Published : 17 Sep 2022 23:21 IST

చేద్దామా... చేప కూరలు!

ఆదివారంనాడు చేపల్ని తెచ్చుకుంటే ఆ రోజు పండుగే కదూ... అందుకే వాటితో ఎప్పటిలా పులుసు, కూర కాకుండా... మసాలాలు వేసి ఇలా వండుకుని రుచి చూసేయండి మరి.


హరియాలీ మచ్చీ

కావలసినవి: ఏదయినా ఒకరకం చేప: అరకేజీ (పెద్ద ముక్కల్లా కోయాలి), వినెగర్‌: అరచెంచా, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, కొత్తిమీర కట్టలు: రెండు, పచ్చిమిర్చి: ఏడు, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, అల్లం: చిన్నముక్క, జీలకర్ర: అరచెంచా.

తయారీ విధానం: చేపముక్కల్ని శుభ్రంచేసుకుని పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకుని తీసుకోవాలి. ఇందులో వినెగర్‌, మొక్కజొన్నపిండి, బియ్యప్పిండి, సరిపడా ఉప్పు వేసుకుని అన్నింటినీ కలిపి... ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి. గంటయ్యాక... నాన్‌స్టిక్‌పాన్‌ని స్టౌమీద ఉంచాలి. ఇది వేడెక్కాక చేపముక్కల్ని ఉంచి నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.


టొమాటో ఫిష్‌ కర్రీ

కావలసినవి: ఏదైనా ఓ రకం చేప: అరకేజీ, ఉప్పు: తగినంత, పసుపు: ఒకటిన్నర చెంచా. కర్రీకోసం: కలోంజీ గింజలు: అరచెంచా, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: అయిదు, వెల్లుల్లి ముద్ద: అరచెంచా, అల్లం ముద్ద: అరచెంచా, పచ్చిమిర్చి: నాలుగు, దనియాలపొడి: అరచెంచా, కారం: మూడు చెంచాలు, చక్కెర: పావుచెంచా, ఆవనూనె: అరకప్పు. 

తయారీ విధానం: చేపముక్కలపైన చెంచా పసుపు, చెంచా ఉప్పు వేసి... వాటికి ఆ రెండూ పట్టేలా కలుపుకోవాలి. ఉల్లిపాయను పేస్టు చేసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయిని పెట్టి... పావుకప్పు నూనె వేసి చేపముక్కల్ని దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, కలోంజీ గింజలు వేయించుకుని ఉల్లిపాయ పేస్టు వేసి వేయించాలి. నిమిషమయ్యాక అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యాక దనియాలపొడి, మిగిలిన పసుపు, కారం వేసి, అరకప్పు నీళ్లు పోయాలి. తరువాత మరో అరచెంచా ఉప్పు, చక్కెర, వేయించిన చేపముక్కలు వేసి బాగా కలపాలి. కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.


చేప కొబ్బరిపాల కర్రీ

కావలసినవి: ఏదయినా ఒకరకం చేప: అరకేజీ, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: మూడు, కారం: రెండు పెద్ద చెంచాలు, దనియాలపొడి: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, మెంతిపొడి: పావుచెంచా, చిక్కని కొబ్బరిపాలు: కప్పు, పల్చని కొబ్బరిపాలు: కప్పు, నూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు: రెండు.

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయముక్కలు ఎర్రగా వేగాక... కారం, దనియాలపొడి, పసుపు, మెంతిపొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక పల్చని కొబ్బరిపాలు, శుభ్రం చేసిన చేప ముక్కలు వేసి ఓసారి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. చేపముక్కలు మెత్తగా అయ్యాక చిక్కని కొబ్బరిపాలు పోసి బాగా కలపాలి. ఇది దగ్గరకు అవుతున్నప్పుడు కరివేపాకు వేసి దింపేస్తే సరి.  


పెప్పర్‌ ఫిష్‌ మసాలా

కావలసినవి: ముళ్లులేని చేప ఏదయినా ఒకరకం: అరకేజీ, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, వెల్లుల్లి పేస్టు: చెంచా, అల్లంపేస్టు: చెంచా, జీలకర్ర: చెంచా, మెంతులు: పావుచెంచా, మిరియాలపొడి: రెండున్నర టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుచెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, పెరుగు: టేబుల్‌స్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను, కొత్తిమీర తరుగు: అరకప్పు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు, పచ్చిమిర్చి: మూడు, గరంమసాలా: ఒకటిన్నర చెంచా. 

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి నూనెవేసి... జీలకర్ర, మెంతులు వేయించి ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి కూడా వేగాక... టొమాటో ముక్కలు వేసి కలపాలి. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గాయనుకున్నాక... అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, దనియాలపొడి, పెరుగు, గరంమసాలా, నిమ్మరసం, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేయాలి. అన్నీ వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కప్పు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు మరగడం మొదలవుతున్నప్పుడు చేపముక్కలు వేసి మూత పెట్టాలి. చేపముక్కలు మెత్తగా అయ్యాయనుకున్నాక కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి... రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts