పుత్రికోత్సాహం!

‘అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారని ఎందుకంటారో మాకు తెలియదు. అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతార’ంటూ కూతుళ్ల గురించి ఎంతో గర్వంగా చెబుతున్న ఈ నాన్నల మనసులోని మాట మనమూ తెలుసుకుందామా!

Updated : 25 Sep 2022 12:26 IST

పుత్రికోత్సాహం!

‘అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారని ఎందుకంటారో మాకు తెలియదు. అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారంటూ కూతుళ్ల గురించి ఎంతో గర్వంగా చెబుతున్న ఈ నాన్నల మనసులోని మాట మనమూ తెలుసుకుందామా!

వాళ్లే వారసురాళ్లు

- అశ్వనీదత్‌

నా ముగ్గురు ఆడపిల్లల్నీ విదేశాల్లో చదివించా. చదువు పూర్తయ్యాక పెద్దమ్మాయి స్వప్నని అమెరికాలోనే ఉండమన్నా. తను నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీవైపు వచ్చింది. తరవాత ప్రియాంక కూడా తోడవడంతో ఇద్దరూ కలిసి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’, ‘జాతి రత్నాలు’, ‘సీతారామం’ చూశాక వాళ్ల ప్రతిభ అర్థమైంది. అప్పుడు అనిపించింది నాకంటే నా పిల్లలే ఎక్కువ సాధించారని. నేను సినిమాలు తీసి పేరూ, డబ్బూ సంపాదిస్తే- వాళ్లు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. నా కూతుళ్లు సాధించిన ఆ ఘనతకు తండ్రిగా ఎంతో గర్వపడతా. అందుకే సినీ రంగంలో స్వప్న, ప్రియాంకలే నా వారసురాళ్లు.


కొడుకులతో సమానం

- ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారానికి ఇషానే కరెక్ట్‌ అని నాకు ముందు నుంచీ అనిపించింది. ఒక్కతే ఆడపిల్లని గారం చేస్తే అది తనమీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనని స్ట్రిక్టుగా పెంచాం. ఒక్కరోజు కూడా స్కూలు మానకూడదనే నిబంధన పెట్టాం. అవసరానికి మించి పాకెట్‌ మనీ ఇచ్చేవాళ్లం కాదు. అయినా ఇషా ఎప్పుడూ ఎదురుచెప్పలేదు. ఏం చెప్పినా ఓపిగ్గా వినేది. అందులోని మంచిచెడు గమనించేది. ప్రతి విషయాన్నీ సూక్ష్మంగా విశ్లేషిస్తూ తను పనులు చక్కబెట్టే తీరు నాకు ఎంతో నచ్చుతుంది. అందుకే ఇషాకి రిలయన్స్‌ రిటైల్‌తోపాటు మా అబ్బాయిలతో సమానంగా వారసత్వ బాధ్యతల్నీ అప్పగించా.


అప్పుడే నమ్మా

- జమీల్‌ అహ్మద్‌

నిఖత్‌ జరీన్‌ బాక్సింగ్‌లోకి వచ్చినప్పుడు మీ అమ్మాయికి పెళ్లే కాదని కొందరు మొహాన్నే అన్నారు. కొందరైతే పొట్టి దుస్తులు వేసుకోవద్దనీ, బురఖా ధరించమనీ నిఖత్‌పై ఒత్తిడి తెచ్చేవారు. నలుగురు ఆడపిల్లల తండ్రినైన నేను మాత్రం ఏ సంప్రదాయాలూ, ఆచారాలూ, మూఢనమ్మకాలూ నా కూతుర్ని ఆపలేవని నమ్మి తనని పన్నెండేళ్ల వయసులో బాక్సింగ్‌ పోటీలకు పంపా. ఏ పరదా మాటునా తన ప్రతిభ కనుమరుగవ్వకూడదని కోరుకున్నంత స్వేచ్ఛనిచ్చా. తను కూడా ఏనాడూ హద్దులను దాటలేదు. శక్తికి మించి శ్రమించింది. నెగ్గిన చోట ఒదిగి ఉంది. ఓడినప్పుడు తప్పులను తెలుసుకుంటూ ఛాంపియన్‌గా దేశానికే గర్వకారణంగా నిలిచింది.


గర్వపడ్డా

- సంజయ్‌ శర్మ

నేను ఫైటర్‌ పైలట్‌ని అయ్యాక ‘నాన్నా, నాకూ నీలా విమానం నడపాలనుంది’ అనేది మా అమ్మాయి అనన్య. ఆడపిల్లకు ఆ రంగం కష్టమని తన దృష్టి మళ్లించడానికి బీటెక్‌ అయ్యే వరకూ ఎన్నో ప్రయత్నాలు చేశా. అయినా తన లక్ష్యం మారకపోవడంతో ప్రోత్సహించడం మొదలుపెట్టా. ఎలాగైనా నాలా అవ్వాలని కష్టపడి 2016లో భారత వైమానిక దళంలో తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌ బ్యాచ్‌కు ఎంపికైంది. శిక్షణ తీసుకుని ఈ మధ్య బీదర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో- ఓ మిషన్‌లో భాగంగా ఇద్దరం కలిసి ఫైటర్‌ జెట్‌ని నడిపాం. ‘యుద్ధవిమానాన్ని నడిపిన తండ్రీ కూతుళ్లు’ అని పొగుడుతూ భారత వాయుసేన ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రపంచానికి తెలియజెప్పడం ఎంతో గర్వంగా అనిపించింది.


నిరూపించుకుంది

- శివ్‌ నాడార్‌

జర్నలిజం కోర్సులూ, ఎంబీఏ చేశాక రోష్నీ హెచ్‌సీఎల్‌లోకి వచ్చింది. సాంకేతిక అంశాలతో ముడిపడిన హెచ్‌సీఎల్‌లో ఆ నేపథ్యమే లేకుండా ఆమెకి ఉద్యోగమెలా ఇస్తారని చాలామంది అడిగారు. ‘ఏ సంస్థను నడిపించాలన్నా ముందు ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉండాలి. వివిధ విభాగాలను నిర్వహించేవారి సామర్థ్యాన్ని అంచనా వేయగలగాలి. అప్పుడు ఏ కంపెనీనైనా నడపొచ్చు’ అని ధైర్యంగా సమాధానమిచ్చింది. ఛైర్‌పర్సన్‌గా ఆ మాటను చేతల్లోనూ నిరూపిస్తూ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో నిలిచింది. తండ్రిగా నేను సాధించిన గొప్ప విజయం అది. దాని ముందు అన్నీ దిగదుడుపే అనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..