Published : 31 Jul 2022 00:28 IST

పోటీకి నిలిచి... పెట్టుబడి గెలిచి..!

వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించి వారికి పెట్టుబడి అందించే షార్క్‌ట్యాంక్‌ రియాల్టీ షోకి వెళ్లాలంటే ఎన్నో వడపోతలు ఉంటాయి. అవన్నీ దాటుకుని ఇన్వెస్టర్లని మెప్పించి పెట్టుబడిని అందుకున్నాయి కొన్ని స్టార్టప్‌లు. ఆ జాబితాలో ఈ ఫుడ్‌ స్టార్టప్‌లూ ఎందుకున్నాయంటే...

ప్యాకెట్‌లో పళ్లరసం

చాలామంది పిల్లలకోసం ఇంట్లోనే పళ్లరసాలతో పాప్సికిల్స్‌ చేస్తుంటారు. ఈ ఫార్ములాతోనే హైదరాబాద్‌కి చెందిన రవి- అనుజ దంపతులు ‘స్కిప్పీ ఐస్‌పాప్స్‌’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించి ద్రవరూపంలో పాప్సికిల్స్‌ను అందిస్తున్నారు. అంటే చిన్న చిన్న ప్యాకెట్లలో తాజా పళ్లరసాలను నింపుతారు. వాటిని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోగానే ఐస్‌పాప్స్‌ రెడీ అవుతాయి. ఈ రసాలను నిమ్మ, స్ట్రాబెరీ, నారింజ, మామిడి వంటి పలు రుచుల్లో తయారు చేసి దేశవ్యాప్తంగా 2500 అవుట్‌లెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. ఆ సంస్థ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ఇవి దొరుకుతున్నాయి. గతేడాది స్థాపించిన ఈ సంస్థ నెలకి అరవై లక్షల రూపాయల ఆదాయం అందుకుంటోంది. షార్క్‌ట్యాంక్‌ ఇండియా కార్యక్రమంలో కోటిరూపాయల పెట్టుబడిని అందుకుంది. అంతేకాదు, ఆ రియాలిటీ షోలో పెట్టుబడి దారులందరినీ మెప్పించిన స్టార్టప్‌ కంపెనీగానూ నిలిచింది ‘స్కిప్పీ ఐస్‌పాప్స్‌’.


రైతుల వెన్నుతడుతూ...

పుణెకి చెందిన మాళవిక గైక్వాడ్, జస్వంత్‌ పటేల్, విశాల్‌ చౌదరి- ఈ ముగ్గురూ ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేసేవారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వీరికి సేంద్రియ వ్యవసాయంపైన ఆసక్తి ఉండటంతో ముగ్గురూ కలిసి ‘హంపీ ఎ2’ పేరుతో సేంద్రియ పాలని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. పుణె చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులతో కలిసి ఓ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసి వారి చేత కూడా డెయిరీలను ఏర్పాటు చేయించి సేంద్రియంగా పండించిన మేత, దాణాను పాడి రైతులకు అందిస్తున్నారు. అలానే మరికొందరి చేత వ్యవసాయం కూడా చేయిస్తున్నారు. అలా రైతులందరినీ ఒక తాటిమీదకు తీసుకొచ్చి వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ దళారుల ప్రమేయం లేకుండా ఉత్పత్తి చేసే పాలనీ, పండించిన పంటల్నీ వీరే కొనుగోలు చేస్తున్నారు. అలా ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా పాలు, పనీర్, నెయ్యి, బ్రెడ్, తేనె, కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్, మసాలాలు, పప్పులు, తృణధాన్యాలు విక్రయిస్తున్నారు. పుణెలో నాలుగువేల మంది వినియోగదారులకు ఈ సంస్థ పాలను అందిస్తోంది. అలానే రైతులు పంటలు వేసే సమయంలో సూక్ష్మ రుణాలూ, సేంద్రియ ఎరువులూ, విత్తనాలూ అందిస్తుంటారు. పంట ఎదుగుదల, చీడల గురించి తెలుసుకుని ఎప్పటికప్పుడు రైతులకు మార్గనిర్దేశం చేస్తుంటారు. దాంతో ఆ ప్రాంతంలో చాలా వరకూ రైతుల ఆత్మహత్యలను ఆపగలిగింది ఈ సంస్థ. భవిష్యత్‌లో  మరింత మంది రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోటిరూపాయల పెట్టుబడిని అందించారు షార్క్‌ట్యాంక్‌ ఇండియా షోలోని పెట్టుబడి దారులు. 


అరటి చిప్స్‌కూ ఓ బ్రాండ్‌

కేరళలోని అలప్పుళాకి చెందిన మానస్‌కి అరటి చిప్స్‌ అంటే చాలా ఇష్టం. ఎంబీఏ కోసం వేరే ప్రాంతానికి వెళితే అక్కడ వెతగ్గా వెతగ్గా ఏదో ఒక బేకరీలో మాత్రమే దొరికేవి ఈ చిప్స్‌. అందుకే ఇంటి నుంచే ఎక్కువ మొత్తం తీసుకెళ్లేవాడు. హాస్టల్‌లో స్నేహితులూ వాటిని ఎంతో ఇష్టంగా తినడం చూశాడు. దాంతో ఈ బనానా చిప్స్‌ను ఓ బ్రాండ్‌ పేరుతో తీసుకొచ్చి సూపర్‌మార్కెట్, రైలు- బస్సు స్టేషన్లలోనూ, థియేటర్లలోనూ అందుబాటులో ఉంచాలనుకున్నాడు. అందుకే ‘బియాండ్‌ స్నాక్స్‌’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆ చిప్స్‌ను తయారు చేయడం మొదలుపెట్టాడు. నేరుగా రైతుల వద్ద నుంచే అరటికాయల్ని కొనుగోలు చేసి వాటిని మసాలా, పెరీపెరీ, సాల్ట్‌ అండ్‌ పెప్పర్, క్రీమ్‌ అండ్‌ అనియన్‌ రుచుల్లో తయారు చేసి తమ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, బిగ్‌బాస్కెట్, జియోమార్ట్, ఇండియామార్ట్, ఫ్లిప్‌కార్ట్, ది గుడ్‌ స్టఫ్‌ వంటి సైట్లలో ఈ చిప్స్‌ను విక్రయిస్తున్నాడు. బెంగళూరు, ముంబయి, పుణె, మైసూరు, దిల్లీ వంటి పలు ప్రాంతాల్లోనూ అవుట్‌లెట్లు ఏర్పాటు చేసి ఎందరికో చేరువయ్యాడు. అమెరికా దుబాయి, నేపాల్, మారిషస్‌కీ వీటిని పంపుతున్న మానస్‌ చాలా తక్కువ సమయంలోనే అంతర్జాతీయ మార్కెట్‌కూ చేరువైనందుకు షార్క్‌ట్యాంక్‌లో యాభై లక్షల పెట్టుబడిని సొంతం చేసుకున్నాడు. ఆ డబ్బుతో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు ఈ కుర్రాడు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని