Published : 22 May 2022 01:08 IST

హహ్హహ్హ

అది మాత్రమే...

రాత్రి పదకొండు గంటలకు నిద్రకు ఉపక్రమిస్తుండగా భార్య అడిగింది...
భార్య: ఏమండీ అడవిరాముడు సినిమాలో హీరోయిన్లు ఎవరు?
భర్త: జయప్రద, జయసుధ
భార్య: బాహుబలి సినిమాలో అనుష్క పేరేంటి?
భర్త: దేవసేన
భార్య: మన పక్క ఫ్లాట్‌లోకి రజనీవాళ్లు వచ్చి ఎన్నాళ్లయింది?
భర్త: ఆర్నెల్లు.
భార్య: నిన్న మనింటికి వచ్చిన నా ఫ్రెండ్‌ ఏ రంగు చీర కట్టుకుంది?
భర్త: అది కూడా నేనే చెప్పాలా... గులాబీ రంగు. అయినా ఇవన్నీ ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు?
భార్య: ఇవన్నీ గుర్తున్న మీకు ఈరోజు నా పుట్టినరోజని గుర్తులేకపోవడానికి కారణమేమై ఉంటుందా అని..


చూసిన సినిమా

భార్య: ఏమండీ... అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నట్లు ఉంది. కాలేజీ నుంచి లేటుగా వస్తోంది. ఒకరోజు కాలేజీ అయ్యే టైముకి వెళ్లి చూడమని చెప్పాను కదా.
వెంగళప్ప: వెళ్లాను. ఎవరో అబ్బాయి బైక్‌ ఎక్కి వెళ్లింది.
భార్య: వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లారు... మిమ్మల్ని ఫాలో అవమని చెప్పాగా.
వెంగళప్ప: సినిమాకి వెళ్లారు... ఆ సినిమా నేను చూసిందే. అందుకే వచ్చేశా.


ఎలా తగిలాయంటే...

సుబ్బారావు: మాష్టారూ! ఆ దెబ్బలేంటండీ...
రామారావు: ఆ గేటు పక్కన రాయి ఉంది చూశారూ...
సుబ్బారావు: ఆ చూశా...
రామారావు: నేను చూళ్లేదు!


చాక్లెట్‌ ఇస్తేనూ...

రాధ: బిట్టూ! పక్కింటి ఆంటీవాళ్ల ఇంట్లో కుండీల్ని పగలగొట్టావట. తప్పు కదా, అలా ఎందుకు చేశావ్‌?
బిట్టు: మొదటిసారి అనుకోకుండా చేశా ఆ తర్వాత కావాలనే పడేశా...
రాధ: బుద్ధిలేదా కావాలనే పడేశా అని చెబుతున్నావ్‌...
బిట్టు: అది కాదమ్మా... అనుకోకుండా పడేసినప్పుడు సారీ చెప్పా. పర్వాలేదులే అంటూ ఆంటీ చాక్లెట్‌ ఇచ్చింది. అందుకే రెండోసారి కావాలని పడేశా...
రాధ: ఆఁ


అత్తారిల్లు!

మగవాళ్లకు అత్తారిల్లు ప్రభుత్వ ఉద్యోగంలాంటిది, ఎప్పుడైనా వెళ్లొచ్చు... వెళ్లిన వెంటనే మర్యాదలన్నీ మొదలవుతాయి. ఆడవాళ్లకి అత్తారిల్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలాంటిది, ఎంతసేపు ఓవర్‌ టైం చేసినా టార్గెట్లు పూర్తికావు.


ప్రతి మెతుకూ...

శ్రీకర్‌: ప్రతి మెతుకూ ఎవరికి చెందాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడట...
కమల్‌: కానీ ఆ మెతుకు బిర్యానీయా, చద్దన్నమా అనేది భార్య డిసైడ్‌ చేస్తుందిరా!


ఎంత ప్రేమో!

భర్త: ఎప్పుడూ నా మీద రుసరుసలాడుతుంటావు. చూడు నేనేమో నీమీద ప్రేమతో ముక్కుపుడక కొనుక్కొచ్చా.
భార్య: పెళ్లప్పుడు మావాళ్లు పెట్టిన వడ్డాణాన్ని పేకాటలో తగలేసి ముక్కుపుడక కొనుక్కొచ్చారు... ఇదా ప్రేమంటే?


ఎందుకో మరి!

మా ఇంగ్లిషు టీచర్‌ నన్ను లిల్లీ స్పెలింగ్‌ చెప్పమని అడిగారు. నేను ‘ఎల్లాయ్‌ ఎల్లెల్లవాయ్‌’  ్బలిiఃః్వ్శ అని కరెక్ట్‌గానే చెప్పాను. అయినా ఎందుకు కొట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు!


బర్త్‌డే డ్రెస్‌

భార్య: ఏమండీ... మీ బర్త్‌డేకి అదిరిపోయే డ్రెస్‌ కొన్నా.
భర్త: థాంక్యూ బంగారం. నేనంటే నీకెంత ప్రేమ. ఏదీ చూపించు.
భార్య: ఉండండి... వేసుకుని వచ్చి చూపిస్తా..!


వెంటనే పంపారు!

గిరి: బ్యాంక్‌ టెస్టుకి పుస్తకాలు కొనుక్కోవాలీ, వెయ్యి రూపాయలు పంపించమని ఫోన్‌ చేస్తే మా నాన్నగారు వెంటనే పంపార్రా...
హరి: మీ నాన్నగారు ఎంత మంచివారు. ఇంతకీ ఆ డబ్బుతో ఏం చేశావ్‌?
గిరి: పంపింది డబ్బులు కాదు రా... పుస్తకాలు!


ఆ పదం ఉండదుగా...

రవి: అరేయ్‌ అపార్థాలు చేసుకునేది అమ్మాయిలే, అబ్బాయిలు కాదు...
రాజు: ఎందుకనీ...
రవి: ఎందుకంటే నిఘంటువులో మిస్‌-అండర్‌స్టాండ్‌ అని ఉంటుంది కానీ మిస్టర్‌-అండర్‌స్టాండ్‌ అని ఉండదు కదా!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని