Published : 10 Sep 2022 23:56 IST

చిన్నారులు... నిజంగానే వండేయొచ్చు!

ఆఫీసునుంచి వచ్చి అలసటతో సోఫాలో కూలబడింది ఆరతి. అది చూసిన ఏడేళ్ల అద్విక... రెండు నిమిషాల్లో వేడివేడిగా మ్యాగీ చేసుకొచ్చి ‘తినమ్మా’ అంటూ అందించింది. అంతే... ఆరతి ఆనందం అంతాఇంతా కాదు, ‘మొన్న తాను కొనిచ్చిన కిచెన్‌ సెట్‌ ఇలా పనికొచ్చిందన్నమాట’ అనుకుంటూ కూతుర్ని ముద్దుల్లో ముంచెత్తింది!

చిన్నారులకు ఆటలంటే ఎంతిష్టమో... ఎంతసేపు ఆడినా అలసిపోరు... అందులోనూ ఉత్తుత్తి ఆటలకన్నా నిజం ఆటలయితే మరీ ఇష్టం. అందుకే ఎన్ని బొమ్మలిచ్చినా అమ్మ వెనకాలే వంటింట్లోకి వచ్చి ఆ సామాన్లన్నీ తీస్తారు. ‘నేనూ వంటచేస్తా... కూరగాయలు కోస్తా...’ అంటూ వెంటపడతారు. కోసుకుంటారనో కాలుతుందనో భయంతో ఆ పనులొద్దని వాళ్లకో బొమ్మ కిచెన్‌ సెట్‌ కొనిచ్చేస్తారు అమ్మలు. కానీ వాళ్లు వాటితో ఎక్కువసేపు ఆడరు. పెరిగేకొద్దీ ఈ ఉత్తుత్తి ఆటలు మరీ బోరు కొట్టేస్తుంటాయి. దాంతో అవి పక్కన పడేసి మళ్లీ యథాప్రకారం ఏ టీవీకో అతుక్కుపోతారు. లేదా ఫోన్‌లో దూరిపోతారు. అందుకే ఈమధ్య ఆరేడేళ్లు వచ్చిన పిల్లలకోసం నిజంగానే వండగలిగే కిచెన్‌ సెట్స్‌ వస్తున్నాయి.

ఏమేమి ఉంటాయి?

ఈ నిజం సెట్స్‌లో పాన్‌, రైస్‌ కుక్కర్‌, పెనం, ఎగ్‌బీటర్‌, కటింగ్‌బోర్డు, చాకు, ఆప్రన్‌... ఇలా నిజంగా వాడగలిగే అన్ని రకాల వంటింటి సామాన్లతోపాటు స్టవ్‌ కూడా ఉంటుంది. కరెంట్‌తో పనిచేసే ఈ స్టవ్‌ స్విచ్‌ను ఈజీగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు. పైగా దీన్ని కాలకుండా ఉండే నాణ్యమైన సిలికాన్‌ మెటీరియల్‌తో డిజైన్‌ చేస్తున్నారు. అలాగే పాత్రలు కూడా సెరామిక్‌ లేదా గ్రానైట్‌ కోట్‌తో చిన్నగా తేలికగానూ కాలకుండా ఉండే హ్యాండిల్స్‌తో పట్టుకునేందుకు వీలుగానూ ఉంటున్నాయి. దాంతో చిన్నారులు నూడుల్స్‌, ఆమ్లెట్‌, దోసె, పొంగనాలు, ఇడ్లీ, సూప్‌, శాండ్‌విచ్‌... వంటి తేలికపాటి వంటల్ని తమకు నచ్చినట్లుగా చేసుకోవచ్చన్నమాట. పేస్టల్‌ కలర్స్‌లో ఉండే ఈ కిచెన్‌ సెట్స్‌ చూడ్డానికీ ఆకర్షణీయంగా ఉంటాయి.

ఈ సెట్స్‌లో బేకింగ్‌ సెట్స్‌ ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. అందులో తమకు కావల్సిన కప్‌కేకుల్నీ వేఫల్స్‌నీ చేసుకునే పదార్థాలతోపాటు రెసిపీ బుక్స్‌ కూడా ఉంటున్నాయి. కాబట్టి పెద్దవాళ్లు పక్కనే ఉండి నేర్పిస్తే, పిల్లలు శ్రద్ధగా నేర్చుకుని, తమ చిట్టి చేతులతో బోలెడు రకాలు వండి వార్చేస్తారన్నమాట. వీటివల్ల వాళ్లకి పాకశాస్త్ర ప్రావీణ్యం ఒంటపట్టడం, ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు ఆ వంటపనినీ పూర్తిగా ఆస్వాదిస్తారు. పైగా ఆహారపదార్థాలపట్ల అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యకరంగా తినడమూ చిన్నప్పటినుంచీ అలవాటవుతుంది. ‘నాకది కావాలి... ఇది చేయి’ అని అమ్మల్ని విసిగించకుండా వాళ్ల పని వాళ్లే చేసుకోవడం అలవడుతుంది. నిజంగానే అందులో ఆసక్తి ఉన్నవాళ్లు కలినరీ ఆర్ట్స్‌లో ఎదిగేందుకూ ఈ రకమైన సెట్స్‌ తోడ్పడతాయి. అంతేనా... ఈ జూనియర్‌ షెఫ్‌లు చేసిన వంటల్ని రీల్స్‌ చేసి, ఇన్‌స్టాల్లో పెట్టేసి లైక్‌లమీద లైక్‌లు సంపాదించేయొచ్చు కొత్త తరం అమ్మలు. పెద్దయ్యాక వాటిని చూసుకున్నప్పుడు చిన్నారులకీ అవన్నీ తీయని జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. ఏమంటారు?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని