దోమలు బాబోయ్‌... దోమలు..!

పులి కాదు, సింహం కాదు, తిమింగలమో సొరచేపో అంతకన్నా కాదు... ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాణి అంటూ ఏదన్నా ఉంటే, అది- దోమే. దోమలవల్ల బాధపడ్డవాళ్లు కాదు, శాస్త్రవేత్తలే తేల్చి చెప్పిన మాట ఇది. మిగతా క్రూరజంతువులు ఏవైనా, వాటి జోలికి వెళ్లినప్పుడే ప్రమాదం. కానీ దోమలు అలా కాదు. మన ఇళ్లలోకి వచ్చి మరీ కుట్టిపోతాయి. ఎర్రటి ఆ దద్దురు ఏ మలేరియా, డెంగీలాంటి జబ్బులకు దారితీస్తుందోనని భయపడిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షలకు పైగా మరణాలకు దోమలే కారణమట. అది

Updated : 02 Aug 2022 20:30 IST

దోమలు బాబోయ్‌... దోమలు..!

పులి కాదు, సింహం కాదు, తిమింగలమో సొరచేపో అంతకన్నా కాదు... ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాణి అంటూ ఏదన్నా ఉంటే, అది- దోమే. దోమలవల్ల బాధపడ్డవాళ్లు కాదు, శాస్త్రవేత్తలే తేల్చి చెప్పిన మాట ఇది. మిగతా క్రూరజంతువులు ఏవైనా, వాటి జోలికి వెళ్లినప్పుడే ప్రమాదం. కానీ దోమలు అలా కాదు. మన ఇళ్లలోకి వచ్చి మరీ కుట్టిపోతాయి. ఎర్రటి ఆ దద్దురు ఏ మలేరియా, డెంగీలాంటి జబ్బులకు దారితీస్తుందోనని భయపడిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షలకు పైగా మరణాలకు దోమలే కారణమట. అది చాలదన్నట్లు పెరుగుతున్న భూతాపం దోమల సమస్యను ఇంకా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

సీరియస్‌గా ఏ పుస్తకమో చదువుకుంటుంటే బుగ్గమీద కసుక్కున సూది దిగినట్లు చుర్రుమంటుంది. ఫట్‌మని ఒక్కటిచ్చి దాన్ని అక్కడికక్కడే చంపేయాలనుకుంటాం. కానీ జరిగేది మాత్రం మన చెంప మనమే పగలగొట్టుకోవడం. మన మనసులో అనుకున్నది దానికి ఎలా తెలుస్తుందో రెప్పపాటులో చేతికి అందకుండా ఎగిరిపోతుంది. మరు నిమిషంలో వెక్కిరిస్తున్నట్లుగా మళ్లీ మన చెవి దగ్గర జుఁయ్‌మని మోత. పాడు దోమలంటూ వాటిని తిట్టుకోనిదే రోజు గడవదు. వర్షాకాలం వచ్చి పట్టుమని నాలుగు వానలు కురిశాయో లేదో ఎప్పటిలాగే ఇళ్లలో దోమలగోల మొదలయింది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసులూ పెరుగుతున్నాయి.

దోమల బ్యాట్లూ రిపెల్లెంట్లకు వందలూ వేలూ తగలెట్టక తప్పడం లేదు. నగరాల నుంచి పల్లెల వరకూ మనదేశంలో వాడుతున్న ఈ దోమల మందుల మార్కెట్‌ విలువ దాదాపు నాలుగు వేల కోట్లట. ఇది ఏ యేటికాయేడు పెరుగుతూనే ఉందట. ఎందుకూ పనికి రాని దోమల గురించి ఎందుకింత ఖర్చు..!

అసలీ దోమల్ని భూమ్మీద లేకుండా పూర్తిగా చంపేయలేమా..?

చంద్రుడిమీదికి వెళ్లొచ్చాం... అంతరిక్ష యాత్రలు చేస్తున్నాం... సూర్యుడి మీద కూడా పరిశోధన చేయగల సత్తా సాధించాం. సాంకేతికంగా ఇంత అభివృద్ధి సాధించిన మనం ఒక చిన్న దోమని మాత్రం వదిలించుకోలేకపోతున్నాం. ఎందుకనీ..? పురుగుమందులతో పంటల మీద తెగుళ్లకు కారణమవుతున్న కీటకాల్ని అంతం చేయగలిగినట్లే దోమల్ని కూడా అంతం చేయలేమా?- ఇలాంటి ప్రశ్నలు అంతర్జాలంలో కొన్ని వందలు కనిపిస్తాయి.

నిజంగా దోమల్ని తరిమేయొచ్చా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే ముందు అసలు దోమల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అవి మన రక్తాన్ని పీల్చేసి బతుకుతాయనీ ఆ క్రమంలో రోగాలను వ్యాప్తి చేస్తాయనీ మాత్రమే అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు. వాస్తవానికి దోమలన్నీ మనకు హానికరమైనవి కాదు. ప్రపంచంలో దాదాపు 3500 రకాల దోమలుంటే అందులో 400 రకాలు మనదేశంలో ఉన్నాయి. అయితే ఈ దోమలన్నీ మనని కుట్టేవీ రోగాల్ని తెచ్చేవీ కావు. ఒక 200 రకాలు మనుషుల్ని కుడితే అందులో ప్రధానంగా మూడు రకాలు- అనాఫిలిస్‌, క్యూలెక్స్‌, ఏడీస్‌ జాతులకు చెందిన దోమలే వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి.

నిశ్చలంగా దోసెడు నీళ్లుంటే చాలు, వాటిమీద ఆడదోమలు ఒకేసారి వంద నుంచి మూడు వందలవరకూ గుడ్లు పెడతాయి. 48 గంటల్లో వాటినుంచి లార్వా బయటకు వచ్చినా అవి మళ్లీ దోమలుగా మారి ఎగరడానికి రెండు వారాలు పడుతుంది. దోమ జీవితకాలం రెండు నెలలు. ఆ కాలంలోనే అవి కనీసం పదిసార్లు గుడ్లు పెడతాయి. అందుకే దోమలు అంత ఎక్కువగా ఉంటాయి. లార్వా దశలో రెండు వారాలూ సూక్ష్మక్రిముల్నీ నాచునీ తింటూ నీళ్లలోనే ఉంటాయి కాబట్టే దోమలు పెరగకుండా ఉండాలంటే నీటిని నిల్వ ఉండకుండా చూడాలనేది. అలా జాగ్రత్తలు తీసుకునే బదులు అసలు దోమలే లేకుండా చంపేయడం ఎందుకు సాధ్యం కాదూ అంటే- ముందు చెప్పుకున్నట్లు దోమలన్నీ చెడ్డవి కావన్నది ఒక విషయం. రెండోది- దోమలన్నీ మనుషుల్ని కుట్టవు. చాలావరకూ దోమలు శాకాహారులే. అవి పువ్వుల్లోని మకరందాన్ని తాగుతాయి. పండ్లూ ఆకుల్లోని రసాల్ని పీలుస్తాయి. వాటితోనే బతుకుతాయి. నిజానికి మనుషుల్ని కుట్టేది కేవలం ఆడదోమలే. వాటి శరీరంలోనే రక్తాన్ని పీల్చే ఏర్పాటు ఉంటుంది. వాటిల్లోనూ చాలావరకూ పశువుల్నీ పక్షుల్నీ కుట్టడానికే ఇష్టపడతాయి. కొన్ని మాత్రమే మనుషుల్ని కుడతాయి. కాబట్టి అవి మనని కుట్టకుండా చూసుకోవడమే తేలిక కానీ మొత్తంగా దోమల్ని నివారించడం సాధ్యమూ కాదు, తెలివైన పనీ కాదు.

ఎందుకనీ..?

ప్రకృతిసిద్ధంగానే భూవాతావరణం అంతా దోమలకు చాలా అనువైనది. భూతాపం పెరిగినకొద్దీ వాటికి మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది కాబట్టి అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా మనం వాడే రకరకాల క్రిమి సంహారకాలన్నిటినీ కూడా తట్టుకునే శక్తి దోమలకు జన్యుపరంగా ఉంటోందట. అందుకే వాటిని నిర్మూలించడం అనేది పూర్తిగా అసాధ్యం.

ఇక, తెలివైన పని ఎందుకు కాదూ అంటే- సహజసిద్ధమైన ఆహారపు గొలుసులో దోమలదీ కీలక పాత్రే. గబ్బిలాలూ కొన్ని చిన్న చిన్న పక్షులూ గోల్డ్‌ఫిష్‌, క్యాట్‌ఫిష్‌ లాంటి చేపలూ కప్పలూ తాబేళ్లూ తూనీగలూ... అన్నీ దోమల్ని తింటాయి. దోమలే లేకుండా చేస్తే వాటికి సమతులాహారం లోపిస్తుంది కాబట్టి క్రమంగా అవి తగ్గిపోతాయి. రెండోది- దోమలు పూలలోని మకరందాన్ని తాగే క్రమంలో పరాగసంపర్కానికీ కారణమవుతాయి. పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు చాలానే ఉన్నప్పటికీ కొన్ని కీటకాలు దోమలకోసమే పువ్వుల మీదికి వస్తుంటాయి కాబట్టి కొన్నిరకాల పూల జాతులు కేవలం దోమల వల్లే బతుకుతున్నాయట. కాబట్టి వాటివల్ల మనకి తెలియకుండానే కొంత మంచీ జరుగుతోంది.  

అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే కేవలం దోమల్ని మాత్రమే చంపగలిగే మార్గం అంటూ ఏదీ లేదు. ఒకవేళ కనిపెట్టినా వాటిని చంపే క్రమంలో మొత్తం పర్యావరణంపైనా, జీవ వైవిధ్యంపైనా ఎలాంటి ప్రభావం పడుతుందన్నది అంచనా వేయడం కష్టం. అందుకే, వ్యాధికారకాలైన దోమల్ని మాత్రమే చంపేందుకు రకరకాలుగా పరిశోధనలు చేస్తున్నారు.

ఎలాంటి పరిశోధనలు?

ఇప్పటివరకూ భూమి మీద దాదాపు సగం మంది చావుకి కారణం దోమలేనని తేల్చి చెబుతున్న పరిశోధకులు వాటిని వదిలించుకోవడమెలా అని చాలానే పరిశోధనలు చేశారు కానీ విజయం సాధించలేకపోయారు. దోమల లార్వాలను తిని బతుకుతాయని భావించిన గంబూషియా చేపల ప్రయోగమూ ఫలించలేదు. మలేరియాకి తయారుచేసిన వ్యాక్సిన్‌ 40శాతమే ప్రభావం చూపుతోంది. మగ కీటకాలకు రేడియేషన్‌ ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేయడంవల్ల గతంలో పశువులకు హానిచేస్తున్న కొన్ని కీటకాలను అమెరికాలో పూర్తిగా నిర్మూలించగలిగారు. అందుకని అదే పద్ధతిని దోమలమీదా ప్రయత్నించి చూశారు.
ఫ్లోరిడాలో అనాఫిలిస్‌ దోమల మీదా, కాలిఫోర్నియాలో క్యూలెక్స్‌ దోమలమీదా చేసిన ప్రయోగాలూ ఫలితాన్ని ఇవ్వలేదు. రేడియేషన్‌ వల్ల దోమలు బలహీనమై చనిపోతున్నాయే తప్ప ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఇలాంటి ప్రయోగంతోనే తాము రెండు చిన్న ద్వీపాల్లో దోమలు లేకుండా చేసినట్లు చైనా ప్రకటించింది. అయితే ఉన్న వందలాది రకాల దోమల్లో ఒక్కో రకం దోమని తీసుకుని, ఆడా మగా వేరు చేసి ఇలా ప్రయోగాలు చేయడం అంటే చాలా కష్టమూ ఖర్చూ కూడా. ఎల్‌సాల్వడార్‌లో చేసిన జెనెటిక్‌ సెక్సింగ్‌ స్ట్రెయిన్స్‌(గుడ్లమీద క్రిమిసంహారకాన్ని ఉపయోగించడం ద్వారా ఆడదోమలు మాత్రమే చనిపోయేలా చేయడం) ప్రయోగం సఫలమైంది కానీ వెంటనే మరో దేశం నుంచీ దోమలు వచ్చేశాయి. అందుకే ఏదైనా పద్ధతి పనిచేసినా దాన్ని ఒకచోట అమలుచేస్తే చాలదు, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అమలుచేయాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్లు అనాఫిలిస్‌ మీదే జీన్‌ ఎడిటింగ్‌ ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు ఫలించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే పరిస్థితి వచ్చేదాకా దోమలతో సహజీవనం తప్పదు కాబట్టి వాటి నుంచి మనని మనం కాపాడుకోవడం మీదే దృష్టి పెట్టాలిక.

దోమలవల్లే జబ్బులు వస్తాయా?

దోమలు వేర్వేరు రకాలుగా జబ్బుల వ్యాప్తికి వాహకాలవుతాయి. అంతేకానీ దోమలే జబ్బుకి కారణాలు కావు. ఉదాహరణకు- మలేరియా వ్యాధికి సంబంధించిన సూక్ష్మక్రిమి తాను బతకాలంటే ఒక ప్రాణి నుంచి మరో ప్రాణి మీదికి మారాలి. అందుకోసం దోమల్ని ఆకర్షిస్తుంది. అవి కుట్టినప్పుడు వాటి ఆహారనాళానికి అతుక్కుంటుంది. ఆ దోమ మరో ఆరోగ్యవంతుడైన మనిషిని కుట్టినప్పుడు ఈ సూక్ష్మక్రిమి రక్తం ద్వారా అతడి శరీరంలోకి చేరుతుంది. అదే డెంగీ, ఎల్లో ఫీవర్‌ లాంటివాటికైతే ఆ జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ రక్తంతో పాటు ఆ వైరస్‌నీ తీసుకుని వచ్చి మరొకరిని కుట్టినప్పుడు వారికి అంటిస్తుంది. డెంగీ వ్యాధి సోకినవారి నుంచి ఒకలాంటి పువ్వు వాసన వస్తుందట. అది ఆకలిగా ఉన్న దోమల్ని ఆకర్షిస్తుందట. అందుకే డెంగీ, జికా లాంటివి అంత వేగంగా వ్యాపిస్తుంటాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనదేశంలో ఏటా దోమల వల్ల వ్యాపించే రోగాల వల్ల ముప్ఫైవేల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతోందట. ఒక్క మలేరియానే కాదు... డెంగీ, జికా, జపనీస్‌ ఎన్‌సెఫలిటిస్‌, చికున్‌గున్యా, ఎల్లోఫీవర్‌- ఇలా ఇంకా చాలా జబ్బులకు వాహకాలవుతున్నాయి దోమలు.

కొందరినే ఎక్కువగా కుడతాయెందుకు?

నిజమే, దోమలు కొందరిని వెతుక్కుంటూ వెళ్తాయి. కొందరు పక్కనే ఉన్నా కుట్టవు. ఎందుకలా అని పరిశోధించిన శాస్త్రవేత్తలకు చాలా విషయాలే తెలిశాయి.

* కచ్చితమైన కారణం ఏమిటో తెలియదు కానీ 83 శాతం దోమలు ‘ఒ’ బ్లడ్‌ గ్రూపు ఉన్నవారిని కుడుతున్నాయట. అదే ‘ఎ’ గ్రూపు అయితే 46 శాతమేనట. ‘బి’ గ్రూపు ఈ రెండింటి మధ్యా ఉంది. తమకు నచ్చిన రక్తం గ్రూపు ఉన్నవారిని దోమలు యాభై మీటర్ల దూరం నుంచే గుర్తించగలవట. అందుకే నేరుగా వారి దగ్గరికే వెళ్లి కుడుతుంటాయి.

* దోమలకు కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంటే చాలా ఇష్టం. కొందరు శ్వాసలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ని ఎక్కువగా వదులుతారు. అలాంటి వారిచుట్టూ దోమలు చేరతాయి. లావుగా ఉన్నవారూ, గర్భిణులూ ఎక్కువగా దోమల బారిన పడటానికీ అదే కారణం.

* ఆటలన్నా వ్యాయామమన్నా ఇష్టపడేవారంటే దోమలకు మరీ ఇష్టం. చెమట, లాక్టిక్‌ ఆసిడ్‌, యూరిక్‌ ఆసిడ్‌, అమ్మోనియా వాసనలు వాటిని ఆకర్షిస్తాయి.

* జీవచర్యల కారణంగా కొందరి చర్మంలో సహజంగానే స్టెరాయిడ్స్‌, కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉంటాయి. అవి కూడా దోమల్ని ఆకర్షిస్తాయి.

* బీర్‌ తాగిన వారి చెమటలో ఇథనాల్‌ వాసన, కొంతమంది వాడే పూల పెర్‌ఫ్యూమ్‌ లాంటివి కూడా దోమల్ని ఆకట్టుకుంటాయి.

* నలుపు, ఇతర ముదురు రంగులూ దోమల్ని ఆకట్టుకుంటున్నాయనీ ఒక పరిశోధనలో తేలింది.

నచ్చిన మనిషిని ఎంచుకోవడమే కాదు, దోమ కుట్టే పద్ధతి కూడా ప్రత్యేకమే. చర్మం మీద వాలగానే రెండు గొట్టాల్ని లోపలికి గుచ్చుతుంది. మన రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి ఒకదాని ద్వారా ఎంజైమ్‌ని పంపించి రెండో గొట్టంతో రక్తాన్ని పీలుస్తుంది. నిజానికి ఆ రక్తంతో అది కడుపు నింపుకోదు. ఆకలి తీర్చుకోడానికి మళ్లీ మొక్కల్నే ఆశ్రయిస్తుంది. కాకపోతే అది గుడ్లు పెట్టాలంటే రక్తంలోని ప్రొటీన్‌ అవసరం. అందుకే కుడుతుంది. ఇక, అవి కుట్టినప్పుడల్లా వాటి ఎంజైమ్‌ మన రక్తంలోకి చేరడాన్ని గుర్తించిన మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందించడం వల్ల అక్కడ ఎర్రగా దద్దుర్లు వస్తాయి. దురద పెడుతుంది. ఆ చర్యల ద్వారా అక్కడేదో హాని జరుగుతోంది గుర్తించమని శరీరం మనకి చెబుతుంది. అప్పుడు కానీ మనకి దోమ కుడుతున్నట్లు తెలియదు.

మరి ఆ నొప్పి తగ్గేదెలా?

దోమ కుట్టిన చోట గట్టిగా గోకకూడదు. ఐసు ముక్కతో మెల్లగా రుద్దడం కానీ చల్లటి నీటితో కడగడం కానీ చేస్తే కాస్త ఉపశమనం ఉంటుంది. దురద, నొప్పి లేకుండా ఉండటానికి షాపుల్లో దొరికే ఆయింట్‌మెంట్‌ ఏదన్నా రాసుకోవచ్చు. ఏమీ అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనె అయినా రాయొచ్చు. చిన్న పిల్లలకీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లకీ, వృద్ధులకీ, మధుమేహులకీ... దోమకాటు వల్ల ఎక్కువ హాని జరుగుతుంది కాబట్టి వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.

దోమకాటు వల్ల చాలా కొద్దిమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల్లాంటి తీవ్రమైన రియాక్షన్‌ కలగవచ్చు. అలాంటివాళ్లు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

నొప్పింపక, తానొవ్వక... అని పెద్దలు చెప్పినట్లు ప్రస్తుతానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దోమల్ని తప్పించుకు తిరగగలవాళ్లే ధన్యులు. అది తప్ప వాటిని ఎదుర్కొనే మరో మార్గం లేదు మరి..!


దోమల్లేని దేశం ఉంది..!

యూరప్‌లోని ఐస్‌లాండ్‌ ప్రజలకు అసలు దోమ అంటే ఎలా ఉంటుందో తెలియదు. ప్రపంచమంతటా ఉన్న దోమలు ఒక్క ఐస్‌లాండ్‌ జోలికి మాత్రం ఎందుకు పోవడం లేదన్నది శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. అంటార్కిటికాలాగా గడ్డ కట్టుకుపోయే చలేమీ ఉండదు అక్కడ. అలాగని అవి పెరగడానికి కావలసిన నీటి గుంటలు లేవా అంటే అవీ ఉన్నాయి. అయినా ఆ దేశానికి దగ్గర్లోనే ఉన్న నార్వే, డెన్మార్క్‌, స్కాట్‌లాండ్‌, గ్రీన్‌లాండ్‌ లాంటి దేశాలన్నిట్లోనూ ఉన్న దోమలు ఐస్‌లాండ్‌లో మాత్రం అడుగుపెట్టలేదు. ఎందుకనీ... అని అధ్యయనం చేసిన పరిశోధకులకు స్పష్టమైన కారణమేంటో ఇంకా తెలియలేదట. ఈ ద్వీప దేశంమీద సముద్ర వాతావరణ ప్రభావం ఎక్కువ కాబట్టి దోమలు అక్కడ బతకలేకపోతున్నాయేమోనని వారు భావిస్తున్నారు. మరి కొందరి అభిప్రాయం ప్రకారం- ఐస్‌లాండ్‌ మట్టిలోనూ నీటిలోనూ ఉన్న రసాయనాల సమ్మేళనం దోమలకు నచ్చడం లేదు.

అయితే గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం తమ దేశం మీద కూడా పడిందనీ, గత ఇరవై ఏళ్లలోనే సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకూ పెరిగిందనీ, గతంలో లేని 200 రకాల కొత్త కీటకాలు ఇప్పుడు దేశంలో కన్పిస్తున్నాయి కాబట్టి ఎప్పుడో దోమలూ ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోలేదనీ అంటున్నారు అక్కడి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.


ఎంత మంచి దోమ..!

‘ఎలిఫెంట్‌ మస్కిటో’ గురించి విన్నారా ఎపుడైనా? ఎక్కువగా అడవుల్లో కన్పించే ఈ దోమ దాదాపు రెండు సెంటీమీటర్ల పొడవుంటుంది. అయినా ఇది ఎంత మంచి దోమ అంటే- మనుషుల్ని కుట్టదు, అస్సలు రక్తం ముట్టదు. పైగా లార్వా దశలో ఉన్నప్పుడు ఇతర దోమల లార్వాల్ని తినేసి బతుకుతుంది. అంటే మనకు హానిచేసే చాలా దోమల్ని అది పుట్టకుండానే తినేస్తుందన్నమాట. ఇలాంటి దోమల్ని పెంచడం కూడా- కుట్టే దోమల నుంచి మనని రక్షించుకోవడానికి తోడ్పడుతుందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా డెంగీ వ్యాప్తిని అరికట్టడానికి ఈ ఎలిఫెంట్‌ మస్కిటోల్ని అడవిలో కాకుండా జనావాసాల మధ్య పెంచేందుకూ కొన్నిచోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి.


రానివ్వద్దు..!

దోమలు కుట్టిన వ్యక్తుల్లో ఇరవై శాతం వల్లే ఎనభై శాతం రోగాలు వ్యాపిస్తున్నాయట. ఆ ఇరవై శాతంలో మనం ఉండకూడదనుకుంటే- దోమలనుంచి  కాపాడుకోవడానికి రెండు రకాలుగా పనిచేయాలి. మొదటిది- ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే పరిస్థితులు లేకుండా చూసుకోవడం. ఇందుకోసం- మొక్కల్లోనూ, పెంపుడు జంతువుల కోసమో పక్షుల కోసమో పెట్టిన పాత్రల్లోనూ నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తాజా నీటిని పోయాలి. డ్రెయిన్స్‌ శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పైపులు ఒక్కో చుక్కా లీకై ఎక్కడో ఓ చోట చారెడు నీరు నిల్వ ఉన్నా చాలు దోమలకి. వీధుల్లో పారేసిన కొబ్బరి చిప్పలూ టైర్లూ పాత సామాన్ల చెత్తలోనూ వానాకాలంలో నీరు చేరితే దోమలు గుడ్లు పెడతాయి.

రెండోది... వాటిని ఇంట్లోకి రానివ్వకుండా చూసుకోవడం. అంటే- తెల్లవారుజామునా, సాయంత్రం చీకటి పడే వేళా దోమలు చురుగ్గా ఉండే సమయం. ఆ సమయాల్లో తలుపులు వేసి ఉంచుకోవాలి. కిటికీలకు మెష్‌లు ఏర్పాటుచేసుకోవడం మంచిది. చాలామంది రకరకాల రసాయన పదార్థాలతో తయారైన మస్కిటో రిపెల్లెంట్లు వాడతారు. వాటివల్ల కొందరికి శ్వాస సమస్యలూ ఎలర్జీలూ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు దోమతెరలు వాడడమే మంచిది. శరీరాన్ని పూర్తిగా కప్పేలా నిండుగా లేత రంగు దుస్తుల్ని ధరించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..