ముళ్ల పండు... పోషకాలు మెండు!

నిన్నమొన్ననే పరిచయమైన ఆ కాక్టస్‌ పండులో అద్భుతమైన పోషకాలున్నాయంటూ అంతా ఎంతో ఇష్టంగా తినేస్తున్నారు... దాని పేరే డ్రాగన్‌ ఫ్రూట్‌. ఇప్పుడు ఈ కోవలోకి మరో దేశీ కాక్టస్‌ కూడా వచ్చి చేరింది. అదే బ్రహ్మ లేదా నాగజెముడు పండు.

Published : 23 Oct 2022 00:31 IST

ముళ్ల పండు... పోషకాలు మెండు!

నిన్నమొన్ననే పరిచయమైన ఆ కాక్టస్‌ పండులో అద్భుతమైన పోషకాలున్నాయంటూ అంతా ఎంతో ఇష్టంగా తినేస్తున్నారు... దాని పేరే డ్రాగన్‌ ఫ్రూట్‌. ఇప్పుడు ఈ కోవలోకి మరో దేశీ కాక్టస్‌ కూడా వచ్చి చేరింది. అదే బ్రహ్మ లేదా నాగజెముడు పండు. ఎక్కడంటే అక్కడ పెరిగే ఈ మొక్క పండ్లనే కాదు, కాండాల్నీ తినొచ్చు అంటున్నారు పోషక నిపుణులు. ముళ్ల మొక్కని తినడమేమిటా అనిపిస్తోంది కదూ. అందుకే దాని కథాకమామిషు...

రోడ్డుపక్కనో పొలం గట్లమీదనో నాగజెముడు మొక్క కనిపిస్తే... ఈ ముళ్ల మొక్క ఇక్కడెందుకూ అని రైతులు పీకి పారేస్తుంటారు. మరికొందరు ‘ఆఁ... పెరిగితే పెరిగిందిలే’ అనుకుంటారు. అలా మనం ఏమాత్రం పట్టించుకోని ఆ మొక్కని వందల సంవత్సరాల నుంచీ అమెరికన్లు- ముఖ్యంగా మెక్సికన్లు సాగుచేసి దాని కాండాన్నీ పండ్లనీ తింటున్నారు. ఇప్పుడిప్పుడు మనదేశంలోనూ నాగజెముడు సాగుని మొదలుపెట్టారు. ఇవి కరవునీ తట్టుకోగలవు, పైగా తక్కువ పెట్టుబడి... దాంతో నీటి సదుపాయం లేనిచోట్ల చాలామంది ఈ కాక్టస్‌ను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఈ మొక్క కాండాల్ని పశువులకు దాణాగానూ వాడుతున్నారు.

నిండా ముళ్లతో ఉన్న ఆ మొక్కల్ని ఎలా తింటారని అనిపించడం సహజమే. అందుకే ఇప్పుడు సంకరీకరణ ద్వారా ముళ్ల పరిమాణాన్ని బాగా తగ్గిస్తున్నారు. ఆ కొద్దిపాటి ముళ్లు కూడా చాకుతో గీరితే ఊడిపోతాయట. దీన్ని పండించడం చాలా సులభం. ముక్కలుగా చేసిన కాండాల్ని నేలలో పాతితే ఏడాదికల్లా పెరిగి రెండుమూడేళ్లకే కాస్తాయి. అయితే పండ్లమీద ఉన్న ముళ్లను తొలగించి తినడం పూర్వం నుంచీ మన దగ్గరా వాడుకలో ఉంది. అందుకే దీన్ని పేదవాడి ఫలం అని మనం పిలిస్తే; పుచ్చ, పియర్స్‌ కలిసిన రుచితో ఉండే ఈ పండుని అమెరికన్లు ట్యునా ఫ్రూట్‌, ప్రిక్‌లీ పియర్‌, నోపల్‌, ప్యాడల్‌ కాక్టస్‌ అని పిలుస్తారు.

ఎందుకీ పంట?

వెడల్పాటి కాండాలతో నిండా ముళ్లతో ఉంటుందీ మొక్క. ఎడారి ప్రాంతాల్లో పెరిగే కాక్టస్‌ మొక్కల ఆకులన్నీ కనీ కనిపించనంత చిన్నగానో లేదా ముళ్ల రూపాన్నో సంతరించుకుంటాయి. దాంతో కాండాలే ఆకుల్లా మారి ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. ఎడారిలో నీరు దొరకదు కాబట్టి, ఉన్న కాస్త నీటినీ ఆ కాండంలోనే నిల్వ చేసుకుంటాయన్నమాట. ఈ నాగజెముడు కూడా అలాంటి మొక్కే. అయితే దీని పండ్లే కాదు, కాండం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించారు పోషక నిపుణులు. దాంతో ఈ పండ్ల నుంచి నీటిని సేకరించి విక్రయిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో మాదిరిగానే వీటిల్లోనూ పొటాషియం, మెగ్నీషియం శాతం ఎక్కువ. దాంతో కండరాల సమన్వయానికీ గుండె పనితీరుకీ మంచిదన్న కారణంతో ఈ నీటికీ డిమాండ్‌ పెరిగిందట. ఈ పండ్ల గుజ్జుతో జ్యూసులూ జామ్‌లూ జెల్లీలూ కూడా చేస్తున్నారు. ఇక, ముళ్లు తొలగించిన కాండాల్ని కూరల్లోనూ సలాడ్లలోనూ వేసుకుంటున్నారు. అంతేకాదు, హైపో గ్లైసీమియా, మధుమేహం, కొలెస్ట్రాల్‌, ఊబకాయం... వంటి వ్యాధుల్ని నివారించే మందులూ; షాంపూలూ క్రీములూ బాడీ లోషన్లూ... వంటి కాస్మెటిక్స్‌ తయారీలోనూ ఈ కాక్టస్‌ వాడకం పెరిగిందట.

ఎంతో మంచిది

కాక్టస్‌ ఆకుల్లో 88 శాతం నీరూ, 10 శాతం పిండిపదార్థాలూ, కొద్ది మొత్తంలో ప్రొటీన్లూ కొవ్వులూ ఉంటాయి. వంద గ్రా. కాండాల నుంచి 41 క్యాలరీలతో పాటు రోజువారీ అవసరమైన సి-విటమిన్‌లో 17 శాతం,
24 శాతం మెగ్నీషియం లభిస్తాయి. ఈ కాక్టస్‌ ఆకుల్లోనూ పండ్లలోనూ యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. ఇవి వైరస్‌లను అడ్డుకోవడంతో బాటు నాడీకణాల పనితీరునీ ప్రభావితం చేస్తాయి. వీటిల్లోని ఫ్లేవనాయిడ్లు రొమ్ము, ప్రొస్టేట్‌, పొట్ట, క్లోమ, గర్భాశయ, అండాశయ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు తగ్గేందుకు సాయపడతాయి. రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రించేందుకూ ప్రొస్టేట్‌ గ్రంథుల వాపును తగ్గించేందుకూ తోడ్పడుతుందీ కాక్టస్‌ పండు. ఇంకా విటమిన్‌-ఎ, సి, ఇ, బి6, ఫోలేట్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం... వంటివన్నీ లభిస్తాయి. వీటిల్లోని పీచు ఆకలినీ చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. ఈ పండ్లలోని బెటానిన్‌ అనే పదార్థం జఠర రసాలు ఊరేలా చేస్తుందనీ, అందుకే దీన్ని తినడంవల్ల జీర్ణశక్తి మెరుగై మలబద్ధకం లేకుండా ఉంటుందనీ అంటున్నారు. 
ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా కాలేయాన్ని కాపాడతాయట. అలాగే పొటాషియం బీపీని తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది. అంతేకాదు, ఈ కాక్టస్‌ పాడ్స్‌లోని తేమ శిరోజాలకూ, చర్మ సౌందర్యానికీ ఎంతో మేలుచేస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. చూశారా మరి... ఆ ముళ్లపొదలో ఎన్ని సుగుణాలు దాగున్నాయో!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..