Published : 21 Jan 2023 23:37 IST

హైడ్రోజెల్‌... త్వరగా పీల్చేస్తుంది!

కిచెన్‌లో ఏదైనా ఒలికితే తుడిచేందుకు గృహిణులు శస్త్ర చికిత్స చేసే సమయంలో రక్తాన్ని పీల్చేందుకు వైద్యులూ టిష్యూ పేపర్‌ను వాడుతుంటారు. అయితే వీటితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ద్రవపదార్థాలను పీల్చే జెల్‌ షీట్లను మేరీల్యాండ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు తయారుచేశారట. ఇది చిక్కని ద్రవపదార్థాలైన రక్తం, సిరప్‌ల వంటివాటినీ పీల్చేస్తుందట. సాధారణంగా హైడ్రోజెల్స్‌ తడి స్థితిలోనే ద్రవపదార్థాలను పీల్చుకుంటాయి. పొడిగా ఉన్నప్పుడు పగుళ్లు వచ్చి విరిగిపోతుంటాయి. అందుకే ఇది పేపర్‌ టవల్‌లా పనిచేసేందుకు ఆ జెల్‌లో ఎసిటిక్‌ ఆమ్లం, సోడియం బైకార్బొనేట్‌లను కలిపి ఓ జిప్‌లాక్‌ బ్యాగ్‌లో ఉంచారు. ఆ పదార్థాలన్నీ రసాయన చర్య పొంది బుడగల రూపంలో కార్బన్‌డై ఆక్సైడ్‌ను విడుదల చేసి నురగలా మారాయట. అప్పుడు జిప్‌లాక్‌ను గట్టిగా నొక్కి, ఓ షీటులా మార్చి యూవీ కిరణాలకు గురిచేసినప్పుడు- అది రంధ్రాలతో కూడిన స్పాంజిలా మారింది. తరవాత దీన్ని ఆల్కహాల్‌, గ్లిజరాల్‌లో ముంచి ఎండబెట్టగా మృదువైన సాగే గుణం గల ఫ్యాబ్రిక్‌గా తయారైంది. అంతేకాదు, నీటిమీద పెట్టినప్పుడు ఉబ్బి పేపర్‌ టవల్సూ క్లాత్‌ ప్యాడ్స్‌ కన్నా మూడు రెట్లు ఎక్కువగా నీటిని పీల్చిందట. దాంతో గాజ్‌ క్లాత్‌ కన్నా వేగంగా నిమిషంలోనే చిక్కని పదార్థాలనీ పీల్చుకోలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి గాయాలూ శస్త్రచికిత్సలతోపాటు కిచెన్‌లో వాడుకునేందుకు కూడా ఈ హైడ్రోజెల్‌ క్లాత్‌ని వాడొచ్చనీ పైగా ఇది రీయూజబుల్‌ అనీ చెబుతున్నారు శాస్త్రవేత్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు