కూరగాయలు... మాత్రల రూపంలో!

బీట్‌రూట్‌, క్యారెట్‌ను రోజూ చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. తరచూ ఆకుకూరల్ని తింటే మంచిదని డాక్టర్లు ఎంత చెప్పినా... వండుకునేవారి సంఖ్య తక్కువే. చేదు పేరుతో కాకరకాయను దూరం పెట్టేస్తుంటారు చాలామంది.

Published : 15 May 2022 01:15 IST

కూరగాయలు... మాత్రల రూపంలో!

బీట్‌రూట్‌, క్యారెట్‌ను రోజూ చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. తరచూ ఆకుకూరల్ని తింటే మంచిదని డాక్టర్లు ఎంత చెప్పినా... వండుకునేవారి సంఖ్య తక్కువే. చేదు పేరుతో కాకరకాయను దూరం పెట్టేస్తుంటారు చాలామంది. ఇవన్నీ గుర్తించారో ఏమో ఇప్పుడు చాలారకాల కూరగాయలను మాత్రల రూపంలో తయారుచేసి అప్పుడప్పుడూ వీటిని వేసుకుంటే సరి... అంటూ పరిష్కారాన్ని చూపించేస్తున్నారు నిపుణులు.

వారానికి సరిపడా తెచ్చుకునే కూరగాయల్లో వంకాయలూ, బెండకాయల నుంచి టొమాటోలూ, ఆకుకూరల వరకూ అన్నీ ఉంటాయి. జ్యూస్‌ చేసుకుందామని బీట్‌రూట్‌ - క్యారెట్‌ తెచ్చుకున్నా వాటి చెక్కుతీసి, ముక్కలు కోసి, మిక్సీపట్టి, వడకట్టుకుని తాగడం అంటే పెద్ద పని కాబట్టి ఆ ముచ్చట ఒకటిరెండు రోజులే ఉంటుంది. దాంతో మిగిలిపోయినవి ఫ్రిజ్‌లో ఓ మూలన ఉండిపోతాయి. ఆకుకూరలూ అంతే... వాటిని కాడల్లేకుండా కోసి, మట్టిపోయేలా శుభ్రంగా కడిగి పప్పో, కూరో వండుకుంటే బాగానే ఉంటుంది కానీ ‘మొన్నేగా పాలకూర పప్పు చేసుకుంది... ఇవాళ మళ్లీ మెంతికూర ఏం వండుకుంటాంలెమ్మ’ని పక్కన పెట్టేస్తుంటారు. దాంతో అవి కుళ్లిపోయి చివరకు పారేయాల్సి వస్తుంది. పిల్లలు కాకరకాయను తినరు కాబట్టి ఇంట్లో ఉన్న నలుగురికోసం రెండురకాల కూరల్ని ఏం చేస్తామనే ఉద్దేశంతో అసలు కాకరకాయల్నే కొనరు కొందరు. మరికొన్ని కూరగాయల విషయంలోనూ ఇలాంటి సమస్యలే ఏవో ఒకటి ఉంటాయనే కారణంతో ప్రతి వారం దాదాపుగా ఒకేరకం కూరగాయల్ని తెచ్చుకుంటూంటారు కొందరు. కానీ ఎప్పుడూ ఒకే తరహా కూరగాయల్ని కొనుక్కొంటూ మిగిలినవాటిని పక్కన పెట్టేయడం వల్ల శరీరానికి అవసరమైన చాలా పోషకాలు అందవు. ఈ సమస్యలన్నీ ఆలోచించే కూరగాయలను మాత్రల రూపంలో తీసుకొచ్చేశారిప్పుడు. కొన్నాళ్లక్రితం వరకూ పండ్లూ,  కూరగాయలను పొడులు చేసి అమ్మేవారు. క్రమంగా పండ్లను మాత్రల రూపంలో తయారుచేస్తే... ఇప్పుడు కూరగాయల్నీ అలాగే తెస్తున్నారు. ఉదాహరణకు బీట్‌రూట్‌ను తినడం వల్ల శరీరంలో రక్తశుద్ధి జరిగి, అధికరక్తపోటు అదుపులో ఉండి చర్మం ఆరోగ్యంగా ఉంటుందనేది తెలిసిందే. కానీ దాన్ని రోజూ కూర రూపంలో లేదా జ్యూస్‌గా తీసుకోవడం కష్టం అనుకునేవారికి ఆ మాత్రలు పరిష్కారాన్ని చూపిస్తాయి. క్యారెట్‌ పిల్స్‌తోనూ అలాంటి లాభమే ఉంటుంది. వాటిని రోజుకోటి వేసుకోవడం వల్ల కంటిచూపు మెరుగవ్వడంతోపాటూ చర్మం కూడా బాగుంటుందని అంటారు నిపుణులు. ఇవి మాత్రమే కాదు... ఇప్పుడు చాలా కూరగాయలు ఇలాగే వస్తున్నాయి.

కూరగాయల సారమే...

మధుమేహులు రోజూ మెంతుల్ని నానబెట్టుకుని తింటే రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయని అంటారు. అయితే రోజూ వాటిని తినాలంటే మాటలుకాదు. బదులుగా ఇప్పుడు వచ్చే మెంతికూర మాత్రల్ని వేసుకుంటే సరిపోతుంది. టొమాటో, పాలకూర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పుదీనా.. వంటి వాటితో తయారుచేసిన మాత్రలతోనూ అలాంటి లాభాలే ఉంటాయి. అంటే... వాటినుంచి వచ్చే పోషకాలను ఈ మాత్రలతోనూ పొందవచ్చన్నమాట. ఎందుకంటే... వీటన్నింటినీ ఆ కూరగాయల సారం నుంచే తయారుచేస్తారు మరి. అయితే... ఒక్కో కూరకు ఒక్కో మాత్ర వేసుకుంటూ కూర్చోలేం కదా అనుకోవచ్చేమో... నిజమే కానీ... ఎప్పుడైనా ఆ కూరను తరచూ తినలేని పరిస్థితుల్లో దానికి సంబంధించిన ఒక మాత్రను వేసుకుంటే ఆ పోషకాలు కనీసం కొన్నయినా శరీరానికి అందుతాయి. ఇక, మల్టీవిటమిన్‌ మాత్రలు దొరుకుతున్నప్పుడు... వీటిని ఎందుకు వేసుకోవాలనే సందేహం కలగడం మామూలే కానీ... ఈ మాత్రల్లో ఆ కూరగాయల సారం లేదా పొడి ఎక్కువగా ఉండి ఇతర కెమికల్స్‌ మోతాదు నామమాత్రంగానే ఉంటుంది కాబట్టి సందేహం లేకుండా వేసుకోవచ్చు. అయితే... సహజ కూరగాయలకు ఇవి ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాలేవు కానీ... వాటిని తీసుకోలేని సందర్భాల్లో మాత్రమే ఈ మాత్రల్ని వేసుకోవచ్చు. అయితే ముందుగా డాక్టర్ల సలహా తప్పనిసరి అని మాత్రం మరవకండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు