ఐస్‌క్రీమ్‌... ఇంట్లో చేసేద్దాం!

బాగా ఎండగా ఉన్నప్పుడు ఓ కప్పు ఐస్‌క్రీమ్‌ తింటే... ఎంత హాయిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. కానీ ఎండాకాలం అయిపోయేదాకా తరచూ బయటినుంచి ఐస్‌క్రీమ్‌ తెచ్చుకోవడం అన్నిసార్లూ కుదరకపోవచ్చు.

Updated : 01 May 2022 06:33 IST

ఐస్‌క్రీమ్‌... ఇంట్లో చేసేద్దాం!

బాగా ఎండగా ఉన్నప్పుడు ఓ కప్పు ఐస్‌క్రీమ్‌ తింటే... ఎంత హాయిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. కానీ ఎండాకాలం అయిపోయేదాకా తరచూ బయటినుంచి ఐస్‌క్రీమ్‌ తెచ్చుకోవడం అన్నిసార్లూ కుదరకపోవచ్చు. కాబట్టి ఇక్కడున్న వాటిల్లో నచ్చిన ఫ్లేవర్లను ఒకటిరెండు ఇంట్లోనే చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే... కావాల్సినప్పుడల్లా కొద్దికొద్దిగా చప్పరించేయొచ్చు.


పిస్తాతో...

కావలసినవి: క్రీమ్‌: రెండు కప్పులు, వెన్న తీయని చల్లనిపాలు: కప్పు, చక్కెర: కప్పు, వెనిల్లా ఎసెన్స్‌: అరచెంచా, గ్రీన్‌ఫుడ్‌కలర్‌: చిటికెడు, పిస్తా: కప్పు.
తయారీ విధానం: ముందుగా సగం పిస్తాను బరకగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన పిస్తాను రెండు ముక్కల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి పాలు పోసి, చక్కెర వేసి కలుపుతూ ఉండాలి. చక్కెర పూర్తిగా కరిగి, పాలు చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఆ పాలు పూర్తిగా చల్లారాక గిలకొట్టిన క్రీమ్‌ వేసి బాగా కలిపి తరువాత పిస్తా పలుకులు, వెనిల్లా ఎసెన్స్‌, గ్రీన్‌ఫుడ్‌ కలర్‌ వేసి మరోసారి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది పూర్తిగా గట్టిపడ్డాక ఇవతలకు తీయాలి.


డ్రైఫ్రూట్స్‌తో...

కావలసినవి: కుంకుమపువ్వు: చిటికెడు, (వేడినీటిలో నానబెట్టుకోవాలి), చిక్కని క్రీమ్‌: రెండు కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: ఒక డబ్బా, యాలకులపొడి: చెంచా, గులాబీనీరు: రెండు టేబుల్‌స్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: కప్పు.
తయారీ విధానం: ఓ గిన్నెలో క్రీమ్‌ వేసుకుని కనీసం అయిదు నుంచి పది నిమిషాలు గిలకొట్టాలి. అందులోంచి కొద్దిగా క్రీమ్‌ తీసుకుని కండెన్స్‌డ్‌మిల్క్‌లో కలిపి మళ్లీ గిలకొట్టాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ మిల్క్‌తోపాటు మిగిలిన పదార్థాలను క్రీమ్‌లో వేసి బాగా కలిపి ఓ డబ్బాలో తీసుకుని మూత పెట్టాలి. ఈ డబ్బాను ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు డీప్‌ఫ్రిజ్‌లో పెడితే డ్రైఫ్రూట్స్‌ ఐస్‌క్రీమ్‌ రెడీ.


చాక్లెట్‌తో...

కావలసినవి: కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు, చిక్కనిపాలు: మూడు టేబుల్‌స్పూన్లు, చాక్లెట్‌పొడి: మూడు టేబుల్‌స్పూన్లు, బ్రౌన్‌షుగర్‌: అరకప్పు, క్రీమ్‌: రెండు కప్పులు, చాక్లెట్‌చిప్స్‌: పావుకప్పు.
తయారీ విధానం: ముందుగా పాలు, బ్రౌన్‌ షుగర్‌ ఓ గిన్నెలో వేసి స్టౌ మీద పెట్టాలి. పాలు వేడి అయ్యాక దింపేసి, చాక్లెట్‌ పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంలో గిలకొట్టిన క్రీమ్‌, చాక్లెట్‌ చిప్స్‌ వేసుకుని మరోసారి కలిపి ఓ గిన్నెలో వేసి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆరేడు గంటలకు ఈ మిశ్రమం గట్టిపడుతుంది.


మామిడితో...

కావలసినవి: చిక్కని క్రీమ్‌: రెండు కప్పులు, చక్కెరపొడి: అరకప్పు, మామిడిపండు గుజ్జు: ముప్పావు కప్పు, ఎల్లో ఫుడ్‌ కలర్‌: చిటికెడు, టూటీఫ్రూటీ పలుకులు: కొన్ని.
తయారీ విధానం: ఓ గిన్నెలో క్రీమ్‌, చక్కెరపొడి వేసుకుని కనీసం అయిదు నిమిషాలు గిలకొట్టుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని మళ్లీ గిలకొట్టుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని చల్లగా అయ్యేవరకూ ఫ్రిజ్‌లో పెట్టి... ఇవతలకు తీయాలి. 


కొబ్బరితో...

కావలసినవి: గులాబీ రేకులు: పావుకప్పు, రోజ్‌ ఎసెన్స్‌: కొన్ని చుక్కలు, లేత కొబ్బరి ముక్కలు: అరకప్పు (పేస్టులా చేసుకోవాలి), చల్లని, వెన్నతీయని పాలు: రెండున్నర కప్పులు, చక్కెర: ముప్పావుకప్పు, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, తాజా క్రీమ్‌: ముప్పావుకప్పు.
తయారీ విధానం: ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి, పావుకప్పు పాలు కలిపి పెట్టుకోవాలి. మిగిలిన పాలు, చక్కెరను మరో గిన్నెలో వేసి స్టౌమీద పెట్టాలి. పాలు వేడెక్కాక మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి కలిపి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి.
ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక తాజా క్రీమ్‌, కొబ్బరి పేస్టు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆరుగంటలయ్యాక బయటకు తీసి రోజ్‌ఎసెన్స్‌ వేసి ఓసారి మిక్సీపట్టి గులాబీరేకులు కలిపి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆరేడు గంటలకు ఇది గట్టిపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..