కృత్రిమ మేథతో కొత్త దారులు!

జన్యువిశ్లేషణతో మనకి రాబోతున్న వ్యాధుల్ని పసిగట్టవచ్చంటే ‘అవునా’ అని ఆశ్చర్యపోతుంటాం. ఏఐతో ఈజీగా పాఠాలు నేర్పించవచ్చంటే... విదేశాల్లోనేమో అనుకుంటాం. ‘టెక్‌’తో మనుషుల ప్రతి కదలికనీ తెలుసుకోవచ్చంటే... సినిమాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తాం. కానీ.

Updated : 08 May 2022 06:16 IST

కృత్రిమ మేథతో కొత్త దారులు!

జన్యువిశ్లేషణతో మనకి రాబోతున్న వ్యాధుల్ని పసిగట్టవచ్చంటే ‘అవునా’ అని ఆశ్చర్యపోతుంటాం. ఏఐతో ఈజీగా పాఠాలు నేర్పించవచ్చంటే... విదేశాల్లోనేమో అనుకుంటాం. ‘టెక్‌’తో మనుషుల ప్రతి కదలికనీ తెలుసుకోవచ్చంటే... సినిమాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తాం. కానీ... ఆ అద్భుతాలన్నింటినీ నిజం చేస్తున్నాయి ఈ స్టార్టప్‌లు...


జన్యు జాతకం... నిమిషాల్లో!

మన శరీరం ఒడ్డూపొడుగూ ఎంతుండాలి... మనకి ఇప్పటిదాకా ఉన్న వ్యాధులేమిటీ... భవిష్యత్తులో రాగల సమస్యలేమిటీ... శరీరానికి సంబంధించిన ఇలాంటి వివరాలన్నీ మన డీఎన్‌ఏలో నిక్షిప్తమై ఉంటాయంటారు. శరీరంలో అలాంటి డీఎన్‌ఏ జతలు మూడువందలకోట్ల దాకా ఉంటాయి. ఆ ఉండటానికీ ఓ క్రమం ఉంటుంది. ఆ క్రమాన్నే ‘జన్యుపటం’(జినోమ్‌) అంటారు. ఆ జన్యు క్రమాన్ని విశ్లేషిస్తే వ్యాధులని పసిగట్టవచ్చు. ఆ విశ్లేషణకి మామూలుగానైతే మూడు నుంచి ముప్ఫై రోజులదాకా పడుతుంది. కానీ కొత్తతరం కంప్యూటర్‌ సాంకేతికతతో ఆ సమయాన్ని 36 గంటలకి కుదించింది ‘హేస్ట్యాక్‌ అనలిటిక్స్‌’ అన్న స్టార్టప్‌. అలా గత ఏడాది కరాళనృత్యం చేసిన కరోనా డెల్టావేరియంట్‌లని కొన్నిగంటల్లో విశ్లేషించి... వేలమంది రోగుల ప్రాణాలు నిలిపింది. ఈ క్రమంలో అటు కేంద్రప్రభుత్వంతోనూ ఇటు బృహత్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ)తోనూ కలిసి పనిచేసింది. డాక్టర్‌ అనిర్వాణ్‌ చటర్జీ దీని వ్యవస్థాపక సీఈఓ. స్నేహితులు గౌరవ్‌ శ్రీవాత్సవ, ప్రొఫెసర్‌ కిరణ్‌ కొండబగిల్‌తో కలిసి ఈ సంస్థని ఏర్పాటుచేశాడు. ఈ సంస్థ ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌, వేలూరు సీఎంసీ వంటి ఆసుపత్రులకి సాయపడుతోంది. అంతేకాదు, ఒక్క టెస్టుతో వందలాది బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లని పసిగట్టే ‘ఒమేగా ఐడీ’, టీబీ కారక బ్యాక్టీరియాని సమగ్రంగా విశ్లేషించి చెప్పే ‘ఒమేగా టీబీ’ టెస్టుల్ని సామాన్యులకి చేరువచేస్తోంది. థైరోకేర్‌, పాత్‌ ల్యాబ్స్‌ వంటి సంస్థలు వీటిని అందిస్తున్నాయి.


ఇంగ్లిష్‌ వింగ్లిష్‌... పల్లెల్లో!


 

గ్రామీణ ప్రాంతాల బడిపిల్లలకి ఇంగ్లిష్‌ ఇప్పటికీ ఓ కొరకరాని కొయ్యే! టీచర్‌ పాఠాలు చెప్పేటప్పుడు ఆయన ఏ పాఠంలో ఏ పదం చెబుతున్నాడో కూడా 90 శాతం పిల్లలకి తెలియదట. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ద్వారా దానికి ఓ సరికొత్త పరిష్కారాన్ని చూపుతోంది ‘ఇంగ్లిష్‌ హెల్పర్‌’ అన్న స్టార్టప్‌. ముందుగా పిల్లల ఇంగ్లిషు పాఠ్యపుస్తకం మొత్తాన్నీ తాము రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోకి తెస్తుందీ సంస్థ. తరగతి గదుల్లో ప్రొజెక్టర్‌ ద్వారా స్క్రీన్‌పైన ఆ పాఠాన్ని ప్రదర్శిస్తుంది. టీచర్‌ పాఠంలోని ఒక్కోపదాన్నీ పలుకుతుంటే... ఆయన ఏ పదాన్ని చెబుతున్నారో దానిపైన కర్సర్‌ వెళుతూ ఉంటుంది. పిల్లలకి డౌట్‌ వస్తే ప్రతి పదం దగ్గరా ఆగి... దాన్ని ఎలా పలకాలో చెబుతుంది, దాని అర్థాన్నీ, ఉపయోగించే పద్ధతినీ సచిత్రంగా చూపిస్తుంది. మళ్లీ సాధన చేయిస్తుంది. పిల్లలు తమ ఫోన్‌లలో ఈ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్లాక కూడా ఎవరి సాయమూ లేకుండా ఆ పాఠాన్ని వింటూ కొత్తవి  నేర్చుకోవచ్చు. ఇందుకోసం ఆయా రాష్ట్రప్రభుత్వాలూ, అమెరికాకి చెందిన యూఎస్‌ ఎయిడ్‌ వంటి సంస్థలూ వాళ్లకి స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. వాటి సాయంతో దేశవ్యాప్తంగా 20 వేల ప్రభుత్వ గ్రామీణ పాఠశాలల్లోని ఎందరో విద్యార్థులకి సాయపడిందీ స్టార్టప్‌. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు, విశాఖ జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులూ దీన్ని ఉపయోగిస్తున్నారు. కోల్‌కతాకి చెందిన 62 ఏళ్ల సంజయ్‌ గుప్తా... ఈ ఇంగ్లిష్‌ హెల్పర్‌ రూపకర్త!  


మాస్క్‌ వేసుకుంటున్నారా?

కొవిడ్‌ వచ్చిన కొత్తల్లో... దక్షిణ కొరియా దేశం ఇన్ఫెక్షన్‌కి గురైన ప్రతి రోగినీ పర్యవేక్షించగలిగిందనీ... ఇందుకోసం ప్రత్యేక ట్రాకర్‌లు ఉపయోగించిందనీ విని ఆశ్చర్యపోయాం కదా! ఆ సాంకేతికతని సాధించడం మనకూ సాధ్యమేనని నిరూపించారు వేణుగోపాల్‌, ప్రతీక్‌లు. ఇందుకోసం ‘వాకస్‌ టెక్‌’ అన్న స్టార్టప్‌ని ఏర్పాటుచేశారు. లాక్‌డౌన్‌ కాలంలో ఆసుపత్రులూ, ఫార్మా సంస్థలకి వీళ్ల ట్రాకింగ్‌ వ్యవస్థ ఎంతో ఉపయోగపడిందట. సిబ్బంది కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కడైనా గుమిగూడినా, దూరం పాటించకున్నా సూపర్‌వైజర్‌లని వీళ్ల ట్రాకర్‌ హెచ్చరించేది. ఆ తర్వాత విలువైన వస్తువులుండే వేర్‌హౌస్‌లూ, తయారీ సంస్థలకి వీళ్ల ట్రాకింగ్‌ వ్యవస్థ ఉపయోగపడుతోంది. ఆ వస్తువులు ఉండాల్సిన చోట కాకుండా ఏమాత్రం దారితప్పినా... పర్యవేక్షకులని ఇది అలర్ట్‌ చేస్తుంది. దేశవ్యాప్తంగా 12 వేలమంది ఉద్యోగుల్ని వాళ్ల ఆఫీసువేళల్లో ఈ సంస్థ సాంకేతికత పర్యవేక్షిస్తోంది


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు