ఫ్యాషన్‌ మేళా!

కొప్పు లేకపోయినా... ‘హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌’తో చాలామంది అమ్మాయిలు హెయిర్‌ స్టైల్స్‌ వేసుకుంటున్నట్టే... స్టైలిష్‌ గడ్డం, మీసం లేకపోయినా అబ్బాయిలూ నచ్చిన గడ్డాన్నీ, మీసం లుక్కునీ తెప్పించుకోవచ్చు. అన్ని వేడుకల్నీ తాకిన ఫొటోషూట్‌ ట్రెండ్‌లోనూ ఒక్క డ్రెస్సుతోనే కాదు... మొత్తం హెయిర్‌ లుక్కుతోనూ ముస్తాబంతా అదరగొట్టేయొచ్చు.

Published : 23 Oct 2022 00:28 IST

ఫ్యాషన్‌ మేళా!

ఏ గడ్డం కావాలి?

కొప్పు లేకపోయినా... ‘హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌’తో చాలామంది అమ్మాయిలు హెయిర్‌ స్టైల్స్‌ వేసుకుంటున్నట్టే... స్టైలిష్‌ గడ్డం, మీసం లేకపోయినా అబ్బాయిలూ నచ్చిన గడ్డాన్నీ, మీసం లుక్కునీ తెప్పించుకోవచ్చు. అన్ని వేడుకల్నీ తాకిన ఫొటోషూట్‌ ట్రెండ్‌లోనూ ఒక్క డ్రెస్సుతోనే కాదు... మొత్తం హెయిర్‌ లుక్కుతోనూ ముస్తాబంతా అదరగొట్టేయొచ్చు. ఎలాగంటే...‘మెన్స్‌ ఫేక్‌ బియర్డ్‌ ముస్టాష్‌’ పేరుతో వెంట్రుకలతో చేసిన గడ్డాలూ, మీసాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మరి. నూనూగు మీసాల పైనో, నున్నటి గడ్డం మీదనో వీటిని అతికిస్తే- నిజమైనది కాదంటే ఎవరూ నమ్మనంత సహజంగా కనిపిస్తాయి. ఫొటోల కోసమే కాదు... కొంతమంది అబ్బాయిలకు ఫ్రెంచ్‌ బియర్డ్‌ లాంటివి ఇష్టమున్నా, ఏ హీరో గడ్డం స్టైల్‌ నచ్చినా- ఉన్న మీసాలూ, గడ్డాలతో అలా చేయించుకోవడం కుదరకపోవచ్చు. దాన్ని మెయింటేన్‌ చేయడమూ చాలా కష్టమే. అలాంటప్పుడు వీటిని కాస్త ట్రై చేసి చూడొచ్చు... ఏమంటారు?


లంబానీ కుట్టు... మీకు నచ్చిందా!

కొన్నిసార్లు ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయ కళలూ- కాస్త మార్పులతో వచ్చి ఈతరం అమ్మాయిల మనసును దోచుకుంటాయి. ఓసారి అద్దాల కుట్టు ఆకట్టుకుంటే, కొన్నాళ్లకు కాసుల కుట్టు కనికట్టుచేసింది. ఇక ఎప్పుడూ అవేనా... అనేవారి కోసం ఈమధ్య ‘లంబానీ ఎంబ్రాయిడరీ’ ట్రెండ్‌... చీరలూ, బ్లౌజుల మీదకూ చేరి అతివల్ని మెప్పిస్తోంది. కర్ణాటకలోని సండూరుకి ప్రత్యేకమైన ఈ ఎంబ్రాయిడరీ అక్కడ గిరిజనులకు చెందిన కళ. కిలాన్‌, వేలే... అంటూ  పద్నాలుగు రకాల కుట్లతో ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ. క్లాత్‌ మీద రంగుల దారాలతో రకరకాల ఆకారాల్లో గవ్వలూ, అద్దాలూ జతచేస్తూ చేతితో కుడతారు. సూదీ దారంతోనే దుస్తులకు ఎంతో అందాన్ని తీసుకొస్తారు. కొత్తదనం కోరుకునే మహిళలకి తెగ నచ్చేయడంతో ఈ కుట్టుకి ఆదరణ పెరిగిపోయింది!  


చలికాలానికి వెచ్చటి లెగ్గింగ్స్‌!

వాతావరణం చల్లగా ఉందంటే డ్రెసింగ్‌ స్టైల్‌ని కూడా మార్చేస్తాం. ఒంటిని వెచ్చగా ఉంచే రకరకాల దుస్తులు వేసుకుంటాం. అయితే వేసుకునే ఆ దుస్తులు మామూలుగా కాకుండా కాస్త ట్రెండీగా ఉంటేనే అవి ఈతరాన్ని మెప్పించగలవు. అందుకే చొక్కాల దగ్గర్నుంచి ప్యాంట్ల వరకూ బోలెడన్ని రకాల దుస్తులు- వెచ్చదనాన్ని ఇవ్వడానికి మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో భాగంగానే అమ్మాయిలు ఎక్కువగా వాడే లెగ్గింగ్స్‌లోనూ ఓ కొత్తరకం వచ్చేసింది. ‘వింటర్‌ విమెన్స్‌ వార్మ్‌ ప్రింటెడ్‌ లెగ్గింగ్స్‌, థెర్మల్‌ లెగ్గింగ్స్‌’ పేరుతో ఎన్నో ప్యాంట్లు దొరుకుతున్నాయి. వివిధ రకాల ప్రింట్లతో వస్తున్న ఈ లెగ్గింగ్స్‌ చూడ్డానికి పై నుంచి మామూలు వాటిలానే కనిపించినా వేసుకుంటే మాత్రం లోపలున్న ఉన్నీ, వెల్వెట్‌ క్లాత్‌ వల్ల శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. మరైతే ఈ చలికాలం ఎప్పుడూ వాడే లెగ్గింగ్స్‌కు బదులు వీటిని ఎంచుకు న్నారంటే... ఫ్యాషన్‌గా ఉంటూనే వెచ్చని హాయినీ పొందవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు