Updated : 26 Jun 2022 05:21 IST

వ్యాయామం ఎప్పుడు చేయాలంటే...

సాధారణంగా ఎవరికి కుదిరిన సమయంలో వాళ్లు వ్యాయామం చేస్తుంటారు. అయితే పురుషులు ఉదయంపూట కన్నా సాయంకాలం వ్యాయామాలు చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందట. ఇలా చేసేవాళ్లలో బీపీ, హృద్రోగ సమస్యలు, అలసట, కొవ్వు పెరగడం.... వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని స్కిడ్‌మోర్‌ కాలేజ్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. అదే మహిళల్లో అయితే ఒక్కో సమయంలో చేయడం వల్ల ఒక్కో రకమైన ఫలితం ఉంటుందట. ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రంనాలుగైదు గంటల సమయంలో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందనీ అంటున్నారు. అంటే వ్యాయామ సమయం కూడా ఆయా సమస్యల్ని ప్రభావితం చేస్తుందన్నమాట. ఉదాహరణకు స్త్రీలు ఉదయం పూట చేసే వ్యాయామం వల్ల పొట్ట తగ్గడంతోపాటు బీపీ కూడా అదుపులో ఉంటుంది. అదే సాయంకాలం వ్యాయామం చేయడంవల్ల ఛాతీ దగ్గరున్న కండరాల దృఢత్వం పెరుగుతుందనీ పోషకాలు బాగా వంటపడతాయనీ మానసికంగానూ ఆనందంగా ఉంటారనీ చెప్పుకొస్తున్నారు. నిద్రపోయేముందు మాత్రం చేయకూడదనీ దానివల్ల నిద్ర సరిగ్గా పట్టదనీ అంటున్నారు. ఈ విషయమై వీళ్లు 27 మంది స్త్రీలూ 20 మంది పురుషుల్ని ఎంపికచేసి వాళ్లతో 12 వారాలపాటు రకరకాల సమయాల్లో వ్యాయామాలు చేయించి మరీ దీన్ని ధ్రువీకరిస్తున్నారు.


ఆలూ పాలల్లోనూ ప్రొటీన్‌!

బంగాళాదుంపల్లో అధికశాతం పిండిపదార్థాలే ఉంటాయి అనుకుంటాం. కానీ అందులోనూ ఆవు, గేదె పాలల్లో మాదిరిగానే అమైనో ఆమ్లాలతో కూడిన ప్రొటీన్లు ఉంటాయనీ ఇవి కండరాల పెరుగుదలకి తోడ్పడతాయనీ నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్‌ యూనివర్సిటీ నిపుణుల తాజా పరిశీలనలో స్పష్టమైంది. కండరాల పెరుగుదలకీ దృఢత్వానికీ ప్రొటీన్లు ఎంతో అవసరం అన్నది తెలిసిందే. అయితే అందుకు అవసరమైన ప్రొటీన్లకోసం ఇంతకాలం జంతు ఉత్పత్తులమీదే ఆధారపడుతున్నాం. కానీ ఎక్కువమంది ఆహారంగా తీసుకునే బంగాళాదుంపల్లోనూ అమైనో ఆమ్లాలు ఉన్నాయనీ ఇవి కూడా జంతువుల పాలల్లోని ప్రొటీన్‌ మాదిరిగానే పనిచేస్తాయనీ ఆయా నిపుణులు గుర్తించారు. పైగా ఇవి వ్యాయామం చేసేవాళ్లకీ నీరసించినవాళ్లు త్వరగా కోలుకోవడానికి కూడా తోడ్పడతాయనీ చెబుతున్నారు. ముఖ్యంగా క్రీడాకారుల్లో కండరాల పెరుగుదలకి అవసరమైన ప్రొటీన్‌ ఆలూ నుంచి తీసిన పాలల్లోనూ లభిస్తుంది కాబట్టి వాటిని నిశ్చింతగా తాగొచ్చని పేర్కొంటున్నారు.


ఇది... స్మార్ట్‌ పిల్లో!

ఇప్పటికే మార్కెట్లో మనం సరిగ్గా నిద్రపోతున్నామా లేదా అన్న విషయాన్ని పసిగట్టే ట్రాకింగ్‌ పరికరాలు చాలానే వచ్చాయి. అయితే వాటన్నింటికన్నా మరింత కచ్చితంగా మన నిద్రకి సంబంధించిన అన్ని విషయాలనీ రికార్డు చేసే స్మార్ట్‌ దిండును రూపొందించారు చైనా సైంటిస్టులు. తల కదలికల ఆధారంగా మనం విశ్రాంతి తీసుకుంటున్నామా... లేదా గాఢంగా నిద్రపోతున్నామా అన్న విషయాన్ని ఇది ట్రాక్‌ చేసి ఆప్‌ ద్వారా ఫోన్‌కి పంపిస్తుంది. పైగా ఇది పనిచేయడానికి అవసరమైన విద్యుచ్ఛక్తిని దానంతటదే తయారుచేసుకుంటుంది. అదెలా అంటే- తల కదలికల నుంచి వచ్చే రాపిడి వల్ల లోపల ఉన్న ట్రైబో ఎలక్ట్రిక్‌ నానో జెనరేటర్లు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తాయి. దాంతో దీన్ని ప్రత్యేకంగా చార్జ్‌ చేయాల్సిన పనీ లేదన్నమాట. పైగా ఈ పిల్లోను ఎలా కావాలంటే అలా వంగేలా రంధ్రపూరిత పాలిమర్‌తో రూపొందించారు కాబట్టి ఎంతో సౌకర్యంగా ఉంటుందట.


డిప్రెషన్‌కీ ప్రొబయోటిక్స్‌!

పొట్టలో ఎంత వైవిధ్యభరితమైన బ్యాక్టీరియా ఉంటే అంత ఆరోగ్యం. అయితే ఇది డిప్రెషన్‌ తగ్గడానికీ తోడ్పడుతుంది అంటున్నారు బేసల్‌ యూనివర్సిటీ పరిశోధకులు. యాంటీ డిప్రెసెంట్స్‌తోపాటు ప్రొబయోటిక్స్‌ సప్లిమెంట్లను ఇవ్వడంవల్ల డిప్రెషన్‌ నుంచి త్వరగా కోలుకుంటారట. ఎందుకంటే జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవాళ్లలోనే కుంగుబాటు లక్షణాలు ఎక్కువగా ఉంటున్నట్లు గత పరిశోధనల్లోనే తేలింది. దాంతో వాళ్లని నిశితంగా పరిశీలించినప్పుడు- చుట్టుపక్కలవాళ్లతో కలవకుండా నిరాశానిస్పృహలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని దృష్టిలోపెట్టుకునే తాజాగా, డిప్రెషన్‌తో బాధపడుతున్న రోగుల్లో కొందరికి యాంటీ డిప్రెసెంట్స్‌తోపాటు ప్రొబయోటిక్స్‌నీ ఇచ్చి, మరికొందరికి  ఇవ్వకుండా చికిత్స చేశారట. నెలరోజుల తరవాత అందరినీ పరిశీలించగా- యాంటీ డిప్రెసెంట్స్‌ కారణంగా అందరిలో డిప్రెషన్‌ లక్షణాలు తగ్గినప్పటికీ ప్రొబయోటిక్స్‌ తీసుకున్నవాళ్లు ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకున్నారట. ఎమ్మారై స్కానింగ్‌ ద్వారా వారి మెదడు పనితీరుని గమనించినప్పుడూ మిగిలినవాళ్లతో పోలిస్తే ప్రొబయోటిక్స్‌ తీసుకున్నవాళ్లలోనే మెరుగ్గా ఉంది అంటున్నారు. కాబట్టి కుంగుబాటు ఛాయలు కనిపించగానే ఆహారం లేదా సప్లిమెంట్ల రూపంలో ప్రొబయోటిక్స్‌ వాడటం మేలు అని వివరిస్తున్నారు సదరు మానసిక నిపుణులు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని