ఇంటికి పచ్చందం!

ఇల్లు అందంగా ఉండాలీ... వచ్చినవాళ్లు ముచ్చటగా చూస్తుండిపోవాలీ... హాయిగా ఉంది, ఇంకాసేపు కూర్చుందాం అనిపించాలీ అంటే- ఖరీదైన కళాఖండాలతోనో అత్యద్భుత పెయింటింగ్స్‌తోనో ఇంటిని అలంకరించనక్కర్లేదు.

Updated : 04 Jun 2023 03:44 IST

ఇల్లు అందంగా ఉండాలీ... వచ్చినవాళ్లు ముచ్చటగా చూస్తుండిపోవాలీ... హాయిగా ఉంది, ఇంకాసేపు కూర్చుందాం అనిపించాలీ అంటే- ఖరీదైన కళాఖండాలతోనో అత్యద్భుత పెయింటింగ్స్‌తోనో ఇంటిని అలంకరించనక్కర్లేదు. ఆహ్లాదాన్ని పంచే పచ్చని వాతావరణం కాస్త ఉన్నా చాలు అంటున్నారు నయా ఇంటీరియర్‌ డిజైనర్లు. అందుకోసం తమ శక్తిమేరా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తున్నారు. అలా వచ్చినవే ఈ ‘నాచు’పచ్చని చిత్రాలూ గోడలూ.

ఇంటివారి అభిరుచికి నిలువెత్తు నిదర్శనమే ఇంటీరియర్‌ డిజైన్‌ అంటారు. అది వాళ్ల జీవనశైలిని చెప్పకనే చెబుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఉన్నంతలో అందంగా అలంకరించుకోవాలీ అనుకుంటారు. అయితే ఈమధ్య ధరించే దుస్తులూ వేసుకునే నగల్లో రోజుకో రకం ఫ్యాషన్‌ పుట్టుకొస్తున్నట్లే ఇంటీరియర్‌ డిజైనింగ్‌లోనూ కొత్త ట్రెండ్స్‌ వస్తున్నాయి. ఈ పచ్చని చిత్రాలూ గోడలూ అలా వచ్చినవే. అలాగని ఈ గోడ మొక్కల్ని పెంచడానికి మట్టి అవసరం లేదు. నీళ్లు అంతకన్నా అక్కర్లేదు. రెండు నుంచి ఎనిమిదేళ్ల వరకూ చెక్కుచెదరకుండా వాడిపోకుండా  కనువిందు చేస్తుంటాయి. అందుకే ఆధునిక ఇంటీరియర్‌ డిజైనర్లు ఈ సరికొత్త గ్రీన్‌వాల్స్‌తో ఇంటికి నయా లుక్‌ని తీసుకొస్తున్నారు.

పచ్చని గోడలు!

పచ్చదనాన్ని ఇష్టపడేవాళ్లు సాధారణంగా బాల్కనీలోనూ పెరట్లోనూ లేదా ఇంటిలోపలా కుండీల్లో మొక్కల్ని పెంచుకుంటుంటారు. అందం, ఆహ్లాదంతోపాటు చల్లదనాన్నీ పంచిస్తాయవి. అయితే ఆసక్తి ఉన్నా అంత ఓపికా తీరికా లేకపోవడంతో చాలామంది పెంచుకోలేరు. దాంతో కొందరు సహజ మొక్కల్ని తలపించే ప్లాస్టిక్కువే తెచ్చి పెట్టుకుంటున్నారు. కానీ ఇరుకిరుకు ఫ్లాట్స్‌లో అవైనా ఎన్ని కుండీలని పెట్టుకోగలరు... ఏదో ఒకటో రెండో తప్ప. అందుకే గోడకే పచ్చని మొక్కలు ఉంటే ఎంత బాగుంటుందో అన్న ఆలోచన వచ్చినట్లుందో డిజైనర్‌కి. అదే క్రమేణా అంతటా పాకింది. పైగా ఆరుబయట ఎంత పచ్చదనం ఉన్నా అక్కడ ఎక్కువసేపు గడపలేం. టీవీ చూస్తూనో భోజనం చేస్తూనో హాల్లోనే ఎక్కువగా గడుపుతాం. అందుకే ఆ పచ్చని ప్రకృతిని నట్టింట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. టీవీ క్యాబినెట్‌ వెనకో, డైనింగ్‌కి ముందో, పడకగది గోడకో... ఇలా తమకి ఇంట్లో నచ్చేచోట ఈ పచ్చనినాచు గోడల్ని(గ్రీన్‌ మాస్‌ వాల్‌)ని అలంకరిస్తున్నారు. వీటినే బయోఫిలిక్‌ వాల్స్‌ అంటున్నారు. నిజానికి గ్రీన్‌ వాల్స్‌ మరీ కొత్తవేం కాదు, కార్పొరేట్‌ భవంతుల్లో గోడలకు ఫ్రేమ్స్‌ని అమర్చి, మొక్కల్ని పెంచడం చూస్తుంటాం. అలా పెంచడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు వాటికి బదులుగా వాడిపోని మాస్‌ గోడల్నీ లేదా చిత్రాల్నీ అలంకరిస్తున్నారన్నమాట.

‘నాచు’ కళ!

ఇందుకోసం ముందుగా గోడమీద ఏ మేరకు కావాలో అంతవరకూ బెండుతో ఓ బోర్డుని తయారుచేస్తారు. దానిమీద పీట్‌ మాస్‌(ఒకరకమైన నాచు)ని ఓ పొరలా అతికించుకుంటూ వస్తారు. ఆపై రకరకాల నాచు మొక్కల్నీ కాండాల్నీ బెరడునీ అతికించుకుంటూ మొత్తంగా కుంచె చిత్రాన్ని తలపించేలా డిజైన్‌ చేస్తారన్నమాట. మరి ఆ నాచు చనిపోకుండా ఉండాలంటే కొంచెం నీళ్లూ కాస్త ఎండా కావాలి కదా అనిపించడం సహజం. కానీ ఈ గోడలమీద ఉన్నవన్నీ నిజమైన నాచు మొక్కలేగానీ వాటికి జీవం ఉండదన్నమాట. అంటే పెరిగిన నాచుని తీసుకొచ్చి దాన్ని గ్లిజరిన్‌తో చర్య జరిపినప్పుడు- అది ఆ మొక్కల్లోని నీటిని పీల్చుకుని అవి ఎండిపోకుండా తాజాగా ఉంచుతుంది. అందుకే అవి మట్టి లేకున్నా నీళ్లు లేకున్నా పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ఈ మొక్కల వల్ల పురుగులూ కీటకాలూ కూడా రావు. సో, జీరో మెయింటెనెన్స్‌ అన్నమాట.

అసలేమిటీ నాచు?

భూమ్మీద పుట్టిన అత్యంత పురాతన జీవులు. బ్రయోఫైటా కుటుంబానికి చెందుతాయివి. దట్టమైన అరణ్యాల్లోని చెట్లమీదా రాళ్లమీదా నాచు(మాస్‌) మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వీటిల్లో 12 వేలకు పైగా జాతులున్నాయి. తడి నేలమీద పెరిగే పీట్‌మాస్‌, చెట్ల కొమ్మలమీద పెరిగే  షీట్‌, రాళ్లమీద పెరిగే మూడ్‌, లేత పసుపు రంగులో ఉన్న ఫైర్‌, ప్లూమ్‌; ఆకుల్లా పెరిగే స్పూన్‌, ఫెర్న్‌... వంటి ఇలా ఎన్నో రకాల నాచులు ఉన్నాయి. డాసోనియా అనే నాచు అయితే పెద్ద మొక్కలానే 20 అంగుళాల పొడవు పెరుగుతుంది. వీటిల్లో కొన్ని రకాలు చీకటిలోనే పెరుగుతూ రత్నాల్లా మెరుస్తాయి. లేతపచ్చ- గోధుమ కలగలిసిన రంగులో ఉండే కుషన్‌ మాస్‌ చూడ్డానికి మెత్తని దిండునే తలపిస్తుంది. తడి లేకున్నా పెరిగే ఈ రకం నాచు, కరవునీ తట్టుకుంటుందట. అయితే గ్రీన్‌వాల్స్‌కోసం నీటిని బాగా పీల్చుకునే పీట్‌మాస్‌నే ఎక్కువగా వాడతారు. నిజానికి దీన్ని మొక్కల పెంపకంలోనూ వాడుతుంటారు. ఇవి వాటి బరువుకన్నా 20 రెట్లు ఎక్కువ నీరు లేదా ద్రావణాన్ని గ్రహిస్తాయి. నాచుమొక్కలన్నీ కూడా మంచి ఇన్సులేటర్లే. ఇవి ఆయా ప్రాంతాల్లో వాతావరణాన్నిబట్టి అక్కడ పెరిగే చెట్లకు అవసరం మేరకు  వేడినీ తేమనీ అందిస్తుంటాయి. పువ్వులు పూయని ఈ మొక్కలు స్పోర్స్‌ ద్వారా ప్రత్యుత్పత్తి చేసుకుంటాయి. వీటికి ఆకులూ కాండాలూ ఉంటాయికానీ వేరు వ్యవస్థ ఉండదు. అందుకే వీటిని అందమైన గోడ చిత్రాలుగానూ రూపొందించగలుగుతున్నారు. వీటి ధర చదరపు అడుగుకి ఇంత చొప్పున ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు ట్రీట్‌ చేయని సజీవ నాచు గోడల్నీ అమ్ముతున్నాయి. వీటికి కొంత పోషణ అవసరమే కానీ ఈ మొక్కలు గాల్లోని కలుషితాల్నీ పీల్చుకోవడంతో ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

