నీళ్లూ బీరూ... అన్నీ కాగితం సీసాల్లోనే..!

ప్రపంచవ్యాప్తంగా రోజుకి తయారయ్యే ప్లాస్టిక్‌ బాటిళ్ల సంఖ్య 22 కోట్లు. వీటిల్లో 80 శాతం చెత్తకుప్పలోకే చేరుతున్నాయి. ఒక్క బాటిల్‌ నేలలో కలవాలంటే కనీసం 450 సంవత్సరాలు పడుతుంది.

Updated : 15 Jan 2023 03:56 IST

నీళ్లూ బీరూ... అన్నీ కాగితం సీసాల్లోనే..!

ప్రపంచవ్యాప్తంగా రోజుకి తయారయ్యే ప్లాస్టిక్‌ బాటిళ్ల సంఖ్య 22 కోట్లు. వీటిల్లో 80 శాతం చెత్తకుప్పలోకే చేరుతున్నాయి. ఒక్క బాటిల్‌ నేలలో కలవాలంటే కనీసం 450 సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్కన బాటిళ్లు చేసుకుంటూ పోతుంటే కాలుష్యం సంగతెలా ఉన్నా మనిషి నిలబడేందుకైనా చోటు మిగులుతుందా అన్న భయం వేస్తుంది. అందుకే సరైన పరిష్కారం కోసం పర్యావరణ నిపుణులతోపాటు అనేక సంస్థలూ ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా  వస్తున్నవే ఈ కాగితం ప్యాకింగులు!

స్సెక్కుతాం... ఎక్కేముందు పక్కనే ఉన్న స్టాల్‌లో ఓ మంచినీళ్ల బాటిల్‌ కొంటాం. బిర్యానీ ఆర్డర్‌ ఇస్తాం... ఇంటికో కంటెయినర్‌ ప్యాకింగ్‌ వస్తుంది. మార్కెట్‌కి వెళతాం... అందంగా ప్యాక్‌ చేసి ఉన్న క్రీములూ లోషన్లూ కొనేస్తాం. వాడేశాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెత్తడబ్బాలో పారేస్తాం. కానీ అవన్నీ ప్లాస్టిక్కువేననీ, నేలను మింగేస్తున్నాయనీ ఏమాత్రం ఆలోచించం. కానీ ఇప్పుడిప్పుడు పర్యావరణ స్పృహ సామాన్యుల్లోనూ కనబడుతోంది. అందుకే కంపెనీలు సైతం ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యర్థ పదార్థాలతో తయారైన కాగితంతో ప్యాకింగుల్ని రూపొందిస్తున్నాయి. పైగా ఈ కాగితాన్ని రీసైక్లింగ్‌ చేయగలగడంతోపాటు నేలలో కలిసిపోయే విధంగా రకరకాల పదార్థాలతో చేస్తున్నారు.

కూల్‌డ్రింకులకీ...

పేపర్‌ వాటర్‌బాటిళ్ల తయారీ ఆలోచన సుమారు ఇరవయ్యేళ్ల కిందటే మొదలైంది. ప్రముఖ ప్యాకేజింగ్‌ డిజైనర్‌ అయిన జిమ్‌ వార్నర్‌, తన ఎనిమిదేళ్ల కొడుకుతో రోడ్డు పక్కన నడుస్తున్నప్పుడు ‘నువ్వేం పని చేస్తావు డాడీ’ అని కొడుకు అడిగితే ‘బాటిళ్లూ ప్యాకింగ్‌లూ డిజైన్‌ చేస్తాన’ని చెప్పాడట. దానికి ఆ చిన్నారి కాసేపు రోడ్డు పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌వైపు చూసి ‘అంటే చెత్తా’ అన్నాడట. ఆ మాటే వార్నర్‌ను ఆలోచనలో పడేసింది. దీని గురించి తను పనిచేస్తున్న ఇండస్ట్రియల్‌ డిజైన్‌ కంపెనీతో చర్చించి, పదేళ్లపాటు కసరత్తు చేశాక చెరుకూ, వెదురు గుజ్జుతో తయారైన నమూనాను 2015లో రూపొందించాడు. అలా మొదలైందే ‘పేపర్‌ వాటిల్‌ బాటిల్‌’ కంపెనీ.

అదేసమయంలో కాగితం బాటిళ్లను తయారుచేసే పాబొకొ కంపెనీ కూడా మొదలైంది. ఈ కంపెనీ సాయంతోనే డ్యానిష్‌ బీర్‌ తయారీ సంస్థ అయిన కాల్జ్‌బర్గ్‌ రీసైకిల్డ్‌ చెక్కముక్కలతో తయారైన తొలి కాగితం బీర్‌ బాటిల్‌ను తీసుకొచ్చింది. క్రమంగా ఈ టెక్నాలజీతోనే లొరియల్‌, ఆబ్‌సల్యూట్‌... వంటి కాస్మెటిక్‌ సంస్థలు తమ ఉత్పత్తుల్ని కాగితం బాటిళ్లలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కోకకోలా సంస్థ సైతం పాబొకొ కంపెనీతో కలిసి కూల్‌డ్రింకుల్నీ రీసైకిల్‌ చేయగలిగే కాగితం సీసాల్లో అందించేందుకు శ్రీకారం చుట్టింది. నూటికి నూరుశాతం నేలలో కలిసిపోయే మరో కాగితం సీసాను పల్పెక్స్‌-పెప్సికొ కంపెనీలు రూపొందించాయి.

కాస్మెటిక్స్‌కీ...

పోతే, మంచినీళ్ల బాటిళ్లతోపాటు లిక్విడ్‌ సోప్‌, షాంపూ, లోషన్లూ... ఇలా రోజువారీ వాడుకునేవాటిని నింపేందుకు మనదేశానికి చెందిన సమీక్షా గోవిల్‌ నెలకొల్పిందే కాగ్జి బాటిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. వృథా కాగితం గుజ్జుతో తయారవుతోన్న ఈ బాటిళ్లని నీళ్లతోపాటు ఇతర పదార్థాలు నింపుకునేందుకూ పనికొచ్చేలా డిజైన్‌ చేస్తున్నారు. మూతల్ని కూడా బెండుతోనే చేయడంతోబాటు ఈ బాటిళ్ల లోపల నీటిని పీల్చకుండా హానిరహితమైన వృక్షసంబంధిత పదార్థంతోనే పూత పూస్తారట. ఈ పూతను గాలి ఆడేలా తయారుచేయడంతో కొన్ని నెలలకే బాటిల్‌ నేలలో కలిసిపోతుంది. పైగా ఈ బాటిళ్లలో ఏ పదార్థమైనా ఆరు నెలలవరకూ నిల్వ చేయవచ్చట. యూనీలీవర్‌ సైతం డిటర్జెంట్లూ హెయిర్‌ కేర్‌ ఉత్పత్తుల్ని కాగితం బాటిళ్లలోనే తీసుకురానుంది.

మరెన్నో హోటళ్లూ రెస్టరంట్లూ సైతం టేక్‌ ఎవేలో అందించే ప్యాకింగులకోసం గడ్డి, వెదురు, చెరుకుపిప్పితో తయారైన కంటెయినర్లనే వాడుతున్నాయి. అలాగే ఐస్‌క్రీమ్‌ కప్పులూ, కాఫీ టీ మగ్గులూ, స్ట్రాలూ, ప్లేట్లూ... ఇలా ఎన్నో డిస్పోజబుల్‌ వస్తువులు ప్లాస్టిక్కుకి ప్రత్యామ్నాయంగా వస్తున్నాయి. ఇదిలానే కొనసాగితే ప్లాస్టిక్కు కనిపించకుండా పోవడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుందాం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..