Updated : 22 May 2022 06:20 IST

అందంగా సర్దుదామా!

చిన్నారులున్న ప్రతి ఇల్లూ ఓ చిన్నపాటి బొమ్మల మ్యూజియమే. చూసిందల్లా అడుగుతారు. నచ్చిందల్లా కొనమంటారు. వాటికి తోడు  బుజ్జాయిల కోసం ఆత్మీయులు తెచ్చే కానుకలూ బొమ్మలే అయి ఉంటాయి. వారి ఆటల సంగతి సరేసరి. మరి ఇవన్నీ ఎక్కడ సర్దాలీ ఎందులో భద్రపరచాలీ అన్నదే చాలా ఇళ్లల్లో సమస్య. అది మీకూ ఉందా! అయితే, ఇది చదివేయండి, పరిష్కారం దొరికేయొచ్చు.

పిల్లలున్న ఇంట్లో బొమ్మలకు కొదవే ఉండదు. ఏ మూల చూసినా అవే కనిపిస్తాయి. ఎన్నున్నా... మళ్లీ మళ్లీ కొత్తవి వచ్చి చేరుతుంటాయి. అమ్మాయికో రకం, అబ్బాయికి ఇంకోరకం... కాలాన్ని బట్టీ పెరుగుతోన్న వయసుని బట్టీ ఇంకెన్నో వారికి నచ్చేస్తుంటాయి. ఒకరోజు ఆలస్యమైనా అవన్నీ వారి ఆట బొమ్మల ఖజానాలో చేరాల్సిందే. వాటిని చూసి ఇంటిల్లిపాదీ మురవాల్సిందే. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే...! బుజ్జాయిలు వాటిని తీసి ఆడిన ప్రతిసారీ ఇల్లంతా చక్కబెట్టడం,  లెక్కకు మించి పోగవుతోన్న ఆ బొమ్మలను భద్రపరచడం పెద్దలకు ఓ పెద్ద సవాల్‌. అందులోనూ చిన్న ఇళ్లూ, ఇరుకు గదులూ ఉంటే మరింత ఇబ్బంది. కానీ ఆలోచిస్తే ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం దొరుకుతుందంటారు ఇంటీరియర్‌ డిజైనర్లు. బొమ్మల ఇబ్బందిని ఆర్గనైజర్లు తీరుస్తాయని చెబుతున్నారు. ఆర్గనైజర్లంటే ఏదో పెద్దగా ఊహించుకునేరు... ప్లాస్టిక్‌ బుట్టలూ, డబ్బాలూ,  ఇతరత్రా వాడని పెట్టెలూ..ఇలా, భద్రపరుచుకోవడానికి అనువుగా ఉన్న అవకాశాలన్నింటినీ అందంగా ఉపయోగించుకోవడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ తీరుని ఇప్పుడు మన దగ్గరా అలవరుచుకుంటున్నారు. ఇల్లు ఎంత చిన్నదైనా ఉన్న కొద్దిపాటి ప్రదేశాన్నీ పద్ధతిగా వినియోగించుకుంటున్నారు.

కోరుకున్నది తీసుకునేలా...

బొమ్మలంటే అన్ని పరిమాణాల్లోనూ ఉంటాయి. అయితే వాటిల్లో కాస్త చిన్న రకాలే ఎక్కువ ఉంటాయి. వీటిని ఒకే చోట కుప్పగా పాడేయకుండా చిన్నారుల మంచం కింద పొందికగా దాచి పెడుతున్నారు. అలానే అల్మారాల్లో ఒకే రకమైన ప్లాస్టిక్‌ డబ్బాలూ, బుట్టలూ పెట్టి, వాటిలో ఆట సామాన్లు సర్దేయడం మరో పద్ధతి. ఇవన్నీ అలంకరణలో భాగం అనిపిస్తాయి. ఇంటినీ చిందరవందరగా కనిపించనీయవు. అలానే,  గోడమూలల్లో నెట్‌ లాంటి వస్త్రాన్ని ఉయ్యాల్లా కట్టి అందులో సాఫ్ట్‌టాయ్స్‌ని పెట్టేస్తున్నారు. ఇవే కాదు... పిల్లల బొమ్మల్ని భద్రపరిచేందుకు ప్రత్యేకంగా స్టోరేజ్‌ ర్యాక్స్‌ కూడా దొరుకుతున్నాయి. ఇలా భద్రపరచడం వల్ల పిల్లలు కూడా ఆడుకోవడానికి అన్ని బొమ్మలూ కింద పడేయకుండా ఏది కావాలో దాన్నే తీసుకోగలుగుతారు. పైగా ఆటయ్యాక తీసి అందులో పెట్టేసుకోవడం సులువు కూడా. అందుకే అమ్మలంతా ఆర్గనైజర్లను వినియోగించడం మొదలుపెట్టారు. తయారీదారులు కూడా...వీరి ఇబ్బందిని పసిగట్టి ఎన్నెన్నో కొత్త రకాలనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ఓ క్రమపద్ధతిలో బొమ్మల్ని సర్దేయడం వల్ల ఇంటికి అందం, అమ్మకి సుఖం. అందుకే ఈ ఆలోచన అందరికీ నచ్చుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని