స్వీటు... చకచకా చేసేద్దాం!

పిల్లలు ఇంట్లో ఉంటే ఎన్ని రకాల పిండివంటలు చేసినా ఎప్పుడూ ఇవేనా అంటుంటారు. అలాగని రోజూ బయట నుంచి రకరకాలు తీసుకొచ్చి పెట్టలేం కదా. అందుకే ఇంట్లోనే తేలికగా వెరైటీ స్వీట్లు చేసేద్దామా మరి!

Published : 05 Jun 2022 01:03 IST

స్వీటు... చకచకా చేసేద్దాం!

పిల్లలు ఇంట్లో ఉంటే ఎన్ని రకాల పిండివంటలు చేసినా ఎప్పుడూ ఇవేనా అంటుంటారు. అలాగని రోజూ బయట నుంచి రకరకాలు తీసుకొచ్చి పెట్టలేం కదా. అందుకే ఇంట్లోనే తేలికగా వెరైటీ స్వీట్లు చేసేద్దామా మరి!


ఎగ్‌లెస్‌ రవ్వ కేక్‌

కావలసినవి: నెయ్యి లేదా నూనె: కప్పు, పెరుగు: కప్పు, పాలు: రెండున్నర కప్పులు, బొంబాయి రవ్వ: రెండు కప్పులు, పంచదార: ఒకటిన్నర కప్పులు, బేకింగ్‌పౌడర్‌: టీస్పూను, బేకింగ్‌సోడా: పావుటీస్పూను, టూటీఫ్రూటీ ముక్కలు: అరకప్పు, యాలకులపొడి: అర టీస్పూను

తయారుచేసే విధానం

* మిక్సీలో రవ్వ వేసి పొడి చేయాలి. వెడల్పాటి గిన్నెలో నూనె లేదా నెయ్యి, పెరుగు, పంచదార వేసి పంచదార కరిగేవరకూ బాగా గిలకొట్టాలి. రెండుంపావు కప్పుల పాలు పోసి మళ్లీ గిలకొట్టాక మూతపెట్టి పదినిమిషాలు నాననివ్వాలి.

* పాన్‌కు నెయ్యి రాసి ఉంచాలి. రవ్వ మిశ్రమంలో బేకింగ్‌సోడా, యాలకులపొడి, పావుకప్పు పాలు, బేకింగ్‌పౌడర్‌ వేసి కలపాలి. తరవాత ఎరుపూ ఆకుపచ్చ రంగుల్లోని టూటీఫ్రూటీ ముక్కలు మూడు వంతులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పాన్‌లో వేసి మిగిలిన టూటీఫ్రూటీ ముక్కలు పైన చల్లి సిమ్‌లో పెట్టాలి. మూత పెట్టి ఆవిరి పోకుండా పిండిముద్దతో మూసేయాలి. సుమారు గంటసేపు ఉడికించి దించితే రవ్వ కేకు రెడీ.


మ్యాంగో పుడ్డింగ్‌

కావలసినవి: బంగినపల్లి మామిడిపండ్లు: రెండు, పాలు: 400మి.లీ., పంచదార: 100గ్రా., ఉప్పు: చిటికెడు, కార్న్‌ఫ్లోర్‌: 100గ్రా., నిమ్మరసం: అరటీస్పూను

తయారుచేసే విధానం

* మామిడిపండ్ల తొక్క తీసేసి గుజ్జు తీయాలి. అందులో పావులీటరు పాలు పోసి, పంచదార వేసి మిక్సీలో వేసి బాగా గిలకొట్టాలి.

* ఓ చిన్నగిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి, మిగిలిన పాలు పోసి కలపాలి.

* ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌లో గిలకొట్టిన మామిడిపండు గుజ్జును వేసి కాస్త మరిగే వరకూ ఉంచాలి. ఒకసారి మరగడం మొదలవగానే సిమ్‌లో పెట్టి పక్కన ఉంచిన కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. ఐదు నిమిషాలకి చిక్కబడటం మొదలవగానే స్టవ్‌మీద నుంచి దించి నిమ్మరసం కలిపి నెయ్యి లేదా నూనె రాసిన గాజుగిన్నెల్లో పోసుకుని చల్లారనివ్వాలి. తరవాత రెండుగంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇప్పుడు ఒక్కో బౌల్‌నీ తీసి ప్లేటులోకి తిరగవేసి మెల్లగా తడితే చక్కని ఆకారంలో రుచికరమైన పుడ్డింగ్‌ రెడీ.


గోధుమపిండి హల్వా

కావలసినవి: పంచదార: అరకప్పు, బెల్లం తురుము: ముప్పావుకప్పు, మంచినీళ్లు: రెండున్నర కప్పులు,  యాలకులపొడి: టీస్పూను, నెయ్యి: కప్పు, గోధుమపిండి: కప్పు,

తయారుచేసే విధానం

* ఓ గిన్నెలో పంచదార, బెల్లం తురుము వేయాలి. ఇప్పుడు నీళ్లు పోసి, అరటీస్పూను యాలకులపొడి వేసి మరిగించి పక్కన ఉంచాలి.

* విడిగా ఓ బాణలిలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీయాలి. తరవాత గోధుమపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ పది నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు నెమ్మదిగా బెల్లం పాకం వేసి కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యేవరకూ సుమారు పావుగంటసేపు ఉడికించాలి. చివరగా మిగిలిన అరటీస్పూను యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి నెయ్యి బయటకు వచ్చేవరకూ ఉడికించితే వేడివేడి గోధుమ హల్వా తయార్‌!


సగ్గుబియ్యం లడ్డూ

కావలసినవి: నైలాన్‌ సగ్గుబియ్యం: 3 కప్పులు, పంచదార: రెండున్నర కప్పులు, యాలకులపొడి: టీస్పూను, సారపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, మిఠాయిరంగు: చిటికెడు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం

* ముందుగా సగ్గుబియ్యం కడిగి నీళ్లు వంపేసి మళ్లీ అవి మునిగేవరకూ నీళ్లు పోసి నాలుగు గంటలు నాననివ్వాలి. తరవాత నీళ్లు మొత్తం వంపేసి సగ్గుబియ్యాన్ని ఓ గిన్నెలో వేసి ఉంచాలి.

* మిక్సీలో పంచదార వేసి పొడి చేయాలి.

* నాన్‌స్టిక్‌ పాన్‌లో పావుటీస్పూను నెయ్యి వేసి సారపప్పు వేసి వేయించి తీయాలి. తరవాత జీడిపప్పు ముక్కలు కూడా వేసి వేయించి తీయాలి. ఇప్పుడు మంటని తగ్గించి 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి నానబెట్టి వడగట్టిన సగ్గుబియ్యం వేసి కలుపుతూ ఉడికించాలి. తరవాత పంచదార పొడి వేసి కలుపుతూ సిమ్‌లోనే మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మిఠాయిరంగు వేసి సిమ్‌లోనే సుమారు పది నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. చివరగా సారపప్పు, జీడిపప్పు కూడా వేసి మిశ్రమం దగ్గరగా అయ్యాక మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి దించి చల్లారాక లడ్డూల్లా చుట్టుకుంటే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..