అది జీవం ఉందా లేదా సహజమైనదా కాదా అన్నది కాకుండా ఇంట్లో పచ్చదనం ఉంటే చాలు అనుకునేవాళ్లు ప్లాస్టిక్‌ నాచు లేదా మొక్కలతో అల్లిన గోడల్నీ తెచ్చి పెట్టుకుంటున్నారు. వీటిల్లోనూ బోలెడు రకాలు... అచ్చంగా గడ్డితో కొన్ని ఉంటే, ఆ గ్రాస్‌కి చిన్నచిన్న మొక్కల్ని జతచేసి అమర్చినవి మరికొన్ని. ఈ రెండూ కాకుండా రకరకాల ఫెర్న్‌, కాక్టస్‌, క్రోటన్‌ మొక్కల్ని మేళవించి చేసిన గోడలూ వస్తున్నాయి. గడ్డితో చేసిన గోడలకి గోల్ఫ్‌ మైదానాలకోసం పాలియెస్టర్‌ ఫైబర్స్‌తో చేసిన ఆస్ట్రో టర్ఫ్‌నే వాడటంతో అది చూడ్డానికి సహజ గడ్డిలానే కనిపిస్తుంది. ఎక్కువకాలం మన్నుతుంది. కాబట్టి నాచు గోడే అక్కర్లేదు, గ్రీన్‌వాల్‌ కావాలనుకున్నవాళ్లు ఇలా కృత్రిమ మొక్కలతో చేసిన గోడని డిజైన్‌ చేయించుకోవచ్చన్నమాట. కొందరైతే ఏ స్పాలోనో స్నానం చేస్తున్న ఫీల్‌ కలగడంకోసం అన్నట్లు మాస్‌ టైల్స్‌ను బాత్‌రూమ్‌ గోడలకీ అలంకరిస్తున్నారు. ఎందుకంటే- పచ్చని నాచు గోడలు కేవలం అందంకోసమే కాదు. ఏదో ఒక రకంగా ఇంట్లో పచ్చదనం పరచుకోవడంవల్ల ఇంట్లోని సభ్యులు ఆరోగ్యంగానూ ఆనందంగానూ ఉంటున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. కుటుంబ సమస్యలూ తక్కువగా ఉంటున్నాయట. నాచుగోడలవల్ల గాల్లో నాణ్యత పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థా పేర్కొంటోంది. టెక్సాస్‌ ఏ అండ్‌ ఎమ్‌ కాలేజ్‌ నిపుణులయితే- ఆఫీసుల్లో పచ్చని వాతావరణం ఉంచినప్పుడు ఉద్యోగుల పనితీరు మెరుగైనట్లు తమ పరిశీలనలో తేలిందని చెబుతున్నారు. అంతేనా... కాసేపు అలా పచ్చదనాన్ని దీక్షగా చూస్తే కంటిసమస్యలూ ఉండవని యోగశాస్త్రం చెబుతుంది. కాబట్టి కాంక్రీటు జంగిల్స్‌లో పచ్చదనంకోసం ఎక్కడికో పరుగులు తీయకుండా ఇంట్లోని గోడల్నే పచ్చగా కళకళలాడేలా అలంకరిస్తున్నారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు