ఊరెళ్లాలా... లోను తీసుకోండి!

ఈ రోజుల్లో గ్యాడ్జెట్ల నుంచీ ఇంటికి అవసరమైన వస్తువుల వరకూ ఏది కొనుక్కోవాలనుకున్నా... చాలామంది ఈఎంఐ పద్ధతినే ఎంచుకుంటున్నారు.

Updated : 13 Apr 2024 15:10 IST

ఈ రోజుల్లో గ్యాడ్జెట్ల నుంచీ ఇంటికి అవసరమైన వస్తువుల వరకూ ఏది కొనుక్కోవాలనుకున్నా... చాలామంది ఈఎంఐ పద్ధతినే ఎంచుకుంటున్నారు. ఆ క్రమంలో కాస్త వడ్డీ పడినా ఒకేసారి డబ్బు మొత్తాన్నీ పెట్టక్కర్లేదు కాబట్టి నచ్చినవి కొనేసుకుంటూ విడతలవారీగా కట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే విధానాన్ని ప్రయాణాలకీ ఉపయోగించుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. అదెలాగో చూసేయండి మరి.

చాలామంది హీరోహీరోయిన్లు తమకు ఇష్టమైన అభిరుచి గురించి చెప్పమంటే... ప్రయాణించడం అనేస్తారు టక్కున. వాళ్లకు చేతినిండా డబ్బు ఉంటుంది కాబట్టి తీరిక దొరికినప్పుడల్లా నచ్చిన ప్రాంతానికి హాయిగా తిరిగొచ్చేస్తుంటారు. అదే మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ‘ఆర్నెల్ల ముందునుంచీ డబ్బును పొదుపు చేసుకోవాలి. పైగా అనుకున్న బడ్జెట్‌లోనే వెళ్లొచ్చేలా చాలా విషయాల్లో రాజీ కూడా పడాల్సి ఉంటుంద’ని చెబుతుంటారు మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు. అది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా, ఎవరైనా సరే చూడాలనుకున్న ప్రాంతానికి హాయిగా వెళ్లొచ్చేందుకు అవసరమైన డబ్బును అప్పుల రూపంలో అందిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇలా ఇచ్చిన డబ్బును కూడా విడతలవారీగా చెల్లించొచ్చు. నిజానికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా రకరకాల గ్యాడ్జెట్లూ, ఇంటికి అవసరమైన వస్తువులూ కొనేవాళ్లు ఎక్కువగా ఈఎంఐ విధానానికే ఓటేస్తారు. అదే పద్ధతిలో నచ్చిన చోటుకు వెళ్లొచ్చేయడమే ప్రయాణరంగంలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌.

ఎలా ఉపయోగించుకోవచ్చంటే..

సాధారణంగా ఓ సెల్‌ఫోన్‌, టీవీ, ఏసీ లాంటివాటిని కొనాలనుకున్నప్పుడు కుదిరితే ఒకేసారి డబ్బు మొత్తం కట్టేస్తాం. లేదంటే ఈఎంఐ విధానాన్ని ఎంచుకుంటాం. ఆ తరువాత మూడు, ఆరు, తొమ్మిది, పన్నెండు నెలల చొప్పున వాయిదాల్లో డబ్బును చెల్లిస్తాం. ప్రయాణానికి సంబంధించి డబ్బు ఇచ్చే సంస్థలు కూడా ఇంచుమించు ఇలాగే పనిచేస్తాయి. ముందుగా ఆ సంస్థల ద్వారా డబ్బును తీసుకుని మనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లొచ్చి.. ఆ తరువాత విడతలవారీగా కట్టొచ్చు అన్నమాట. అలాంటి సేవల్ని అందిస్తున్న సంస్థల్లో సంకష్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, మేక్‌ మై ట్రిప్‌, మిహురు, రూట్‌మేట్‌, సీజన్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, కయాక్‌... వంటివెన్నో ఉన్నాయి. వీటిల్లో సంకష్‌ రెండురకాలుగా సేవలందిస్తుంది. ఈ సంస్థ ద్వారా మనం వెళ్లాలనుకున్న ప్రాంతాన్ని బట్టి - కావాల్సిన డబ్బును మాత్రమే తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా ప్యాకేజ్‌ పద్ధతిలో అన్నిరకాల ఏర్పాట్లు చేయమని కూడా అడగొచ్చు. ఆ తరువాత డబ్బును ఆరు నెలలనుంచీ ఏడాదిలోపు చెల్లించొచ్చు. ఆరునెలల వరకూ వడ్డీ ఉండదు కానీ ఆ వ్యవధి మించితే కాస్త భారం పడుతుంది. అదేవిధంగా బజాజ్‌ఫిన్‌సర్వ్‌, మేక్‌ మై ట్రిప్‌, యాత్ర, మిహురు వంటి సంస్థలు కూడా మన అవసరాలకు తగినట్లుగా డబ్బును అందిస్తాయి. వీటికి కాస్త భిన్నంగా సేవలందిస్తాయి రూట్‌మేట్‌, సీజన్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థలు. ఎలాగంటే... ఈ సంస్థల ద్వారా రకరకాల ప్రాంతాల గురించి తెలుసుకున్నాక వెళ్లాలనుకున్న దాన్ని బట్టి డబ్బును అంచనా వేసుకోవాలి. ఆ డబ్బును ఆర్నెల్లు లేదా ఏడాది ముందు నుంచీ నెలవారీ కొంత చొప్పున ఈ సంస్థల్లోనే జమచేయాలి. ఆ డబ్బుతో ఈ సంస్థల ద్వారానే ప్యాకేజీలను ఎంచుకుంటే ఏర్పాట్లన్నీ ఇవే చూసుకుంటాయి. అదే కయాక్‌ ద్వారా అయితే... తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే ఫ్లైట్ల వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది మరి ఈ సేవల్ని ఎలా ఉపయోగించుకోవచ్చని అంటారా...  ఏమీ లేదు.. వీటిల్లోకి లాగిన్‌ అయి- వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకుంటే ఆ సిబ్బందే సంప్రదిస్తారు. ప్యాకేజీలూ, వాళ్లు అందించే సేవలూ, ఈఎంఐల వివరాలూ, ఇవ్వాల్సిన డాక్యుమెంట్ల గురించి తెలియజేస్తారు. ఆ ప్రకారం చేస్తే సరిపోతుంది. అదండీ సంగతి... ఈసారి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు - ఒకేసారి డబ్బు మొత్తం సమకూర్చుకోలేక అవస్థ పడకుండా ఇలాంటి సేవల ద్వారా హాయిగా వెళ్లొచ్చేసి ఆ తరువాత విడతలవారీగా డబ్బును చెల్లించుకుంటే సరి. ఏమంటారూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు