అంతెత్తు కొబ్బరిచెట్టు... ఒక్క రోజులో మీ ముంగిట్లో
అన్ని హంగులతో కట్టుకున్న ఇంటి ముందు అటు అందానికీ, ఇటు శుభసూచకానికీ ఓ కొబ్బరి చెట్టు ఉంటే బాగుండనుకుంటే...ఇంతకుముందు ఏమోగానీ, ఇప్పుడు తెల్లవారేలోపే కొబ్బరి చెట్టునూ ఇంటి ముందుకు తెప్పించేయొచ్చు. దీని వల్ల ఇటు గృహస్థులకు ఆనందమూ, అటు రైతులకు ఆర్థిక లాభమూ కలుగుతుంది. అదెలాగో చూడండి...
కొత్త ఇళ్లూ, పెద్ద పెద్ద భవనాలూ, రెస్టరంట్లూ, ఆఫీసులూ... ఇలా కొత్తగా నిర్మించేవి ఏవైనా సరే, మారుతున్న కాలానికి తగ్గట్టుగా కట్టుకోవడమే కాదు, లోపలా బయటా కూడా చక్కగా అలంకరించుకుంటున్నారు. లోపలి డెకరేషన్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, బయట వాతావరణమూ మరెంతో ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే రకరకాల పచ్చనిచెట్లను అలంకరణకోసం పెంచుకుంటున్నారు. అయితే ఆ చెట్లన్నింటిలోనూ చూడగానే ఆకట్టుకునే కొబ్బరిచెట్లను వేగంగా పెంచడం కుదరదు అనుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు అందుకూ పరిష్కారం వచ్చేసింది. రెడీమేడ్‌గా కొబ్బరిచెట్లూ దొరుకుతున్నాయి. మామూలుగా రహదారులు వేస్తున్నప్పుడో, ఇంటినిర్మాణాలప్పుడో అడ్డుగా ఉన్న చెట్లను ఒక దగ్గరి నుంచి మరో దగ్గరికి తీసుకెళ్లి నాటడం గురించి తెలిసిందే. కానీ ఇప్పుడు అలా మనకు నచ్చినచోటకి శుభానికి గుర్తుగా ఉంటూ ఆ ప్రాంతానికే కొత్త అందాన్ని తెచ్చిపెట్టే కొబ్బరి చెట్లనూ రీ ప్లాంటేషన్ చేస్తున్నారు. అంటే అసలు మన దగ్గర ఆ చెట్టు లేకపోయినా తెచ్చి పెట్టుకోవచ్చన్నమాట.
ఎలా చేస్తారు...
రకరకాల మొక్కల పెంపకంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల గురించి వినే ఉంటారుగా. ఇక్కడి నుంచే తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్... ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు నెలకు వందలాది సంఖ్యలో రెడీమేడ్ కొబ్బరి చెట్లను పంపుతున్నారు. అసలీ ఆలోచన ఎలా మొదలైందీ అంటే... వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం... కొందరు రైతులు కొబ్బరిలో అంతర పంటగా వాణిజ్య పంటలు వేస్తున్న నేపథ్యంలో కొబ్బరి చెట్లను తొలగించేస్తున్నారట. కొన్నేళ్లు ఎదిగిన ఆ చెట్టు అలా వృథాగా పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రెడీమేడ్ కొబ్బరి చెట్ల పద్ధతిని తీసుకొచ్చారు నర్సరీ నిర్వాహకులు. అలా రైతులకు డబ్బు చెల్లించి ఆ చెట్లను అక్కడి నుంచి జాగ్రత్తగా తీసి విక్రయిస్తున్నారు. అయితే ఇదంతా అంత సులువుగా అయ్యే పనేం కాదు... ఒక చెట్టును దశల వారీగా తొలగించేందుకు కనీసం 10 రోజులు పడుతుందట. యంత్రాలు వాడకుండా చెట్టు మొదలు దగ్గర మట్టిని తొలగించి, చెట్టును క్రేన్ సాయంతో పెద్దవాహనాల్లో నర్సరీకి తరలిస్తారు. తోట నుంచి చెట్లను నర్సరీకి తీసుకొచ్చాక సుమారు నాలుగు అడుగుల మేర గొయ్యి తవ్వి వాటిని పాతుతారు. చెట్టు బతికి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లు నాటేందుకూ... గాలులూ, ఇతర విపత్తుల సమయంలో కూలిపోకుండా ఉండేందుకూ... కొబ్బరి ఆకుల్ని తాళ్లతో కట్టేస్తారు. కొద్ది రోజులకు వాటికి కొత్త ఆకులు చిగురిస్తే... అది రెడీమేడ్ చెట్టుగా సిద్ధం అయినట్టే అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎక్కడైనా నాటుకోవచ్చు. వీటిని ఎలాంటి నేలలో అయినా నాలుగు అడుగుల లోతూ, తగిన వెడల్పూ ఉన్న గోతిలో నాటి, వర్మీ కంపోస్టూ, సహజ ఎరువులూ వేసి అవి మళ్లీ చిగురించే వరకూ సంరక్షిస్తారట. చెట్టు నాటిన సుమారు నెల రోజులకు చిగుళ్లు వచ్చాక ఆకులకు కట్టిన తాళ్లను విప్పుతారట. అలా మొత్తానికి రెడీమేడ్ కొబ్బరిచెట్టు నాటుకుంటుంది.
వయసును బట్టి ధర!
ఈమధ్య కొబ్బరి చెట్లను కొత్తగా ఇల్లు కట్టుకున్నవాళ్లే కాదు... విల్లాలూ, రెస్టరంట్లూ, రిసార్టులూ, స్విమ్మింగ్ ఫూల్స్ వద్ద నాటేందుకూ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొబ్బరి మొక్కనాటి అది పెరిగి పెద్దయ్యే సరికి కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అదే దాదాపు 15 వేల నుంచి 20 వేల రూపాయల ధరలో దొరుకుతున్న ఈ రెడీమేడ్ చెట్లను కొనుగోలు చేస్తే తమకు నచ్చిన వ్యూలో, మెచ్చిన ప్రాంతంలో నాటుకోవచ్చు. ఏది ఏమైనా, ఈ రెడీమేడ్ కొబ్బరి చెట్ల వల్ల... అటు రైతులూ కొబ్బరి చెట్లను ఊరికే పారేయకుండా, ఇటు కొనుగోలుదారులూ ఎన్నో ఏళ్లు కొబ్బరి చెట్లకోసం వేచి చూడాల్సిన అవసరమూ లేకుండా ఉండటం మంచి విషయమే కదా!
మోహనరావు బనిశెట్టి, ఈనాడు, రాజమహేంద్రవరం
ఫొటోలు: శ్రీనివాసరావు, కడియం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
General News
AP High court: ఏపీ హైకోర్టు తరలింపు న్యాయస్థానాల పరిధిలోనే: కేంద్ర ప్రభుత్వం
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
-
General News
Polavaram: ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్