అక్వేరియం కుండీ బాగుందా!

గాజు తొట్టెల్లో చేపల్ని పెంచుకుంటారు... కుండీల్లో మొక్కల్ని పెంచుకుంటారు... కానీ ఈ రెండింటినీ ఒకేదాంట్లోకి తెచ్చేస్తే ఎలా ఉంటుంది... ఆ రెండూ ఒకదానికొకటి ఉపయోగపడితే ఎంత బాగుంటుంది... అందుకే మరి అక్వేరియాలే ‘ఫిష్‌ట్యాంక్‌ అండ్‌ ప్లాంటర్స్‌’లా వచ్చేస్తున్నాయి!

Published : 17 Sep 2022 23:49 IST

అక్వేరియం కుండీ బాగుందా!

గాజు తొట్టెల్లో చేపల్ని పెంచుకుంటారు... కుండీల్లో మొక్కల్ని పెంచుకుంటారు... కానీ ఈ రెండింటినీ ఒకేదాంట్లోకి తెచ్చేస్తే ఎలా ఉంటుంది... ఆ రెండూ ఒకదానికొకటి ఉపయోగపడితే ఎంత బాగుంటుంది... అందుకే మరి అక్వేరియాలే ‘ఫిష్‌ట్యాంక్‌ అండ్‌ ప్లాంటర్స్‌’లా వచ్చేస్తున్నాయి!

దివరకు అక్వేరియం అంటే... కేవలం చేపలూ, నీళ్లూ నిండిన గాజు తొట్టెలే ఉండేవి. కానీ నెమ్మదిగా వాటిల్లో బోలెడన్ని రకాలొచ్చాయి. కొన్నేమో నీటిలోపల అలంకరణ రాళ్లూ, మినియేచర్‌ బొమ్మలతో ఆకట్టుకుంటే... మరికొన్నేమో చూడగానే కళ్లని కట్టిపడేసేలా బొమ్మల స్టాండులతో కలిపి వచ్చాయి. కానీ కొత్తగా ‘ఒకటి కొంటే మరోటి ఉచితం’ అన్నట్టు అక్వేరియమే ‘ఫిష్‌ట్యాంక్‌ అండ్‌ ప్లాంటర్‌’లా మారి, కుండీనీ వెంట తెచ్చుకుంది. ఒకే దాంట్లో ఇటు మొక్కలూ, అటు చేపలూ పెంచుకునేలా మారిపోయింది.

చాలామంది గృహిణులు ఇళ్లల్లో పచ్చని మొక్కల కుండీల్నీ, రంగుల చేపల అక్వేరియాల్నీ పెట్టుకుంటుంటారు. ‘మరైతే అలంకరణా, ఆహ్లాదమూ తెచ్చే ఆ రెండూ కలిసిపోతే ఆ అందం రెట్టింపు అవదూ. పైగా చోటూ కలిసి వస్తుందిగా’ అన్న ఆలోచన తట్టినట్టుంది తయారీదారులకు- ఇంకేముంది... వెంటనే ఈ టూ ఇన్‌ వన్‌ అక్వేరియాల్ని తీసుకొచ్చారు.

ఉపయోగమూ ఉంది...
మొక్కలు పెంచుకునే ఏర్పాట్లతో రావడమే ఈ అక్వేరియాల ప్రత్యేకత. వీటిల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి- చేపల గాజు తొట్టెలకే ఒక పక్కనో, మధ్యలోనో మట్టి కుండీలూ వస్తాయి. తీసీ పెట్టేలా ఉండే ఈ కుండీల్లో కావాల్సిన మొక్కల్ని పెంచుకోవచ్చు. రెండో రకం అక్వేరియం ప్లాంటర్‌ ‘ఆక్వాపోనిక్‌’ పద్ధతితో నడుస్తుంది. ఈ అక్వేరియాల్లో కింద గాజు తొట్టె ఉంటుంది. పైన మొక్కల్ని పెంచుకోవడానికి కుండీల్లాంటివి ఉంటాయి. అక్వేరియంలోని నీళ్లు మొక్కలకు చేరేలా ప్రత్యేక విధానం ఉంటుంది. దీంతో చేపలు విసర్జించిన వ్యర్థాల్లోని పోషకాలన్నీ మొక్కలకు చేరుతాయి. దీని వల్ల మొక్కలకు పోషణ అందడమే కాదు, అక్వేరియం నీళ్లల్లోని వ్యర్థాలన్నీ పోయి ఎప్పటికప్పుడు శుభ్రమవుతాయి కూడా. ఈ అక్వేరియం కుండీల్లో పూల, అలంకరణ మొక్కలతో పాటు రకరకాల నీటిలో పెరిగే మొక్కల్నీ చక్కగా పెంచేసుకోవచ్చు. వీటిల్లో ఇంటి హాల్లో ఓ మూలన పెట్టుకునేంత పెద్ద పరిమాణం నుంచి ఆఫీసు టేబుల్‌ మీద పెట్టుకునేంత చిన్న సైజు వరకూ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ అక్వేరియం ప్లాంటర్‌ని ఎవరికైనా బహుమతిగా ఇచ్చినా...
మన ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది మరి!


మీకు తెలుసా

‘గాంధీ’ ఆంగ్ల చిత్రంలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న నటుడు బెన్‌ కింగ్స్‌లీ అసలు పేరు కృష్ణ పండిట్‌ భంజీ. ఆయన తల్లి ఆంగ్ల వనిత, తండ్రి గుజరాతీ. ఇంగ్లండ్‌లోనే పుట్టి పెరిగిన భంజీ, నటుడుగా నిలదొక్కుకునే క్రమంలో- భారతీయతను ధ్వనించే తన పేరు కారణంగా అవకాశాలు రావేమోనన్న భయంతో పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత అతను వెనుతిరిగి చూడలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..