ఒక మాట... ఒక ట్వీట్... వేల కోట్లు హాంఫట్!
ఒక మాటే కదా... చిన్న ట్వీటే కదా... అని చిన్నచూపు చూడొద్దండోయ్. అవతలివాళ్ల పేరూ, పాపులారిటీతో ఒక్కోసారి వేల కోట్లు కరిగిపోవచ్చు. నమ్మకం లేదా... మొన్నీమధ్య ఏం జరిగింది... ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఓ ప్రెస్మీట్లో టేబుల్‌పైన ఉన్న రెండు కోకాకోలా కూల్‌డ్రింక్ బాటిళ్లను పక్కన పెట్టి ‘మంచి నీళ్లు తాగండి’ అన్నాడు. ఆ ఒక్కమాటతో కోకాకోలా కంపెనీ షేరు పడిపోయి మార్కెట్ విలువ రూ.29వేల కోట్ల మేర ఆవిరైపోయింది. అతగాడు ప్రపంచంలోనే అత్యధికంగా 30 కోట్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్న సెలబ్రిటీ మరి. గతంలోనూ కొందరు తారలు ఇలాగే స్టాక్‌మార్కెట్‌ని షేక్ చేశారు. ఆ సంగతులేంటో కాస్త చూద్దామా...
కుబేరుని ట్వీట్‌తో కుదేల్!
ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్ 2020 మే నెల ఒకటో తేదీన ‘టెస్లా స్టాక్ ప్రైస్ ఈజ్ టూ హై’ అని ట్వీట్ చేశాడు. ‘టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువుంది’ అన్న ఈ ఒక్క ట్వీట్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. టెస్లాకి 14 బిలియన్ డాలర్ల (దాదాపు లక్ష కోట్ల రూపాయలు) నష్టం వచ్చింది. గమ్మత్తయిన విషయం ఏంటంటే, ఈ కంపెనీలో ఉన్న షేర్ల వల్ల ఎలన్ కూడా రూ.22 వేల కోట్లు నష్టపోయాడు.
ట్రంప్ ట్వీటా మజాకా!
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి కాస్త ముందు 2016 డిసెంబర్ 6న ఓ ట్వీట్ చేశాడు. బోయింగ్ కంపెనీ ‘ఎయిర్ ఫోర్స్ వన్ కమిషన్’ అనే విమానం తయారీని ప్రతిపాదించినప్పుడు ‘బోయింగ్ చాలా డబ్బులు సంపాదించాలని మేమూ కోరుకుంటున్నాం... కానీ మరీ ఇంత కాదు’ అని ట్వీట్ చేయడంతో ఒక్కో బోయింగ్ షేర్ విలువ 2 డాలర్లు పడిపోయిందట. దీనివల్ల కంపెనీ బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7,000 కోట్లు) నష్టపోయింది.
ఇన్‌స్టా పోస్టుతో భారీ నష్టం!
అమెరికా నటుడు జెర్మీ జోర్డాన్ 2017లో అమెరికాలోని ప్రముఖ రెస్టరెంట్ ‘చిపోట్లే’లో తిన్నాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చేరిన జోర్డాన్ ‘మీరు చూస్తున్నారుగా... నేను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నా. నాకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఇంతకు ముందే నేను తిన్న ఆహారం వల్ల దాదాపు చావు అంచుల దాకా వెళ్లా’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక అంతే, ఆ ఫుడ్ కంపెనీ స్టాక్ పడిపోయి రూ.56 వేల కోట్ల నష్టాన్ని మూటకట్టుకుంది.
మీరూ వాడట్లేదా...
‘ఈ మధ్య స్నాప్‌చాట్ ఎవరూ వాడట్లేదా? లేదంటే నేను మాత్రమే ఓపెన్ చేయడం లేదా? ఇది చాలా బాధాకరమైన విషయం’ అంటూ 2018 ఫిబ్రవరి 21న అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్, మోడల్ కైలీ జెన్నర్ ఒక ట్వీట్ చేసింది. దాదాపు నాలుగు కోట్ల ట్విటర్ ఫాలోవర్స్‌తో కైలీ ఈ విషయం పంచుకోగానే సోషల్ యాప్ స్నాప్చాట్పైన ఒక్కసారిగా ప్రభావం పడింది. స్నాప్‌చాట్ స్టాక్ మార్కెట్ విలువ పాతాళానికి పడిపోయింది. దీంతో స్నాప్‌చాట్‌కి 1.3 బిలియన్ డాలర్ల (దాదాపు 9,647 కోట్ల రూపాయలు) నష్టం వచ్చిందట.
అభిమానుల కోపంతో కోట్ల నష్టం!
అంతర్జాతీయ పాప్ సింగర్ రియన్నా 2018లో చేసిన ఒకే ఒక్క విమర్శ స్నాప్ చాట్ షేర్స్‌ను కిందకు పడేసింది. స్నాప్‌చాట్‌లోని ఓ వాణిజ్య ప్రకటనలో ‘ఉడ్ యూ రాదర్’ అనే గేమ్ ఉంది. దాంట్లో ‘రియన్నాను చెంపదెబ్బ కొడతారా?’ అనే ప్రశ్న ఉందట. అది నచ్చని రియన్నా స్నాప్‌చాట్‌ను విమర్శిస్తూ తన ఆరున్నర కోట్ల ఫాలోవర్స్ మధ్యన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె అభిమానులు కోపంతో పెద్ద సంఖ్యలో తమ స్మార్ట్ఫోన్ల నుంచి స్నాప్ చాట్‌ను తొలగించారట. ఇంకేముంది, స్నాప్‌చాట్ స్టాక్ మార్కెట్ విలువ డౌన్ అయ్యింది, సంస్థ రూ.7,000 కోట్లు నష్టపోయింది.
మీకు తెలుసా!
ప్రపంచంలో మొట్టమొదటి పూర్తిస్థాయి ఈ-కామర్స్ కొనుగోలు 1994 ఆగస్టు 11న జరిగింది. ‘నెట్మార్కెట్’ అనే వెబ్సైట్ ద్వారా డాన్కాన్ అనే యువకుడు ఫిలడెల్ఫియాలో ఉన్న స్నేహితుడికి మ్యూజిక్ సీడీ అమ్మాడు. ఆ స్నేహితుడు క్రెడిట్ కార్డుతో ఆన్లైన్లో 12 డాలర్లు చెల్లించాడు.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్