Updated : 10 Oct 2021 01:22 IST

ఈ పాత్రలన్నీ.. ‘సింగిల్‌ పీస్‌’లే..!

మల్లెపువ్వు, మంచి గంధం, పండు వెన్నెల, పుట్టతేనె, తెలిమంచు, తొలిపొద్దు... ఈ పదాలని వింటే కలిగే అనుభూతే తెలుగువాళ్లకి ‘శేఖర్‌ కమ్ముల సినిమా’ అన్నా కలుగుతుంది! సున్నితత్వానికీ, స్వచ్ఛతకీ అంత దగ్గరగా ఉంటాయి ఆయన కథాకథనాలు. శేఖర్‌ తీర్చిదిద్దిన పాత్రల్లో మిగతావాళ్లందరూ ఒక ఎత్తయితే...  నాయికలు మాత్రమే ఒకెత్తు! తెలుగు సినిమా చరిత్రలో ధీమాగా పీఠం వేసుక్కూర్చోగల పేర్లు వాళ్లవి. ఒక్కో పాత్ర వెనకా ఉన్న తన ఆలోచనల్నీ ఇలా పంచుకుంటున్నారు శేఖర్‌ కమ్ముల...


ఉష - డాలర్‌ డ్రీమ్స్‌

‘లిజన్‌! ఐ ఆల్వేస్‌ స్ట్రగుల్‌. ఇంటి నుంచి స్కూల్‌దాకా నాకు పోరాటమే. ప్రతి మగవాడూ మమ్మల్నో ‘పబ్లిక్‌ ప్రాపర్టీ’లా చూడటమే! వీళ్లని నేను తిట్టుకోని రోజే ఉండదు. ఇక్కణ్ణుంచి పారిపోవాలనిపించని క్షణమే లేదు. ఇన్ని ఉన్నా సరే... నేను ఈ దేశం విడిచి పారిపోలేదే! - అంటుంది నా తొలి సినిమా ‘డాలర్‌ డ్రీమ్స్‌’లోని ఉష. అమెరికా వెళ్లాలని మన యువత అంగలార్చడం అనవసరమన్న నా సొంత అనుభవం ఆధారంగా తీసిన సినిమా అది. ఇందులోని రవి, బాలు, సింగ్‌, శ్రీను అన్న నలుగురబ్బాయిలకి ఉష బెస్ట్‌ ఫ్రెండ్‌. నలుగురిలో సింగ్‌ తప్ప మిగతావాళ్లందరూ ‘ఈ దేశంలో ఏముంది... అవినీతీ చెత్తాచెదారం తప్ప. వీటిని భరించలేకే అక్కడికి పోతున్నాం’ అన్న భావనలో ఉంటారు. ఓ రచయితగా ఆ నలుగురి మాటలకి మరో పాత్ర ద్వారా ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో కౌంటర్‌ ఇవ్వాలనుకున్నాను. అలాంటి పవర్‌ఫుల్‌ కౌంటర్‌ ఇవ్వడానికి నేను ఉష పాత్రనే ఎంచుకున్నాను. ఓ స్త్రీ ద్వారానే ఎందుకూ అని అడుగుతారేమో... అది సిటీ బస్సుల్లో కావొచ్చూ, క్యాంపస్‌ల్లో కావొచ్చు అమ్మాయిలపైన జరిగే దాడులకి ఒకప్పుడు మౌన సాక్షిని నేను. సీబీఐటీలో చదివేటప్పుడు మా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ గ్రూపులో ఒక్కతే అమ్మాయి ఉండేది. ఎప్పుడైనా తను బోర్డు దగ్గరకెళ్లి ఏదైనా మాట్లాడాలంటే జంకుతూ ఉండేది. ఒకవేళ మాట్లాడినా తనేం చెబుతుందో వినకుండా అబ్బాయిలందరూ గోలచేసేవారు. మా అమ్మానాన్నలు ఏనాడూ ఆడ-మగ పిల్లల మధ్య తేడా చూపకపోవంతో ఇంటి బయట అమ్మాయిలపట్ల ఉన్న చిన్నచూపు నన్ను షాక్‌కి గురిచేసేది. అందుకే ‘అనునిత్యం అలాంటి వివక్షని ఎదుర్కొనే నాకే ఈ దేశం విడిచి వెళ్లాలనే ఆలోచన రానప్పుడు... ఇక్కడ మీకేం తక్కువ?’ అని అర్థం వచ్చేలా జర్నలిస్టు ఉష చేత మాట్లాడించాను. ఓ రకంగా నా కోపాన్ని తన ద్వారా వెళ్లగక్కి... రిలీఫ్‌గా ఫీలయ్యాను!


రూప - ఆనంద్‌

‘ఒకటి కాదు... రెండు కాదు ఎన్నో విషయాలు. నా ఆత్మాభిమానాన్ని ఇక చంపుకోలేను... ఇండిపెండెన్స్‌ మీద కాంప్రమైజ్‌ కాలేను. దెన్‌ ఐ విల్‌ బి జస్ట్‌... ఏ రోబో! అలా కేవలం మట్టిముద్దగా బతకలేను’ - ‘ఆనంద్‌’ సినిమాని మలుపు తిప్పే డైలాగ్‌ ఇది. ‘రూపలాంటి ఇండిపెండెంట్‌ పాత్రని ఎలా మలిచారు?’ అని అందరూ అడుగుతూ ఉంటే నాకు అప్పట్లో ఆశ్చర్యమేసేది. నా దృష్టిలో ‘ఆనంద్‌’ ఓ ఫక్తు కమర్షియల్‌ సినిమా స్క్రిప్టు మాత్రమే. నేను అమెరికాలోని హొవార్డ్‌ వర్సిటీలో సినిమాలపైన మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నప్పుడు కుటుంబసమేతంగా చూడగల ఓ వాణిజ్య సినిమాని ఎలా తీయాలో చెబుతూ రాసిన థీసిస్‌ అది. అంతేతప్ప స్త్రీ సాధికారతని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు! రూప పాత్రని మొదట్లో మామూలుగానే రాయడం మొదలు పెట్టాను. మొదట్లో- పెళ్ళి, ఆ చీర సన్నివేశాన్నీ నేను అనుకోలేదు. కానీ రాసే క్రమంలో అవన్నీ ఒక్కొక్కటిగా వచ్చి వాటి స్థానంలో కుదురుకున్నాయి. ఓ రకంగా రూప తనని తానే మలచుకుంది. పెళ్ళాగిపోయిన సాయంత్రం అమ్మ ఫొటో ముందు నిల్చుని ఏడ్చినా, ఇంటి అద్దె కట్టలేక బేలగా ఉండిపోయినా... తన జీవితం సంక్షోభంలో పడుతుందనుకున్నప్పుడు రూప గంభీరంగా నిలబడింది. ఆ రెండు షేడ్సూ ఉండటం వల్లే రూప వాస్తవానికి దగ్గరగా ఉండి ప్రేక్షకులతో బాగా కనెక్టయ్యింది. అలాకాకుండా స్త్రీలకి సంబంధించి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలని బలవంతంగా పాత్రల్ని మలిస్తే ఎఫెక్టివ్‌గా రాదన్నదే ఇప్పటికీ నా అభిప్రాయం.


సీత - గోదావరి

‘ఈ భూమ్మీద స్వేచ్ఛగా పుట్టి... అన్ని పనులూ అందరిలాగే చేసి... ఈ రోజు ఓ మగాడి మూలంగా షాప్‌కి తాళం వేసుకోవాల్సి వచ్చింది. వాడి కారణంగా కెరీర్‌ని మార్చుకోవాల్సి వస్తోంది... అదే నా బాధ! - స్టార్టప్‌లు అంటే ఏమిటో తెలియని రోజుల్లో ఓ అమ్మాయి సొంతంగా బొటీక్‌ పెట్టాలనుకుంటున్నట్టు ఈ సీతామహలక్ష్మి పాత్రని కల్పించాను. 2007 నాటికి అమ్మాయిలూ అబ్బాయిలూ ఉద్యోగం చేయడం కొత్తకాదు. అలాంటి నైన్‌ టు ఫైవ్‌ ఉద్యోగాలు నచ్చక కొత్తగా సొంతంగా ఏదైనా సాధించాలనుకున్న ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రాసుకున్న కథ ‘గోదావరి’. ‘ఆనంద్‌’లో నాయికగా చేసిన కమలినీ ముఖర్జీయే ఇందులోనూ కథానాయిక కాబట్టి... రెండు పాత్రల తీరుతెన్నుల్లో పొంతనే ఉండకూడదనుకున్నాను. రూప ఆచితూచి మాట్లాడుతుంది... గంభీరంగా ఉంటుంది... తన జీవితం నలుగురికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటుంది. సీతేమో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. కోపం, భయం, సెల్ఫ్‌పిటీ వెంటవెంటనే వస్తూపోతుంటాయి తనలో! హెల్మెట్‌లేకుండా ట్రాఫిక్‌ పోలీసులకి మస్కాకొట్టి వెళ్లిపోగల గడుగ్గాయి. ఇన్ని ఉన్నాసరే తనని తనలాగే స్వీకరించే అబ్బాయినే చేసుకోవాలనుకుంటుంది. స్టీరియో టైప్‌ భావాల్లోనూ ఇమడలేనంటుంది...! సీతలోని ఆ వాస్తవిక దృష్టే... తనని మనలో ఒకరిగా మార్చింది. గోదావరి అనగానే నీలిచీర కట్టిన సీతని గుర్తుకుతెచ్చేలా చేసింది!


అనామిక - అనామిక!

‘నీలాంటి రాక్షసుణ్ణి చంపడానికి భార్యగా పుట్టాల్సి వస్తే మళ్లీ మళ్లీ పుడతాను... చంపుతాను’ - ఓ అమ్మాయి మళ్లీమళ్లీ భార్యగా పుట్టడమేంటీ? చంపడమేంటీ...? ఇంతకీ ఎవరీ అమ్మాయి?- వీటికి జవాబులేవీ ఈ సినిమాలో నేరుగా చెప్పకుండా ప్రేక్షకుల ఊహకే వదిలేశాను. ‘నిర్భయ’కి నివాళిగా తీసిన సినిమా ఇది. అందుకే రీమేక్‌లు చేయడానికి బొత్తిగా ఇష్టపడని నేను హిందీ ‘కహానీ’ సినిమాని తెలుగుకి తేవాలనుకున్నాను. నిర్భయ మరణం ఈ దేశంలో మనసున్న మగవాళ్లందరినీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందన్నది నిజం. అలాంటివాళ్లు ఆ అమ్మాయి కోసం గుంపులో ఒకరిగా వెళ్లి కొవ్వొత్తులు వెలిగించి రావడం కాదు...

సంఘటనకి మూలమైన పురుషాధిక్య భావజాలాన్ని వదులుకోవాలని చెప్పాలనుకున్నాను. అందుకోసం ‘ఐ కేర్‌... ఐ రియాక్ట్‌’ ప్రచారకార్యక్రమం మొదలుపెట్టాను. ఆ ప్రచారంతోపాటూ అమ్మాయిల తెగువని చూపేలా ఓ సినిమా తియ్యాలనుకున్నప్పుడే కహానీ రైట్స్‌ కొన్న నిర్మాతలు నన్ను కలిశారు. ‘కహానీ’లో విద్యాబాలన్‌ నిండు గర్భిణి. చూలాలిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది... మాతృభావం ఏర్పడుతుంది. కానీ నేను ‘గర్భిణికాకున్నా సరే ఓ సంక్షోభంలో కూరుకుపోయిన స్త్రీని గౌరవించి తీరాల్సిందే’ అన్న భావన ప్రేక్షకుల్లో తేవాలనుకున్నాను. అందుకే నా హీరోయిన్‌ని చూలాలిగా కాకుండా మామూలు వివాహితగానే చూపాలనుకున్నాను. హిందీలోలాగా కథ చివర్లో ఆమె గతాన్ని వివరించలేదు. సినిమా పరంగా ఇవన్నీ పెద్ద రిస్కని తెలిసినా... నా దారిలోనే నేను వెళ్లాను. అప్పట్లో ఇది ఆశించినస్థాయిలో ప్రేక్షకులకి చేరువకాకున్నా... అమ్మాయిల శక్తిని చాటిన చిత్రంగా ఇప్పుడు నెటిజన్లు కీర్తిస్తున్నారు.


భానుమతి - ఫిదా

‘అమ్మాయిలెందుకు పోవాల్నాన్నా అన్నీ వదులుకుని...? ఈ రూలు ఎవడు పెట్టిండో కానీ చానా మోసం... చానా పెద్ద మోసం... ధోకా’ - సినిమా మొదట్లో చాలా మామూలుగా వచ్చేసే ఈ డైలాగ్‌ క్లైమాక్స్‌ తర్వాత ప్రేక్షకుల్ని వెంటాడుతూనే ఉంటుంది... ముఖ్యంగా అమ్మాయిల్ని! ‘రెక్కల గుర్రమెక్కి రాజకుమారుడొచ్చి అతని కోటకి నిన్ను తీసుకెళ్తాడు... మరి ఆ కోట నీకు నచ్చకుంటే... రాకుమారుడు ఇక్కడికే వస్తాడా!’ ఏ అమ్మాయికైనా ఈ డైలమా వస్తే ఏమవుతుందన్నదే ‘ఫిదా’ కథకి మూలం. ‘ఇంత చిన్న విషయంతో సినిమా తీస్తారా తేలిపోతుందేమో...’ అని భయపెట్టినా నా హీరోయిన్‌ పాత్రపైనున్న నమ్మకంతోనే ముందుకెళ్లాను. దానికి కారణం లేకపోలేదు... ‘ఐ కేర్‌... ఐ రియాక్ట్‌’ ప్రచారంలో భాగంగా రెండేళ్లపాటు కాలేజీల చుట్టూ తిరుగుతుంటే ‘సినిమాలు లేవు కాబోలు... అందుకే ఇలా తిరుగుతున్నాడు’ అనడం మొదలుపెట్టారు. అలాకాదని నా పాత్రలు ఎప్పుడైనా మెప్పించగలవని చూపడానికి ఈ సినిమా తీశాను. ఈ సినిమాతో ఓ క్రియేటర్‌గా నన్ను నేను చాలా మార్చుకున్నాను కూడా. ఇదివరకటి సినిమాల్లోకన్నా ఇందులోని డైలాగుల్లో ఓ సహజమైన ఫ్లో వచ్చింది. ముఖ్యంగా ‘భానుమతి సింగిల్‌ పీస్‌’ వంటివి మాస్‌కి బాగా దగ్గరయ్యాయి. క్లాసూ మాసూ అన్న తేడాలేకుండా తొలిసారి నన్ను అందరికీ చేరువచేసిన ఘనత ఈ బాన్సువాడ భానుమతిదే!


మౌనిక - లవ్‌ స్టోరీ

‘కంట్రోల్‌ చేసి ఉండాల్సింది నన్ను కాదే... మీవాణ్ణి. చిన్నప్పుడే అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో వాడికి నేర్పి ఉంటే ఇలా మా జీవితాలని నాశనం చేసి ఉండేవాడు కాదు!’ - చేతిలో చెప్పు తీసుకుని మరీ ఈ మాటలంటుంది మౌనిక... అదీ వాళ్ల నాన్నమ్మతో!! చిట్టిపాపల్ని కామంతో చిదిమేసేవాళ్లని అతిదగ్గర బంధువులన్న కారణంతో చూసీచూడనట్టుండేవాళ్లకి ఈ మాటలు చెప్పు దెబ్బల్లా తగలాలనుకునే ఈ సీన్‌ రాశాను. పాతికేళ్లకిందట- అమెరికాలో చదువుతున్నప్పుడే ‘లవ్‌ స్టోరీ’ కథకి బీజం పడింది. అక్కడంతా ఆఫ్రోఅమెరికన్‌ అమ్మాయిల్ని కించపరుస్తూ బొమ్మలు గీస్తుండేవారు. ఇక్కడికొచ్చాక దళితుల పైనా అంతకన్నా ఎక్కువ వివక్షని గమనించాను. ‘ఈ దేశాన్నీ మన సమాజాన్నీ తీవ్రంగా అసహ్యించుకునే హక్కు దళితులకూ స్త్రీలకీ మాత్రమే ఉంది. అంతగా వాళ్లని అణచివేస్తున్నాం మనం’ అన్న భావన నాలో స్థిరపడింది.

కాకపోతే ఆ రెండు సమస్యల్నీ సినిమాలో చూపేంత ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి మాత్రం నాకు ఇన్నేళ్లు పట్టింది! పసిపాపగా లైంగిక దాడికి గురైన కథానాయిక తెలుగు సినిమాకి చాలా కొత్త. ఆ విషయాన్ని చెప్పీచెప్పనట్టు కాకుండా చెంప ఛెళ్ళుమనిపించేలాగే చూపాలనుకున్నాను. మౌని నా మిగతా కథానాయికల్లా ఇంటెలిజెంట్‌ కాదు... ఓ బిలో యావరేజ్‌ స్టూడెంట్‌. నా కథానాయికలందరూ బండి నడపగలవాళ్లయితే మౌనిక మాత్రం బైకులో వెనక కూర్చుని రావాలన్నా వణికిపోతుంటుంది. ఇందుకు కారణమేంటీ అంటే... చిన్నప్పటి లైంగిక దాడే అని చెప్పాలనుకున్నాను. అదొక్కటే కాదు... మౌనిక ఓ దళిత అబ్బాయిని ప్రేమిస్తుంది. అతనితో కలిసి ఈ రకమైన అణచివేతని ప్రత్యక్షంగా చవిచూస్తుంది. అందుకే నా కెరీర్‌లో నేను ఎంతో కష్టపడి రాసిన క్లిష్టమైన పాత్ర మౌనిదేనని చెబుతాను. ఆ కారణంగానే నేను ఇంతకాలం అందుకున్న విజయాలన్నీ ఒక లెక్కయితే... లవ్‌స్టోరీతో అందుకున్న ప్రేక్షకాదరణ ఒక్కటీ ఒక లెక్క’ అంటున్నాను.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని