Updated : 23 Oct 2022 01:01 IST

ఫుడ్‌ ట్రెండ్‌

ఒకసారి తిని చూద్దాం!

మనం చేసే పనిలోనైనా వెళ్లే దారిలోనైనా కొత్తదనం లేకపోతే ఏం బాగుంటుంది. కొన్నాళ్లకి బోర్‌కొట్టేస్తుంది. అలానే మనం తినే ఆహారం కూడా ఎప్పుడూ ఒకే రుచిలో ఉంటే మజా ఏముంటుంది. అందుకే, నిత్యం మనం తినేవాటితోనే షెఫ్‌లు ప్రయోగాలు చేసి రుచిలోనూ, రూపంలోనూ మార్పులు తెస్తున్నారు. ఇదిగో ఇవీ అలా చేసినవే... రుచి చూసేయండి మరి.


దమ్‌ పరోటా లాగించేయ్‌!

పొరలు పొరలుగా... మెత్తగా ఉండే పరోటా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మసాలా కుర్మాతో తిన్నా... మాంసం కూరతో లాగించినా ఆ రుచి అద్భుతమే. అయితే ఇప్పుడు పరోటాలోకి ప్రత్యేకంగా కూరను నంజుకుని తినే బదులు... రెండింటినీ కలగలిపి తిని సరికొత్త రుచిని ఆస్వాదించేలా దమ్‌ పరోటా సిద్ధం చేస్తున్నారు. దమ్‌ బిర్యానీ వండేప్పుడు ఎలాగైతే సగం వండిన అన్నాన్నీ, మసాలా కూరనూ పొరలు పొరలుగా వేసి చేస్తామో అలానే దమ్‌ పరోటానీ చేస్తున్నారు. ఓ చిన్న కుండలో నెయ్యి రాసి సగం కాల్చిన పరోటాను ఉంచి దానిపైన చికెన్‌, మటన్‌, గుడ్డుకూర ఏదో ఒకటి పరుస్తారు. ఆపైన సగం పచ్చివీ, సగం వేయించినవీ ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిపైన మరో పరోటాను ఉంచుతారు. ఆ పైన కూరనూ, దానిపైన ఇంకో పరోటా పెట్టి కుండలోని ఆవిరి బయటకు వెళ్లకుండా గట్టిగా మూత పెట్టి కాసేపు స్టౌ మీద ఉంచుతారు. ఆవిరిపైన- కూరతోపాటు ఉడికే పరోటాకు మసాలా పట్టి మెత్తగా అయిపోతుంది. కూరలో కలిసిపోయి ఫోర్కు, చెంచాతో తినడానికి వస్తుంది. చల్లని వాతావరణంలో వేడిగానూ, స్పైసీగానూ ఉండే ఈ దమ్‌ పరోటా లాగిస్తే ఎంత బాగుంటుందో కదా.


కోన్‌ చాకీ కావాలా!

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ తన రుచుల మాయలో పడేస్తుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయే చాక్లెట్‌. రకరకాల రుచుల్లో నోటికి విందు చేసే ఈ చాక్లెట్లు సాధారణంగా గుండ్రంగానో, పలకగానో వస్తుంటాయి. ఇప్పుడు ఆ చాకీలు ఐస్‌క్రీమ్‌వైపు దారి మళ్లినట్టున్నాయి. క్రంచీగా ఉండే వేఫర్‌ కోన్‌లో దూరిపోయి కోన్‌ చాక్లెట్‌ అవతారమెత్తాయి. కొసరి కొసరి కోన్‌ ఐస్‌క్రీమ్‌ను తిన్నట్టే... క్రంచీగా ఉండే కోన్‌తో కలిపి తియ్యని చాక్లెట్‌ని కొద్దికొద్దిగా కొరుక్కుతింటున్నారు చిన్నారులు. బాక్సుల్లోనూ, రేపర్స్‌లోనూ వస్తోన్న ఈ చాక్లెట్లు- డ్రైఫ్రూట్స్‌నూ, రంగురంగుల పంచదార పలుకులనూ అద్దుకుని అందంగానూ ముస్తాబవుతున్నాయి. గబుక్కున చూసేవారికి కోన్‌ ఐస్‌క్రీమ్‌లానే అనిపించే ఈ చాక్లెట్లు చూపులకే కాదు, రుచిలోనూ అదుర్సే. పలు కంపెనీలూ తయారు చేస్తున్న ఈ చాక్లెట్లు ఈ కామర్స్‌ సైట్లలోనూ దొరుకుతున్నాయి. అందుకే ఈ సారి ఇలాంటి చాక్లెట్లతో మీ చిన్నారులకు తీయని వేడుక చేసేయండి.


ఖర్జూరంలో నింపుతున్నారు!

ట్టిగా ఉన్నా మెత్తగా ఉన్నా, గింజలున్నా లేకున్నా ఖర్జూరం కనిపిస్తే తినకుండా ఉండలేం. చక్కెరకు ప్రత్యామ్నాయంగా తినదగిన ఈ ఖర్జూరం పోషకాల గని. రోగనిరోధకశక్తిని పెంచి... రక్తహీనతను దూరం చేసే ఇది పిల్లలకీ, మహిళలకీ చాలా మంచిది. అలాంటి ఆరోగ్య ప్రదాయిని అయిన ఖర్జూరం ఇప్పుడు డ్రైఫ్రూట్‌ పలుకులూ, కోవా, కొబ్బరిపొడీ, తేనె, గుల్ఖండ్‌ వంటి రకరకాల పదార్థాల్ని నింపుకుని- సరికొత్త రుచినీ, ఆరోగ్యాన్నీ పంచుతోంది. ఖర్జూరాల మధ్యలో గింజతీసేసి కాస్త పెద్ద గాటును పెట్టి అందులో స్టఫ్‌తోపాటు కొందరు పాన్‌ మసాలానూ పెట్టి మసాలా డేట్స్‌నూ ప్రత్యేకంగా అందిస్తున్నారు. నోటికి ఒకేసారి పలురుచుల అనుభూతిని పంచే ఈ స్టఫ్డ్‌ డేట్స్‌ను కొన్ని కంపెనీలు సందర్భాన్ని బట్టి కస్టమైజ్‌ చేసి మరీ వినియోగదారులకు కానుకలుగా పంపుతున్నాయి. మరి ఈసారి పటాసుల పండక్కి ఆత్మీయులకీ, బంధువులకీ ఈ డేట్స్‌ బాక్సును ఇచ్చి ఆరోగ్యాన్ని పంచేస్తే సరి.


మీకు తెలుసా!

నాలుక ముద్రలు!

ఇద్దరి వేలి ముద్రలూ ఒకేలా ఉండవు. అందుకే బయోమెట్రిక్‌ హాజరు విధానానికీ, నేరపరిశోధనలకీ వేలిముద్రల్ని ఉపయోగిస్తున్నారు. అయితే అచ్చం వేలి ముద్రల్లాగే నాలుక మీద గీతలు కూడా మనిషి మనిషికీ విభిన్నంగా ఉంటాయట. ఇప్పటి వరకూ డాక్టర్లు నాలుక చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం చూశాం. ఇక ముందు, వేలిముద్రలను వాడినట్లే టంగ్‌ ప్రింట్‌నీ వివిధ అవసరాలకు వాడుకోవచ్చట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..