ఇడ్లీల్లో ఎన్ని రుచులో..!

ఆరోగ్యానికి మంచిదనీ తేలికగా అవుతుందనీ అమ్మలంతా వారంలో మూడు నాలుగు రోజులు అల్పాహారంగా ఇడ్లీనే చేస్తుంటారు. తెల్లని ఆ ఇడ్లీల్ని చూసి పిల్లలు మాత్రం ముఖం మాడ్చుకుంటారు.

Published : 29 May 2022 00:38 IST

ఇడ్లీల్లో ఎన్ని రుచులో..!

ఆరోగ్యానికి మంచిదనీ తేలికగా అవుతుందనీ అమ్మలంతా వారంలో మూడు నాలుగు రోజులు అల్పాహారంగా ఇడ్లీనే చేస్తుంటారు. తెల్లని ఆ ఇడ్లీల్ని చూసి పిల్లలు మాత్రం ముఖం మాడ్చుకుంటారు. అందుకే వాళ్లు ఇష్టంగా తినాలంటే ఇడ్లీల్నీ ఇన్‌స్టంట్‌గా వెరైటీ రుచుల్లో వండి పెట్టేయండి మరి!

మొక్కజొన్న ఇడ్లీ

కావలసినవి: మొక్కజొన్నపిండి: పావుకిలో, పెరుగు: పావు లీటరు, నూనె: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: రెండు రెబ్బలు, సెనగపప్పు, మినప్పప్పు: టీస్పూను చొప్పున, ఆవాలు: అర టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, అల్లం తురుము: టీస్పూను, బేకింగ్‌సోడా: ముప్పావు టీస్పూను, ఉప్పు: టీస్పూను

తయారుచేసే విధానం: బాణలిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు మొక్కజొన్నపిండి వేసి కలుపుతూ రెండు నిమిషాలు వేయించి వెడల్పాటి గిన్నెలోకి తీయాలి. అందులో గిలకొట్టిన పెరుగు, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా చేసి పది నిమిషాలు పక్కన ఉంచాలి.

* చివరగా పిండి మిశ్రమంలో బేకింగ్‌సోడా వేసి కలిపి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో పిండిని వేసి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సుమారు పావుగంటసేపు ఉడికించి దించాలి. వీటిని కొత్తిమీర లేదా కొబ్బరి చట్నీతో తింటే సరి.


రవ్వ ఇడ్లీ బర్గర్‌

కావలసినవి: బొంబాయి రవ్వ: పావుకిలో, పెరుగు: పావులీటరు, ఉడికించిన బంగాళాదుంపలు: మూడు, ఉడికించిన బఠాణీ: పావు కప్పు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 3 టీస్పూన్లు, ఆవాలు, జీలకర్ర, దనియాలపొడి, కారం, అల్లంపేస్టు: అరటీస్పూను చొప్పున, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం: ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు వేసి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కలిపి పావుగంట పక్కన ఉంచాలి. తరువాత అర టీస్పూను బేకింగ్‌సోడా వేసి కలిపి, నెయ్యి రాసిన ప్లేటుల్లో పిండి వేసి పది నిమిషాలపాటు ఉడికించి పక్కన ఉంచాలి.
* బాణలిలో టీస్పూను నూనె వేసి పోపు దినుసులన్నీ వేసి వేగాక అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బఠాణీలు వేసి గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పసుపు, కారం, దనియాలపొడి వేసి కలిపాక మెదిపిన బంగాళాదుంపలు, కొత్తిమీర తురుము కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించి దించాలి.
* ఉడికించిన రెండు ఇడ్లీల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి గట్టిగా అదమాలి. ఇలాగే అన్నీ చేసుకుని విడిగా పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు చల్లినట్లుగా వేసి ఇడ్లీ శాండ్‌విచ్‌ లేదా బర్గర్లను పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. ఒకవైపు కాలిన తరవాత రెండో వైపు కూడా పెట్టి రెండు నిమిషాలపాటు మీడియం మంటమీద ఉడికించి తీయాలి.


సెనగపిండి ఇడ్లీ

కావలసినవి: సెనగపిండి, బొంబాయిరవ్వ: పావుకిలో చొప్పున, పెరుగు: పావులీటరు, పచ్చిబఠాణీ: అరకప్పు, క్యాప్సికమ్‌: ఒకటి, టొమాటో: ఒకటి, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: రెండు రెబ్బలు, పచ్చిమిర్చి: రెండు, అల్లం తురుము: టీస్పూను, మినప్పప్పు: టీస్పూను, ఆవాలు: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, బేకింగ్‌సోడా: టీస్పూను

తయారుచేసే విధానం: ఓ గిన్నెలో సెనగపిండి, బొంబాయిరవ్వ, పెరుగు వేసి బాగా కలిపాక కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా చేయాలి. సన్నగా తరిగిన మిర్చి, అల్లం తురుము వేసి కలపాలి.

* బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి పోపు చేసి పిండి మిశ్రమంలో కలపాలి. తరవాత సన్నగా తరిగిన టొమాటో, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉడికించి మెదిపిన బఠాణీలు, ఉప్పు, పావుకప్పు నీళ్లు వేసి కలిపి ఓ పది నిమిషాలు పక్కన ఉంచాక బేకింగ్‌ సోడా కూడా వేసి కలపాలి. ఈ పిండి మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసి కుక్కర్‌లో పెట్టి పది నిమిషాలు ఉడికిస్తే కమ్మని ఇడ్లీ రెడీ!


పెసరపప్పు ఇడ్లీ

కావలసినవి: పెసరపప్పు: పావుకిలో, పెరుగు: పావులీటరు, క్యారెట్‌ తురుము: కప్పు, కాలీఫ్లవర్‌ తురుము: కప్పు, ఉడికించిన పచ్చిబఠాణీ: 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఆవాలు: టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, అల్లంపేస్టు: టీస్పూను, బేకింగ్‌సోడా: టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం: పెసరపప్పుని ఓ గంటనాననిచ్చి నీళ్ళు వంపేయాలి. దీనికి పెరుగు చేర్చి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా రవ్వలా ఉండేలా రుబ్బాలి.

* బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిర్చి, అల్లం పేస్టు, క్యారెట్‌, క్యాప్సికమ్‌, కాలీఫ్లవర్‌ తురుములతోపాటు బఠాణీ వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు వీటిని పిండిమిశ్రమంలో వేసి, ఉప్పు వేసి కలపాలి. తరవాత బేకింగ్‌సోడా కూడా వేసి కలపాలి. నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో పిండి మిశ్రమాన్ని వేసి సుమారు పది నిమిషాలపాటు ఉడికించి దించాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..