చెస్‌, లూడో, చెక్కర్స్‌.. అన్నీ క్యారమ్‌ బోర్డ్‌లోనే!

ఆదివారం పూట రోజంతా ఒకే ఆట ఆడాలంటే బోర్‌ కొట్టేయదూ. అందుకే కాసేపు క్యారమ్స్‌... ఆ తర్వాత చదరంగం... మళ్లీ వైకుంఠపాళీ.. ఇలా మార్చి మార్చి ఆడితే కాస్త మజాగా ఉంటుంది.

Published : 06 Mar 2022 00:31 IST

చెస్‌, లూడో, చెక్కర్స్‌.. అన్నీ క్యారమ్‌ బోర్డ్‌లోనే!

ఆదివారం పూట రోజంతా ఒకే ఆట ఆడాలంటే బోర్‌ కొట్టేయదూ. అందుకే కాసేపు క్యారమ్స్‌... ఆ తర్వాత చదరంగం... మళ్లీ వైకుంఠపాళీ.. ఇలా మార్చి మార్చి ఆడితే కాస్త మజాగా ఉంటుంది. ఇందుకోసం క్యారమ్‌ బోర్డ్‌నీ, మిగతా ఆటల అట్టల్నీ విడివిడిగా కొనుక్కోవాల్సిన అవసరమే లేదిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క క్యారమ్‌ బోర్డ్‌లోనే రకరకాల గేమ్సూ వచ్చేస్తున్నాయి మరి!

అసలు ఆటలంటే ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉంటారా! ఓ ఇద్దరు చిన్నారులు కలిస్తే చాలు, ఏదో ఒక ఆట మొదలు పెట్టేస్తారు. బయట ఆడే వీలు లేకపోతే ఇంట్లోనే లూడో, బిజినెస్‌ గేమ్స్‌, చదరంగం, క్యారమ్స్‌ అంటూ ఏవేవో ఆటలు ఆడేస్తుంటారు. అందుకే బుజ్జాయిలు ఆడుకోవడానికి వీలుగా బోలెడన్ని బోర్డ్‌ గేములు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అందులో భాగంగానే మొన్నమొన్నటి వరకూ నలుపూ, గోధుమ రంగుల్లోనే కనిపించే క్యారమ్‌ బోర్డ్‌ ఆకట్టుకునేలా కార్టూన్‌ బొమ్మలతో రకరకాల రంగుల్లో రంగంలోకి దిగిపోయింది. ఇక ఇప్పుడైతే అదే బోర్డ్‌ చిన్నారులకు మరెంతో ఉపయోగపడేలా ఇతర గేమ్స్‌నూ తోడుగా తీసుకుని వచ్చేసింది. ‘మల్టిపుల్‌ గేమ్స్‌ క్యారమ్‌ బోర్డ్‌’గా సిద్ధమైపోయింది.

మిగతా బోర్డ్‌ గేములన్నీ మందపాటి అట్టముక్కలతో ఉన్నా ఎంచక్కా ఆడుకోవచ్చు. కానీ క్యారమ్‌ బోర్డ్‌ విషయం వేరు. కచ్చితంగా అది కలప, ప్లాస్టిక్‌ లాంటి వాటితో తయారైనదైతేనే ఆడ్డానికి వీలుగా ఉంటుంది. అందుకే అన్ని రకాల ఆటలూ కోరుకునే వాళ్లు క్యారమ్‌ బోర్డుతో పాటు ఇతర గేముల అట్టలూ కొనుక్కోవాల్సిందే. మరైతే ఆ రెండింటినీ ఒకటి చేస్తే... ఒకదాంట్లోనే బోలెడన్ని ఆటలు ఆడుకోవచ్చు కదా అన్న ఆలోచన తట్టిందో ఏమో క్యారమ్‌బోర్డ్‌కే ఇతర ఆటల్నీ జోడించేశారు తయారీదారులు.

ఒకే బోర్డులో...

ఈ క్యారమ్‌ బోర్డులు ‘ఫైవ్‌ ఇన్‌ వన్‌, ఫోర్‌ ఇన్‌ వన్‌, త్రీ ఇన్‌ వన్‌’ అంటూ రకరకాల సైజుల్లో వేర్వేరు ఆటలతో దొరుకుతున్నాయి. మామూలు క్యారమ్‌ బోర్డ్‌లో అయితే స్ట్రైకర్‌ పెట్టడానికి బేస్‌లైన్లూ, నాలుగు వైపులా గుంతలూ ఉంటాయి. కానీ వీటిల్లో బేస్‌లైన్ల లోపల చదరంగమూ, వైకుంఠపాళీ, అష్టాచెమ్మా లాంటి ఆటలు ఆడేలా వాటి బొమ్మలుంటాయి. ఇంకొన్నింట్లోనేమో ఒకవైపు క్యారమ్స్‌ ఆడుకోవచ్చు. మరోవైపు- అంటే దాన్ని పూర్తిగా తిరగేసి చైనీస్‌ చెక్కర్స్‌, నంబర్‌ గేమ్స్‌, లూడోలాంటి ఆటలు ఆడుకోవచ్చు. మరికొన్ని క్యారమ్‌ బోర్డుల్లో అయితే ఒకే సెట్‌లో నాలుగైదు ఆటల బోర్డులూ వచ్చేస్తాయి. వీటిల్లోనే చివరనున్న క్యారమ్‌ బోర్డ్‌ను తిరగేస్తే ఇంకో ఆటా ప్రత్యక్షమవుతుంది.

ఏ ఆట కావాలంటే ఆ ఆట ఆడుకోవచ్చన్నమాట. రకరకాల ఆటలతో వస్తున్న ఈ క్యారమ్‌ బోర్డులతో కాయిన్లూ, స్ట్రైకర్‌తోపాటూ అందులో ఉన్న ఆటల్ని బట్టి పావులూ, పాచికలూ ఉంటాయి. పిల్లలు మెచ్చే డిజైన్లలో దొరుకుతున్న ఈ మల్టిపుల్‌గేమ్స్‌ బోర్డ్‌ని కొనిచ్చామంటే, ఒకేదాంట్లో వరుసగా బోలెడు ఆటలాడుకుంటూ కదలకుండా కూర్చుండిపోతారంతే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..