చిట్టి గుడి... మన ఇంటికి వస్తే!

నేటి పూజగది... భక్తికే కాదు సౌందర్యానురక్తికీ వేదికవుతోంది. నూతన అలంకరణలకూ నిలయమవుతోంది. ఒక్క దేవతా ప్రతిమలే కాకుండా హారతి పళ్ళెం నుంచీ అగరుబత్తీ స్టాండ్‌ దాకా అన్నీ సరికొత్త అందాలని సంతరించు కుంటున్నాయి.

Published : 16 Jun 2024 00:11 IST

నేటి పూజగది... భక్తికే కాదు సౌందర్యానురక్తికీ వేదికవుతోంది. నూతన అలంకరణలకూ నిలయమవుతోంది. ఒక్క దేవతా ప్రతిమలే కాకుండా హారతి పళ్ళెం నుంచీ అగరుబత్తీ స్టాండ్‌ దాకా అన్నీ సరికొత్త అందాలని సంతరించు కుంటున్నాయి. ఆ వరసలో తాజాగా  వచ్చి చేరింది- ‘మినియేచర్‌ గుడి’. మన ఇష్టదైవం తిరుమల వెంకటేశ్వరుడు కావొచ్చు, వేములవాడ రాజరాజేశ్వరుడు అయ్యుండొచ్చు... ఆ ఆలయాల అతిచిన్న నమూనాలని యథాతథంగా సృష్టిస్తున్నారిప్పుడు. అనాది శిల్పకళకి ‘3డీ ఆటోక్యాడ్‌’ సాంకేతికతని అద్ది అద్భుతాలే చేస్తున్నారు...

ప్రముఖ క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ ఆలయాలకి సంబంధించిన ఫొటోలు అమ్ముతుంటారు. ఇలా ఫొటో రూపంలో తప్ప- ఆ ఆలయాన్ని ఉన్నదున్నట్టు చిట్టి నమూనా(మినియేచర్‌ మోడల్‌)గా మార్చి విక్రయించే ఆనవాయితీ మన దగ్గర లేదు. నవరాత్రి బొమ్మల కొలువుకని ప్లాస్టిక్‌తోనూ, చెక్కతోనూ చేసి కొన్నిచోట్ల అమ్ముతుంటారు కానీ- అవి కళాత్మకంగా ఉండవు. ఆలయంలోని ప్రతి గోపురమూ, ఆ గోపురంలోని శిల్పాలూ, ఆ శిల్పాల్లోని నగలూ పూలూ అన్నీ యథాతథంగా వచ్చేంత ‘డీటైలింగ్‌’ వాటిల్లో ఉండదు. ఏదో ఒక మూసలో పోసి తీసినట్టు ముద్దగా అనిపిస్తుంటాయంతే. తిరుమల, తిరువణ్ణామలై, మదుర మీనాక్షి గుడి వంటి ఆలయాల్లో ఆయా ఆలయ నిర్వహణా సంస్థలే ఇలాంటి నమూనాలని ప్రత్యేకంగా శిల్పుల చేత చేయించి ప్రదర్శిస్తున్నాయి కానీ అవి ఎక్కడా అమ్మకానికి దొరకవు. ఆ సంస్థలు చేసినట్టు ఏ శిల్పి చేతో ఓ చిట్టి నమూనాని తయారు చేయించి ఇంట్లో అలంకరించుకోవడం సామాన్యులకి సాధ్యమయ్యేది కాదు... మొన్నటిదాకా. ఆధునిక కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఆసరాతో... ఆ అద్భుత కళని సామాన్యులకి చేరువ చేస్తున్నాయి సంస్థలు కొన్ని. ప్రదర్శనలకే పరిమితమైన ఆలయ చిట్టి నమూనాలని... పూజగదికీ తెచ్చేస్తున్నాయి!

విదేశాల్లో ఎక్కువ...

విదేశాల్లో ప్రసిద్ధిచెందిన అన్ని చర్చిలకూ చిట్టి నమూనాలు వాటి ప్రాంగణంలో ఉండి తీరుతాయి. ఆ దైవసన్నిధుల్ని చూసి... ఆనందించలేని అంధులు తాకి తెలుసుకునేలా ఈ నమూనాలని కంచుతో చేసి పెడుతుంటారు. వాటిపైన బ్రెయిలీ అక్షరాల్ని చెక్కిస్తుంటారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ నలుమూలల్లోని శిల్పులూ, కళాకారులూ అలాంటివాటిని తయారుచేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండేవారు. కనీసం ఆరు నెలలు శ్రమించి వాటిని చేసేవారు. కానీ- 3డీ ప్రింటింగ్‌ విప్లవం ఈ శ్రమనంతటినీ తగ్గించేస్తోంది. కొన్నివారాల్లోనే మనం కోరుకునే నమూనా సిద్ధమయ్యేలా చూస్తోంది. దాంతో- ఒకప్పుడు విదేశాల్లోని శిల్పులు వ్యక్తిగతంగా చేస్తున్న పనిని ఇప్పుడు చైనాకి చెందిన కొన్ని కంపెనీలు తలకెత్తుకున్నాయి. ‘చిట్టి చర్చి’లను ఓ కుటీర పరిశ్రమలా తయారుచేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. సరిగ్గా- ఈ ధోరణినే స్ఫూర్తిగా తీసుకుని మనదేశంలో శిలై, ఎవన్జీ, ప్రజ్ఞాన్‌ వంటి సంస్థలు ఆవిర్భవించాయిప్పుడు. ఆన్‌లైన్‌ వేదికగా ఆలయాల నమూనాలని అందరికీ అందిస్తున్నాయి. కశ్మీర్‌లోని వైష్ణోదేవి నుంచీ కన్యాకుమారి ఆలయం దాకా ఉన్న ప్రసిద్ధ గుడులన్నింటినీ- మనం కోరుకున్నట్టు చేసిస్తున్నాయి. అచ్చు అసలు ఆలయాన్ని పొట్టి రూపంలోకి దించేస్తున్నాయి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..