వధువు జడలో గడ్డిపూల సందడి

ఓ పదేళ్లక్రితం... పెళ్లి కూతురి జడ అలంకరణలో మల్లెలూ గులాబీలూ లిల్లీలూ... వంటి సుగంధ పుష్పాలు మాత్రమే కనిపించేవి. ఆ తరవాత చామంతులూ కార్నేషన్లూ ఆర్కిడ్లూ చొచ్చుకొచ్చాయి.

Updated : 19 Oct 2022 16:03 IST

వధువు జడలో గడ్డిపూల సందడి

ఓ పదేళ్లక్రితం... పెళ్లి కూతురి జడ అలంకరణలో మల్లెలూ గులాబీలూ లిల్లీలూ... వంటి సుగంధ పుష్పాలు మాత్రమే కనిపించేవి. ఆ తరవాత చామంతులూ కార్నేషన్లూ ఆర్కిడ్లూ చొచ్చుకొచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూడండి... పెళ్లికూతుర్ని చేసినప్పుడో మంగళస్నానం చేయించేటప్పుడో అమ్మాయి జడలోనో సిగలోనో తెలుపు రంగు గడ్డి పూల గుత్తులు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఏమిటివీ... ఎక్కడివీ... నిజంగానే గడ్డిపూలేనా... చూద్దాం.

నాలుగు చినుకులు పడగానే నేలలోంచి పైకి లేచిన పచ్చని తివాచీ మీద మంచు పూలను ఆరబోసినట్లుగా మెరుస్తుంటాయి గడ్డిపూలు. వాటిని చూసి పరవశిస్తామేగానీ తలలో తురుము కోవాలనుకోం. కానీ... ఎవరుమాత్రం ఊహించగలరు... ఏదో ఒక రోజున కొండల్లో కోనల్లో రోడ్డుపక్కనా స్నిగ్ధ సోయగంతో మెరిసే ఆ గడ్డి పూలకీ మార్కెట్లో బోలెడు డిమాండ్‌ రావచ్చు. అమ్మాయిల జడలో సిగలో ఆ పూలే అందంగా విరియనూ వచ్చు. అవునుమరి, నేడు పెళ్లిళ్లలో అమ్మాయిల తలలో గుత్తులుగా కనిపించే పూలను చూస్తే ఎవరికైనా ఇలానే అనిపించడం సహజం... వాటి పేరే బేబీస్‌ బ్రెత్‌. దూరం నుంచి చూస్తే గడ్డిపూల మాదిరిగా కనిపిస్తాయి.

ఏమిటీ బేబీస్‌!

నాలుగైదేళ్ల కిందట- ఈ పూలతో అంతో ఇంతో పరిచయం ఉన్నవాళ్లెవరూ కూడా మున్ముందు ఇవి భారతీయ పెళ్లి అలంకరణలోనూ అందంగా విరుస్తాయని ఊహించి ఉండరు. ఎందుకంటే- ఐరోపా, అమెరికా దేశాల్లో ఎక్కువగా పెరిగే కార్నేషన్‌ జాతుల్ని పోలిన పుష్పాలివి. ఆకు కనిపించకుండా కొమ్మలూ రెమ్మలుగా విరిసే ఈ పూలను అందంకోసం ఉద్యానవనాల్లో పెంచుతుంటారక్కడ. తెలుపుతోపాటు లేత గులాబీ, ఎరుపూ రంగుల్లోనూ పుష్పిస్తాయివి. దాంతో అక్కడి వేడుకల్లోనూ బొకేల అలంకరణలోనూ తరచూ కనిపిస్తుంటాయీ చిట్టి పూలు. క్రమంగా పెళ్లి వేడుకల్లో వేసుకునే హెయిర్‌స్టైల్స్‌లో ఇతర కార్నేషన్స్‌తో కలిపి వీటిని అలంకరించడం మొదలైంది. ఆ పూలగాలి మనవాళ్లకీ చేరినట్లుంది... దాంతో ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా అందరి పెళ్లి వేడుకల్లో ఈ పూలే కనిపిస్తున్నాయి. మెహందీ, సంగీత్‌, హల్దీ, పెళ్లికూతురు... ఇలా ఒక్కో వేడుకకీ ఒక్కోలా తయారయ్యే పెళ్లికూతుళ్ల హెయిర్‌స్టైల్స్‌లో భాగంగా ఈ పూలనీ అలంకరించడం పెరిగింది. ఆకుపచ్చ దారానికి చిట్టి ముత్యాల్ని గుచ్చినట్లుగా తెలుపూ ఆకుపచ్చా రంగుల కలయితో కనిపించే ఈ బేబీస్‌ బ్రెత్‌ పూలు, మల్లెలూ ఆర్కిడ్లూ గులాబీలూ... ఇలా అన్నింటిలో ఇమిడిపోతాయి. పైగా బరువుండవు. దాంతో జడలతోపాటు విరబోసిన జుట్టులోనూ ఈ పూలను పెడుతున్నారు. ముఖ్యంగా పొట్టి జడలో అక్కడక్కడా ఈ రెమ్మల్ని గుచ్చితే ఆ లుక్కే వేరు అంటారు హెయిర్‌ స్టైలిస్ట్‌లు. పొడవు జడలకి పెట్టే వేణీల్లోనూ బేబీస్‌ బ్రెత్‌ అందాలు చిందిస్తున్నాయి. ముడుల్నీ ఈ పూరెమ్మలు చుట్టేస్తున్నాయి. ముడి చుట్టూ లేదా ముడి మొత్తంగా పెట్టినా ఆ సోయగాన్ని చూసి తీరాల్సిందే. పైగా వీటికి రంగులద్ది చీరలకి మ్యాచింగ్‌ గానూ పెట్టేసుకుంటున్నారు కొందరు.

హల్దీ వేడుకకోసం చేతులకి పెట్టుకునే జ్యువెలరీలోనూ ఈ పూల ముచ్చటే. ఈ పూలమాలల్నే వరమాలలు గానూ వేసుకుంటున్నారు. ఇక, వేదిక నుంచి ఫొటోబూత్‌ అలంకరణ వరకూ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ చిట్టి పూల సందడే. ఇంట్లో అలంకరించు కునే వేజ్‌ల్లోనూ ఈ బేబీస్‌ ఫ్లవర్స్‌ పలకరిస్తున్నాయి. మొత్తమ్మీద కళ్లకీ మనసుకీ ఆహ్లాదాన్ని పంచే బేబీస్‌ బ్రెత్‌ లేకుండా పెళ్లివేడుక పూర్తికావడం లేదంటే నమ్మండి!


ఫ్యాషన్‌ మేళా!

మువ్వల చెప్పులు!

అమ్మాయిల పాదాల్ని అంటిపెట్టుకుని ఉండే పట్టీల్లోని మువ్వలు... కాళ్ల చెప్పులపైకి చేరితే అదిరిపోదూ అనుకున్నారో ఏమో, ఫ్యాషన్‌ డిజైనర్లు ‘ఘుంఘ్రూ ఫుట్‌వేర్‌’ పేరుతో గజ్జెలతో అలంకరించిన నయా చెప్పుల్ని మార్కెట్లోకి దించేశారు. రకరకాల సైజుల్లోని మువ్వల్ని వేరువేరు డిజైన్లతో పాదరక్షలపైకి చేర్చేస్తున్నారు. మగువల మనసు దోచుకునేలా వాటికో సరికొత్త లుక్‌ను తీసుకొస్తున్నారు. పార్టీవేర్‌ శాండల్స్‌ నుంచి ఫ్లాట్స్‌ వరకూ మువ్వల సవ్వళ్లతో వస్తున్న ఈ వెరైటీ ఫుట్‌వేర్‌ కొత్తదనం కోరుకునేవారికి కచ్చితంగా నచ్చేస్తాయి.


ఎంబ్రాయిడరీ గాజులొచ్చాయ్‌!

చూడగానే ‘వావ్‌... భలే రెడీ అయ్యారే’ అని కితాబు అందుకోవడానికి చాలామంది అమ్మాయిలు చక్కని చీరతో పాటూ దానికి సరిపోయే గాజుల్నీ ఎంచుకుంటారు. శారీ రంగుకి మ్యాచింగ్‌గా వేసుకోవడానికి సిల్క్‌దారపు గాజుల ట్రెండ్‌ అలా వచ్చిందే. అయితే ఇప్పుడు అదే ఫ్యాషన్‌ ఒక అడుగు ముందుకేసి ఎంబ్రాయిడరీతో దర్శనమిస్తోంది. రంగే కాదు, బ్లౌజు మీద చేయించుకున్న వర్కూ మ్యాచ్‌ అయ్యేలా ‘ఎంబ్రాయిడరీ గాజు’ల్ని తయారుచేస్తున్నారు. క్లాత్‌పైన ముందుగానే పూసలూ, రాళ్లతో ఎంబ్రాయిడరీ చేసేసి ఆ తర్వాత దాన్ని గాజులకు అతికిస్తున్నారు. దీంతో ఇవి థ్రెడ్‌ బ్యాంగిల్స్‌లా కాకుండా ఎక్కువ రోజులు మన్నుతాయి. పైగా మెరిసే వర్కు సొబగులతో మరింత అందంగానూ ఉంటాయి. కావాలంటే మీ బ్లౌజు క్లాత్‌తోనే ప్రత్యేకంగా చేయించుకోవచ్చు కూడా!


లెదర్‌టై బాగుందా!

ఫార్మల్‌లుక్‌ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించే టై ఎప్పుడూ ఒకేలా ఉండాలా... అందులోనూ కాస్త వైవిధ్యం ఉంటే బాగుంటుంది కదా... అనుకునేవారు ట్రెండీ లుక్కుతో వస్తున్న ఈ లెదర్‌ టైలను ఎంచుకుంటే సరి. ఫ్యాషన్‌తో మెప్పించడం ఒక్కటే కాదు, సౌకర్యంలోనూ ఇది బెస్ట్‌ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీటిని సాధారణ టైల మాదిరి ఉతికి, ఇస్త్రీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడైనా ఓసారి తుడుచుకుంటే సరిపోతుంది. దానికితోడు ఫార్మల్‌లుక్‌కు నిండుదనం వస్తుంది. లెదర్‌ అనగానే కేవలం నాలుగైదు రంగుల్లోనే దొరుకుతుంది కాబట్టి... ఏం వాడతామనే సందేహం అక్కర్లేదు. వీటిని కూడా రకరకాల రంగులూ, డిజైన్లలో తీసుకొస్తున్నారు డిజైనర్లు. సో... నచ్చిన టైలను రెండుమూడు కొనిపెట్టుకుంటే మనకు బోర్‌కొట్టేవరకూ ఎంతకాలమైనా మార్చిమార్చి కట్టుకోవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..