పసందుగా... ఇఫ్తార్‌ విందు!

రంజాన్‌ మాసంలో రోజంతా ఉపవాసం ఉండే ముస్లింలు... సాయంత్రం భోంచేయడం పరిపాటి. ఆ ఇఫ్తార్‌ విందులో ఈ వంటకాలనూ చేర్చుకుని చూస్తే సరి...

Published : 23 Apr 2022 23:20 IST

పసందుగా... ఇఫ్తార్‌ విందు!

రంజాన్‌ మాసంలో రోజంతా ఉపవాసం ఉండే ముస్లింలు... సాయంత్రం భోంచేయడం పరిపాటి. ఆ ఇఫ్తార్‌ విందులో ఈ వంటకాలనూ చేర్చుకుని చూస్తే సరి...


ముర్గ్‌ మఖానీ

కావలసినవి: మారినేషన్‌కోసం: చికెన్‌: కేజీ, ఉప్పు: చెంచా, దనియాలపొడి-కారం: చెంచా చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, నూనె: ఒకటింబావు కప్పు. మసాలాకోసం: ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత,
దనియాలపొడి - కారం - గరంమసాలా: రెండు చెంచాల చొప్పున, కసూరీమేథీ: చెంచా, టొమాటో ముక్కలు: అరకప్పు, క్రీమ్‌: పావుకప్పు.

తయారీ విధానం: మారినేషన్‌ కోసం పెట్టుకున్న పదార్థాలను ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి పావుకప్పు నూనె వేసి... చికెన్‌ ముక్కలు, క్రీమ్‌ తప్ప మిగిలిన పదార్థాలను వేసి వేయించాలి. టొమాటో ముక్కలు ఉడికాక ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ముక్కల్ని మిగిలిన నూనెలో వేయించి తీసుకోవాలి. అదే నూనెలో చేసి పెట్టుకున్న మసాలాను వేేయించి చికెన్‌ ముక్కలు, క్రీమ్‌ వేసి కలిపి దింపేయాలి.


యాక్నీ పులావ్‌

కావలసినవి: బాస్మతీబియ్యం: నాలుగుకప్పులు (అర గంట ముందు నానబెట్టుకోవాలి), కుంకుమపువ్వు: చిటికెడు (చెంచా పాలలో నానబెట్టుకోవాలి), నెయ్యి: అరకప్పు, బిర్యానీ ఆకులు: రెండు, పచ్చిమిర్చి: ఆరు, పెరుగు: కప్పు, ఉల్లిపాయలు: రెండు, ఉప్పు: సరిపడా, గరంమసాలా: చెంచా, నిమ్మకాయ: ఒకటి, ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు: పావుకప్పు. మటన్‌ స్టాక్‌కోసం: మటన్‌: కేజీ, జీలకర్ర- సోంపు-ఎండు గులాబీరేకులు: టేబుల్‌స్పూను చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను,
అనాసపువ్వు: ఒకటి, యాలకులు: పది, లవంగాలు: పన్నెండు, దాల్చినచెక్క: పెద్ద ముక్క, దనియాలు: రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు: ఎనిమిది కప్పులు, ఉప్పు: అరచెంచా.

తయారీ విధానం: ముందు మటన్‌ స్టాక్‌ చేసుకోవాలి. ఓ పల్చని వస్త్రంలో స్టాక్‌కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసుకుని మూటలా కట్టుకోవాలి. కుక్కర్‌లో ఈ మూట, మటన్‌ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి మూతపెట్టి మూడు కూతలు వచ్చాక దింపేయాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బిర్యానీ ఆకులు, ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయించి మటన్‌ముక్కలు, తగినంత ఉప్పు, గిలకొట్టిన పెరుగు వేసి బాగా వేయించాలి. ఇందులో కడిగిన బియ్యం, మటన్‌ ఉడికించిన నీళ్లు, గరంమసాలా, నిమ్మరసం వేసి స్టౌమీద పెట్టాలి. బియ్యం తొంభైశాతం ఉడికాక కుంకుమపువ్వు నానబెట్టుకున్న పాలు, వేయించిన ఉల్లిపాయముక్కలు పైన వేసి మూత పెట్టి పావుగంటయ్యాక స్టౌని కట్టేయాలి.


పెసర పకోడీ

కావలసినవి: పెసరపప్పు: కప్పు (గంట ముందు నానబెట్టుకోవాలి), ఉల్లిపాయలు: మూడు, పచ్చిమిర్చి: రెండు, జీలకర్ర: చెంచా, గరంమసాలా: చెంచా, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: మూడు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర టేబుల్‌స్పూను, నూనె: వేయించేందుకు సరిపడా, చాట్‌మసాలా: అరచెంచా.

తయారీ విధానం: నానబెట్టుకున్న పెసరపప్పును ఎండుమిర్చితో కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి కలుపుకోవాలి. ఈ పిండిని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


రైస్‌ఖీర్‌

కావలసినవి: బాస్మతీబియ్యం: అరకప్పు, పాలు: రెండున్నర కప్పులు, కుంకుమపువ్వు: చిటికెడు, నెయ్యి: టేబుల్‌స్పూను, బాదం: పావుకప్పు, సొరకాయ తురుము: కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం: పావుకప్పు, జీడిపప్పు ముద్ద: పావుకప్పు, కండెన్స్‌డ్‌మిల్క్‌: కప్పు, యాలకులపొడి: చెంచా, గులాబీనీరు: చెంచా.

తయారీ విధానం: కుంకుమపువ్వును చెంచా పాలలో నానబెట్టుకోవాలి. బాస్మతీబియ్యాన్ని కాసేపు నానబెట్టుకుని తరువాత తడిపోయేలా ఆరబెట్టి పిండిలా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి... బాదంపలుకుల్ని వేయించుకుని తీసుకోవాలి. అందులోనే సొరకాయ తురుమును వేయించి, కాసిని నీళ్లు పోసి ఉడికాక దింపేయాలి. స్టౌమీద ఓ గిన్నె పెట్టి పాలు పోయాలి. అవి మరిగాక సగ్గుబియ్యం, బియ్యప్పిండి వేసి కలపాలి. సగ్గుబియ్యం ఉడికాక మిగిలిన పదార్థాలను వేసుకుని బాగా కలిపి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..