటే బాగుంటుంది. చైనా, వియత్నాం, ఆగ్నేయాసియా దేశాల్లో మాండరిన్‌ ఆరెంజ్‌ అలంకరణలో భాగం. జపనీయులకు క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే బహుమతి. చూడ్డానికి ముచ్చటగా ఉండే ఈ మాండరిన్‌ నారింజ విరగ్గాయడం వల్ల చెట్టు వేలాడిపోతుంది. లేదంటే కొమ్మలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎదిగే క్రమంలో కుండీలో వెదురుగడలు పాతి వాటి ఆధారంగా  కొమ్మలు గుండ్రంగా అల్లుకునేలా చేస్తారు. అందుకే ఈ చెట్టు ఆకర్షణీయంగా కనిపిస్తూ అలంకరణలో భాగమైంది.

రంగుకీ రుచికీ మాండరిన్‌ ఆరెంజ్‌ పెట్టింది పేరు. అందుకే దీన్ని పళ్ల రసాలూ, స్క్వాష్‌లూ, పౌడర్లూ, సలాడ్లూ, ఔషధాల తయారీలో విరివిగా వాడతారు. విదేశాల్లో ఎంతో డిమాండ్‌ ఉన్న ఈరకం ఇప్పుడు మనదేశంలోనూ మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో సాగవుతోంది. గతేడాది నుంచి అలంకరణకూ సాగుకూ కడియం నర్సరీలోనూ లభ్యమవుతోంది మాండరిన్‌ నారింజ. నల్ల, ఎర్రరేగడి నేలలు.. వేడి వాతావరణం ఈ సాగుకు ఎంతో అనుకూలం. చీడపీడల బెడదా తక్కువే. ప్రత్యేకించి శద్ధ్ర కూడా పెట్టాల్సిన పనిలేదు. నాటిన మూడేళ్ల నుంచి ముప్ఫై ఏళ్ల వరకూ విరగ్గాస్తుందీ చెట్టు. అల్లుకుని... కాయలతో అందంగా కాసిన ఈ చెట్టు ఒక్కటుంటే చాలు... ఇటు ఆరోగ్యం అటు అలంకరణ. ఇంకెందుకాలస్యం ఓ కుండీ తెచ్చి కాయలు కాయించేద్దామా!

సహకారం: శ్రీనివాస్‌, న్యూస్‌టుడే, కడియం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..